Climate Change: వాతావరణాన్ని కాపాడేందుకు మీ వంతుగా చేయాల్సిన నాలుగు పనులు

cop26

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రపంచ నాయకత్వం అంతర్జాతీయ స్థాయిలో కార్యాచరణ చేపట్టాల్సి ఉంది.

అదే సమయంలో వ్యక్తులుగా మనమందరం ఉద్గారాల నియంత్రణకు మన వంతు కృషి చేయాలి.

వ్యక్తిగత స్థాయిలో పర్యావరణంపై దుష్ప్రభావాన్ని నివారించేందుకు మనం చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం.

వీడియో క్యాప్షన్, 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జీవితం ఎలా ఉంటుందంటే..

1) ఇంటి ఉష్ణోగ్రతలను సులభ పద్ధతుల్లో అదుపు చేయడం

సరైన హీట్ పంప్ అమర్చుకోవడం దగ్గర నుంచి ఇంట్లో చేసుకునే అనేక మార్పులు భూమికి మేలు చేస్తాయి.

''గ్యాస్ లేదా ఆయిల్‌తో పనిచేసే హీట్ పంప్‌లకు బదులు విద్యుత్‌తో పనిచేసే హీట్ పంప్‌లు వాడడం మంచిది'' అని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన విద్యావేత్త డాక్టర్ నీల్ జెనింగ్స్ చెప్పారు.

''అవసరం లేనప్పుడు లైట్లు, గృహోపకరణాలను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల వాతావరణ మార్పులపై పడే ప్రభావం తగ్గడమే కాకుండా డబ్బుకూడా ఆదా అవుతుంది' అంటారు నీల్ జెనింగ్స్.

ప్రజలు ఇళ్లలో హీట్ పంప్స్ ఏర్పాటు చేసుకోవడానికి యూకే ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి 5 వేల పౌండ్ల (సుమారు రూ. 5 లక్షల) చొప్పున మంజూరు చేయనుంది.

ఇళ్లలో గోడలు, పైకప్పు, కిటికీలు వంటివి ఉష్ణ నిరోధకంగా మార్చుకోవచ్చు.

విద్యుత్/ఇంధన వినియోగం తగ్గించడానికి చౌకైన మార్గం డ్రాట్ ప్రూఫింగ్(శీతల దేశాల్లో బయట చల్లదనం ఇంట్లోకి రాకుండా చేసుకునే విధానం).

గోడల్లో చిన్నచిన్న పగుళ్లు లేకుండా చూడడం.. కిటికీలు, తలుపుల చుట్టూ ఉన్న ఖాళీలలోంచి బయటి చల్లగాలి లోనికి వచ్చి లోపలి వేడి గాలి బయటకు పోయే అవకాశాన్ని తగ్గిస్తే ఇంటిని వెచ్చగా మార్చుకోవడానికి విద్యుత్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది.

carbon footprint

2) ఆహార వృథా ను, పశుమాంస వినియోగాన్ని తగ్గించడం

గ్రీన్ హౌస్ ఉద్గారాలలో 14 శాతం పెంపుడు పశుపక్ష్యాదుల కారణంగా వెలువడుతున్నాయి. ఇందులో పశుసంపద పాత్ర మరీ అధికం.

దీన్ని తగ్గించాలంటే మన ఆహారంలో పాడి ఉత్పత్తులు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు వంటి వాటి మాంసాన్ని వినియోగించడం మానేయాలి.

ఏ ఆహార పదార్థం కార్బన్ ఫుట్‌ప్రింట్ గమనించినా.. అది ఎలా ఉత్పత్తవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుందనే అంశాలపై ఆధారపడి ఉంటుందని అబెర్డీన్ యూనివర్సిటీ బయాలజిస్ట్ ప్రొఫెసర్ మార్గరెట్ గిల్ చెప్పారు.

ప్రపంచంలో ఉత్పత్తువుతున్న ఆహారంలో 25 నుంచి 30 శాతం వృథా అవుతున్నట్లు 'వేస్ట్ అండ్ రిసోర్స్ యాక్షన్ ప్రోగ్రాం' అధ్యయనాలు చెబుతున్నాయి.

కాలుష్యం దేనివల్ల ఎంత?

3) కార్లు మానేయండి... విమాన ప్రయాణాలు తగ్గించండి

ప్రపంచ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలలో 25 శాతం రవాణా వల్ల వెలువడుతున్నవే.

కార్లు వాడడం మానేస్తే రవాణా వల్ల వెలువడే కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోతుందని డాక్టర్ నీల్ జెనింగ్స్ చెబుతున్నారు.

అయితే, సరైన ప్రజారవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఉండేవారు, రాత్రి షిఫ్టులలో పనిచేసేవారు కార్ల వాడకం మానేయడం కుదరకపోవచ్చు.

చిన్నచిన్న పనులే పెద్ద ప్రభావం చూపిస్తాయి. మన ఇంటికి దగ్గర్లోని దుకాణాలకు నడుచుకుంటూ వెళ్లడం, సైకిళ్లపై వెళ్లడం వంటివి పర్యావరణానికి మేలు చేస్తాయి.

స్నేహితులు, ఇరుగుపొరుగువారితో కార్లు షేర్ చేసుకోవడం వంటివీ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతో ఉపకరిస్తాయి.

ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరుగుతోంది. అయితే, ఇప్పటికీ వాటి ధరలు ఎక్కువగానే ఉండడంతో అందరూ వాటి వైపు మొగ్గు చూపడం లేదు.

అయితే, ఎలక్ట్రిక్ కార్లను చార్జింగ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ కూడా సౌర విద్యుత్, పవన విద్యుత్ అయినప్పుడే మన ప్రయాణాన్ని అసలైన గ్రీన్ ట్రావెల్‌గా చెప్పుకోవచ్చు.

2020లో యూకే విద్యుదుత్పత్తిలో 58 శాతం తక్కువ కర్బన వనరుల నుంచే ఉత్పత్తయింది.

అయితే, వ్యక్తిగతంగా ఎంత చేసినా తరచూ దూర ప్రయాణాలు చేసేవారు విమానం ఎక్కుతున్నారు. ఒక వ్యక్తి ప్రయాణం కారణంగా కిలోమీటరుకు సగటు ఉద్గారాలను లెక్కించి అందుకు కారణాలు విశ్లేషిస్తే దేశీయ విమాన సర్వీసులే అందుకు ప్రధాన కారణమవుతున్నాయి.

దేశీయ ప్రయాణాలకు విమానాలకు బదులు రైళ్లను ఎంచుకుంటే పర్యావరణంపై ప్రభావాన్ని అయిదో వంతు మేర తగ్గించొచ్చు.

షాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

4) ఏదైనా కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి

యూఎన్ ఎన్విరానమెంట్ ప్రోగ్రాం అంచనాల ప్రకారం... ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 3,781 లీటర్ల నీరు ఖర్చవుతుంది. పత్తి పంట కోసం అవసరమయ్యే నీరు, దుస్తుల తయారీ సమయంలో వాడే నీరు, రవాణా, ఉతకడానికి అవసరమయ్యే నీరు అన్నిటినీ లెక్కేసి సగటున రూపొందించిన అంచనా ఇది.

తరచూ కొత్త దుస్తులు కొనే బదులు పాతవి బాగుచేసుకుని వాడుకోవడం మంచిది.

పాత దుస్తులు కూడా పడేయకుండా అవసరమైనవారికి ఇవ్వడం మంచిది.

ఫ్యాషన్ ఇండస్ట్రీలో వ్యర్థాలను నియంత్రించే లక్ష్యంతో చాలా సంస్థలు దుస్తులు అద్దెకు ఇస్తున్నాయి. ప్రతిసారీ కొత్త దుస్తులే కొనకుండా పాతవీ కొని చూడండి.

గృహోపకరణాలు సరైనవి ఎంచుకోవడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అత్యధిక ఇంధన దక్షత ఉన్న వస్తువులే కొనాలని డాక్టర్ నీల్ జెనింగ్స్ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)