సర్ డేవిడ్ ఆమెస్ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?

డచ్ ప్రధాని మార్క్ రట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డచ్ ప్రధాని మార్క్ రట్

బ్రిటన్ కన్సర్వేటివ్ పార్లమెంట్ సభ్యుడు సర్ డేవిడ్ ఆమెస్ మరణం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్న సందిగ్ధతను హై లైట్ చేస్తోంది.

ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా ఉంటూ మీ వ్యక్తిగత భద్రతను ఎలా పరిరక్షించుకోగలరు?

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్న విధానాన్ని చెప్పమని బీబీసీ వివిధ దేశాల్లో ఉన్న తమ ప్రతినిధులను అడిగింది.

జైర్ బోల్సోనారో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జైర్ బోల్సోనారో

బ్రెజిల్

కేటీ వాట్‌సన్, బీబీసీ సౌత్ అమెరికా ప్రతినిధి

బ్రెజిల్ లాంటి విస్తారమైన దేశంలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉంటాయి .

అమెజాన్ లాంటి మారుమూల ప్రాంతాల్లో సాధారణ రాజకీయ నాయకునికి చాలా తక్కువ భద్రత లభిస్తుంది. ఒక్కొక్కసారి భద్రత పూర్తిగా లభించదు కూడా.

అలా అని, వారి భద్రత విషయంలో ఆందోళన లేదని కాదు. శక్తివంతమైన ఆర్ధిక ప్లేయర్లు ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నాల నడుమ రాజకీయ నాయకులు బెదిరింపులను ఎదుర్కోవడం అసాధారణ విషయమేమీ కాదు.

కానీ, ర్యాలీలు, సామాజిక కార్యక్రమాలు జరిగే సమయంలో రాజకీయ నాయకులు అందరికీ పరిచితమయిన వ్యక్తులుగా సామజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా కీలకమైన విషయం.

పెద్ద పెద్ద నగరాలైన సావో పాలో, రియో డి జెనీరో లాంటి నగరాల్లో రాజకీయ నాయకుల చుట్టూ బాడీ గార్డులు, భారీ భద్రత ఉండటాన్ని గమనించవచ్చు. ఈ నగరాల్లో సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, అదే స్థాయిలో అక్కడ అసమానతలు కూడా నెలకొని ఉన్నాయి.

సంపన్న రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

బ్రెజిల్ రాజకీయంగా తీవ్రంగా విడిపోయిన దేశం. ఈ విషయం జైర్ బోల్సోనారో నాయకత్వం వహిస్తున్న సమయంలో స్పష్టమయింది.

ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనను గాయపరిచారు. ఈ నెపాన్ని చూపించి తుపాకీ వాడకానికి సంబంధించిన చట్టాలను మరింత సరళతరం చేసుకున్నారు.

ఇక్కడ చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇటీవల నేను బ్రసీలియా వెళ్ళినప్పుడు అధ్యక్ష భవనానికి వెళ్లాను. అక్కడున్న భద్రతా సిబ్బంది చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని అనిపించింది.

అదే డౌనింగ్ స్ట్రీట్ అయితే, భద్రతా తనిఖీలను మించిన తనిఖీలు కొన్నైనా లేకుండా నేనింత సాధారణంగా నడిచేందుకు వీలుండేది కాదు.

మార్క్ రట్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మార్క్ రట్

నెదర్లాండ్స్

అనా హోలిగాన్, బీబీసీ ప్రతినిధి

నెదర్లాండ్స్ ప్రధాని పార్లమెంటుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన ఫోటోలు సురక్షితమైన, శాంతియుత, సహనంతో కూడిన దేశానికి ప్రతీకగా నిలుస్తాయి.

కానీ, విరివిగా ప్రశంసలందుకున్న ఈ స్వేచ్ఛకు ఇటీవల కాలంలో ఆంక్షలు ఎదురయ్యాయి.

మార్క్ రట్‌పై హత్యాయత్నం చేశారనే అనుమానంతో 22 ఏళ్ల వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు.

గత వారంలో, ఫేస్‌బుక్‌లో ఇద్దరు రాజకీయ నాయకులను చంపేస్తామని బెదిరింపులు చేశారనే ఆరోపణలపై మరొక డచ్ వ్యక్తి కోర్టులో హాజరయ్యారు.

రెండు దశాబ్దాల క్రితం, పార్టీ నాయకుడు పిమ్ ఫార్ట్యూన్ లెఫ్ట్ వర్గానికి చెందిన జంతుహక్కుల కార్యకర్త చేతిలో హత్యకు గురయ్యారు.

డచ్ చట్టసభ సభ్యులు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలను కలవరు. అలాగే, వారు తరచుగా బహిరంగ సమావేశాలకు హాజరవ్వరు.

పార్లమెంటు సభ్యులు ప్రజలను చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కలుస్తారు.

ఇస్లాం వ్యతిరేక నాయకుడు జీర్ట్ వైల్డర్స్ లాంటి కొంత మంది రాజకీయ నాయకులకు మాత్రమే ప్రత్యేకమైన భద్రత ఉంటుంది.

ముఖ్యంగా, చాలా మంది వారి పనులు వారు చేస్తున్నందుకు వారికి ముప్పు ఉండదని భావిస్తారు.

స్టీవ్ స్కాలైజ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్టీవ్ స్కాలైజ్

అమెరికా

తారా మెక్కెల్వీ, బీబీసీ వాషింగ్టన్ ప్రతినిధి

కోవిడ్ మహమ్మారి, గన్ హింసతో కూడుకున్న ముప్పు రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాల్లో తిరిగే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కొన్ని హింసాత్మక దాడుల్లో డెమొక్రటిక్, రిపబ్లిక్ నాయకులు కూడా లక్ష్యంగా మారారు.

2017లో లూసియానా రిపబ్లిక్ నాయకుడు స్టీవ్ స్కాలైజ్ బేస్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా, లెఫ్ట్ వింగ్ ఉద్యమకారుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు.

2011లో ఒక సూపర్ మార్కెట్ వెలుపల జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో అరిజోనా డెమొక్రాట్ నాయకురాలు గాబ్రియెల్ గిఫర్డ్స్ ఒక గన్ మ్యాన్ చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ముప్పును ఎదుర్కోవడం ఒక్కొక్కసారి ఆయా పార్టీల విధానాలను అనుసరించి ఉంటుంది. కొంత మంది డెమొక్రాట్ నాయకులు బహిరంగ స్థలాల్లో భారీ గుంపుల్లోకి వెళ్లడాన్ని మానడం లేదా భద్రతతో వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.

కొంత మంది కన్సర్వేటివ్ నాయకులు గుంపుల్లోకి దూసుకుని వెళుతూ ఉంటారు.

మొత్తానికి రిపబ్లిక్ నాయకులు గన్ హక్కులను సమర్థిస్తారు. డెమొక్రాట్లు మాత్రం గన్ చట్టాలు కఠినంగా ఉండాలని అంటారు.

రాజకీయ నేపధ్యం ఏదైనప్పటికీ రాజకీయ నాయకులందరూ ప్రజలతో కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

వారి సహచరులపై చోటు చేసుకున్న హింస పట్ల దేశంలోనూ, బయటా కూడా అందరూ భయబ్రాంతులయ్యారు.

భారతదేశం

వికాస్ పాండే, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికవ్వడంతో పాటూ అనేక ప్రయోజనాలు కూడా వెంట వస్తాయి. అందులో వారి భద్రతకు సంబంధించిన అంశం ఒకటి.

చాలా మంది పార్లమెంటు సభ్యులకు కనీసం ఒక భద్రతా అధికారి ఉంటారు. కానీ, అందరి చట్టసభ్యులకూ ఒకే విధమైన భద్రత ఉండదు. అది వారికున్న ముప్పు పై ఆధారపడి ఉంటుంది.

కొన్ని ప్రత్యేకమైన బెదిరింపులను ఎదుర్కొంటున్న చట్ట సభ్యుల భద్రతను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తరచుగా సమీక్ష చేస్తూ ఉంటుంది.

పార్లమెంటు సభ్యులు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా వారికి భద్రత కల్పిస్తారు.

అది తిరిగి వారికున్న ముప్పు, వ్యక్తులకున్న పలుకుబడిపై ఆధారపడి ఉంటుంది.

చాలా మంది చట్టసభ్యులు తమ రాజకీయ పరివారం చుట్టూ ఉండగా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అందులో వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు, మద్దతుదారులు కూడా ఉంటారు.

కొంత మంది పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు అత్యధిక భద్రత ఉండటాన్ని హోదాకు సంబంధించిన అంశంగా చూస్తారని ఒక మాజీ పోలీసు అధికారి నాతో చెప్పారు. అలా ఉండటం వల్ల నిజంగా భద్రత అవసరమయిన వారి నుంచి దృష్టి మరలే అవకాశం కూడా ఉంది.

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై చిన్న పాటి దాడులు జరిగిన దాఖలాలున్నాయి. కానీ, అవి ఇంకు విసరడం, కొట్టడం వరకే పరిమితం అయ్యాయి.

2019లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆయనను చెంపదెబ్బ కొట్టారు.

కానీ, గతంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులు ప్రాణాలు కోల్పోయారు.

కెన్యా

ఆనీ సోయ్, బీబీసీ ప్రతినిధి

కెన్యాలో పార్లమెంటు సభ్యులకు ఆయుధాలతో ఉన్న ఒక పోలీసు అధికారి బాడీ గార్డుగా వ్యవహరిస్తారు.

కానీ, పార్లమెంటులో అత్యధిక మెజారిటీ ఉన్న నాయకులకు, లేదా అదనంగా బాధ్యతలు నిర్వహించే నాయకులకు అదనపు భద్రత లభిస్తుంది.

సీనియర్ రాజకీయ నాయకుల భద్రత నిమిత్తం పోలీసు అధికారులను అత్యధిక సంఖ్యలో నియమిస్తారు.

కెన్యా ఉపాధ్యక్షుడు భద్రత, ఆస్తుల సంరక్షణ కోసం 257 మంది భద్రతా అధికారులను నియమించినట్లు ప్రభుత్వం సెప్టెంబరులో తెలిపింది. ఈ విషయం వెల్లడి అయినా తర్వాత వెల్లువెత్తిన నిరసనలతో, కొంత మంది అత్యున్నత అధికారులను అకస్మాత్తుగా ఆయన భద్రతా సిబ్బంది నుంచి తొలగించారు.

సాధారణంగా కెన్యాలో రాజకీయ నాయకులు ప్రజలను కలుస్తూ ఉంటారు. తమ సమావేశాలకు హాజరయిన భారీ సందోహాలను ప్రదర్శించాలని అనుకుంటారు. ఆ ర్యాలీలకు హాజరయ్యేందుకు ప్రజలను సమీకరించేందుకు చాలా ఖర్చు కూడా పెడతారు.

కానీ, చర్చిలు, అంత్యక్రియల్లో మాత్రం స్వేచ్ఛగా పాల్గొంటారు. వారాంతాల్లో తమను వార్తల్లో కవర్ చేయమని మీడియాకు ఆహ్వానాలు పంపుతూ ఉంటారు. వీటికి ప్రత్యేకమైన సందర్భాలేవీ ఉండవు.

కానీ, 2014లో ఒక రాజకీయ ర్యాలీలో ప్రతిపక్ష నాయకుడు రైలా ఒడింగాపై ఒక వృద్ధుడు వాకింగ్ స్టిక్‌తో దాడి చేశారు.

2008, 2015లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు పార్లమెంటు సభ్యులను కాల్చి చంపారు. కానీ, వారెవ్వరూ గుంపులో లేరు.

సాధారణంగా, రాజకీయ నాయకుల సహాయ సిబ్బంది, భద్రతా సిబ్బంది వారిని మద్దతుదారుల నుంచి కవచంలా రక్షిస్తూ ఉంటారు. కొన్నికొన్ని సార్లు రాళ్లు విసిరే గుంపుల నుంచి నాయకులను దూరంగా ఉంచాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో ఉద్రిక్తతలు తలెత్తుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)