COP26: ‘వాతావరణ మార్పులకు కారణమవుతున్న చమురు, గ్యాస్ ఉత్పత్తి పెరుగుతూనే ఉంది’ – రిపోర్ట్

ఫొటో సోర్స్, VCG
- రచయిత, మాట్ మెక్‌గ్రాత్
- హోదా, ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్
పెట్రోలు, గ్యాస్ లాంటి శిలాజ ఇంధనాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వాల దగ్గరున్న ప్రణాళికలకు, ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గించడం కోసం 2030 నాటికి పెట్టుకున్న లక్ష్యాలకు పొంతన కుదరడం లేదని ఐక్యరాజ్యసమితి అంటోంది.
ప్రపంచ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గించడానికి అవసరమైన స్థాయి డ్రిల్లింగ్ కంటే రెట్టింపు డ్రిల్లింగ్ జరగనుందని ఐక్యరాజ్యసమతి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్-యూఎన్ఈపీ) ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ చెబుతోంది.
బొగ్గు తవ్వకాలు కొంత తగ్గినప్పటికీ, గ్యాస్,పెట్రోలు వెలికితీత మాత్రం గణనీయంగా పెరగనుంది. 2019లో యూఎన్ఈపీ మొదటి నివేదిక వెలువడిన తర్వాత పరిస్థితిలో మార్పు కొద్దిగానే ఉంది.
కాప్26 కాన్ఫరెన్స్‌కు ఇంకా కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అధిక స్థాయిలో కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే దేశాలు చేపట్టిన నియంత్రణ చర్యలపై ఇప్పటికే దృష్టి సారించారు.
నెట్ జీరో ఉద్గారాలపై వివిధ దేశాలకు ఇప్పటికే లక్ష్యాలు పెట్టినా రాబోయే సంవత్సరాలలో ఈ ఉద్గారాలను ఎలా తగ్గిస్తారన్న దానిపై కొన్ని పెద్ద చమురు, గ్యాస్, బొగ్గు ఉత్పత్తి దేశాలు ఇంకా తమ ప్రణాళికలను ప్రకటించ లేదు.
ఈ శతాబ్దంలో 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగేలా వ్యవహరిస్తే మానవాళికి జరిగే ముప్పు గురించి ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) పరిశోధకులు హెచ్చరించారు.

ఫొటో సోర్స్, VCG
ఈ స్థాయిని కొనసాగించడానికి 2010 స్థాయిలను ఆధారం చేసుకుని 2030 నాటికి దాదాపు 45% కార్బన్ ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది.
ఒకపక్క కార్బన్ ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం కనిపిస్తుండగా, కొన్ని దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిని పెంచాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
ఈ శతాబ్ధి చివరినాటికి ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పెరగకుండా చూడటానికి లక్ష్యాలు విధిస్తుండగానే కొన్ని దేశాలు 110% శిలాజ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ వెల్లడించింది.
ఉష్ణోగ్రతల్లో వృద్ధిని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు ఉండేలా చూడటానికి అవసరమైన దానికంటే 45% అధికంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధమయ్యాయి.
ఈ అధ్యయనం ప్రకారం, బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. కానీ, రాబోయే 20 సంవత్సరాలలో గ్యాస్ ఉత్పత్తి పారిస్ ఒప్పందానికి విరుద్ధంగా పెరుగుతుంది. ఈ నివేదిక ఆస్ట్రేలియా, రష్యా, సౌదీ అరేబియా, యూఎస్, యూకే సహా 15 ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలను ప్రస్తావించింది.

ఫొటో సోర్స్, PAUL RATJE
చాలా దేశాలు శిలాజ ఇంధన ఉత్పత్తి విషయంలో విధానపరమైన మద్దతును అందిస్తూనే ఉన్నాయని ఈ రిపోర్ట్ రూపకర్తలు వెల్లడించారు.
"ఈ పరిశోధన చాలా స్పష్టంగా ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు, చమురు, గ్యాస్ ఉత్పత్తిని వెంటనే తగ్గించాలి'' అని స్టాక్‌హోమ్‌లోని ఎన్విరాన్మెంట్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన రిపోర్టులో ప్రధాన రచయిత ప్లాయ్ అచకుల్విసట్ అన్నారు.
''ఉత్పత్తి తగ్గించాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వాలు మద్ధతిస్తూనే ఉన్నా, అవి మనం సురక్షితంగా ఉపయోగించుకోగల స్థాయికన్నా ఎక్కువగానే ఉంటాయి'' అని అచకుల్విసట్ అన్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత శిలాజ ఇంధన కార్యకలాపాల కోసం దేశాలు తమ రికవరీ ఖర్చులో చాలా ఎక్కువే కేటాయించాయి. ఫైనాన్సింగ్ విషయంలో కొన్ని సానుకూలతలు ఉన్నాయి.
బొగ్గు, చమురు, గ్యాస్ నిధుల కోసం బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు కొంత వరకు తగ్గాయి. ధనిక దేశాలు కూడా ఈ రుణాలను తగ్గించినట్లు తేలింది.
ఈ రిపోర్ట్ మనకొక నిజాన్ని వెల్లడించింది. మనం పారిస్ ఒప్పందాన్ని అమలు చేయాలంటే భూమి నుంచి పెట్రోల్ తీసి వాడుకోవడాన్ని తగ్గించాలి'' అని కోస్టారికా పర్యావరణ, ఇంధన శాఖ మంత్రి అండ్రేజా మెజా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- వైఎస్ జగన్: ‘విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








