ఫేస్‌బుక్: మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?

మెటావర్స్ గురించి ఫేస్‌బుక్ ఇటీవల ప్రకటన చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెటావర్స్ గురించి ఫేస్‌బుక్ ఇటీవల ప్రకటన చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది

"మెటావర్స్"ను డెవలప్ చేయడానికి యూరప్‌లో 10,000 మందిని నియమించుకోబోతున్నట్లు ఫేస్‌బుక్ ఈ మధ్యే ప్రకటించింది.

ఈ కొత్త టెక్నాలజీని ఫ్యూచర్ ఇంటర్నెట్‌గా చాలామంది చర్చించుకుంటున్నారు. కానీ నిజంగా ఏంటిది?

మెటావర్స్ అంటే ఏంటి?

కొందరికి ఇది వర్చువల్ రియాలిటీలాగా కనిపిస్తుండగా, మరికొందరు దీన్ని ఫ్యూచర్ ఇంటర్నెట్‌కు సంబంధించిన అంశంగా చూస్తున్నారు.

1980ల నాటి మొబైల్ ఫోన్లకు నేటి తరం అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లు వర్చువల్ రియాలిటీ లాగా కనిపించినట్లే, మెటావర్స్ మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అయ్యుంటుందని కొందరు భావిస్తున్నారు.

మెటావర్స్‌లో కంప్యూటర్‌తో పని లేకుండా, కేవలం ఒక హెడ్‌సెట్‌తో అన్ని రకాల డిజిటల్ ఎన్విరాన్‌మెంట్స్‌లోకి వెళ్లిపోవచ్చు.

నేడు గేమ్‌లకు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్న వర్చువల్ రియాలిటీకి భిన్నంగా, ఈ కొత్త టెక్నాలజీని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే, ఉదాహరణకు పని, ఆటలు, ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలు ఇలా అన్ని విధాలుగా వినియోగించుకోవచ్చు.

చాలామంది దీన్ని మిమ్మల్ని మీకు చూపించే త్రీడీ అవతార్‌ అని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ ఊహాగానాలే. మెటావర్స్ ఇలా ఉంటుంది అని చెప్పే నిర్వచనం ఏదీ ఇంకా రాలేదు.

మెటావర్స్ :ఇటీవల వచ్చి అత్యాధునిక వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లలో ఓక్యులస్ క్వెస్ట్ 2 ఒకటి.

ఫొటో సోర్స్, OCULUS

ఫొటో క్యాప్షన్, ఇటీవల వచ్చి అత్యాధునిక వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లలో ఓక్యులస్ క్వెస్ట్ 2 ఒకటి

ఒక్కసారిగా తెరమీదకు ఎలా వచ్చింది?

డిజిటల్ ప్రపంచంలో కొత్త కొత్త టెక్నాలజీలు రెండు మూడేళ్ల పాటు హైప్ సృష్టిస్తుంటాయి. కొన్నాళ్లకు చప్పబడిపోతాయి.

కాకపోతే, సంపన్న పెట్టుబడిదారులు, పెద్దపెద్ద టెక్నాలజీ సంస్థలలో మెటావర్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైగా ఇది ఫ్యూచర్ ఇంటర్నెట్ అని, ఇందులో ఎక్కడా వెనకబడకూడదని చాలామంది అనుకుంటున్నారు.

వర్చువల్ గేమింగ్, కనెక్టివిటీ టెక్నాలజీలో పురోగతి అవసరానికి సరిపడే స్థాయికి చేరిందని చాలామంది భావిస్తున్నారు. అందుకే కొత్త టెక్నాలజీ రాబోతోందన్న చర్చ జరుగుతోంది.

ఫేస్‌బుక్ పాత్ర ఏంటి?

తన కీలక అవసరాల కోసం ఫేస్‌బుక్ మెటావర్స్‌ను సిద్ధం చేస్తోంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఓక్యులస్ హెడ్‌సెట్‌ల రూపంలో ఫేస్‌బుక్, వర్చువల్ రియాలిటీలో భారీగా పెట్టుబడి పెట్టబడింది.

కొంత నష్టం ఉన్నా, ఇది ప్రత్యర్ధుల కంటే తక్కువ ధరకు అందిస్తుంది.

సోషల్ హ్యాంగవుట్‌లు, పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్‌లను ఫేస్‌బుక్ రూపొందిస్తోంది.

ప్రత్యర్థి కంపెనీలను కొనుగోలు చేసే చరిత్ర ఉన్న ఫేస్‌బుక్ మెటావర్స్‌ విషయంలో మాత్రం '' రాత్రికి రాత్రే ఏ కంపెనీని నిర్మించలేము. కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం'' అని ప్రకటించింది.

మెటావర్స్‌ కోసం ఇటీవల 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్‌బుక్ పెట్టుబడిగా కేటాయించింది. కాకపోతే, సంపూర్ణమైన మెటావర్స్ అందుబాటులోకి రావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేస్తోంది.

వర్చువల్ రియాలిటీ మీటింగ్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వర్చువల్ రియాలిటీ మీటింగ్స్

మెటావర్స్‌పై ఇంకా ఎవరు ఆసక్తి చూపిస్తున్నారు?

ఎపిక్ గేమ్స్ అధినేత స్వీనీ కూడా తన మెటావర్స్ ఆలోచనల గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్‌లలో కొన్ని దశాబ్దాలుగా మెటావర్స్ తరహా టెక్నాలజీ ఉంది.

ఇటీవలి కాలంలో ఫోర్ట్‌నైట్ సంస్థ కన్సర్ట్‌లు, బ్రాండ్ ఈవెంట్‌ల రూపంలో తన ప్రోడక్ట్స్‌ను విస్తరించింది. ఈ సంస్థ అధినేత స్వీనీ మెటావర్స్‌ గురించి మాట్లాడుతుండటంతో దానికి కూడా గుర్తింపు పెరిగింది.

ఇతర గేమ్స్ కూడా మెటావర్స్ ఐడియాకు దగ్గరవుతున్నాయి. రాబ్లాక్స్ అనేది ఇందుకు పెద్ద ఉదాహరణ. ఈ సంస్థ అనేక వ్యక్తిగత గేమ్‌ల రూపకర్త.

యూనిటీ అనే త్రీడీ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్ డిజిటల్ ట్విన్స్‌లో పెట్టుబడులు పెడుతోంది. అలాగే ఎన్విడియా 'ఓమ్నివర్స్'ను సిద్ధం చేస్తోంది.

అంటే ఇదంతా ఆటల గురించేనా?

కాదు. మెటావర్స్ ఎలా ఉంటుందనే దాని గురించి చాలా రకాలుగా చెబుతున్నప్పటికీ, సోషల్ ఇంటరాక్షన్ ప్రధానంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.

ఉదాహరణకు ఫేస్‌బుక్, వర్క్‌ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్‌తో ప్రయోగాలు చేస్తోంది. రెండూ వాటి వర్చువల్ అవతార్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్నాయి.

మరొక వర్చువల్ రియాలిటీ యాప్, వీఆర్ చాట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో హ్యాంగ్ అవుట్, చాటింగ్‌లపై దృష్టి పెట్టింది. ఇంకా కొన్ని యాప్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఇటీవల వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడిన స్వీనీ ''ఒక కొత్త మోడల్‌‌ కారుకు అడ్వర్టయిజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక కార్ల తయారీ సంస్థ వాటిని రియల్ టైమ్‌లో మీ ముందుకు తీసుకువస్తుంది. మీరు దాన్ని నడపొచ్చు'' అన్నారు.

అలాగే ఆన్‌లైన్ షాపింగ్‌కు వెళ్లినప్పుడు, మొదట డిజిటల్ దుస్తులు ధరించి చూసి, తర్వాత అసలు దుస్తులు కొనుక్కోగలుగుతారు.

మెటావర్స్ డెవలప్‌మెంట్ కోసం 10వేలమందిని నియమిస్తామని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మెటావర్స్ డెవలప్‌మెంట్ కోసం 10వేలమందిని నియమిస్తామని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు

ఈ టెక్నాలజీ ఇప్పటికే ఉందా?

వర్చువల్ రియాల్టీ ఇటీవలి సంవత్సరాలలో చాలా అడ్వాన్స్ అయ్యింది. హై ఎండ్ హెడ్‌సెట్‌లతో, మనిషిని త్రీడీ ద్వారా వర్చువల్ ప్రపంచంలో కదులున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఇది ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్‌గా మారింది.

అయితే, మెటావర్స్ ప్రస్తుతానికి ప్రారంభదశలోనే ఉంది. మెటావర్స్ టెక్నాలజీలో మరిన్ని మార్పులు వస్తే, రాబోయే దశాబ్దంలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ తీవ్రంగా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)