శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డెమీ పెరేరా
- హోదా, బీబీసీ ట్రావెల్
అనురాధపుర శ్రీలంకలోని ఒక ప్రాచీన నగరం. శ్రీలంకలో క్రీస్తు పూర్వం 377లో మొట్ట మొదట ఏర్పడిన రాజ్యం ఇదే. ఇది శ్రీలంక బౌద్ధ సాంస్కృతిక కేంద్రం కూడా.
అనురాధపురలో రాతి పై చెక్కిన ఒక చిత్రపటాన్ని నక్షత్ర ద్వారం (స్టార్ గేట్) అని, ఈ ప్రాచీన నిర్మాణం ద్వారా ప్రజలు విశ్వంలోకి అడుగు పెట్టవచ్చనే ఊహాత్మక ప్రచారాలతో ఇటీవల ఇంటర్నెట్ నిండిపోయింది.
అనురాధపురలో అప్పుడప్పుడూ గుర్తు తెలియని వస్తువులు ఎగురుతాయని, భూప్రపంచానికి ఆవల జరిగే ఘటనలు ఇక్కడ కూడా జరుగుతాయనే కథలు వినిపిస్తుంటాయి.
స్థానికంగా ఈ ప్రాంతాన్ని రాజారతా (చక్రవర్తుల భూమి) అని అంటారు. ప్రపంచ సాంస్కృతిక కేంద్రంగా యునెస్కో దీనిని గుర్తించింది.
ఇక్కడుండే ప్రాచీన బౌద్ధ మందిరాలు, భారీ స్థూపాలు దర్శించేందుకు దేశం నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు.
కానీ, ఈ మందిరాలు, స్థూపాలను మించి మరో ఉత్సుకత కలిగించే అంశానికి కూడా ఈ ప్రదేశం కేంద్రంగా ఉంది.
మూడు బౌద్ధ మందిరాలను చుట్టుకుని ఉన్న రన్‌మాసు ఉయానాలో 40 ఎకరాలలో ఉండే ప్రాచీన అర్బన్ పార్క్ (గోల్డెన్ ఫిష్ పార్క్) లో ఉండే ఒక చిత్ర పటం (చార్ట్) విశ్వ రహస్యాలను ఛేదిస్తుందనే వాదనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, SAHAN PERERA
ఈ రాయిని ఎలా చెక్కారు
1.8 మీటర్ల వ్యాసం ఉన్న సక్వాలా చక్రాయా (సింహళ భాషలో విశ్వచక్రం) ఒక రాతి పై చెక్కి ఉంది.
భూమి మీద నుంచి కేవలం దీని ముందు భాగాన్ని మాత్రమే చూడగలం. అయితే, ఆ చిత్రపటాన్ని చూసేందుకు దానికి ఎదురుగా ఉన్న ఒక చదునైన రాతి ఉపరితలం పై నాలుగు ఆసనాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ చిత్ర పటం, ఆ ఆసనాల పుట్టుక రెండూ రహస్యంగానే ఉండి, చరిత్రకారులను, పురాతత్వ శాస్త్రవేత్తలను, విద్యావేత్తలను ఒక శతాబ్దానికి పైగా అయోమయానికి గురి చేశాయి.
"రన్‌మాసు ఉయానా ప్రాంతాన్ని చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు ఉపయోగించారు" అని కేలనియా యూనివర్సిటీలోని ఆర్కియాలజీ సీనియర్ ప్రొఫెసర్ రాజ్ సోమదేవ చెప్పారు.
"ఈ ప్రాంతంలో రెండవ దశ అభివృద్ధి 7వ శతాబ్దంలో తిరిగి మొదలై ఉంటుంది. అదే సమయంలో అక్కడ అదనంగా మరి కొన్ని భవనాలను నిర్మించి ఉంటారు. అప్పుడే ఈ చార్ట్ ను కూడా చెక్కి ఉంటారు. కానీ, ఆ చిత్ర పటం పుట్టుక, ప్రాముఖ్యత గురించి బౌద్ధ సన్యాసులు పొందుపరిచిన చారిత్రక పత్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో దాని గురించి కచ్చితంగా చెప్పడం కష్టం" అని అన్నారు.
ఈ చిత్రపటం మధ్య భాగంలో ఏడు వృత్తాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ నిలువుగా, అడ్డుగా ఉన్న రేఖలు విడదీస్తున్నాయి.
దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న గడుల్లో తిరిగి చిన్న చిన్న వృత్తాలు ఉన్నాయి.
సాధారణమైన కంటికి అవి గొడుగులు, బాణం, విల్లు, గాలి పటం, వంకర టింకరగా ఉన్న గీతలు, స్థూపాకారాల్లా కనిపిస్తాయి. చిత్రపటానికి అవతల ఉన్న వృత్తంలో సముద్ర జీవులైన చేపలు, తాబేళ్లు, సముద్రపు గుర్రాలు(సీ హార్స్) ఉన్నాయి.
అదే సమయానికి చెందిన సందకదా పహానాలో ఉన్న శిల్పకళతో పోల్చినప్పుడు అందులో బౌద్ధ చిత్రకళను ప్రతిబింబించే పూల తీగలు, హంసలు, కలువలు కనిపిస్తాయి.
ఈ చిత్రపటానికి ఎటువంటి మతపరమైన నేపథ్యం లేదు. దాంతో, అదక్కడ ఎందుకుందో స్పష్టమైన కారణం తెలియదు.
దీని గురించి సరైన వివరణ లేకపోవడమే ఆన్‌లైన్‌లో ఊహాగానాల వ్యాప్తికి దారి తీసింది. ఇంటర్ నెట్ ఆవిర్భావానికి ముందు శ్రీ లంకలో ఈ చార్ట్ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు.
అనురాధపుర రాజ్యం కూలిపోయిన తర్వాత కూడా ఇది ఇక్కడ నిలిచే ఉంది.
ఇక్కడుండే జంట సరస్సులు, స్నాన మండపాలను రాజులు వాడి ఉండేవారని భావిస్తారు.
ఒకవేళ గ్రహాంతరవాసులు భూమి మీదకు గనక వస్తే, వారు ఇంత కంటే అందమైన ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయి ఉండేవారు. దట్టమైన అడవుల మధ్యలో నెలకొన్న జనావాసాలు లేని ఈ పవిత్రమైన దేవాలయ మైదానాలను అధికారులు పరిరక్షిస్తున్నారు.
ఈ చిత్రపటం పురావస్తు ప్రాశస్త్యం గురించి మొదట ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ హెచ్ సిపి బెల్ సిలోన్ కమీషనర్ ఆఫ్ ఆర్కియాలజీగా నియమితులైనప్పుడు కనుగొన్నారు. శ్రీలంకకు ముందు సిలోన్ అనే పేరు ఉండేది.
ఆయన 1911లో సిలోన్ గవర్నర్ కు రాసిన నివేదికలో ఈ చిత్ర పటం గురించి ప్రస్తావించారు.
"ఈ అతి ప్రాచీన 'ప్రపంచ చిత్రపటం' బహుశా చాలా పురాతనమైనదై ఉండవచ్చు. కానీ, ఇది చాలా ఆసక్తిని కలిగిస్తోంది. సిలోన్ బౌద్ధ ఆరామాలలో పరిఢవిల్లిన ఖగోళ విజ్ఞానానికి రుజువుగా నిలుస్తోంది" అని నివేదికలో రాశారు.
ఆధునిక పరిభాషలో ఈ చిత్రపటం, మ్యాప్ ను పోలి ఉండదు కానీ, ఇది బౌద్ధులకు విశ్వం పట్ల ఉన్న ఊహలకు అనుగుణంగా, సరళంగా రూపొందించిన చిత్రాలతో విశ్వ చిత్రపటంలా ఉంది" అని బెల్ రాశారు.
చిత్రపటంలో ఉన్న వృత్తాలు, ఆకారాలు, సముద్ర జీవులు, భూమి, సముద్రం, అంతరిక్షం, విశ్వానికి ప్రతీకలని ఆయన విశ్లేషించారు.
అయితే, ఈ చిత్ర పటం చారిత్రకంగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో ఉండటం వల్ల దాని గురించిన చర్చలు చాలా సంవత్సరాల వరకు విద్యావేత్తల మధ్యే సాగాయి.
సోషల్ మీడియా అవతరించిన తర్వాత ఫోటోలు విపరీతంగా షేర్ చేయడంతో, ఈ చారిత్రక రహస్యం పై ప్రపంచం దృష్టి కూడా పడింది.
కొంత మంది పర్యటకులు ఈ చిత్రపటాన్ని, ఇతర దేశాల్లో ఉన్న నక్షత్ర ద్వారాలు అని చెప్పేటటువంటి ప్రదేశాలతో పోల్చి చూడటం మొదలుపెట్టారు.
మనుషులు విశ్వంలోకి ప్రవేశించడానికి ఇవి ప్రాచీన ద్వారాలని అంటారు. అయితే, ఆ విశ్వ రహస్యాన్ని ఛేదించడానికి ఆ చిత్ర పటంలో ఒక రహస్య కోడ్ ఉంటుందనే సిద్ధాంతాన్ని చెబుతారు.

ఫొటో సోర్స్, Srilanka Tourism
ఇలాంటివి మరెక్కడైనా ఉన్నాయా?
అనురాధపురలో ఉన్న ఈ నక్షత్ర ద్వారాన్ని పోలిన ఆకారాలు, గుర్తులు ఈజిప్ట్ లోని అబూ ఘురాబ్ , పెరులోని లా ప్యూర్టా డి హయా మర్కా దగ్గర ఉన్నాయని కొంతమంది అంటున్నారు.
ఈ రెండు ప్రదేశాలూ కూడా నదీ ప్రాంతాలకు దగ్గరగా ఉండటం, ఈ చిత్ర పటం 300 బిసి లో నిర్మించిన టిస్సా వేవ్ రిజర్వాయిర్ కు దగ్గరగా ఉండటాన్ని మరో పోలికగా చెబుతారు. గ్రహాంతర వాసులు భూమి పై నున్న నీటి నుంచి బంగారాన్ని వెలికి తీశారని స్టార్ గేట్ సిద్ధాంతం చెబుతుంది.
ఈ చిత్ర పటం పోలోనారువా పవిత్ర నగరంలో ఉన్న డానిగలా పర్వతానికి దగ్గరగా ఉండటం కూడా ఈ సిద్ధాంతానికి మరింత బలం చేకూర్చింది. ఇది దట్టమైన అడవుల మధ్యలో ఉండి, పర్వతారోహకులు ఇష్టపడే ప్రాంతం.
ఇది పూర్తిగా వలయాకారంలో ఉండి, చదునైన శిఖరాన్ని కలిగి ఉంటుంది. దీంతో, గ్రహాంతరవాసులు ఇక్కడకు రావడానికి ఈ ప్రదేశాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవారని ఇంటర్ నెట్ లో కొందరు తీర్మానించారు.
"ఈ పర్వతం ఆకాశంలో పేలే నక్షత్రాలను, ఉరుములు, మెరుపులను ఎక్కువగా ఆకర్షిస్తుందని, ఇక్కడ గ్రామాల్లో ప్రజలు నమ్ముతారు" అని స్థానిక పర్యటక గైడ్ శ్రీ అభయ విక్రమ కూడా చెప్పారు.
"అయితే, అది నక్షత్ర ద్వారం అని చెప్పడానికి పురావస్తు శాస్త్ర పరంగా ఆధారాలేవీ లేవని, సోమదేవ చెప్పారు.
కానీ, బెల్ చెప్పినట్లు ఈ చిత్రపటం, "ప్రాచీన ప్రపంచ చిత్రపటం అని చెప్పవచ్చు" అని అన్నారు.
ఆయనిచ్చిన వివరణ మతపరమైన, ఖగోళపరమైన నేపధ్యాన్ని ప్రస్తావిస్తూ, అప్పటి కాలమాన పరిస్థితుల కనుగుణంగా అర్ధవంతంగా ఉందని అన్నారు.
"కనీసం క్రీస్తుపూర్వం 250 నుంచి శ్రీలంక వాసులకు ఆకాశం, విశ్వం గురించి స్పష్టమైన అవగాహన ఉంది. శ్రీ లంకలో లభించిన ప్రాచీన బ్రాహ్మి శాసనాల్లో కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని పేర్లు ఉన్నాయి. శ్రీలంకలోని దక్షిణ తీరంలో ఉన్న చారిత్రక ప్రదేశం కిరిందలో "అపరిమిత లోక దాతుయా" ( ఈ విశ్వం అనంతమైనది) అని శాసనం లభించింది".
"అది చెక్కిన వ్యక్తికి ఈ విశ్వం స్వభావం పై బాగా అవగాహన ఉండి ఉంటుందని దీనిని బట్టీ తెలుస్తోంది" అని సోమదేవ అన్నారు.

ఫొటో సోర్స్, Sahan Perera
ఎందుకు నిర్మించారు
అయితే, శ్రీ లంకలోని మొరాతువా యూనివర్సిటీలో ల్యాండ్ స్కేప్ డిజైన్ లో సీనియర్ లెక్చరర్ షెరీన్ అల్మెన్ద్ర దీనికి హేతుబద్ధమైన వివరణ ఇచ్చారు. "ఈ సక్వాలా చక్రాయా చార్ట్" ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ నిర్మాణ ప్రణాళిక అయి ఉండవచ్చు. అది సీగిరియా రాజ్య ప్రణాళిక కూడా అయి ఉండవచ్చని అనుకుంటున్నాను" అని అన్నారు.
సీగిరియా శ్రీలంకలో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ ప్రాచీన రాతి కోట.
ఇది నీటి ప్రవాహాలు, అందంగా చెక్కిన తోటలు, నివాస గృహాలతో కూడి ఉంటుంది. ఇక్కడి నుంచి అనురాధపురకు అరగంట ప్రయాణం.

ఫొటో సోర్స్, Getty Images
మతపరమైన కారణాలు ఉన్నాయా?
"శ్రీలంక సాంస్కృతిక త్రికోణ నగరాలుగా పిలిచే అనురాధపుర, పోలోన్నారువా, కేండీ ఒక దానికొకటి అభిముఖంగా ఉంటాయి. దాంతో, ఈ ప్రదేశంలో ప్రాచీన కాలం నాటి ఆర్కిటెక్చర్ కేంద్రం ఉండి ఉండవచ్చు. ఆ ప్రాంతంలో చాలా చర్చలు జరిగి ఉండవచ్చు" అని అన్నారు.
"అక్కడ నిర్మించిన ఆసనాలను మతపరమైన కారణాలు, లేదా ధ్యానం కోసం నిర్మించినట్లయితే, అవి తిన్నగా నిర్మించి ఉండేవారు" అని అన్నారు.
అయితే, "ఈ చిత్రపటం కాలం స్పష్టంగా తెలియడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దీని పాత్రను తెలుసుకోవడం పెద్ద సవాలు" అని సోమదేవ అన్నారు.
"అనురాధపురంలో ఉన్న రన్‌మాస్ ఉయానా, ఇతర పార్కులు, స్థూపాల గురించి క్రీస్తు పూర్వం 250 నాటి శాసనాల్లో లిఖించినప్పటికీ, ఈ సక్వాలా చక్రాయా గురించి మాత్రం ఏ చారిత్రక రికార్డుల్లోనూ రాయలేదు.
"ఈ రేఖా చిత్రాన్ని ఏదో ఒక అవసరానికే ఉపయోగించి ఉంటారు. కానీ, దాని కాలమానం తెలియకుండా దాని ఉపయోగం ఏంటో తెలుసుకోవడం కష్టం" అని అన్నారు.
శ్రీలంకలో మర్మగర్భంగా ఉన్న నక్షత్ర ద్వారం (స్టార్ గేట్) అని చెప్పే ఈ చిత్రపటం ప్రయోజనం, అర్ధం రహస్యంగానే మిగిలిపోయాయి. కాకపొతే, ఈ చిత్ర పటానికి సైన్స్ ఫిక్షన్ ఔత్సాహికులు కొత్తగా తెచ్చిన హోదాతో ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది.
వారి ఉత్సుకత, సోషల్ మీడియాకున్న శక్తి వల్ల అనురాధపుర నీడలోంచి బయటపడి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది.
ఇవి కూడా చదవండి:
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- మోషన్ సిక్నెస్: వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








