ముంబయి దేవనార్ చెత్త పర్వతం... దీనిని కరిగించడం సాధ్యమా?

ఫొటో సోర్స్, Reuters
భారతదేశంలోని నగరాలలో చెత్త పేరుకు పోతోంది. అది మామూలుగా కూడా కాదు. చెత్త మహా పర్వతాలే పుట్టుకొస్తున్నాయి. పెరుగుతున్న ఈ కొండలను కరిగించేందుకు వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే హామీ ఇచ్చారు.
అసలు నగరాలలో ఈ చెత్త ఎలా పేరుకుపోతోందన్న దానిని పరిశీలించేందుకు రచయిత్రి సౌమ్య రాయ్ ఒక పురాతన, అతి ఎత్తయిన చెత్త గుట్టను పరిశీలించారు. అది ముంబయి తీరంలోని దేవనార్ చెత్త పర్వతం. దాని ఎత్తు దాదాపు 18 అంతస్తులు. ఆ చెత్త కొండ వయసు వందేళ్లకు పైగానే ఉంటుంది.
ఫర్హా షేక్ ప్రతి రోజు పొద్దున్నే ఆ చెత్త కొండ ఎక్కుతారు. ఉదయం అక్కడికి వచ్చినప్పటి నుంచి, చెత్త తీసుకుని వచ్చే ట్రక్కుల కోసం ఆమె ఎదురు చూస్తుంటారు.
19 ఏళ్ల ఈ యువతి, తను పుట్టి గుర్తెరిగినప్పటి నుంచి దేవనార్ శివార్లలోని ఈ డంప్ యార్డ్‌ల దగ్గరే చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ వ్యర్థ పదార్ధాల నుంచి ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, వైర్లలాంటివి ఏరి వాటిని వేస్ట్ మార్కెట్‌కు తీసుకెళుతుంటారు ఫర్హా. అందులో పగిలిపోయిన, పాడైన మొబైల్ ఫోన్లు ఏవైనా దొరుకుతాయేమోనని ఆమె ఆతృత్తగా చూస్తుంటారు.
వారానికో, రెండో వారాలకో ఒక పాడైపోయిన మొబైల్ ఫోన్ దొరుకుతుందామెకు. దాచుకున్న డబ్బులో కొంత ఖర్చు పెట్టి ఆ ఫోన్‌లను బాగు చేయించుకుంటారు.
సినిమాలు చూడటం, వీడియో గేమ్‌లు, మెసేజ్‌లు, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం వంటి వాటితో సాయంత్రాలలో ఆమె కాలక్షేపం చేస్తారు.
కొన్ని రోజులకు ఆ ఫోన్ మళ్లీ పాడవగానే, ఆమెకు ఆ సరదా ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మరో కొత్త చెడిపోయిన ఫోన్ కోసం వెతుక్కుంటూ ఆమె మళ్లీ చెత్త ఏరుకునే పనిలో మునిగిపోతారు.
దేవనార్‌లోని ఈ చెత్త కొండల్లో దాదాపు 16 మిలియన్ టన్నులకు పైగా చెత్త పేరుకుని పోయి ఉంది. ఈ చెత్త కుప్పలలో 8 కుప్పలు సుమారు 300 ఎకరాల మేర విస్తరించి ఉన్నాయి. భారతదేశంలోని అతి పెద్ద, పురాతనమైన చెత్తకుప్పలు ఇవే.
ఇక్కడ పేరుకుపోయిన చెత్త సుమారు 120 అడుగులు (సుమారు 36.5 మీటర్లు) ఎత్తు ఉంటుంది. ఈ కొండలకు ఒక వైపు సముద్రం ఉండగా, మరోవైపు మురికివాడలు ఉన్నాయి.
ఇక్కడి వ్యర్థాలు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లాంటి హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. 2016లో, ఇక్కడ మంటలు చెలరేగి, నెలల తరబడి కొనసాగాయి. ఈ కారణంగా ముంబయిని భారీ ఎత్తుల పొగలు ఆవరించాయి.

పెరుగుతున్న కాలుష్యం
చెత్తకుప్పల్లో మంటల కారణంగా నగరంలో కాలుష్య కారక అణువులు 11% అధికంగా ఉత్పత్తి అయినట్లు జాతీయ కాలుష్య నియంత్రణ సంస్థ 2011లో జరిపిన అధ్యయనంలో పేర్కొంది
దేశంలోని 3,159 చెత్త కుప్పల్లో మొత్తం 800 మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోయిందని దిల్లీ కేంద్రంగా పని చేసే థింక్ ట్యాంక్ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) 2020లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ముంబయిలోని దేవనార్ చెత్తకుప్పను అక్కడి నుంచి తీసేయాలంటూ 26 సంవత్సరాలుగా కోర్టు కేసు నడుస్తోంది. కానీ, ఇక్కడ డంపింగ్ మాత్రం ఆగలేదు. ఇలాంటి చెత్తకుప్పలు అటు రాజకీయ నాయకులను, ఇటు అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.
జాతీయ పరిశుభ్రతా కార్యక్రమం కింద ఈ చెత్త కుప్పలను తొలగించేందుకు సుమారు 13 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.97వేల కోట్లు) ఖర్చు పెడతామని ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ 1 ప్రకటించారు.
ఈ నిధుల ద్వారా దేవనార్ లాంటి భారీ చెత్త కుప్పలున్న ప్రాంతంలో వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు.
అయితే, ఇక్కడి చెత్తను తొలగించడం సాధ్యమేనా అని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ''చిన్న చిన్న నగరాలలో కూడా వ్యర్ధాలను తొలగించడం కష్టం'' అని సీఎస్‌ఈ లో డిప్యూటీ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేస్తున్న సిద్ధార్ధ్ ఘన్‌శ్యామ్ సింగ్ అన్నారు.
"ఇది ఒక సమస్య అని ఒప్పుకుంటాం. కానీ దిల్లీ, ముంబయి వంటి పెద్ద నగరాలలో ఇలాంటి చెత్త కొండలు పుట్టుకొస్తూనే ఉంటాయి'' అని గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంసినరేటర్ ఆల్టర్నేటివ్స్ సంస్థకు భారతదేశపు కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న ధర్మేశ్ షా అన్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల తొలగింపు పై పని చేస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
మున్సిపాలిటీలలో వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం 2000 సంవత్సరం నాటికే భారత దేశంలో నియమాలు సిద్ధమయ్యాయి. కానీ చాలా రాష్ట్రాలు వాటిని పాక్షికంగానే సమ్మతించాయి. ఇప్పటికీ తగినన్ని వ్యర్థ శుద్ధి కర్మాగారాలు లేవు.
ముంబయి భారతదేశపు వాణిజ్య, వినోద రాజధాని. ఇక్కడ దాదాపు 2 కోట్లమంది ప్రజలు నివసిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో కేవలం ఒక్క ప్లాంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు దేవనార్ వద్ద వ్యర్థాల నుండి విద్యుత్ ప్లాంట్ కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
గ్రీన్ ఎనర్జీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు. అయితే, ఇక్కడ చెత్త ఏరుకునే ఫర్హాలాంటి వారు ఈ ప్రయత్నాల పట్ల ఆందోళనగా ఉన్నారు.
2016లో ఇక్కడ మంటలు చెలరేగిన తర్వాత, ఈ కొండల మీదకు వెళ్లడం పర్హాలాంటి వారికి కష్టంగా మారింది. మునిసిపాలిటీ చెత్తలో వేస్ట్ మెటీరియల్‌ను వెతికేవారు ఈ కొండల మీదకు వెళ్లకుండా, వారు మంటలు వేయకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఇక్కడ మంటలు వేయడం వల్ల పనికి రాని చెత్త కాలిపోయి, లోహాలు మిగులుతాయి. వాటికి మంచి ధర వస్తుంది. దీంతో చెత్త ఏరుకునే వారు ఇక్కడ మంటలు పెడుతుంటారు.
దొంగతనంగా ఇక్కడికి చొరబడే వారు అప్పుడప్పుడు భద్రతా సిబ్బంది చేతిలో దెబ్బలు తినడం, జైలుకెళ్లడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
కొందరు ఇక్కడి సెక్యూరిటీ సిబ్బందికి లంచాలు ఇస్తారు. లేదంటే గస్తీ కాసే గార్డులు వచ్చేలోగానే చెత్త కుప్పల మీదకు వెళ్లి తమ పనులు పూర్తి చేస్తుంటారు.
అయితే, ఇటీవలి కాలంలో చాలా వరకు చెత్తను దాన్ని పడవేసే దగ్గరే ప్రాసెస్ చేస్తున్నారు. దీంతో దేవనార్ వద్దకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

ఫొటో సోర్స్, SAUMYA ROY
కొందరి ఉపాధిపై ప్రభావం
ఫర్హాకు గత కొన్ని నెలలుగా ఒక్క ఫోన్ కూడా దొరక లేదు.
దేవనార్ చెత్త కుప్పల్లోకి ప్రవేశించడానికి ఆమె రోజుకు కనీసం .50 లంచం ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని రాబట్టుకోవడానికి గత ఏడాది కాలంగా నగరంలోని కోవిడ్ హాస్పిటల్ వార్డుల నుండి వచ్చిన చెత్తను తీయడం గురించి కూడా ఆమె ఆలోచన మొదలు పెట్టారు.
అయితే, "హానికరమైన" కోవిడ్ వ్యర్థాలను సేకరించవద్దని ఫర్హా కుటుంబం ఆమెను వారించింది. అయితే, ఆమె ప్లాస్టిక్ సేకరించడం మానేయకుండానే, వాటిని సురక్షితంగా ఎలా సేకరించాలో ఆలోచించారు.
తన తోటి వాళ్లు కొందరు సురక్షితంగా ఉండేందుకు చేతులకు గ్లవ్స్ తొడుక్కుని ఉండటం ఆమె చూశారు.
ఇప్పుడు, నగరం కొత్త చెత్తను పంపుతూనే ఉంది. కొన్నేళ్లుగా ఈ చెత్త దగ్గర వస్తువులను ఏరుకుంటున్న వారు తమ పని ఆపలేదు. అక్కడి ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అమ్ముకుంటూనే ఉన్నారు.
"అనారోగ్యంతోనో, ఆకలితోనో ఏదో ఒక దానితో చావక తప్పదు'' అని ఫర్హా అన్నారు.
( సౌమ్య రాయ్ ముంబయికి చెందిన జర్నలిస్ట్, రచయిత. ఇటీవలే, మౌంటెయిన్ టేల్స్: లవ్ అండ్ లాస్ ఇన్ ద మున్సిపాలిటి ఆఫ్ క్యాస్టవే బిలాంగింగ్ అనే పుస్తకం రచించారు)
ఇవి కూడా చదవండి:
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- బంగ్లాదేశ్: హిందూ ఆలయాలు, పూజా మండపాల మీద జరిగిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక, ఎందుకు?
- కేరళ వరదలు: 24కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








