కెనడా పాఠశాల ప్రాంగణంలో బయటపడిన 215 మంది పిల్లల అవశేషాలు..

బ్రిటిష్ కొలంబియాలో ఉన్న కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ కొలంబియాలో ఉన్న కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 500 మంది పిల్లలు చదువుకునేవారు

కెనడాలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం వెలుగుచూసింది.

బడి ప్రాంగణంలో 215 మంది పిల్లల అవశేషాలతో కూడిన సమాధి బయటపడింది.

ఈ పిల్లలంతా బ్రిటిష్ కొలంబియాలో కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్‌లోని విద్యార్థులు.

ఈ పాఠశాల 1978లో మూతపడింది.

రాడార్‌తో స్కూల్ సర్వే చేస్తుండగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ అవశేషాల గురించి టెమ్‌లప్స్ టీ సెక్వెపెమ్ ఫస్ట్ నేషన్ అధికారి గురువారం ప్రకటించారు.

"ఇది కెనడా చరిత్రలో తలదించుకునే అధ్యాయంలో వేదన కలిగించే ఒక జ్ఞాపకం" అని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.

ఈ మరణాలకు గల కారణాలు, సమయాన్ని నిర్ధారించడానికి ఫస్ట్ నేషన్ మ్యూజియం నిపుణులు, కరొనర్ ఆఫీస్‌తో కలిసి పని చేస్తున్నారు.

ఈ దారుణం గురించి స్కూల్ నిర్వాహకులు ఎక్కడా ప్రస్తావించలేదని ప్రాథమిక ఆధారాలతో తెలిసిందని బ్రిటిష్ కొలంబియాలోని సిటీ ఆఫ్ కామ్‌‌లూప్స్ కమ్యూనిటీ చీఫ్ రోసాన్ కసిమీర్ అన్నారు.

19వ శతాబ్దంలో కెనడాలో ప్రభుత్వం, మత సంస్థలు రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వహించేవి. పిల్లలు ఇక్కడ తప్పనిసరిగా హాస్టల్‌లోనే ఉండాలి.

ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిడులు జరిగేవని ఆరోపణలు ఉన్నాయి.

అప్పట్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాల అతి పెద్దది.

దీన్ని 1890లో రోమన్ కాథలిక్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ స్కూల్‌లో 1950 నాటికి 500 మంది పిల్లలు ఉండేవారు.

ఈ పాఠశాల నిర్వహణను 1969లో ప్రభుత్వం తీసుకుంది.

1978లో స్కూల్ మూతపడే వరకు స్థానిక విద్యార్థుల వసతి గృహంగా దీన్ని ఉపయోగించారు.

ఈ అవశేషాల గురించి ఏమి తెలుసు?

స్కూల్ గురించి సర్వే చేస్తుండగా రాడార్ ద్వారా ఈ అవశేషాలు సమాచారం లభించినట్లు టెమ్‌లప్స్ టీ సెక్వెపెమ్ ఫస్ట్ నేషన్ తెలిపింది.

"తప్పిపోయిన పిల్లల మరణాలేవీ నమోదు కాలేదు" అని కసిమీర్ చెప్పారు. వీరిలో కొంతమంది మూడేళ్ళ వయసు పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్‌లో చదువుకున్న పిల్లల తల్లిదండ్రులను సంప్రదిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ మిస్టరీకి సంబంధించి జూన్ మధ్య నాటికి ప్రాథమిక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు.

ఎవరేమన్నారు?

ఈ సమాచారం పట్ల అందరూ తీవ్ర దిగ్భ్రాంతి, బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటన చూసిన తర్వాత తన గుండె తరుక్కుపోయిందని కెనడా ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రభుత్వ ప్రతినిధులంతా ఈ సమాచారం పట్ల దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

బ్రిటిష్ కొలంబియాలో ఉన్న కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బడి ఆవరణలో బయటపడిన పిల్లల అవశేషాల గురించి విచారణ సాగుతోంది

రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఏంటి?

1863 - 1998 వరకు 1,50,000 మందికి పైగా మూలవాసుల పిల్లలను తీసుకొచ్చి ఈ స్కూళ్లలో వేశారు.

ఈ బడిలో చదివే పిల్లలను వారి మాతృభాషలో మాట్లాడనివ్వకుండా, వారి సంస్కృతిని పాటించనివ్వకుండా చేసేవారు. వారిని తరచూ వేధించేవారు.

ఈ విధానం ఎలా పని చేస్తోందో తెలుసుకోవడానికి 2008లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు.

మూలవాసుల పిల్లలు చాలా మంది ఇళ్లకు తిరిగి రాలేదని ఈ కమిషన్ తెలిపింది.

ఈ విధానం సాంస్కృతిక మారణహోమానికి పాల్పడిందని 2015లో విడుదలైన ది ల్యాండ్‌మార్క్ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ రిపోర్ట్ చెప్పింది.

ఈ విధానం గురించి కెనడా ప్రభుత్వం 2008లో అధికారికంగా క్షమాపణ చెప్పింది.

స్కూళ్లకు హాజరవుతున్న సమయంలో మరణించిన పిల్లల సమాధులను, మరణాలను ది మిస్సింగ్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ చేస్తుంది.

ఇప్పటి వరకు ఆశ్రమ పాఠశాలల్లో చదివిన 4100 మందికి పైగా పిల్లలు మరణించినట్లు ఈ ప్రాజెక్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)