తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్‌ను కైవసం చేసుకున్న తరువాత నా జీవితం ఎలా అయిపోయిందంటే..

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సోఫీ విలియమ్స్
- హోదా, బీబీసీ న్యూస్
తాలిబాన్‌లు అధికారంలోకి రావడంతో అఫ్గానిస్తాన్ ప్రజల జీవితాలు తలకిందులైపోయాయి.
తాలిబాన్‌లకు ముందు, వారు అధికారంలోకి వచ్చిన తరువాత జీవితాలు ఎలా మారాయంటూ ఓ రిపోర్టరు ఇటీవల అక్కడి ప్రజలను అడిగారు. ఆ ప్రశ్నకు వచ్చిన జవాబులు అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో వివరిస్తున్నాయి.
ఆఫీసుల్లో పనిచేసుకునేవారి నుంచి యాక్టివిస్టుల వరకు అనేక మంది తమ జీవితాలలో వచ్చిన మార్పులను చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. అలాంటి కొందరితో బీబీసీ మాట్లాడింది.
అహ్మద్: జీవితం కష్టమైపోతోంది
అహ్మద్ 2019 సెప్టెంబరు నుంచి తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చే వరకు అఫ్గానిస్తాన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో అహ్మద్ ఆఫీస్ మేనేజరుగా పనిచేసేవారు.
''నేను ఉద్యోగం చేస్తూ నా చెల్లెళ్ల చదువుకు ఆర్థికంగా సాయపడుతుండేవాడిని. నాకు మంచి జీతమే వస్తుండేది. నా కుటుంబానికి ఆ డబ్బు సరిపోతుండేది. కొంత ఇంటికి పంపించి కొంత పొదుపు చేస్తుండేవాడిని'' అని బీబీసీతో చెప్పారు అహ్మద్.
ఆఫీసులో తనకు చాలామంది స్నేహితులుండేవారని.. తనతో పాటు అందరి ఉద్యోగాలు పోయాయని అహ్మద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Ahmed
''ఇప్పుడు నా జీవితం కష్టతరమైపోయింది. నాకు ఉద్యోగం పోవడంతో ఆదాయం పోయింది. కుటుంబం గడవడం కష్టమవుతోంది'' అన్నారు అహ్మద్.
అహ్మద్ తండ్రికి 60 ఏళ్లుంటాయి. వయసు, మోకాళ్ల సమస్యల కారణంగా ఆయన పనిచేయలేరు. తన తండ్రికి తానొక్కడినే కుమారుడినని, తనే పెద్దవాడినని.. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత, తన చెల్లెళ్ల బాధ్యత తనదేనని అహ్మద్ చెప్పారు.
అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయాయని అహ్మద్ చెప్పారు.
జహ్రా: జీవితం జీవితంలా లేదు
తాలిబాన్లు అధికారంలోకి రావడానికి ముందు వరకు జహ్రా యూనివర్సిటీలో చదువుకునేది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత ఆమె క్లాసులు ఆగిపోయాయి.
''నేను మెడికల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నా జీవితం బాగుండేది'' అన్నారామె.
''యూనివర్సిటీలో ప్రవేశం కోసం అనుకున్న స్కోర్ పొందడానికి రెండేళ్లు కష్టపడ్డాను.. కానీ, ఇప్పుడు ఉత్త చేతులతో తిరిగిరావాల్సి వచ్చింది'' అన్నారామె.
''ఇప్పుడు బతుకుతున్నది బతుకు కాదు. ఏ ప్రయోజనం లేకుండా బతుకుతున్నాం అంతే'' అన్నారామె.
తాను స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఎన్‌రోల్‌మెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న కాలంలో తాను కలలు కన్న జీవితానికి ఇప్పటి తన జీవితానికి అంతా మారిపోయిందని జహ్రా చెప్పారు.
''నా విద్యార్థి జీవితాన్ని కోల్పోయాను. నా స్నేహితులతో కలిసి చదువుకోవడాన్ని నేను ఇష్టపడేదాన్ని'' అన్నారామె.
ఇప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నానని.. బయటకు వెళ్లలేకపోతున్నానని చెప్పారామె.
''నా ఇంగ్లిష్‌ను మెరుగుపరచుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి కృషి చేస్తున్నాను. కానీ, పరిస్థితులు మాత్రం నిరుత్సాహకరంగా ఉన్నాయి. కానీ, ఏదో ఒక రోజు మళ్లీ నేను చదువుకోగలుగుతాను" అన్నారు జహ్రా.

ఫొటో సోర్స్, Sana
సనా: ఇదో పీడకల అయితే బాగుణ్ను
సనా అఫ్గానిస్తాన్‌లో మహిళా హక్కుల కోసం పోరాడేవారు. ''తాలిబాన్లు రావడానికి ముందు కూడా చాలా హక్కులు ఉండేవి కావు. కానీ, స్వాతంత్ర్యం ఉందన్న సంతోషం ఉండేది'' అన్నారు సనా.
''మేం చదువుకోగలిగేవాళ్లం. ఉద్యోగాలు చేసేవాళ్లం. స్నేహితులతో బయటకు వెళ్లేవాళ్లం. అంతా కలిసి కూర్చుని చర్చించుకునేవాళ్లం.. హాయిగా నవ్వుకునేవాళ్లం'' అంటూ తాలిబాన్లు రావడానికి మునుపటి రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు.
''మా హక్కులు సాధించుకోవడానికి పోరాడేవాళ్లం. చట్టాలలో మార్పుకోసం ప్రయత్నించాం. కానీ, ఒక్కసారిగా అంతా మారిపోయి మా సొంతదేశం నుంచే బయటకువెళ్లిపోయాం'' అన్నారు సనా.
సనా ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నారు. ఆమెకు జర్మనీ వీసా వచ్చింది కానీ ఇంకా అక్కడకు వెళ్లలేదు.
''జరుగుతున్నదంతా ఒక పీడకలగా మిగిలి నేను నిద్రలేచి ఇంటికి వెళ్లిపోతే బాగుణ్ననిపిస్తోంది. మాతృదేశానికి దూరంగా ఉండడం కష్టంగా ఉంది''
''నేను నా దేశం నుంచి వలస వచ్చాను కానీ నా ఆత్మ అక్కడే ఉంది. అయితే, ఆది గాయపడింది'' అన్నారు సనా.
సయాద్: ఆ రోజు మధ్యాహ్నం ఏమైందంటే..
సయీద్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లోని ఒక ప్రధాన మీడియా సంస్థలో యాంకర్ ఆయన.
''జర్నలిస్టుగా నా వృత్తి జీవితాన్ని నేను కోల్పోయాను. కెరీర్‌లో ముందుకెళ్లాలన్న నా కలలన్నీ ఇంటికెళ్లిపోయాయి'' అన్నారు సయీద్.
కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న రోజున సయీద్ ఆఫీసులోనే ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అంతా మారిపోయింది.
''మా ఆఫీసు దాదాపు ఖాళీ అయిపోయింది. మహిళా ఉద్యోగులంతా ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. మా టెక్నికల్ టీం వాళ్లు యూనిఫాం మార్చేసి సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించారు'' అని చెప్పారు.
సయీద్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, ఆయన కుటుంబం మాత్రం అఫ్గానిస్తాన్‌లోనే ఉండిపోయింది.
'గత 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, త్యాగాలు అన్నీ వృథా అయిపోయాయి. నా ఆశలు, కలలు సహా అన్ని కొద్ది గంటల్లోనే నాశనమైపోయాయి'' అంటూ ఆయన ఆవేదన చెందారు.
(ఈ కథనంలో పేర్కొన్న వ్యక్తులందరి పేర్లు గోప్యత కోసం మార్చాం)
ఇవి కూడా చదవండి:
- వాతావరణాన్ని కాపాడేందుకు మీ వంతుగా చేయాల్సిన నాలుగు పనులు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- పునీత్ రాజ్‌కుమార్ మరణం: జిమ్‌లో ఈ తప్పులు చేయకండి
- భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండా, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








