పాకిస్తాన్‌ - దైవదూషణ: మూక దాడి నుంచి శ్రీలంక జాతీయుడిని రక్షించడానికి ప్రయత్నించిన మాలిక్‌కు శౌర్య పురస్కారం

మాలిక్ అద్నాన్

ఫొటో సోర్స్, Malik Adnan

ఫొటో క్యాప్షన్, మాలిక్ అద్నాన్

పాకిస్తాన్‌ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ తమకు న్యాయం చేయాలని పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో దైవ దూషణ ఆరోపణలతో ఒక మూక చేతిలో హత్యకు గురైన శ్రీలంక జాతీయుడు ప్రియాంథ దియావదన భార్య డిమాండ్ చేశారు.

మరోవైపు ప్రియాంథ దియావదనపై మూక దాడిని ఆపడానికి ప్రయత్నించిన మాలిక్ అద్నాన్‌పై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. పౌర పురస్కారం తంగా-ఇ-షౌకత్‌‌ను అందజేయనున్నట్లు ప్రకటించారు.

దేవుడిని దూషించారని ఆరోపిస్తూ దియావదనపై సియాల్‌కోట్‌లోని రాజ్‌కో ఫ్యాక్టరీ కార్మికులు దాడికి ప్రయత్నించగా, అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్న మాలిక్ అద్నాన్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అది ఫలించలేదు. ఆగ్రహంతో ఉన్న మూక, దియావదనపై దాడి చేసి కొట్టి చంపారు. ఆ తర్వాత ఆయన శరీరాన్ని తగలబెట్టారు.

తనకు ప్రమాదమని తెలిసి కూడా బాధితుడిని రక్షించేందుకు ప్రయత్నించినందుకు మాలిక్ అద్నాన్‌కు పాకిస్తాన్ నాలుగవ అత్యున్నత శౌర్య పురస్కారం తంగా-ఇ-షౌకత్‌‌ను అందజేస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ప్రకటించారు.

పాకిస్తాన్: దైవదూషణ ఆరోపణలతో మూక చేతిలో హత్యకు గురైన ప్రియాంథ దియావదన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దైవదూషణ ఆరోపణలతో మూక చేతిలో హత్యకు గురైన ప్రియాంథ దియావదన

''మానవత్వంతో ఆయనను కాపాడేందుకు ప్రయత్నించా'' అని స్థానిక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ మాలిక్ అద్నాన్ తెలిపారు.

రాజ్‌కో ఇండస్ట్రీస్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్న మాలిక్ అద్నాన్, ప్రియాంథ దియావదనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ గుంపు ఫ్యాక్టరీ మేనేజర్ ప్రియాంథపై విరుచుకు పడింది. అయితే, ఎర్రని స్వెటర్ ధరించిన ఓ వ్యక్తి ఆ గుంపు నుంచి ఆయనను రక్షించడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది.

ప్రియాంథపై దాడి చేయవద్దంటూ మాలిక్ అద్నాన్ ఆ గుంపును వేడుకోవడం కూడా కనిపిస్తుంది. ఆయన తలపై వాలి, దెబ్బలు తగలకుండా రక్షించడానికి అద్నాన్ ప్రయత్నిస్తుండగా, ప్రియాంథ దియావదన వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

అద్నాన్ ప్రియాంథపై పూర్తిగా వాలి, ఆయనకు కవర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే, ఆ గుంపు అద్నాన్‌ను పక్కకు తప్పించడానికి ప్రయత్నించింది. ''వాడు(ప్రియాంథ) ఈ రోజు బతకడు'' అని జనం అరవడం వీడియోలో వినిపిస్తుంది.

ఈ సంఘటనకు సంబంధించిన మరో వీడియో ఫ్యాక్టరీ లోపల రికార్డ్ అయ్యింది. వీడియోలో అద్నాన్ ఫ్యాక్టరీలోని గుంపును ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్రహించిన గుంపు టెర్రస్‌పైకి రాకముందు ఈ వీడియో రికార్డ్ అయ్యింది. అద్నాన్ దాదాపు 45 నిమిషాల పాటు ఈ గుంపును ఆపేందుకు ప్రయత్నించారని సోషల్ మీడియాలో కొందరు యూజర్లు రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అద్నాన్‌కు ఇమ్రాన్ అభినందనలు

అద్నాన్ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశంలోని నాల్గవ అత్యున్నత శౌర్య పురస్కారం తంగా-ఇ-షౌకత్‌ను ప్రధాని ప్రకటించారు. ''ఇది పాకిస్తాన్‌కు సిగ్గుపడే రోజు'' అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

సియాల్‌కోట్ పోలీసు ప్రతినిధి కూడా మాలిక్ అద్నాన్ ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ కేసు దర్యాప్తులో సహాయం చేస్తున్నారని, ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు.

శ్రీలంకకు చెందిన ప్రియాంథ దియావదన దాదాపు దశాబ్ధ కాలంగా సియాల్‌కోట్ ఫ్యాక్టరీలో ఎక్స్‌పోర్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర పోలీసుల ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం, క్రమశిక్షణతో కూడిన, స్ట్రిక్ట్ మేనేజర్‌గా ప్రియాంథకు పేరుంది. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మతపరమైన స్టిక్కర్లను తొలగించాలని ప్రియాంథ ఆదేశించడంతో వివాదం మొదలైంది. ఇది కార్మికులకు కోపం తెప్పించింది.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మేనేజర్ ప్రియాంథను ఫ్యాక్టరీలో చిత్రహింసలకు గురి చేశారు. ఆగ్రహంతో ఉన్న మూకకు సర్ది చెప్పేందుకు ప్రొడక్షన్ మేనేజర్ మాలిక్ అద్నాన్‌తో సహా కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. కానీ, వారు వినలేదు.

"నలభై, యాభై మంది ప్రియాంథ దగ్గరికి రావడం చూశాను. డాబా మెట్ల వైపు పరిగెత్తాను. నేను ఆయన దగ్గరకు వెళ్లేసరికే ప్రియాంథ తల మీదా, ముఖం మీదా గాయాలున్నాయి'' అని అద్నాన్ గుర్తు చేసుకున్నారు.

మానవత్వంతోనే తన మిత్రుడిని కాపాడాలనుకున్నానని, కానీ వారి బలం ముందు తానేమీ చేయలేకపోయానని అద్నాన్ అన్నారు. ''ప్రియాంథ నిజాయితీ, క్రమశిక్షణగల మంచి అధికారి'' అని అద్నాన్ పేర్కొన్నారు.

''నాకు అవార్డు ప్రకటించినందుకు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు'' అని అద్నాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)