కెనడా ప్రధాని ట్రూడో పర్యటన: భారత్ తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టా, ఇవ్వనట్టా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆయేషా పెరేరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో తొలిసారిగా జరుపుతున్న అధికారిక పర్యటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ట్రూడో, ఆయన కుటుంబం పర్యటనను ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చాలా వరకు విస్మరించారనే వాదనలు ఉన్నాయి.
ఈ నెల 17న ట్రూడో దిల్లీలో విమానం దిగినప్పుడు, ఆయనకు ఒక జూనియర్ మంత్రి స్వాగతం పలికారు. దీనిని ప్రస్తావిస్తూ కెనడా ప్రధాని స్థాయికి తగిన గౌరవం ప్రభుత్వం ఇవ్వలేదని చాలా మంది విమర్శించారు.
ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి, స్వాగతం పలికారు.
జనవరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కూడా ఆయన ఆలింగనంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, EPA
ఆగ్రాకు వెళ్లని యూపీ ముఖ్యమంత్రి
ట్రూడో భారత్‌కు వచ్చి రెండు రోజులైంది. ప్రధాని మోదీ ఆయనతో ఇంకా సమావేశం కాలేదు. ట్రూడో సోమవారం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటన చేపట్టారు. అప్పుడు కూడా మోదీ ఆయనతోపాటు లేరు.
కెనడా ప్రధాని ఆదివారం ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లగా, ఆయన్ను పలకరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రూడోకు భారత్ తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. కెనడా ప్రధానికి భారత్ కావాలనే అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదా, ఇది నిజమేనా, నిజమే అయితే కారణాలు ఏమిటి?
'ఖలిస్తాన్ ఉద్యమం' ప్రభావం?
ట్రూడో పర్యటన-ప్రభుత్వం తీరుపై ఆర్థికవేత్త, కాలమిస్టు వివేక్ దెహేజియాను బీబీసీ స్పందన కోరగా- కెనడా ప్రధానికి, ఆయన కుటుంబానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఒక జూనియర్ మంత్రిని పంపిందని, ఇది ట్రూడో ప్రాధాన్యాన్ని విస్మరించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రూడో ప్రభుత్వంలోని పలువురు సిక్కులకు ఖలిస్తాన్ ఉద్యమం నడిపేవారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఆయన విషయంలో ఇలా వ్యవహరిస్తుండొచ్చని వివేక్ అభిప్రాయపడ్డారు.
సిక్కుల ప్రాబల్యం అధికంగా ఉండే పంజాబ్ రాష్ట్రం నుంచి ఖలిస్తాన్ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలన్నది ఖలిస్తాన్ ఉద్యమం మద్దతుదారుల డిమాండ్.
ట్రూడో నాయకత్వోంలోని 'లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా' సిక్కు-కెనడా ఓటు బ్యాంకుపై బాగా ఆధారపడుతుందని వివేక్ తెలిపారు.
ఆయన ప్రభుత్వంలో నలుగురు మంత్రులు సిక్కులు. వారిలో కీలకమైన రక్షణశాఖ మంత్రి హర్జీత్ సింగ్ సజ్జన్ ఒకరు.
ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి వివేక్ చెబుతున్న కారణాన్నే పరిగణనలోకి తీసుకొంటే, రెండు దేశాల నాయకుల మధ్య సంబంధాలపై ఈ అంశం ప్రభావం చూపడం ఇదే తొలిసారి కాదు. నిరుడు ఏప్రిల్‌లో భారత పర్యటనకు వచ్చిన కెనడా రక్షణ మంత్రి హర్జీత్ సింగ్ సజ్జన్‌తో సమావేశమయ్యేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిరాకరించారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
భారత్ ప్రొటోకాల్‌ను పాటించింది: మాజీ హైకమిషనర్
ట్రూడోకు భారత్ సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలను కెనడాలో భారత హైకమిషనర్‌గా చేసిన విష్ణు ప్రకాశ్ తోసిపుచ్చారు. ఆయనకు స్వాగతం పలికే విషయంలో దౌత్యపరమైన ప్రొటోకాల్‌ను భారత్ పాటించిందని ఆయన చెప్పారు.
ప్రొటోకాల్ ప్రకారం విదేశీ నాయకుడికి కేబినెట్ మంత్రి స్వాగతం పలకాల్సి ఉంటుందని, ట్రూడో విషయంలో ప్రభుత్వం ఈ నిబంధన పాటించిందని విష్ణు ప్రకాశ్ తెలిపారు.
గతంలో పలువురు విదేశీ నాయకులకు వ్యక్తిగతంగా స్వాగతం పలికి ప్రొటోకాల్‌ను ప్రధాని మోదీ 'పక్కనబెట్టారని', అలాగని ప్రతి నాయకుడి విషయంలోనూ ప్రధాని అలా చేయడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రూడోకు లాంఛనంగా స్వాగతం పలికే కార్యక్రమం ఈ నెల 23న ఏర్పాటైందని, ఆ సందర్భంగా ఆయనతో ప్రధాని సమావేశం కానున్నారని విష్ణు ప్రకాశ్ ప్రస్తావించారు.
'మెరుగుపడిన ద్వైపాక్షిక సంబంధాలు'
ట్రూడోను భారత్ కావాలనే విస్మరిస్తోందనే ఆరోపణలను మాజీ దౌత్యవేత్త కన్వాల్ సిబల్ కూడా తోసిపుచ్చారు.
ఇటీవల కాలంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఆయన బీబీసీతో చెప్పారు.
భారత్‌కు యురేనియం సరఫరా చేస్తామని 2015లో కెనడా ప్రకటించింది. భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో పెద్ద ముందడుగు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









