రైతుల ఆందోళన: భారత వ్యవహారాలలో కెనడా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?

రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై భారతదేశంలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలుకుతూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ప్రధాని ట్రూడోతోపాటు కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత ఎరిన్‌ ఊటూల్‌ కూడా రైతుల విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ మాట్లాడారు. “శాంతియుత నిరసనలకు కెనడా మద్దతు పలుకుంది” అని సోమవారం ట్రూడో వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్‌లను పడగొట్టి దిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రైతులు తమను అడ్డుకున్నచోటే కూర్చుని ఆందోళనకు కొనసాగిస్తున్నారు.

నిరసనలపై వెనక్కు తగ్గని రైతుల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు ఒక దఫా చర్చలు జరిపింది. అయితే తొలి దశ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. సుమారు 50వేలమంది రైతులతో రెండు ప్రధాన రైతు సంఘాలు ఆందోళనకు చేస్తున్నాయి.

అయితే, కెనడాలో జరిగిన గురునానక్‌ జయంతి ఉత్సవాలలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో రైతులపై పోలీసులు దాడుల గురించి మాట్లాడారు. ఐదులక్షలమంది రైతులను పట్టించుకోకపోతే అది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వ్యాఖ్యానించారు.

“రైతులు,వారి కుటుంబాల పరిస్థితిపై మేం ఆందోళన చెందుతున్నాం. చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చని మేం భావిస్తున్నాం. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా భారత ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం’’ అన్నారు ట్రూడో

ట్రూడోతో గొంతు కలిపిన ప్రతిపక్ష నేత ఎరిన్‌ ఊటూల్‌ ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు అంటూ రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.

అయితే కెనడా ప్రధాని, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇద్దరు నేతలు ఈ ఆందోళనపై నిజమైన సమాచారం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది.

“ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ముఖ్యంగా అది ఒక దేశపు అంతర్గత వ్యవహరాలపై అసలే చేయకూడదు’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ అన్నారు.

“దౌత్య వ్యవహారాలలో రాజకీయ ప్రయోజనాల ప్రభావం పడకుండా చూసుకోవడం మంచిది” అని అనురాగ్‌ వ్యాఖ్యానించారు. అయితే భారత విదేశాంగ శాఖ ప్రతి స్పందనపై వ్యాఖ్యానించడానికి ప్రధాని ట్రూడో కార్యాలయం నిరాకరించింది.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

ట్రూడో వ్యాఖ్యలపై భిన్న స్పందనలు

జస్టిన్‌ ట్రూడో ప్రకటనపై భారత సోషల్‌ మీడియాలో అనుకూల, వ్యతిరేక కామెంట్లు వినిపించాయి. “కెనడా ప్రధాని ట్రూడో నిరసన తెలిపే హక్కు గురించి మాట్లాడటం చాలా సంతషకరం. ఇది దేశ అంతర్గత వ్యవహారం అనే వారికి దాని విలువ తెలియదు” అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేశారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ వీర్‌ సింఘ్వీ ట్రూడో ప్రకటనను తప్పుబట్టారు. “రైతుల ఆందోళనపై నా అభిప్రాయం ఏదైనా, ట్రూడో ప్రకటన నాకు నచ్చలేదు.ఆయన మాటలకు ప్రపంచ వేదికలపై ఎలాంటి మెప్పురాదు. తన దేశంలోని సిక్కులను సంతృప్తిపరచడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు” అని సింఘ్వీ ట్వీట్‌ చేశారు.

"భారతదేశంలో మాకు ఎన్నో అభిప్రాయభేదాలుంటాయి. ఉదాహరణకు నేను ఈ ప్రభుత్వ అభిమానిని కాదు. కానీ ఈ వివాదాన్ని అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి అనే విధానాన్ని సమర్ధిస్తాను. ప్రభుత్వానికి వ్యతిరేకి అయినందున విదేశీయుల జోక్యాన్ని కొందరు సమర్ధించడం సిగ్గుచేటు” అని సింఘ్వీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఒక దేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడకూడదనే పరిమితిని ట్రూడో ఉల్లంఘించారని వీర్‌సింఘ్వి అభిప్రాయపడ్డారు. “భారతదేశంతో సత్సంబంధాల గురించి కాకుండా తన దేశంలోని సిక్కులను సంతోషపెట్టాలని ట్రూడో భావిస్తున్నట్లున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ప్రకటనలు రావడంలో ఆశ్చర్యం లేదు” అని సింఘ్వీ అన్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు నిరసనలు చేపట్టారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు నిరసనలు చేపట్టారు

“భారతదేశంలోని చాలామంది నాయకులు జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాలను అవలంబిస్తున్నారు. మన అంతర్గత వ్యవహారాలు నిర్వహించాలో చెప్పే హక్కు మరెవరికీ ముఖ్యంగా పశ్చిమ దేశాలకు ఎంత మాత్రం లేదు" అన్నారు సింఘ్వీ

ఇటు దేశలోని పలువురు రాజకీయ నాయకులు కూడా ట్రూడో వ్యాఖ్యలను దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా అభివర్ణించారు.“నేను మోదీ ప్రభుత్వ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకం. అలాగని మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కును కెనడా ప్రధాన మంత్రికి ఇవ్వలేను’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ట్వీట్‌ చేశారు.

అయితే మోదీ అమెరికా వెళ్లి ట్రంప్‌కు మద్దతు పలికినప్పుడు, ట్రూడోను తప్పుబట్టడం ఏమాత్రం సబబని కొందరు సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు. ట్రూడో వ్యాఖ్యలు భారత ప్రభుత్వ దౌత్య వైఫల్యమని మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్‌ సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో జరిగిన టాక్ షోలో అన్నారు.

“కెనడా ప్రధానికి నిజాలు తెలియవని ప్రభుత్వం అంటోంది. కానీ రైతులు నిజం చెప్పడానికి దిల్లీ వస్తుంటే అడ్డుకుంటున్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని మాత్రమే ట్రూడో చెప్పారు. అయితే ట్రూడో దీన్ని సరైన పద్దతిలో చెప్పలేదన్నది నిజం. ఆయన అమెరికా నల్లజాతీయుల సమస్యలపై కూడా మాట్లాడారు. రేపు బైడెన్‌ కూడా వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అప్పుడు కూడా ప్రశ్నిస్తారా’’ అని కేసీ సింగ్‌ వ్యాఖ్యానించారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

సిక్కు వేర్పాటువాదం- కెనడా రాజకీయాలు

కెనడాలో సిక్కు ఓటు బ్యాంకు చాలా కీలకమైంది. వీరి ఓట్ల కోసం ట్రూడో లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్‌ పార్టీ, జగ్మీత్‌ సింగ్ న్యూ డెమోక్రటిక్‌ పార్టీ ప్రయత్నిస్తుంటాయి. ఇక్కడి సిక్కు జనాభా దాదాపు 5 లక్షల వరకు ఉంది. భారత, కెనడా సంబంధాలపై సిక్కు వేర్పాటువాదం ప్రభావం చాలా ఉంది.

సిక్కు వేర్పాటువాదానికి ట్రూడో మద్దతు పలుకుతున్నారన్న ఆరోపణలున్నాయి. తన మంత్రి వర్గంలో ఉన్నంతమంది సిక్కులు భారత ప్రభుత్వ మంత్రివర్గంలో కూడా లేరని 2015లో ట్రూడో వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 2018లో ట్రూడో ఏడు రోజుల పర్యటనకు భారతదేశానికి వచ్చారు. అయితే ఆయన పర్యటనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విస్తీర్ణపరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన కెనడా ప్రధాని పర్యటనకు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని భారత, విదేశీ మీడియాలలో కథనాలు వెలువడ్డాయి.

ట్రూడో కార్యక్రమంలో సిక్కు వేర్పాటువాదులు

1986లో కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి పంజాబ్ క్యాబినెట్ మంత్రిగా మల్కియత్‌ సింగ్‌ సిద్దూ వెళ్లారు. కెనడాలో సిక్కు వేర్పాటువాది జస్పాల్‌ సింగ్ అట్వాల్‌ మల్కియత్‌ సింగ్‌ హత్యకు ప్రయత్నించారు. ఆయన జరిపిన కాల్పుల నుంచి మల్కియత్‌ సింగ్‌ తప్పించుకున్నారు. ఈ హత్యయత్నం చేసింది జస్పాల్‌ సింగేనని తేలింది.

ట్రూడో 2018లో భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేవారి జాబితాలో జస్పాల్‌ సింగ్‌ పేరు కూడా ఉండటం వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 20న ముంబైలో కెనడా ప్రధానమంత్రి ట్రూడో భార్య పాల్గొన్న ఒక కార్యక్రమంలో జస్పాల్‌ సింగ్‌ కనిపించారు. తన కారణంగా ప్రధాని ట్రూడో భారత పర్యటనలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని జస్పాల్‌ సింగ్‌ అన్నారు.

కెనడాలో సిక్కులను సంతృప్తిపరచడానికి ట్రూడో భారత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేశారని విమర్శలు వినిపించాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడాలో సిక్కులను సంతృప్తిపరచడానికి ట్రూడో భారత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేశారని విమర్శలు వినిపించాయి

సిక్కులు కెనడాకు ఎలా వెళ్లారు?

1897లో విక్టోరియా రాణి బ్రిటిష్‌ భారతీయ సైనికుల బృందాన్ని డైమండ్ జూబ్లీ వేడుకలో పాల్గొనడానికి లండన్‌కు ఆహ్వానించారు. బ్రిటన్‌ రాణితో కలిసి బ్రిటీష్‌ కొలంబియాకు వెళ్లిన అశ్వికదళంలో మేజర్‌ కేసర్‌ సింగ్‌ సభ్యుడు. కెనడాకు ట్రాన్స్‌ఫర్‌ అయిన ఏకైక సిక్కు మేజర్‌ కూడా ఆయనే.

కేసర్‌ సింగ్‌తోపాటు మరికొందరు సైనికులు కెనడాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. వారంతా బ్రిటిష్ కొలంబియాను తమ నివాసంగా చేసుకున్నారు.

కెనడాలో న్యూడెమొక్రటిక్ పార్టీ నేత జగ్‌మీత్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడాలో న్యూడెమొక్రటిక్ పార్టీ నేత జగ్‌మీత్ సింగ్

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రిటీష్‌ ప్రభుత్వం వారికి కెనడాలో ఉండేందుకు ఆప్షన్‌ కూడా ఇవ్వడంతో సిక్కుల ప్రవాసం మొదలైంది.

కొద్ది సంవత్సరాలలోనే సుమారు 5,000మంది సిక్కులు కెనడా చేరుకున్నారు. బ్రిటీష్ కొలంబియాలో వారి జనాభా 90శాతానికి చేరింది. అయితే వారి రాకపై స్థానికుల్లో ఆందోళన కూడా మొదలైంది.

1907నాటికి భారతీయులపై జాత్యహంకార దాడులు ప్రారంభమయ్యాయి. కొన్ని సంవత్సరాల తరువాత భారతదేశం నుండి వలస వచ్చినవారిని నిషేధించడానికి ఒక చట్టం రూపొందించారు.

కెనడాకు వచ్చేటప్పుడు భారతీయుల దగ్గర 200 అమెరికా డాలర్ల ధనం ఉండాలని నియమం పెట్టారు. యూరోపియన్లకు ఇది కేవలం $25 మాత్రమే.

అయితే ఈ నియమం పెట్టే నాటికే చాలామంది భారతీయులు కెనడాలో స్థిరపడ్డారు. వారిలో ఎక్కుమంది సిక్కులే. ఇబ్బందులున్నా వారు అక్కడే జీవించడం అలవాటు చేసుకున్నారు.

कनाडा

ఫొటో సోర్స్, Getty Images

తమ కృషి, అంకితభావాలతో కెనడాలో తమను తాము నిరూపించుకున్న సిక్కులు ఒక బలమైన సంస్కృతిని నిర్మించుకున్నారు. అనేక గురుద్వారాలు ఏర్పాటయ్యాయి.

1914లో భారతదేశానికి చెందిన అనేకమంది ‘కొమగట మారు’ అనే జపనీస్‌ ఓడలో కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కెనడా ప్రభుత్వం వారిని దేశంలోకి రానివ్వలేదు.

దాదాపు 2 నెలలపాటు ఆ ఓడ కెనడా తీరంలోనే నిలిచిపోయింది. ఈ సందర్భంగా సుమారు 19మంది మరణించారు. తర్వాత ఈ ఓడను తిరిగి కోల్‌కతాకు పంపించి వేశారు. ఈ ఘటనపై 2016లో జస్టిన్‌ ట్రూడో క్షమాపణలు కూడా చెప్పారు.

1960లలో కెనడాలో లిబరల్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అది తమ దేశంలోని సిక్కులను గుర్తించింది. అలాగే కెనడా ప్రభుత్వం వలస నియమాలలో మార్పులు చేసింది. దీని ప్రభావంతో భారత సంతతికి చెందిన జనాభా వేగంగా పెరిగింది.

భారతదేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు కూడా కెనడాకు రావడం ప్రారంభించారు. ఇప్పటికీ వెళుతూనే ఉన్నారు.

ఇప్పుడు కెనడాలోని న్యూ డెమెక్రాటిక్‌ పార్టీకి సిక్‌-కెనడియన్‌ జగ్మీత్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తున్నారు. కెనడాలో మూడో ప్రధాన భాషగా పంజాబీ గుర్తింపు పొందింది. ఆ దేశ జనాభాలో 1.3% మంది పంజాబీని అర్థం చేసుకుని మాట్లాడగలరు.

2016 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాసియాకు చెందిన వారు కెనడాలో దాదాపు 20 లక్షలమంది ఉండగా, అందులో సుమారు 13 లక్షలమంది భారతీయులే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)