MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?

మార్కెట్లో ధరలు పడిపోయినా, ప్రభుత్వం ఎంఎస్‌పీ వద్ద రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తుంది

ఫొటో సోర్స్, RAWPIXEL

ఫొటో క్యాప్షన్, మార్కెట్లో ధరలు పడిపోయినా, ప్రభుత్వం ఎంఎస్‌పీ వద్ద రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తుంది

పార్లమెంటులో శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే బిల్లును మోదీ ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదించింది.

అయితే, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు హామీ ఇవ్వాలని రైతులు గత ఏడాది కాలంగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు.

అసలు ఎంఎస్‌పీ అంటే ఏంటి? దాని అవసరం ఏంటి?

కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస ధర నిర్ణయిస్తుంది. దీన్నే కనీస మద్దతు ధర (మినిమం సపోర్టింగ్ ప్రైస్) అంటారు. ఒకవేళ మార్కెట్లో ధరలు పడిపోయినా, ప్రభుత్వం ఎంఎస్‌పీ వద్దే రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తుంది. దీనివల్ల రైతులు నష్టపోకుండా ఉంటారు.

రైతుల మేలు కోసం ఏళ్ల తరబడి ఈ ఎంఎస్‌పీ విధానం కొనసాగుతోంది. 1960ల ప్రారంభంలో ఆహార కొరత నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తొలుత గోధుమలపై ఎంఎస్‌పీ ప్రారంభించింది. ఈ ధర వద్ద రైతుల నుంచి గోధుమలు కొనుగోలు చేసి పీడీఎస్ పథకం (రేషన్) కింద పేదలకు పంపిణీ చేస్తుంది.

రైతుల మేలు కోసం ప్రభుత్వం ఏళ్ల తరబడి ఎంఎస్‌పీ విధానాన్ని పాటిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రైతుల మేలు కోసం ప్రభుత్వం ఏళ్ల తరబడి ఎంఎస్‌పీ విధానాన్ని పాటిస్తోంది.

ఎంఎస్‌పీ విషయంలో రైతుల భయం ఏమిటి?

రైతులు పెట్టిన ఖర్చులో 50 శాతం రాబడి పొందాలనే ప్రాతిపదికన కనీస మద్దతు ధరను నిర్ణయిస్తారు. అయితే, వాస్తవంలో ఇలా జరగట్లేదు.

చాలా ప్రాంతాల్లో రైతులు పండించిన పంటను ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. దీనికి సంబంధించి చట్టాలేమీ లేవు. ఆ కారణంగా రైతులు కోర్టును ఆశ్రయించే పరిస్థితి లేదు.

ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడైనా ఎంఎస్‌పీ నిలిపివేయవచ్చు. ఎంఎస్‌పీ అనేది ఒక విధానం మాత్రమే. చట్టబద్ధం కాదు. ఇదే రైతుల భయం.

ఇప్పటివరకు ఎంఎస్‌పీ వల్ల రైతులు ఎంత లాభపడ్డారు?

అన్ని పంటలకూ ప్రభుత్వం కనీస ధర ఇవ్వదు. ఇప్పటి వరకూ కేవలం 23 పంటలకు మాత్రమే ఎంఎస్‌పీ అందిస్తోంది.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగం ‘కమీషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది.

2014 ఆగస్టులో ఏర్పాటైన శాంత కుమార్ కమిటీ నివేదిక ప్రకారం, దేశంలో కేవలం ఆరు శాతం రైతులు మాత్రమే ఎంఎస్‌పీ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

బిహార్ రాష్ట్రంలో ఎంఎస్‌పీ పద్ధతి లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసింది.

కానీ, అక్కడ పీఏసీఎస్ చాలా తక్కువగా, ఆలస్యంగా కొనుగోలు చేస్తుందని, దీనివల్ల ఎక్కువ భాగం పంటను తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సి వస్తోందని బిహార్ రైతులు వాపోతున్నారు.

ఏ పంటలకు ఎంఎస్‌పీ లభిస్తుంది?

మొత్త 23 పంటలకు ప్రభుత్వం ఎంఎస్‌పీ అందిస్తుంది.

అవి..

  • 7 తృణ ధాన్యాలు.. వరి, గోధుమ, సజ్జలు, మొక్కజొన్న, జొన్న, రాగి, బార్లీ.
  • 5 పప్పు ధాన్యాలు.. సెనగ, కంది, పెసర, మినప, మసూర్ (ఎర్ర పెసర)పప్పులు
  • 7 నూనె గింజలు.. పెసర, సోయాబీన్, ఆవాలు, పొద్దు తిరుగుడు, నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ పువ్వు
  • 4 ఇతర పంటలు.. చెరకు, పత్తి, జనపనార, కొబ్బరి

వీటిల్లో చెరకు కు మాత్రమే కొన్ని చట్టపరమైన పరిమితులు వర్తిస్తాయి. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం, చెరకుకు న్యాయమైన, లాభదాయకమైన ధర చెల్లించాల్సిన అవసరం ఉంది.

ఎంఎస్‌పీ విషయంలో రైతుల డిమాండ్ ఏమిటి?

ప్రభుత్వం ఎంఎస్‌పీ విధానాన్ని కొనసాగించాలని, ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేయడం నేరంగా పరిగణించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాకుండా, ఇతర పంటలను కూడా ఎంఎస్‌పీ పరిధిలోకి తీసుకురావాలని పట్టుబడుతున్నారు.

కాగా, ఎంఎస్‌పీ విధానాన్ని రద్దు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని, ఆ పద్ధతి కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

అలా అయితే, ఈ విధానాన్ని చట్టబద్ధం చేసి, ఎంఎస్‌పీపై హామీ ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నారు.

చాలా ప్రాంతాల్లో ఎంఎస్‌పీ ఉన్నా తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చాలా ప్రాంతాల్లో ఎంఎస్‌పీ ఉన్నా తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది.

ప్రభుత్వంపై ఎంఎస్‌పీ భారం ఎంత?

ఈ 23 పంటలూ భారతదేశ వ్యవసాయోత్పత్తిలో మూడింట ఒక వంతు మాత్రమే. చేపల పెంపకం, పశుపోషణ, కూరగాయలు, పండ్లు తదితరాలు ఇందులో భాగం కావు.

2019-20 సంవత్సరంలో ఈ 23 పంటల మొత్తం ఉత్పత్తి 10.78 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఉత్పత్తి చేసినదంతా మార్కెట్లో విక్రయించరు. కొంత భాగాన్ని సొంత అవసరాలకు వాడుకుంటారు.

ఈ పంటలను మార్కెట్లో అమ్మే నిష్పత్తి కూడా వేరు వేరుగా ఉంటుంది. 50 శాతం రాగి అమ్మితే, 90 శాతం పప్పుధాన్యాలు, 75 శాతం గోధుమలను మార్కెట్లో అమ్ముతారు.

ఉదాహరణకు, 75 శాతం గోధుమలను లెక్కలోకి తీసుకుంటే, సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పైనే అవుతుంది. ప్రభుత్వం ఎంఎస్‌పీపై హామీ ఇవ్వాలంటే ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత అవసరం అన్నదే ప్రశ్న? దీనికి స్పష్టమైన జవాబు లేదు.

ఈ 23 పంటల్లోంచి చెరకును తప్పించవచ్చు. ఎందుకంటే చెరకుకు ప్రభుత్వం డబ్బు చెల్లించక్కర్లేదు. నేరుగా చక్కెర మిల్లులే చెల్లిస్తాయి.

ప్రభుత్వం తమ ఏజెన్సీల ద్వారా కొన్ని పంటలను ముందే కొనుగోలు చేస్తోంది. 2019-20లో వీటి మొత్తం ఖర్చు 2.7 లక్షల కోట్ల రూపాయలు.

అయితే, ప్రభుత్వ సంస్థలు మార్కెట్‌లోని మొత్తం పంటను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అందులో మూడో వంతు లేదా నాలుగో వంతు కొనుగోలు చేసినా చాలు, మార్కెట్లో ధర పెరుగుతుంది.

రైతులు ఆ పెరిగిన ధర వద్ద పంటను అమ్ముకుంటారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటను సబ్సిడీ ధరలను విక్రయిస్తారు.

ఈ అంశాలన్నింటినీ పరిగణించి చూసినా, ప్రభుత్వంపై ప్రతి ఏటా సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలు భారం పడుతుంది.

ఎంఎస్‌పీ ద్వారా ప్రభుత్వం ఏ విధంగా రైతులకు ప్రయోజనాలను చేకూర్చగలదు?

చెరకు లాగ, ఇతర పంటలను కూడా ఎంఎస్‌పీ వద్దే ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవొచ్చు.

అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి ఎంఎస్‌పీ వద్ద పంటలను కొనుగోలు చేయొచ్చు.

రైతులకు వచ్చిన నష్టాన్ని ప్రభుత్వం పూడ్చవచ్చు. స్వయంగా కొనుగోలు చేయక్కర్లేదు. లేదా ప్రయివేటు కంపెనీలపై ఒత్తిడి తీసుకురానక్కర్లేదు.

మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత ధర వద్ద రైతులు పంటలు అమ్ముకుంటారు. ఎంఎస్‌పీకి, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు ముట్టజెపితే సరిపోతుంది. ఇప్పటికే ఈ పద్ధతిని 'కిసాన్ సమ్మాన్ నిధి' వంటి పథకాల ద్వారా అమలు చేస్తున్నారు.

ఎంఎస్‌పీకి చట్టబద్ధత కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఎంఎస్‌పీకి చట్టబద్ధత కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

హామీని లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు?

ఎంఎస్‌పీకి చట్టబద్ధత తీసుకువచ్చినా, అది అమలు జరిగేలా చూడడం సాధ్యమేనా అంటూ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎస్‌పీ ఒక "ఫెయిర్ ఏవరేజ్ క్వాలిటీ" (సగటున ఓ మోతాదులో నాణ్యమైన సరుకు)ని సూచిస్తుంది. అంటే నిర్ణయించిన ప్రమాణాలకు తగ్గ నాణ్యతతో పంటను పండిస్తేనే కనీస మద్దతు ధరను ఇవ్వగలరు.

అయితే, ప్రమాణాలకు తగ్గినట్టుగా పంట ఉందా లేదా అన్నది ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రమాణాలను పాటించని పంటను ఏం చేస్తారు?

ఇన్ని సందేహాల మధ్య ఎంఎస్‌పీకి చట్టబద్ధత తీసుకువచ్చినా, అమలు చేయడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

రైతులు కోరుతున్నట్లుగా ఇతర పంటలను కూడా ఎంఎస్‌పీ కిందకు తీసుకువస్తే, ప్రభుత్వంపై పడే బడ్జెట్ భారం గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

వరి, గోధుమల కొనుగోళ్లను తగ్గించాలని పలు కమిటీలు ప్రభుత్వానికి సూచించాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగా కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఈ భయం కూడా రైతులను వెంటాడుతోంది.

ప్రభుత్వం కొనుగోళ్లను తగ్గిస్తే రైతులు పంటలను ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తారు. ఈ కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకే మొగ్గుచూపుతాయి.

ఎంఎస్‌పీ వద్దే కొనుగోలు చేయాలని కంపెనీలపై ఒత్తిడి తెచ్చే మార్గమేమీ ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వం ఈ అంశాన్ని ద్వైపాక్షికంగానే ఉంచాలని చూస్తోందని నిపుణులు అంటున్నారు.

ఎంఎస్‌పీని చట్టబద్ధం చేస్తే, దీనికి సంబంధించిన ప్రతి అంశంలోనూ మూడు పక్షాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి ప్రభుత్వం, రెండు రైతులు, మూడవ పక్షం ప్రయివేటు కంపెనీలు. ఇది ప్రభుత్వానికి కత్తి మీద సాములాగ తయారవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)