ఫ్యాషన్‌కూ పర్యావరణానికీ సంబంధమేంటి... భవిష్యత్తులో దుస్తులు ఎలా ఉండబోతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ టేలర్
- హోదా, బీబీసీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి
గత కొన్ని వారాలుగా మెట్ గలా నుంచి ఎమ్మీస్ వరకు రక రకాల ఫ్యాషన్ ఉత్సవాలు జరుగుతున్నాయి.
కానీ, ఈ ఉత్సవాల్లో కేవలం డిజైనర్ లేబుళ్ల ప్రదర్శన మాత్రమే కాదు, సస్టెయినబిలిటీ గురించి కూడా చర్చకు వస్తోంది.
ప్రస్తుతం సస్టెయినబిలిటీ అనే పదం ఒక భారీ ఫ్యాషన్ స్టేట్మెంట్‌గా మారింది.
ఈ నెలలో జరిగిన మెర్క్యురీ ప్రైజ్ ఉత్సవంలో ఐరిష్ గాయని హన్నా పీల్ అత్యంత పొడి ప్రాంతాల్లో పెంచిన యూకలిఫ్టస్ చెట్ల నుంచి సేకరించిన పదార్ధాలతో తయారు చేసిన పర్యావరణ హితమైన సప్తవర్ణ డ్రెస్ ధరించినట్లు బీబీసీకి చెప్పారు.
ఈ దుస్తులను కిట్టీ జోసెఫ్ అనే డిజైనర్ రూపొందించారు.
"ఇందులో ఎటువంటి రసాయనాలు ఉండవు. దీని తయారీకి సాధారణంగా దుస్తులు తయారీలో వాడే నీటి కంటే 90 శాతం తక్కువ నీటిని వాడతారు. అంతే కాకుండా, ఇది చాలా తేలికగా ఎగురుతోంది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Fashionscapes
లండన్‌లో ఇటీవల ముగిసిన ఫ్యాషన్ వీక్ లో కూడా ఒకసారి ధరించిన దుస్తులను తిరిగి వాడటం అనే విషయం ఒక ఊతపదంగా మారిపోయింది. వ్యర్ధాల నుంచి కూడా దుస్తులను డిజైన్ చేసి రీసైకిల్ చేయడమే ఈ ఫ్యాషన్ వీక్ లో ముఖ్యాంశంగా మారిపోయింది.
సస్టెయినబిలిటీ గురించి వస్త్ర పరిశ్రమ చేస్తున్న హామీలను సాధించగలరో లేదో వెలికి చూసే "ఫ్యాషన్ స్కేప్స్: ఏ సర్క్యులర్ ఎకానమీ" అనే డాక్యుమెంటరీని కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాలలో 10 శాతం , వ్యర్ధ జలాల్లో సుమారు 20 శాతం ఫ్యాషన్ పరిశ్రమ నుంచే విడుదల అవుతున్నాయి. విమానయానం, నౌకాయాన పరిశ్రమలు రెండూ కలిపి వినియోగించే ఇంధనం కంటే వస్త్ర పరిశ్రమ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Boohoo
సస్టెయినబుల్ ఫ్యాషన్‌ను కొనసాగించడం అనేది ఒక నిబద్ధతతో చేయాలంటే ఎక్కువ రోజులు మన్నే దుస్తులను పర్యావరణ హితంగా తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు, వీలైనన్ని చోట్ల వాటిని తిరిగి వాడటం కానీ, లేదా రీసైకిల్ చేసే సామర్ధ్యం కానీ ఉండాలి.
"సస్టెయినబిలిటీ ఫ్యాషన్ ప్రాపంచిక హద్దుల్లో చేయగలిగే పని" అని లండన్ ఫ్యాషన్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఫ్యాషన్ ప్రొఫెసర్ కేట్ ఫ్లెచర్ అన్నారు.
నీటి వినియోగాన్ని, కలుషితం చేయడాన్ని తగ్గించడం, దుస్తులను ఉత్పత్తి చేసేటప్పుడు, ఉతికేటప్పుడు అధిక మొత్తంలో నీరు వినియోగం అవ్వడంతో పాటు కలుషితం కూడా అవుతుంది.
సింథటిక్ దుస్తులు వాడేటప్పుడు, ఉడికేటప్పుడు వెలువడే ఉద్గారాలను తగ్గించాలి.
కాటన్ దుస్తుల తయారీకి వాడే రసాయనాలు, ఎరువులు, క్రిమి సంహారకాలను తగ్గించాలి.
దుస్తులు తయారీలో, లేదా వాటిని పడేస్తున్నప్పుడు వ్యర్ధాలను చెత్తలోకి పంపడం ద్వారా వ్యర్ధాలను పోగు చేయడం తగ్గించాలి.
కార్మికుల దోపిడీ - మారుతున్న ఫ్యాషన్ రంగం కార్మికుల పై కూడా ఒత్తిడిని పెంచుతుంది.
"ప్రస్తుతం సస్టెయినబిలిటీ ఫ్యాషన్ గురించి ప్రచారం అవసరం. ఎందుకంటే, ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ కోసం అల్ప వనరులున్న ఫ్యాషన్ పరిశ్రమ అనంతమైన వినియోగం ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. సామాజిక న్యాయం, అందరినీ సమీకృతం చేయడం లాంటి అంశాలు వ్యాపారానికి హాని కలిగించే అంశాలుగా చూస్తోంది" అని ప్రొఫెసర్ ఫ్లెచర్ బీబీసీతో అన్నారు.
"ఎప్పటికప్పుడు విసిరేసే ఫ్యాషన్ పంథాలను ఆన్‌లైన్‌లో పెంచిన ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్లను సస్టెయినబుల్ ఫ్యాషన్ తిప్పికొడుతోంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లకు డబ్బులిచ్చి మరీ తమ బ్రాండులను ప్రమోట్ చేసుకునే సంస్థలు తమ సంస్థల్లో పని చేసే కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరు, పర్యావరణానికి హాని కలిగించే విధానాల పట్ల చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు
ఈ ఏడాది మే నెలలో రాయల్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ (ఆర్ ఎస్ ఏ) దుస్తుల వెబ్ సైట్లు అమ్మే బూహూ, ప్రెట్టీ లిటిల్ థింగ్, మిస్ గైడెడ్ అండ్ ఆసోస్ లాంటి బ్రాండులు అమ్మిన 10,000 ఉత్పత్తులను పరిశీలించింది.
అందులో, ప్రతీ వెబ్‌సైటులో కొత్తగా చేర్చిన 2500 ఉత్పత్తుల్లో 49 శాతం పాలిస్టర్, ఆక్రిలిక్, నైలాన్, ఎలాస్టిన్ లాంటి ప్లాస్టిక్ పదార్ధాలతో తయారు చేసినవే ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.
ఈ వెబ్‌సైట్లు ఉత్పత్తి చేస్తున్న దుస్తుల పరిమాణం చూస్తుంటే చాలా దిగ్బ్రాంతి కలిగిస్తోంది. అందులో చాలా ఉత్పత్తులు చాలా తక్కువ ధరకు అమ్మడం చూస్తూ ఉంటాం.
"ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ కోసం డిజైన్ చేసిన దుస్తులు వార్డ్‌రోబ్‌లలో ఎక్కువ కాలం ఉండేందుకు తయారు చేయరు" అని అధ్యయన నివేదిక సహ రచయత జోసీ వార్డెన్ చెప్పారు.
"2018లో కొన్న 5 రకాల దుస్తుల్లో 3 తుక్కులో కలిసిపోయాయి" అని క్లీన్ క్లోత్స్ కాంపైన్ చెబుతోంది.
యూకేలో ఉత్పత్తి అయిన లేదా దిగుమతి అయిన దుస్తుల పై ప్లాస్టిక్స్ పన్ను విధించే అవకాశం ఉందేమో పరిశీలించమని ఆర్ ఎస్ ఏ ప్రభుత్వానికి సూచించింది.
ఫ్యాషన్ పరిశ్రమ మారుతోందా?
పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో గో గ్రీన్ అనే అంశం మరో పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఏదైనా బ్రాండును ఎంచుకునే ముందు 67 శాతం మంది షాపర్లు పర్యావరణ హితమైన దుస్తులను ఎంపిక చేసుకుంటున్నట్లు 2020లో
ఫ్యాషన్ రంగంలో సస్టెయినబిలిటీ గురించి ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది.
ఉదాహరణకు 2025కల్లా తాము ఉత్పత్తి చేసే పాలిస్టర్, కాటన్ దుస్తులను రీసైకిల్ చేయడం గాని, అవి తిరిగి వాడేందుకు పనికొచ్చేలా చేయడం గాని చేయడమే తమ వ్యూహమని బూహూ బ్రాండ్ ప్రకటించింది.
అయితే, ఈ లక్ష్యాన్ని చేధించేందుకు ఈ సంస్థ ఒక పర్వతాన్ని అధిరోహించేంత పని ఉందని ఆర్ ఎస్ ఏ నివేదిక చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నివేదిక మరి కొంత మంది ప్రధాన రిటైలర్లు చేసిన పర్యావరణ హిత హామీలను కూడా పరిశీలించింది.
2030 కల్లా తాము ఉత్పత్తి చేసే 100 శాతం ఉత్పత్తులు రీసైకిల్ చేసేవి కానీ, లేదా పర్యావరణ హితంగా సేకరించినవే ఉంటాయని ప్రముఖ బ్రాండ్ హెచ్ & ఎమ్ ప్రకటించింది.
2022 కల్లా 50 శాతం ఉత్పత్తులను పర్యావరణ హితంగా సేకరిస్తామని మ్యాంగో కూడా ప్రకటించింది.
ప్రముఖ బ్రాండులన్నీ 2020 సస్టైనబిలిటీ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని సంతకం చేయడంతో పాటు, సర్కులర్ ఫ్యాషన్ భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ ఫ్యాషన్ ఏజెండాను రూపొందించేందుకు ఐక్యమయ్యాయి. కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి బయటపడేందుకు మరింత పర్యావరణ హితమైన పరిష్కారాలు సాధించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కానీ, ఈ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలన్నీ వ్యాపారంలో విస్తృతంగా మార్పు తేవడానికి బదులు ప్రస్తుతం నడుస్తున్న మార్కెటింగ్ ట్రెండ్ ను ఉపయోగించుకోవడానికే కానీ, ఇవన్నీ కంటితుడుపు చర్యలని కొంత మంది హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ మొత్తం అంశంలో మూడు విషయాల గురించి అప్రమత్తంగా ఉండాలను బీబీసీ స్కాట్లాండ్ కాన్షియస్ క్లోజెట్ సిరీస్ చెబుతోంది.
మాటలు కాదు చర్యలు కావాలి
సస్టెయినబిలిటీ అని చెబుతున్న పదాలకు నిర్దిష్టమైన, చట్టబద్ధమైన నిర్వచనం లేదు. ఏదైనా బ్రాండు చేస్తున్న వాదనలకు చూపిస్తున్న ఆధారాల గురించి సదరు బ్రాండ్ వెబ్ సైటును పరిశీలించాలి.
ఆ బ్రాండ్ అందించే ఉత్పత్తులను పూర్తిగా పరిశీలించాలి. అందులో ఉన్న సస్టైనబుల్ అంశాన్ని పరిశీలించాలి.
ఏదో ఒక కలెక్షన్ తేవడం మొత్తం మార్పు జరుగుతున్నట్లు కాదు.
సస్టెయినబిలిటీ నైతికంగా ఉండాలనే నియమం ఏమి లేదు. ఈ ఉత్పత్తుల తయారీలో కూడా కార్మికుల దోపిడీ జరిగే అవకాశం ఉంది.
బ్రాండులు అనుసరిస్తున్న సస్టైనబిలిటీ చర్యలు కంటి తుడుపు చర్యలని చేసే హెచ్చరిక గురించి అభిప్రాయాన్ని కోరుతూ బీబీసీ బూహూ, ప్రెట్టీ లిటిల్ థింగ్, మిస్ గైడెడ్ , ఓ పోలీ లాంటి చాలా బ్రాండులను సంప్రదించింది.
కిట్టీ జోసెఫ్ రూపొందించిన డిజైన్లు దుస్తులను రీసైకిల్ చేయడం కంటే కూడా వాటి గురించి పూర్తిగా కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి.
"ఈ దుస్తుల తయారీలో వాడిన 99 శాతం నీరు, ఇతర పదార్ధాలను తిరిగి వినియోగించినట్లు లేబుల్ ప్రతినిధి చెప్పారు
అలాగే, దుస్తులను బ్లీచింగ్ చేసేందుకు క్లోరిన్ రహిత పదార్ధాలను వాడినట్లు తెలిపారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తామని హామీ ఎందుకివ్వాలి?
"పర్యావరణ పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో తలెత్తిన మహమ్మారి వనరుల వినియోగం పై హద్దులు విధించి సంస్థలు తమ దీర్ఘ కాల వ్యూహాలను తిరిగి ఆలోచించుకునేలా చేసింది" అని సస్టైనబుల్ ఫ్యాషన్ లేబుల్ డిప్లాయ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ బెర్నీస్ పాన్ చెప్పారు.
"ఇక మీదట పరిమాణం, వేగం మాత్రమే కాదు. కేవలం పరిమాణం పెంచడం వల్ల సంస్థలు అభివృద్ధి చెందవు" అని ఆమె అన్నారు.
ఇందులో వినియోగదారునికున్న లాభమేంటి?
వినియోగదారులకు కావల్సిన నాణ్యత, విభిన్నత, ఫ్యాషన్, వాడకం పై లక్ష్యం పెట్టడం వల్ల అధిక విలువ వస్తుందని ఆమె అంటారు.
అంటే, దుస్తులను తిరిగి వాడే విధంగా, రక రకాల అవసరాలకు వాడే విధంగా రూపొందించాలి.
ఎవరికైనా స్కర్టును ఇస్తే, దానిని మరొక కొత్త టాప్‌తో కలిసి ధరించగల్గడం లాంటివి చేయాలి దాంతో, అది మరొక కొత్త డ్రెస్ గా తయారవుతుందని ఆమె అంటారు. ఈ మార్పు రావాలని అన్నారు.
డి పాప్ లాంటి వింటేజ్, సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు కూడా దుస్తుల మన్నికను పెంచాయి.
ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ లో ఉండే కళాత్మక మైన సామాజిక అంశాలను మేళవించి ఈ -బే తరహాలో, కొనుగోలు, అమ్మకం అవకాశాలను కల్పించింది.
2011లో మొదలుపెట్టిన ఈ సైటుకి ప్రస్తుతం 147 దేశాల నుంచి 15 మిలియన్ లకు పైగా వినియోగదారులున్నారు.
లాక్ డౌన్ లో దీని డిమాండ్ మరింత పెరిగింది.
ఈ ఆన్ లైన్ స్పేస్ ఈ-బే ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడానికి డిపాప్ మాత్రమే కాకుండా చాలా రకాల సెకండ్ హ్యాండ్ దుస్తుల వర్తకులు ఉన్నారు.
వాడి తీసేసిన దుస్తులను అమ్మేందుకు, కొనేందుకు అసోస్ కూడా ఈ-బే తరహాలో స్పేస్ అందిస్తోంది.
సస్టెయినబిలిటీ ఫ్యాషన్ ను ఆపుతున్నదేంటి?
అయితే, సస్టైనబుల్ ఫ్యాషన్ ను అందరూ భరించలేరు. అందుకు దాని ఖరీదే కారణం. ఇది వినియోగదారులకు, ఫ్యాషన్ లేబుళ్ళకు కూడా ఖరీదైన వ్యవహారమే.
ఉదాహరణకు హన్నా ధరించిన దుస్తులు కొన్ని వందల పౌండ్లు ఖరీదు చేస్తుంది
ఈ ఉత్పత్తులను తయారు చేసేందుకు అయ్యే ఖర్చు వల్ల ఇవి ఖరీదు ఉంటాయని పాన్ చెప్పారు.
"అలాగే, ఇవి తయారు చేసేందుకు అధునాతన సాంకేతికతను కొనుక్కోవడానికి తగినన్ని బ్రాండులు లేకపోవడంతో కూడా ఇంకా పూర్తిగా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేలేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
బూహూ, ఓ పోలీ లాంటి బ్రాండ్లు వినియోగదారుల డిమాండు కోసం ఉత్పత్తులను వేగంగా తయారు చేసేవి.
"అయితే, బాధ్యతా రాహిత్యంగా తయారు చేసే ఉత్పత్తులను వినియోగదారులు తిరస్కరించినప్పుడే, బ్రాండులకు మరో అవకాశం లేక కొత్త విధానాలకు అలవాటు పడి అవలంబించడం మొదలు పెడతారు" అని పాన్ అభిప్రాయపడ్డారు.
"ఒక టీ షర్టును 10 పౌండ్లకు కొంటే దాని వల్ల పర్యావరణానికి, సమాజానికి కలిగే హాని అంత కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.
భవిష్యత్తును విషపూరితం చేస్తుందనే ఆందోళన ఉన్నప్పటికీ కూడా వాడి తీసేసే వాటికి మనం వెచ్చించాలని అనుకుంటున్నామా? లేదా పర్యావరణ హితంగా, కార్మికులను మెరుగ్గా చూసిన కొన్ని వస్తువులను కొనుక్కోవడంలో ఆనందం పొందుతామా" అని ప్రశ్నించారు.
పచ్చని భవిష్యత్తు
అయితే, వినియోగదారుల్లో కూడా ఈ తరహా ఉత్పత్తుల గురించి ప్రభుత్వం అవగాహన పెంచడం వల్లే మార్పుకు కీలకం అని పాన్ అన్నారు.
సంప్రదాయ తరహాలో దుస్తులమ్మే రిటైలర్లను మహమ్మారి వల్ల బాగా దెబ్బ తిన్నారు. నవంబరులో జరిగిన సిఓపి 26 పర్యావరణ సదస్సు సస్టైనబుల్ ఫ్యాషన్ గురించి చర్చించింది.

ఫొటో సోర్స్, Getty Images
"ఈ పరిశ్రమను అధిక ఉత్పత్తి , వినియోగదారుల అవసరాలను తప్పుగా అంచనా వేయడం, హానికారక పని విధానాల్లాంటి అంశాలు బాధపెడుతున్నాయనేది అందరూ అంగీకరించే విషయం" అని ఫోర్బ్స్ పత్రిక రాసింది.
అయితే, వీటికి పరిష్కారాలు సాంకేతికత, పెట్టుబడులు, పరిశ్రమలో సహకారం పై ఆధారపడి ఉంటాయి. ఈ పరిశ్రమ కూడా పూర్తిగా నియంత్రణ లేకుండా ఉంది.
అయితే వినియోగదారుని నుంచి వచ్చే డిమాండ్ వల్ల గానీ లేదా ఒక నైతిక అవసరం దృష్ట్యా పరిశ్రమ తన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది"
ఈ వ్యాఖ్యతో ప్రొఫెసర్ ఫ్లెచర్ అంగీకరిస్తున్నారు. "ఫ్యాషన్ భవిష్యత్తు చాలా ఉత్సాహకరంగా ఉంది" అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఉన్నదాని కంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఫ్యాషన్ పరిశ్రమ పాత్ర మరింత తగ్గుతుంది.
దీని స్థానంలో పర్యావరణ హితంగా ఫ్యాషన్ ఉనికిని ప్రదర్శించేందుకు చిన్న చిన్న విభిన్నమైన ఫ్యాషన్ వ్యూహాలు అందుబాటులోకి వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












