ఫోర్డ్ 'సోయాబీన్ కారు': చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఎందుకు ధ్వంసం చేశారు? ఆ ఫార్ములా ఏమైంది?

హెన్రీ ఫోర్డ్

ఫొటో సోర్స్, THE HENRY FORD / FORD MOTOR COMPANY

ఫొటో క్యాప్షన్, బయోప్లాస్టిక్‌తో తయారు చేసిన తన కారును ప్రదర్శిస్తున్న హెన్రీ ఫోర్డ్

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో తయారు చేసిన వాహనాలు 'ఫోర్డ్-టీ'. వీటిని తయారు చేసింది హెన్రీ ఫోర్డ్. ప్రపంచ వాహనాల్లోనే చిరస్థాయిగా నిలిచిపోయిన రికార్డు ఇది.

అమెరికాకి చెందిన హెన్రీ ఫోర్డ్ కార్ల తయారీ కోసం స్థాపించిన అసెంబ్లీ లైన్ అనేది ప్రపంచ ఆటోమొబైల్ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది.

ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో హెన్రీ ఫోర్డ్ రవాణా పరిశ్రమను ఒక పెద్ద మార్కెట్‌ స్థాయికి తీసుకొచ్చారు.

వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంధనంతో నడుస్తూ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే ఈ వాహనాలు భూ ఉష్ణోగ్రత పెరుగుదలకు, వాతావరణ మార్పులకు కారణంగా భావిస్తున్నారు.

అయితే మనకు కార్లపై ఉన్న క్రేజ్‌కి కారణమైన వ్యక్తి పర్యావరణ రంగంలో కూడా అగ్రగామి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

వీడియో క్యాప్షన్, కారు కాదది.. స్కూలు

'సోయాబీన్ కారు'

ఎందుకంటే 1930లలో, బయోప్లాస్టిక్‌లను ఉత్పత్తి చేయడం, ఉపయోగించడంలో ఫోర్డ్ మొదటి స్థానంలో ఉంది.

బయోప్లాస్టిక్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్, ఇది మొక్కలు, హైడ్రోకార్బన్‌ల నుంచి తయారవుతుంది. అంతే కాకుండా ఇది బయోడీగ్రేడబుల్.

బయోప్లాస్టిక్‌లను తయారు చేయడమే కాకుండా, దాని నుంచి కారును తయారు చేసిన మొదటి వ్యక్తి ఫోర్డ్.

ఈ కారుకు 'సోయాబీన్ కారు' లేదా 'సోయాబీన్ ఆటో' అని పేరు పెట్టారు. ఫోర్డ్ సంస్థ దీనిని 1941లో ప్రజల ముందుకు తెచ్చింది.

ప్లాస్టిక్, స్టీల్ కంటే పది రెట్లు దృఢంగా ఉందని ఫోర్డ్ పేర్కొన్నారు. ఆయన తయారు చేసిన ప్రతి మెటీరియల్ ప్యానెల్‌ను గొడ్డలితో కొట్టి పరీక్షించారు. మెటల్ ప్యానెల్‌లో గుంటలు మాత్రమే ఏర్పడ్డాయని చూపించారు.

హెన్రీ ఫోర్డ్

ఫొటో సోర్స్, THE HENRY FORD / FORD MOTOR COMPANY

రైతు, పారిశ్రామికవేత్త

ఈ మెటీరియల్‌తో పదివేల కార్ల విడిభాగాలను తయారు చేయాలనుకున్న హెన్నీ ఫోర్డ్ చివరకు అలా చేయలేకపోయారు.

వాస్తవానికి, ఆయన సోయాబీన్ కారు మార్కెట్లోకి రాలేకపోయింది. తయారు చేసిన ఒక్క కారును కూడా ధ్వంసం చేశారు. దానిలాంటి ఇంకో కారు లేదు.

ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే హెన్రీ ఫోర్డ్‌ గ్రీన్‌ కారు అనేది ఎందుకు నిలిపివేశారు, ఎందుకు విజయవంతం కాలేకపోయింది?

బెన్సన్ ఫోర్డ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ప్రముఖ వ్యాపారవేత్త హెన్రీ ఫోర్డ్ మిచిగాన్‌లోని వ్యవసాయ క్షేత్రంలో పెరిగారు. పరిశ్రమ, వ్యవసాయ రంగాలను ఎలా మిళితం చేయాలో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు.

హెన్రీ ఫోర్డ్ పనిని ప్రోత్సహించడానికి బెన్సన్ సెంటర్ పనిచేస్తుంది.

వీడియో క్యాప్షన్, నానో కార్ల పరిశ్రమ తరలిపోవడంతో సింగూరు రైతులు ఇప్పుడేం చేస్తున్నారు

ప్లాస్టిక్ ప్యానెల్ కారు

వ్యవసాయ ఉత్పత్తులు అయిన సోయాబీన్స్, మొక్కజొన్న, గోధుమలు, జనపనారల పారిశ్రామిక ఉపయోగాలను కనుగొనడానికి ప్రయత్నించే ల్యాబ్‌లను ఫోర్డ్ ఏర్పాటు చేశారు.

ఈ ప్లాంట్ల నుంచి తయారైన ప్లాస్టిక్‌తో కారును తయారు చేయాలనే ఆలోచన, వ్యవసాయం-పరిశ్రమలను అనుసంధానించే ఫోర్డ్ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమే కాకుండా, ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

బెన్సన్ ఫోర్డ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, సాంప్రదాయ ఉక్కు ఫ్రేమ్ కారు కంటే ప్లాస్టిక్ ప్యానళ్లతో నిర్మించిన కారు మరింత సురక్షితంగా ఉందని ఫోర్డ్ విశ్వసించింది.

ఈ కారును తయారు చేయడానికి మరో కారణం ఏంటంటే, ప్రమాదాలు సంభవించినప్పుడు ధ్వంసం కాకుండా, కారు బోల్తాపడే అవకాశం ఉంది.

1939వ సంవత్సరంలో యూరోప్‌లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమై ప్రపంచంలో లోహానికి కొరత ఏర్పడింది.

సోయాబీన్ కారు గురించి మనకు ఏం తెలుసు?

1941లో న్యూ యార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కారును ప్రదర్శిస్తున్నప్పుడు, హెన్రీ ఫోర్డ్ ఈ ప్లాస్టిక్‌తో తయారు చేసిన కారు అమెరికాలో ఉక్కు వినియోగాన్ని పది శాతం తగ్గించగలదని చెప్పారు.

బెన్సన్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ఈ ఆవిష్కరణ గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే భద్రపరిచి ఉంది.

హెన్రీ ఫోర్డ్

ఫొటో సోర్స్, THE HENRY FORD / FORD MOTOR COMPANY

ముఖ్యంగా ఇప్పుడు పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుండటంతో, చాలా మంది ఇప్పటికీ దీని గురించి ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ కారు దేనితో తయారు చేశారు అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. బెన్సన్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ప్యానెల్‌లో ఏ పదార్థాలు వాడారో దాని గురించి కచ్చితమైన పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఎందుకంటే దాని ఫార్ములా భద్రపరిచి లేదు.

ఈ కారు గురించి ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఫోర్డ్ రసాయన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌ను తయారు చేయడానికి 70 శాతం సెల్యులోజ్, 30 శాతం రెసిన్ బైండర్‌ను ఉపయోగించారు.

కథనం ప్రకారం, సెల్యులోజ్ ఫైబర్‌లో 50% దేవదారు ఫైబర్, 30% గడ్డి, 10% గంజాయి, 10% రెమీ(ఒక రకమైన మొక్క, దీనిని మమ్మీలను తయారు చేయడానికి పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించారు) ఉండేవి.

అయితే, కారును తయారు చేసిన టీమ్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న లోవెల్ ఈ భిన్నమైన సమాచారం ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో ఈ ప్లాస్టిక్‌ను సోయా ఫైబర్, ఫినోలిక్ రెసిన్, ఫార్మాల్డిహైడ్‌తో తయారు చేసినట్లు చెప్పారు.

చాలా తేలిక

అయితే సోయాబీన్ కారు రూపకల్పన, అమర్చడంపై డాక్యుమెంటరీ సమాచారం ఉంది.

ఫోర్డ్ ఈ పనిని సోయాబీన్ కారు ల్యాబ్‌లో టూల్ అండ్ డై డిజైన్ ఇంజనీర్ అయిన ఓవర్‌లేకి అప్పగించింది.

సూపర్‌వైజర్, రసాయన శాస్త్రవేత్త అయిన రాబర్ట్ ఏ బోయర్ కూడా ఓవర్లేకు ఈ ప్రాజెక్ట్‌లో సహాయం చేశారు.

కారు 14 ప్లాస్టిక్ ప్యానెల్స్‌తో స్టీల్ ట్యూబ్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ప్లాస్టిక్ వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే ఇది ఉక్కు కంటే చాలా తేలికైనది.

హెన్రీ ఫోర్డ్

ఫొటో సోర్స్, THE HENRY FORD / FORD MOTOR COMPANY

సోయాబీన్ కారు 907 కిలోల బరువు మాత్రమే ఉంది. ఇది సాధారణ కారు కంటే 450 కిలోలు తక్కువ.

1941 ఆగస్టు 13న ఫోర్డ్ తన ఆవిష్కరణతో ఈ కారును పరిచయం చేసినప్పుడు, దాని నాణ్యత ప్రమాణాలను కూడా నొక్కి చెప్పారు.

మిచిగాన్‌లోని డియర్‌బార్న్ డేస్ కమ్యూనిటీ ఈవెంట్‌లో, తర్వాత మిచిగాన్ ఫెయిర్‌లో ఈ కారును పరిచయం చేశారు.

అయితే ప్లాంట్ ఆధారిత ప్లాస్టిక్‌ల పట్ల ఫోర్డ్ ఉత్సాహం చూపినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు.

ఓవర్‌లే ప్రకారం, ఈ కారు ఒక మోడల్‌ని మాత్రమే ఉత్పత్తి చేశారు. దాన్ని కూడా ధ్వంసం చేశారు. మరొక కారును నిర్మించే ప్రణాళికలు నిలిపివేశారు.

సోయాబీన్

ఫొటో సోర్స్, THE HENRY FORD / FORD MOTOR COMPANY

ఫొటో క్యాప్షన్, సోయాబీన్ కారు నమూనా

కారణం ఏంటి?

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రమేయం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడమే కాకుండా, ఆ సమయంలో అమెరికాలో కార్ల తయారీపై నిషేధం విధించారు.

బెన్సన్ ఫోర్డ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ప్లాస్టిక్ నుంచి కారును తయారు చేయాలనే ఆలోచన యుద్ధం తరువాత పట్టాలెక్కలేకపోయింది.

యుద్ధం తర్వాత దేశ నిర్వహణ, తిరిగి అభివృద్ధి పథంలో పయనించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

అదే సమయంలో, బయోప్లాస్టిక్‌లపై ఆసక్తి లేకపోవడానికి కారణం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చమురు సులభంగా లభించడం వల్ల ఆర్థికంగా అనువుగా ఉందని కొందరు భావించారు.

కారణం ఏమైనప్పటికీ, సోయాబీన్ కారు నిర్మాణం, ఆ తర్వాత దాని రూపకల్పన ఆగిపోవడం అనేవి నేటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)