ట్రంప్ దెబ్బ: అమెరికాలో తగ్గిన పర్యాటకులు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య పడిపోతోంది. దీనికి కారణం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని పర్యాటక రంగానికి చెందిన కొందరు తప్పుపడుతున్నారు.
2017లో మొదటి ఏడు నెలల్లో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 4 శాతం తగ్గిందని యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ లెక్కలు చెప్తున్నాయి.
అయితే అమెరికాలో పర్యాటకుల సంఖ్య తగ్గిపోవటం.. అంతర్జాతీయంగా పర్యాటక రంగం పెరుగుతుండటానికి విరుద్ధంగా ఉంది.
అమెరికాలో పర్యాటకుల తగ్గుదలను ‘‘ట్రంప్ స్లంప్’’ అని కొందరు అభివర్ణించారు. అమెరికా ముందు అంటూ అధ్యక్షుడు ఉద్ఘాటిస్తున్న నినాదం, వలసలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, కొన్ని దేశాల విషయంలో వీసా నిబంధనలు కఠినతరం చేయటం, ఇతర ఆంక్షలు విధించటం దీనికి కారణమని చెప్తున్నారు.
’’జనం ప్రయాణించేటపుడు ఆహ్లాదకరమైన భావోద్వేక అనుభూతిని కోరుకుంటారు. అయితే ఈ సమయంలో అమెరికా సందర్శించటం చాలా ఇబ్బందికరమని వారు భావిస్తున్నారు’’ అని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ మాజీ చైర్మన్ విన్సెంట్ ఓల్ఫింగ్టన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రెండ్స్ ఎలా ఉన్నాయి?
అమెరికాలో కొన్నేళ్లుగా స్థిరంగా పెరుగుతూ వచ్చిన అంతర్జాతీయ పర్యాటకుల రాక 2015లో అత్యధిక స్థాయి.. 7.75 కోట్ల సందర్శకులకు పెరిగింది. .
పర్యాటకుల సంఖ్య 2016లో 2 శాతం తగ్గిందని, ఈ తిరోగమనం 2017 మొదటి ఏడు నెలల్లో వేగవంతమైందని నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం లెక్కలు చెప్తున్నాయి.

ఈ తగ్గుదల ఒకే రకంగా లేదు
అమెరికాకు అత్యధిక సంఖ్యలో వచ్చే విదేశీ పర్యాటకులు ప్రధానంగా కెనడా నుంచే వస్తారు. జూలై వరకూ ఈ పర్యాటకుల సంఖ్య ఏటా 4.6 శాతం పెరిగిందని అమెరికా చెప్తోంది.
కెనడా తర్వాత మెక్సికో, బ్రిటన్‌ల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు అమెరికాకు వస్తారు. ఈ రెండు దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ఆ కాలంలో పడిపోయింది.
ఇక అమెరికా పర్యాటకుల్లో ఐదో స్థానంలో ఉండే చైనా నుంచి రాకలు కూడా పడిపోయాయి. నాలుగో పెద్ద దేశమైన జపాన్ నుంచి పర్యాటకుల సంఖ్య స్థిరంగా కొనసాగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా ఎందుకు జరుగుతోంది?
ముఖ్యమైన బ్రిటన్ మార్కెట్‌లో పౌండ్ విలువ తగ్గటం పర్యాటకుల సంఖ్య తగ్గటానికి కారణం కావచ్చునని.. పర్యాటక రంగాన్ని విశ్లేషించే స్పెయిన్ సంస్థ ఫార్వర్డ్‌కీస్ ప్రతినిధి డేవిడ్ టార్ష్ పేర్కొన్నారు.
కానీ ఈ ఏడాది డాలర్ విలువ గణనీయంగా తగ్గింది. దీనివల్ల.. అమెరికా పర్యటన 2016 కన్నా 2017లో చౌక అయింది.
ఐదేళ్లతో పోలిస్తే డాలర్ విలువ బలంగా ఉన్నప్పటికీ.. అమెరికా నాయకత్వానికి ఆమోదం తగ్గిందని ప్రపంచ సర్వేలు చెప్తున్నక్రమంలో.. పర్యాటకులపై ’సెంటిమెంట్’ ప్రభావం ఉందని తాను భావిస్తున్నట్లు ఓల్ఫింగ్టన్ చెప్పారు.
2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడుల తర్వాత.. సరిహద్దు భద్రతపై అమెరికా కఠిన చర్యలు చేపట్టటం, ఇరాక్ పై ఆక్రమణకు దిగటం వంటి చర్యల సమయంలోనూ అమెరికా పర్యాటక రంగం ఇదే రీతిలో పడిపోయిందన్నారు.
‘‘నాడు తమ రాకను అమెరికా వ్యతిరేకిస్తోందని అమెరికాయేతర పౌరులు భావించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాం’’ అని రాజకీయంగా తను ఏ వైపూ మొగ్గనని చెప్పుకున్న ఓల్ఫింగ్టన్ పేర్కొన్నారు.
అధ్యక్షుడి విధానాలు, ప్రకటనల ప్రభావాన్ని ఫార్వర్డ్‌కీస్ వేరుగా అంచనా వేయలేకపోయిందని టార్ష్ చెప్పారు. అయితే.. మిగతా ప్రపంచంతో పోలిస్తే అమెరికాలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పడిపోవటం 2018లో కూడా కొనసాగుతుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, AFP/Getty
అంతర్జాతీయంగా పోలిస్తే ఎలా ఉంది?
విదేశీ ప్రయాణికుల సంఖ్య పడిపోతున్న పరిస్థితి అమెరికాకు మాత్రమే ప్రత్యేకం.
నిజానికి గత ఏడాది అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 7 శాతం పెరిగిందని, అందులోనూ యూరప్‌లో ఈ పెరుగుదల అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల పేర్కొంది.
ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానం నుంచి అమెరికాను తోసేసి స్పెయిన్ చేరనున్నట్లు ప్రాధమిక లెక్కల ఆధారంగా రూపొందించిన ఆ నివేదిక చెప్తోంది.
2015 - 2017 మధ్య అంతర్జాతీయ పర్యాటక గమ్యాలైన టాప్ 12 దేశాల్లో కేవలం అమెరికా, టర్కీల్లో మాత్రమే విదేశీ పర్యాటకుల సంఖ్య పడిపోతోందని.. ఈ ‘విజిట్ యూఎస్’ కూటమి చెప్తోంది. ఈ తిరోగమనం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి పర్యాటక రంగ సంస్థలు ఈ కూటమిని ఏర్పాటు చేశాయి.
‘‘ఈ తిరోగమనం ఆందోళనకరం. మనకు బలమైన జాతీయ భద్రతను కలిగివుంటూనే నిజమైన అంతర్జాతీయ సందర్శకులను ఆహ్వానించవచ్చు అనేది మా మార్గదర్శక సూత్రం’’ అని యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యక్షుడు రోజర్ డవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే 2017 మొదటి 10 నెలల్లో అంతర్జాతీయ పర్యాటకులు చేసే ఖర్చు 3.2 శాతం అంటే 25 కోట్ల డాలర్లకు పైగా తగ్గిపోయిందని వాణిజ్య విభాగం చెప్తోంది.
2016లో జీడీపీలో 8 శాతం వాటా పర్యాటక రంగానిదేనని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ అను నేను..!
- ట్రంప్‌తో డేటింగా.. నో నో!
- Quiz: ట్రంప్‌కు పెట్టిన పరీక్ష ఇదే.. మరి మీరు రాస్తే?
- ట్రావెల్ బ్యాన్: ట్రంప్‌కి మళ్లీ మొట్టికాయలు
- అమెరికా స్తంభించటానికి ట్రంప్ ఎంత వరకు కారణం?
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- 39 మంది అమెరికా అధ్యక్షులను చూసిందీ చెట్టు!
- కోక్ తాగినా, చికెన్ తిన్నా ట్రంప్ ఆరోగ్యానికి ఢోకా లేదు!
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- అమెరికాలో గవర్నమెంటు ఆఫీసులకు తాళం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








