COP26: 'మా ఉనికి, మనుగడ ప్రమాదంలో ఉన్నాయి...' వాతావరణ మార్పులపై యువతుల ఆందోళన

- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు యువతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తం 10 దేశాల్లో 10,000 మందితో నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది.
16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న సుమారు 60 శాతం మంది వాతావరణ మార్పుల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు సమాధానమిచ్చారు.
అందులో మూడొంతుల మంది భవిష్యత్తు భయపెట్టే విధంగా ఉందనే సమాధానాన్నిచ్చారు. సర్వేలో పాల్గొన్న సగం మంది (56 శాతం) మానవాళి అంతమవుతుందని భావించారు.
1995 నుంచీ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (సిఓపిఎస్) లాంటి అంతర్జాతీయ వాతావరణ సదస్సుల కోసం ప్రపంచ నాయకులు కలుస్తూనే ఉన్నారు.
నవంబరులో 26వ సిఓపిఎస్ సదస్సు గ్లాస్‌గోలో జరగనుంది. ఈ నేపథ్యంలో బీబీసీ అయిదు దేశాలకు చెందిన మహిళలతో మాట్లాడింది. వీరంతా 1995 తర్వాత పుట్టినవారే. వీరందరి అభిప్రాయాలూ ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. అందరూ భవిష్యత్తు పట్ల ఆందోళనను వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Ameera Latheef
అమీరా లతీఫ్, 23 సంవత్సరాలు, మాల్దీవులు
నేను మేల్ దీవికి ఉత్తరాన పెరిగాను. నేను ఇంట్లోంచి అడుగు బయటపెట్టగానే ఎదురుగా సముద్రం కనిపించేది.
నేను సంతోషంగా ఉన్నా, కోపంగా ఉన్నా, విచారంగా ఉన్నా, సంబరం చేసుకోవాలన్నా సముద్రతీరానికి వెళ్లి కూర్చునేదానిని.
సముద్రమే నా థెరపిస్ట్. సముద్రమే నాకు సాంత్వన చేకూర్చేది. నా ఉత్సాహాన్ని పెంచేది.
ఏదో సంప్రదాయంలా ప్రతి శుక్రవారం ఇక్కడ సముద్ర తీరంలో గడిపేందుకు చాలా కుటుంబాలు వస్తాయి. ఇక్కడ అన్ని వయసుల వారినీ చూడవచ్చు.
నాకు 16 ఏళ్ళు ఉండగా క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. దాంతో, చికిత్స కోసం భారతదేశం వచ్చాను.
ఇక్కడ 32 నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత మా దేశానికి తిరిగి వెళ్లాను.
నేను బీచ్ కు వెళ్లేసరికి నేను సాధారణంగా గడిపే చోటు, మా నానమ్మ కథలు చెబుతుంటే కూర్చుని వినే ప్రదేశం కనిపించలేదు.
అదే స్థలంలో నేను నా స్నేహితులతో కలిసి నీళ్లలో ఆడుకున్నాను. అక్కడుండే ఈత చెట్టు కూడా మాయమైపోయింది.
ఇదంతా వినాశకరంగా అనిపించింది. నా గుండె పగిలిపోయింది. నా ఉనికి కొట్టుకుపోయినట్లు అనిపించింది.
ప్రస్తుతం తరచుగా కోరల్ బ్లీచింగ్ జరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మా పగడపు గుట్టలు నాశనమవుతున్నాయి.
వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాన్ని ఎదుర్కొనే నైపుణ్యం మా దగ్గర లేదు.
కొన్ని సార్లు తీరం కొట్టుకుపోకుండా కొందరు పెద్ద పెద్ద రాళ్లను తీరంలో పెట్టడాన్ని చూస్తూ ఉంటాను.
ప్రస్తుత తరహాలో సముద్ర మట్టం పెరుగుతూ ఉంటే, 2100 నాటికి 80 శాతం మాల్దీవులు మునిగిపోతాయి.
ఆ దృశ్యం స్మశానాన్ని తలపిస్తుంది. ఒక రోజు ఈ దేశ జనాభా అంతా ఈ ప్రాంతాన్ని వదిలి పెట్టి వెళ్లాల్సి వస్తుందనే ఊహ చాలా బాధాకరంగా ఉంది.
మాల్దీవులతో పాటు మరెన్నో దీవులతో కూడిన దేశాలు వాతావరణ మార్పుల ప్రభావానికి లోనయ్యే దేశాల్లో ముందున్నాయి.
కానీ, ఈ హాని ఇంతటితో ఆగదు. ఇప్పుడు కాకపొతే, తర్వాతైనా అభివృద్ధి చెందిన దేశాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయి.
నేను ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్నాను. ఇది నా మనసుకు దగ్గరగా ఉండే విషయం.
వాతావరణ మార్పులను పరిష్కరించే బాధ్యత జీ 20 దేశాలకు ఉందని నేను భావిస్తున్నాను.
మనం దీని గురించి ఎక్కువగానే మాట్లాడాం. ఇక పై చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది.

ఫొటో సోర్స్, Fithriyyah Iskandar
ఫిత్రియా ఇస్కాందర్ , 24 సంవత్సరాలు, ఇండోనేసియా
నేను భూమధ్య రేఖ నడినెత్తి పై ఉన్న పోన్ టియాక్ నగరంలో పెరిగాను.
గ్లోబల్ వార్మింగ్ మా జీవితాలను మరింత కష్టతరం చేస్తోంది.
రోజు రోజుకూ వాతావరణం వేడిగా తయారవుతూ ఊహించని రీతిలో మారుతోంది. మూడు రోజుల పాటు చాలా పొడిగా, వేడిగా ఉంటుంది. ఆ తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి.
పశ్చిమ బార్నియోలో భూభాగంలో గట్టి మట్టితో కూడిన నేలలు (పీట్ సాయిల్) ఉంటాయి. దాంతో, ఎండా కాలంలో సులభంగా మంటలు రాజుకుంటాయి.
ఈ మంటలు వేగంగా వ్యాపించిన తర్వాత వాటిని ఆపడం కూడా కష్టమైపోతుంది. దాంతో మంటలు కాలి, భూమి కిందకు కూడా వేడి వ్యాపిస్తుంది.
ఈ నేలల్లో కార్బన్ నిల్వ ఉంటుంది. ఒక్క సారి మంటలు చెలరేగితే, కార్బన్ వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతాయి.
పామ్ ఆయిల్ పంట పండించేందుకు అడవులను నరికేస్తుండటంతో, పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.
2015లో మా ప్రాంతంలో అడవి మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల నుంచి వచ్చిన ధూళి దక్షిణాసియా వరకు విస్తరించింది.
2019లో నేను మా ఊరికి వచ్చేందుకు విమానం ఎక్కాను. కానీ, కనుచూపు మేరలో వాతావరణంలో ఏమీ కనిపించకపోవడంతో, విమానాన్ని వెనక్కి మరలించాల్సి వచ్చింది.
మార్చి మొదట్లో మాకు ఈ కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి ప్రతీ ఏడాది మూడు నెలల పాటూ ఉంటాయి.
నేను మెడికల్ డిగ్రీ పూర్తి అయి, ప్రస్తుతం ఇంటర్న్ షిప్ చేస్తున్నాను. నేను చికిత్స చేసే రోగుల్లో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
మేము వాతావరణంలో గాలి నాణ్యతను తరచుగా లెక్కిస్తూ ఉంటాం. కాలుష్య తీవ్రత పెరగగానే, చాలా మందికి గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తూ ఉంటాయి.
మేము వీధుల్లోకి వెళ్ళేటప్పుడు, కచ్చితంగా మాస్కులు ధరించాలి. ఏటా వచ్చే ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రజలు నెమ్మదిగా నేర్చుకుంటున్నారు.
నేను మా నానమ్మతో కలిసి నివసిస్తాను. నా కుటుంబ ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను.
వాయు కాలుష్యం పెరిగితే, మరింత మంది అనారోగ్యం పాలయి , మరణించే అవకాశం ఉందని ఒక డాక్టరుగా నాకు తెలుసు.

ఫొటో సోర్స్, Sokoita Sirom Ngoitoi
సోకోయిటా సిరోంగోయిటోయ్, 20 సంవత్సరాలు, టాంజానియా
నేను మాసాయి జాతికి చెందిన వ్యక్తిని. ఆఫ్రికాలో ఇదొక దేశీయ తెగ. మేము పాక్షికంగా సంచార జీవన విధానాన్ని పాటిస్తూ ఉంటాం.
మేము పశువులు, మేకలు, గొర్రెలు పెంచుతూ బ్రతుకుతాం.
మాసాయి తెగ వారికి ఒక విభిన్నమైన సంస్కృతి ఉందని నేను భావిస్తున్నాను. మేము మా సంప్రదాయాలను గౌరవిస్తాం.
కానీ, మా తెగకు చెందిన ప్రజలతో పాటూ మా పశువులు కూడా వివిధ రోగాలకు లోనవుతున్నాయి.
నా చిన్నప్పుడు ఆవు నుంచి తీసిన పాలను మరిగించకుండానే నేరుగా తాగేదానిని. కానీ, ప్రస్తుతం మా పిల్లలలా తాగితే జబ్బు పడుతున్నారు.
ఆహార ఉత్పత్తి బాగా తగ్గింది.
వాతావరణం వేడిగా మారిపోతోంది. వర్షం ఎప్పుడొస్తుందో తెలియదు.
మాసాయి మహిళలు మంచి నీటి కోసం కొన్ని మైళ్ళ దూరం నడవాల్సి వస్తోంది.
గాలులతో పాటూ విపరీతమైన ధూళి వస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందేమోనని అనిపిస్తోంది.
వాతావరణ మార్పులు మా జీవన శైలి మార్చుకునేలా ఒత్తిడి చేస్తున్నాయి. వర్షపాతం తగ్గిందంటే ఆకలి పెరుగుతోందని అర్ధం
మా ఉనికి, జీవనం ప్రమాదంలో ఉన్నాయి.
నగరాలకు వలస వెళ్లడం మా జాతికే వినాశనంగా తయారవుతుంది. ఇతర తెగలకు చెందిన మహిళల మాదిరిగా మాసాయి మహిళలు కూడా వ్యభిచారంలోకి నెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడవచ్చు.
అలాంటి పరిస్థితి గురించి ఊహించడం భయానకంగా ఉంది. మా పాటలు, నృత్యం అంతరించిపోతున్నాయి. భవిష్యత్తు తరాలు మా భాష కూడా మాట్లాడలేరు.
ప్రస్తుతానికి మా తెగలో వాతావరణ మార్పుల గురించి పెద్దగా అర్ధం చేసుకోవటం లేదు.
దీని వల్ల కలిగే వినాశకరమైన పరిణామాల గురించి కొంత మందికి మాత్రమే అవగాహన ఉంది.
దీని గురించి కొన్ని స్వచ్చంద సంస్థలు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తూ గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలను నేర్పిస్తున్నాయి.
కరువు ఏర్పడితే మరణించే ప్రమాదం ఉండటంతో ఎక్కువగా పశువులను పెంచవద్దని సలహా ఇస్తున్నారు.
సులభంగా పెంచగలిగే విధంగా తక్కువ సంఖ్యలో ఆవులను ఉంచుకోమని సూచిస్తున్నారు.
అడవులను నాశనం చేయవద్దని చెబుతున్నారు. నేను చెట్లను నాటుతూ, ఇతరులను కూడా ఆ పని చేసేందుకు ప్రోత్సహిస్తున్నాను. మేము సోలార్ పవర్ ను వాడుతున్నాం.
కానీ, ప్రధాన కార్యకలాపాలైన , గనుల తవ్వకం, అడవులను నరకడం, వ్యవసాయ విధానాలు, వ్యర్ధాల నిర్వహణ పట్ల అంతర్జాతీయ స్థాయిలో కొత్త నియమాలు రావాలి.

ఫొటో సోర్స్, Sabrina Oliveira
సబ్రీనా ఒలీవెరా, 19 సంవత్సరాలు,బ్రెజిల్
నా బాల్యం అంతా పెస్ కీరా అనే గ్రామీణ ప్రాంతంలో పెరిగాను. ఇది ఈశాన్య బ్రెజిల్ లో ఉంది.
నేను ప్రస్తుతం పరైబా కు దగ్గర్లో ఉన్న ఏరియా నగరంలో ఉంటున్నాను. ఇక్కడ నేను యూనివర్సిటీలో బయాలజీ చదువుతున్నాను.
ఇక్కడ కరువు వ్యవసాయ భూములను పొడిగా చేస్తోంది. చెట్లు కనిపించటం లేదు. పక్షుల సంఖ్య తగ్గిపోయింది. ఆవులు బక్కపలచగా తయారవుతున్నాయి.
అక్టోబరు నాటికి రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడాలి. కానీ, ఇప్పటి వరకు వర్షాలే పడలేదు.
మా ఊర్లో నీటిని రేషన్ లా వాడే పరిస్థితి రావచ్చు.
ఇక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం, పాలు, చీజ్ అమ్మకం పై ఆధారపడి జీవనం సాగిస్తారు. సాధారణంగా వారికి 5-20 ఆవులుంటాయి. కొందరు ఆవులను ఆహారం కోసం అడవుల్లో వదిలేస్తున్నారు.
ఇక్కడ నీటి కోసం డెలివెరీ ట్యాంకర్లకు సుమారు 45 డాలర్లను (సుమారు రూ. 3300) చెల్లిస్తున్న రైతులను చూశాను.
మా భవిష్యత్తు గురించి చాలా ఆందోళన నెలకొని ఉంది. ఇదే విధంగా నా చుట్టు పక్కల వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు.
భవిష్యత్తులో నీరు ఉంటుందో లేదోనని సందేహపడుతున్నారు.
ప్రకృతి గురించి భయపడుతున్నాం.
రైతులు అధునాతన సాంకేతిక పరికరాలను వాడేందుకు సహకారం అందించే ఒక సంస్థ దగ్గర నేను స్వచ్చందంగా పని చేస్తున్నాను.
అందులో కొందరు అధునాతన సాంకేతికత వాడేందుకు అంగీకరిస్తారు. కానీ, కొందరు మాత్రం అడవులను వ్యవసాయ భూములుగా మార్చేందుకు వాటిని నరికి, కాల్చే ప్రక్రియ వైపే మొగ్గు చూపుతారు.
వాతావరణ మార్పులకు సంబందించిన సమాచారాన్ని చూస్తుంటే, నేను ఆశను కోల్పోతున్నాను.
అడవుల్లో పెరుగుతున్న మంటలు చూస్తుంటే భయంగా ఉంది.
నీటి వినియోగాన్ని నియంత్రించడం, రీసైకిల్, చేయడం, మాంసాహార వినియోగాన్ని తగ్గించడం లాంటివి చేస్తూ మన పాత్ర మనం పోషించాలి.
కానీ, అంతర్జాతీయంగా చూస్తే, పెద్ద పెద్ద సంస్థలే తప్పుచేస్తున్నాయి.
భారీ సంస్థల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సమస్యకు గల మూల కారణాన్ని తెలుసుకుని దానిని పరిష్కరించాలి.

ఫొటో సోర్స్, Opeyemi Kazeem-Jimoh
ఓపేయేమి కజీమ్ జిమోహ్ , 26 సంవత్సరాలు, నైజీరియా
నేను 1995లో లాగోస్ లో పుట్టాను. అదే సంవత్సరంలో బెర్లిన్ లో తొలి క్లైమేట్ సదస్సు జరిగింది.
ప్రపంచ నాయకులు దీని గురించి ఇంకా చర్చిస్తున్నారంటే నాకు చాలా కోపంగా ఉంది.
వాతావరణ మార్పులు జరగడానికి ఆఫ్రికా ప్రధాన పాత్రధారి కాదు. కానీ, వాటి పర్యవసానాలను మాత్రం అనుభవించాల్సి వస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆచరణాత్మక ప్రణాళిక ఉండాలి. కానీ, దానిని ప్రతి ఒక్కరూ స్థానికంగా కూడా పాటించాలి.
నా చిన్నప్పుడు మా బంధువులొకామె వరదల్లో తన ఇంటిని కోల్పోయారు. అదే సమయంలో నా స్నేహితులు కొంత మంది కూడా ఇళ్లను కోల్పోయారు.
వాతావరణ సరళి మారింది. వర్షాలు సమయానికి కురవవు.
గతంలో ఇలా జరగడం అరుదుగా ఉండేది. కానీ, ప్రస్తుతం వరదలు ఎప్పటికప్పుడే వస్తున్నాయి.
నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కొన్ని వాతావరణ మార్పుల పై పని చేస్తున్న స్వచ్చంద సంస్థలతో కలిసి నేను పని చేస్తున్నాను.
ముఖ్యంగా వరద ప్రాంతాల మ్యాప్ ను అప్ డేట్ చేసే పనిలో సహకరిస్తున్నాను.
లాగోస్ బల్లపరుపుగా ఉంటుంది. దాంతో, వరదలను తట్టుకోగలిగే ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి.
మీరొక ఇల్లు కొనుక్కోవాలని అనుకోవడం దీర్ఘకాల నిర్ణయం. అందులో మీరు చాలా డబ్బును వెచ్చిస్తారు. అలాంటప్పుడు పరిస్థితి మరీ కష్టంగా మారుతోంది. ఆ ప్రాంతం మరో పదేళ్లలో లేదా 20 ఏళ్లలో నీటిలో మునిగిపోతుందో లేదో మీకు తెలియలేనప్పుడు ఎలా పెట్టుబడి పెడతారు?
నేను ప్రస్తుత నగరం మ్యాప్ ను 10 ఏళ్ల క్రితం ఉన్న సాటిలైట్ చిత్రాలతో పోల్చి చూసాను.
నివాసిత ప్రాంతాలు, సముద్రానికి మధ్యలోనున్న భూభాగం ఎలా మునిగిపోతుందో కనిపించింది. సముద్రపు నీరు తీరం దాటి ముందుకు వస్తోంది.
మరో దశాబ్దం తర్వాత ఇక్కడ ఎలా నివసించాలో అర్ధం కావడం లేదు.
రైతులకు గతంలో వచ్చినంత పంట దిగుబడి రావడం లేదు. భవిష్యత్తులో తినేందుకు అవసరమైన తిండి కూడా దొరకదేమో అని భయం వేస్తోంది.
ఈ వినాశనాన్ని ఆపేందుకు ప్రజలకు మరింత అవగాహనతో పాటు ప్రభుత్వాలు కూడా మరిన్ని చర్యలు చేపట్టడం అవసరం అని అనిపిస్తోంది.
అదనపు రిపోర్టింగ్: పాబ్లో ఉకోవా
ఇవి కూడా చదవండి:
- సెక్స్: మీ భార్య/భర్తను ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘డబ్బులు ఇవ్వకపోతే మీ కంప్యూటర్లో ఉన్న పోర్న్ వీడియోలు బయటపెడతాం’
- మెనోపాజ్: మలి వయసు మహిళల పోరాటమే ప్రధానాంశంగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్, భారత సమాజం దీని గురించి ఎప్పటికి మాట్లాడగలదు?
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- భారతీయ సంస్కృతిలో స్వలింగ సంపర్కులకు ఆమోదం ఉందా
- ఆన్లైన్ సెక్స్: స్పర్శ లేని లోటును తీరుస్తుందా?
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- వీర్యంలో శుక్రకణాలు లేకపోతే.. మగతనంలో లోపమా? అజూస్పెర్మియా అంటే ఏంటి?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సెక్స్ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించాలా... వారి వృత్తిని చట్టబద్ధం చేయడం సాధ్యమేనా?
- మగవాళ్ల ‘శీలం కాపాడే’ పరికరాన్నిసైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లాక్ చేసే ప్రమాదం
- 'ఈ మగాళ్లంతా కేవలం నిన్ను కోరుకోగలరు... నేను మాత్రమే అనుభవించగలను'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










