పాకిస్తాన్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టినప్పుడు... 'అపరాధం, పాపం' అని ఆగ్రహించారు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సారా అతీక్
    • హోదా, బీబీసీ కోసం

పాకిస్తాన్‌లో పిల్లలు పుట్టనివారికి ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగించే ప్రక్రియ 1984లో ప్రారంభమైంది.

ఈ పద్దతిని పాకిస్తాన్‌లో తొలుత పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ రషీద్ లతీఫ్ ఖాన్. లాహోర్‌లో ఆయన తొలి ఐవీఎఫ్ సెంటర్ 'లైఫ్'ను స్థాపించారు.

డాక్టర్ రషీద్ అయిదేళ్ల నిరంతర కృషి ఫలితంగా 1989లో పాకిస్తాన్‌లో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టింది.

1978లో ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇంగ్లండ్‌లో జన్మించినప్పుడు చాలామందికి దానిని నమ్మలేకపోయారు. ఈ పద్ధతిని ఎంతోమంది విమర్శించారు.

భారతదేశంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని బయటకు తీసుకొచ్చిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ విమర్శలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాలడ్డారు.

ఆ కథ మరోసారి చెప్పుకుందాం. ప్రస్తుతం పాకిస్తాన్‌కు చెందిన డాక్టర్ లతీఫ్ ఖాన్ కథకు వద్దాం.

డాక్టరుగా లతీఫ్ ఖాన్ ప్రయాణం కూడా అంత సులభం కాలేదు. ఎన్నో విమర్శలు, వేధింపులు ఎదుర్కొన్నారు.

పాక్ టెస్ట్ ట్యూబ్ బేబీ

ఫొటో సోర్స్, Getty Images

ఇవాళ పాకిస్తాన్‌లో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కంటున్నవారు వేలల్లో ఉన్నారు. కానీ, డాక్టర్ రషీద్ ఐవీఎఫ్ సెంటర్ స్థాపించినప్పుడు ఈ ప్రక్రియ గురించి సరైన అవగాహనగానీ, తగినన్ని వనరులుగానీ లేవు.

అప్పటికి ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ.. ప్రపంచంలో మూడవ టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. అక్కడకు వెళ్లి ఐవీఎఫ్ ప్రక్రియలో శిక్షణ పొందేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు.

ఆస్ట్రేలియాలో శిక్షణ పూర్తి చేసిన తరువాత డాక్టర్ రషీద్ పాకిస్తాన్‌లో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అయిదేళ్ల వరకు ఫలితాలు రాలేదు.

ఈ చికిత్స కోసం తానెప్పుడూ జంటలను వెతుక్కోవలసిన అవసరం రాలేదని, పిల్లలు లేని భార్యాభర్తలు చాలామంది ఆశతో తన దగ్గరకు వచ్చేవారని రషీద్ చెప్పారు.

"ఈ చికిత్సలో అనుకున్న ఫలితాలు రావట్లేదని నా దగ్గరకు వచ్చినవారికి ఎప్పుడూ నిజమే చెప్పేవాడిని. కానీ, నా మీద, నా బృందం కృషి మీద నమ్మకం ఉంచి, 'డాక్టరుగారూ మీరు ప్రయత్నించండి, ఈసారి మా విషయంలో విజయం లభించవచ్చు' అనేవారు" అని డాక్టర్ రషీద్ వివరించారు.

డాక్టర్ రషీద్ లతీఫ్ ఖాన్ (కుడి నుంచి రెండవ వ్యక్తి)

ఫొటో సోర్స్, DR RASHID LATIF KHAN

ఫొటో క్యాప్షన్, డాక్టర్ రషీద్ లతీఫ్ ఖాన్ (కుడి నుంచి రెండవ వ్యక్తి)

పాకిస్తాన్‌లో మొదటి ఐవీఎఫ్ గర్భధారణ

డాక్టర్ లతీఫ్ బృందంలోని ఒక సభ్యుడి సోదరుడు పాకిస్తాన్‌లోని ఓ ప్రముఖ వార్తాపత్రికలో పనిచేస్తున్నారు.

ఈ చికిత్స ద్వారా తొలిసారిగా ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు, "పాకిస్తాన్‌లో తొలిసారిగా ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ జరిగింది" అనే హెడ్డింగ్ పెట్టి మరీ ఈ వార్తను ప్రచురించారని డాక్టర్ రషీద్ చెప్పారు.

వెంటనే పదిమంది మౌల్వీలు (ముస్లిం మతాధికారులు) దీనిని వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు విడుదల చేశారు. ఇది "హరాం" అనీ, "అమెరికా కుట్ర" అనీ ఆరోపించారు.

'హరాం' అంటే పాపం, నిషిద్ధం అనే అర్థాలున్నాయి.

అయితే ఇది ఎక్టోపిక్ గర్భం కావడంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. ఎక్టోపిక్ గర్భం అంటే యుటరస్‌లో కాకుండా ఫాలోపియన్ ట్యూబ్‌లో పిండం ఏర్పడుతుంది.

పాక్ టెస్ట్ ట్యూబ్ బేబీ

ఫొటో సోర్స్, DR RASHID LATIF KHAN

రెండోసారి మరో మహిళ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన కొన్ని నెలలు తరువాత డాక్టర్ రషీద్ తనను విమర్శించిన మౌల్వీలను విడివిడిగా కలుసుకుని ఐవీఎఫ్ గురించి వివరించేందుకు ప్రయత్నించారు.

"అదే సమయంలో పాకిస్తాన్‌లో బైపాస్ సర్జరీ కొత్తగా ప్రారంభమైంది. పురుషుల గుండె నాళాల్లో ఏర్పడిన రుగ్మతను తొలగించడానికి బైపాస్ సర్జరీ చేయగలిగినప్పుడు, మహిళల గర్భాశయ నాళాల్లో సమస్య ఉంటే కూడా బైపాస్ చేయవచ్చు కదా అని వారికి చెప్పాను. అలా వివరించాక మౌల్వీలకు ఐవీఎఫ్ ప్రక్రియ అర్థమైంది."

పాకిస్తాన్‌లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టడానికి రోజులు సమీపిస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.

1989, జూలై 6వ తేదీని కాన్పు కోసం నిశ్చయించారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డ తల్లిదండ్రులను జనం వేధించకుండా ఉండేందుకు, అదే రోజు మరో అయిదుగురు తల్లులకు కూడా ప్రసవం చేయించారు.

టెస్ట్ ట్యూబ్ ద్వారా తొలి బిడ్డ జన్మించిందని మరుసటి రోజు పత్రికల్లో వార్త వచ్చింది.

ఆ బిడ్డ తండ్రి రషీద్‌ను కలిసి తన ఇంట్లో జరిగిన సంగతి చెప్పారు.

"పొద్దున్నే ఈ వార్త చదివి, ఈ పాపపు పని నువ్వుగానీ చేయలేదు కదా అని మా నాన్న నన్ను నిలదీశారు" అంటూ బిడ్డ తండ్రి వాపోయారు.

పాక్ టెస్ట్ ట్యూబ్ బేబీ

ఫొటో సోర్స్, DR RASHID LATIF KHAN

ఐవీఎఫ్ అంటే ఏంటి?

పురుషుల్లో లేక స్త్రీలలో లోపం లేదా సమస్య ఉన్నప్పుడు, పురుషుడి వీర్యంలోని శుక్రకణం సహజ ప్రక్రియ ద్వారా స్త్రీ అండాన్ని చేరుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు సహజ పద్ధతిలో పిల్లలు కలగడం అసాధ్యం.

అప్పుడు, పురుషుడి వీర్యాన్ని, స్త్రీ అండాన్ని వారి వారి శరీరాల నుంచి బయటకు తీసి ప్రయోగశాలలో ఆ రెండింటినీ కలుపుతారు. రెండు రోజుల తరువాత ఈ అండాన్ని మళ్లీ స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. తల్లి కడుపులో అండం పెరిగి తొమ్మిది నెలల తరువాత బిడ్డ పుడుతుంది. శుక్రకణం కలిపిన అండాన్ని తల్లి గర్భంలో ఉంచిన తరువాత సహజ గర్భధారణ మాదిరిగానే అంతా సాధారణంగా జరుగుతుంది.

ఐవీఎఫ్‌లో మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. సరొగసీ, వీర్యం దానం చేయడం(స్పెర్మ్ డొనేషన్), అండం దానం చేయడం(ఎగ్ డొనేషన్) ద్వారా కూడా పిల్లలు లేని తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చు. వీటన్నిటికీ ఐవీఎఫ్ ప్రక్రియనే ఉపయోగిస్తారు.

సరొగసీ అంటే గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. ఒక పురుషుడి వీర్యాన్ని, స్త్రీ అండాన్ని కలిపి వేరే మహిళ గర్భంలో ఉంచుతారు. ఆమె నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది.

వీర్యంలోగానీ, అండంలోగాని నాణ్యతా లోపాలు ఉంటే డొనేషన్ ద్వారా వచ్చిన దాత వీర్యాన్ని లేదా అండాన్ని తీసుకోవచ్చు.

సహజంగా కలవలేకపోతున్న శుక్రకణాన్ని, అండాన్ని బయటకు తీసి కలపడమే ఐవీఎఫ్ చికిత్స.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Wales News Service

ఐవీఎఫ్ ద్వారా ఆడపిల్లని లేదా మగపిల్లాడిని కనాలని ఎంచుకోవచ్చా?

ఇది కూడా సాధ్యమే. ఐవీఎఫ్ ద్వారా తమకు ఏ బిడ్డ కావాలనేది కూడా ఎంచుకోవచ్చు.

పాకిస్తాన్‌లో ఎక్కువగా కొడుకు పుట్టాలని కోరుకుంటారు. దాని కోసం ఎంతమంది పిల్లల్నైనా కంటారు, ఎన్ని వివాహాలైనా చేసుకుంటారు.

అందువల్ల పాకిస్తాన్‌లో 'ఫ్యామిలీ స్పేసింగ్' కింద ఐవీఎఫ్ చేయించుకుంటున్న దంపతులు, ఆడ లేదా మగ బిడ్డను ఎంపిక చేసుకోవచ్చు.

ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఐవీఎఫ్ ద్వారా పుట్టే బిడ్డల జెండర్‌ ఎంచుకోవచ్చు. కానీ, అది వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి మాత్రం కాదు. తల్లిదండ్రులకు ఉన్న జన్యు లోపాలు పిల్లలకు సంక్రమిస్తాయని అనుకున్నప్పుడు మాత్రమే బిడ్డల జెండర్ ఎంపిక చేసుకోవచ్చు.

కొన్ని రకాల జన్యువ్యాధులు ఆడపిల్లలకు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కొడుకు పుట్టాలని ఎంపిక చేసుకోవచ్చు. లేదా జన్యు లోపాలు మగబిడ్డకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటే ఆడపిల్లను ఎంచుకోవచ్చు.

పాక్ టెస్ట్ ట్యూబ్ బేబీ

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ చట్టంలో, ఇస్లాంలో ఐవీఎఫ్‌కు అనుమతి ఉందా?

1978లో ప్రపంచంలోని తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించిన సందర్భంగా, ఈజిప్టులోని అల్-అజహర్ విశ్వవిద్యాలయం 1980లో ఒక ఫత్వా జారీ చేసింది.

"వీర్యం, అండం ఆ తల్లిదండ్రులదే అయినప్పుడు ఐవీఎఫ్ ద్వారా పుట్టే బిడ్డకు షరియత్ ప్రకారం అనుమతి ఉంటుంది" అందులో పేర్కొన్నారు.

అందుకే, తొలుత మౌల్వీలు అడ్డు చెప్పినప్పటికీ, ఈ ఫత్వాను అనుసరించి 2015 వరకు ఐవీఎఫ్ చికిత్స చేసేందుకు ఏ అడ్డంకులు ఎదురవలేదు.

అయితే, 2015లో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన ఒక బిడ్డ కస్టడీ విషయమై ఆ బిడ్డ తల్లిదండ్రులు ఫెడరల్ షరియా కోర్టుకు వెళ్లారు.

పాక్ టెస్ట్ ట్యూబ్ బేబీ

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ మూలాలున్న అమెరికా డాక్టర్ ఫరూక్ సిద్దిఖీ దంపతులకు చాలాకాలం సంతానం కలగలేదు. అందుకే వారు సరొగసీని ఆశ్రయించారు. తమ బిడ్డ కోసం ఒక అద్దె గర్భం కావాలని, అందుకు తగిన మూల్యం చెల్లిస్తామని వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారు.

ఈ వార్త చదివి, ఫర్జానా నాహీద్ అనే మహిళ సరొగేట్ తల్లిగా ఉంటానంటూ ముందుకు వచ్చారు.

ఈ విషయమై డాక్టర్ ఫరూక్ దంపతులు ఫర్జానాతో చర్చించారు. వైద్య పరీక్షలు, చికిత్స కోసం రూ. 25 వేలు అందించారు.

సరొగసీ ద్వారా ఫర్జానా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డను ఫరూఖ్ దంపతులకు అప్పగించేందుకు ఆమె నిరాకరించారు.

అంతేకాకుండా, తాను డాక్టర్ ఫరూఖ్ భార్యనని, నెల నెలా బిడ్డ ఖర్చుల కోసం డబ్బులు పంపించాలని వాదించారు.

కుటుంబ సభ్యులు, బంధువుల వేధింపుల నుంచి బయటపడేందుకే తాను ఫర్జానాను పెళ్ళి చేసుకున్నట్లు నాటకం ఆడానని డాక్టర్ ఫరూఖ్ చెప్పారు.

దాంతో ఈ వివాదం కోర్టు వరకూ వెళ్లింది.

సరోగసీ నేరం

ఫొటో సోర్స్, PA Media

సరోగసీ చట్టవిరుద్ధమని ప్రకటన

2017లో ఫెడరల్ షరియా కోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ, "పాకిస్తాన్ చట్టం, షరియా చట్టం ప్రకారం అండం, గర్భాశయం కూడా ఆ తల్లిదే అయినప్పుడు, వీర్యం ఆ తండ్రిదే అయినప్పుడు మాత్రమే ఐవీఎఫ్ చికిత్స అనుమతించబడుతుందని" చెప్పింది.

దాతలు ఇచ్చే వీర్యం, అండాల నుంచి బిడ్డలను పుట్టించడం చట్టవిరుద్దమని షరియా కోర్టి తేల్చి చెప్పింది. సరొగసీని చట్టవిరుద్ధంగా ప్రకటించింది.

కాగా, ఇరాన్, లెబనాన్‌లలో డొనేషన్ ద్వారా వీర్యం, అండాలను పొందడం చట్టబద్ధంగానే పరిగణిస్తారు.

నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ అధ్యయనం ప్రకారం, పాకిస్తాన్‌లో 22 శాతం జంటలు సంతానలేమితో బాధపడుతున్నారు. అంటే జనాభాలో ప్రతీ ఐదు జంటల్లో ఒక జంటకు పిల్లలు కలగట్లేదు.

"పురుషుల్లో, స్త్రీలలో సంతానలేమి లోపాలు సమానంగా ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మా దేశంలో భార్యలనే దోషులుగా చిత్రీకరిస్తారు. చాలామంది పురుషులు పరీక్ష చేయించుకోడానికి కూడా ఇష్టపడరు" అని డాక్టర్ రషీద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)