వైఎస్ వివేకానందరెడ్డి హత్య: పీఏ క్రిష్ణా రెడ్డి సహా ముగ్గురి అరెస్టు

వివేకా
    • రచయిత, డీఎల్ నరసింహ
    • హోదా, బీబీసీ కోసం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ నెల 28 గురువారంనాడు ముగ్గుర్ని అరెస్టు చేశామని పోలీసులు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివేకానందరెడ్డి వద్ద పీఏగా ఉన్న ఎం.వి. క్రిష్ణా రెడ్డితోపాటు యెర్ర గంగిరెడ్డి, ప్రకాష్ అనే ముగ్గురిని సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలతో పోలీసులు అరెస్టు చేసి, పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.

పోలీసులు చెప్పిన ప్రకారం , నిందితులు ‘వైఎస్ వివేకా మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూమ్‌కు తరలించారు. బెడ్ రూంలోని రక్తపు ఆనవాళ్లను తుడిచేసి, సాక్ష్యాలను తారుమారు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టకముందే, వివేకా శవాన్ని అంబులెన్స్‌లో పులివెందుల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి మార్చారు.’

‘వైఎస్ వివేకానంద రెడ్డి, తన మరణ కారణాన్ని తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని ఆయన పీఏ క్రిష్ణా రెడ్డి దాచిపెట్టి, మరణ కారణం తెలిసి కూడా, తెలియదు అంటూ ఫిర్యాదు చేశాడు’ అని పోలీసులు చెబుతున్నారు.

ఈ కారణాలతో, సాక్ష్యాధారాలను తారుమారు చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.

కడప పోలీసుల పత్రికా ప్రకటన

ఫొటో సోర్స్, CUDAPA POLICE

‘దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి’ - సునీత

వైఎస్ వివేకా హత్య తర్వాత, ఆయన కుమార్తె సునీత, పులివెందులలో మార్చి 20న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా..

"జగనన్న సీఎం కావాలని మా నాన్న కష్టపడేవాడు. మా కుటుంబంలో గొడవలున్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏడువందల మంది సభ్యులున్న మా కుటుంబంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలేతప్ప, ఒకరితో ఒకరు పోట్లాడుకునేంత విభేదాలు లేవు. అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి కుటుంబంలోని అందరమూ అందరినీ ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే, దాని ప్రభావం పోలీసుల దర్యాప్తుపై పడుతుంది. ఓవైపు సిట్ విచారణ జరుగుతుండగానే పెద్దలు రకరకాల వ్యాఖ్యలు చేస్తే, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా 'సిట్' ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది..?" అని సునీత ప్రశ్నించారు.

సిట్, సీబీఐ.. పేరు ఏదైనా, విచారణ మాత్రం పారదర్శకంగా జరగాలని మొదట్లో సునీత చెప్పారు. ఆ తర్వాత దిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ సునీల్ అరోరాను కలిసి, ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయని స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ చేత, తన తండ్రి హత్య కేసు విచారణ చేయించాలని కోరారు.

రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేస్తున్న విచారణ సక్రమంగా లేదని ఆరోపించారు.

‘‘రేపోమాపో మా కుటుంబ సభ్యుల్లో ఎవరోఒకరిని దోషిగా చిత్రిస్తారించే అవకాశం ఉంది. మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారన్న భయం ఉంది. విచారణ ఏకపక్షంగా జరగడంలేదు కాబట్టే నాకు అనుమానం వచ్చింది’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత అన్నారు.

వివేకా హత్య కేసులో అసలేం జరుగుతోంది?

ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. మొదట.. వివేకా గుండెపోటుతో మరణించారని మార్చి15, శుక్రవారం ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి.

అనంతరం వివేకా పీఏ క్రిష్ణారెడ్డి ఫిర్యాదుతో ఇది అనుమానాస్పద మృతిగా, మధ్యాహ్నం పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత హత్యగా అనుమానిస్తూ కేసు నమెదు చేశామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

సాయంత్రానికి, తన డ్రైవరే తనను చచ్చేలా కొట్టాడని వివేకా రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖను పోలీసులు బయటపెట్టారు.

వివేకానందరెడ్డి.. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా బాబాయ్ కావటంతో ఈ హత్య.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది.

అటు అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైసీపీ అధినేతలిద్దరూ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రధాన అంశంగా మారింది.

మీడియా సమావేశంలో వైఎస్ వివేకానందరెడ్డి

ఫొటో సోర్స్, D.L.Narasimha

సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం?

తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యలో కుట్ర కోణం దాగుందని, రాజకీయంగా లబ్దిపొందేందుకే అధికారపార్టీ నేతలు ఆయన్ను హత్య చేశారని జగన్ ఆరోపిస్తున్నారు.

వైఎస్ కుటుంబాన్ని అంతమెుందించే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి మృతి, విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం, ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగాయంటున్నారు. ఈ మూడింటిలో సీఎం చంద్రబాబు హస్తం ఉందని జగన్ ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర పోలీసుల విచారణలో నిజాలు వెలికిరావని, సీబీఐతో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకుంటే, సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని జగన్ ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ఏమన్నారు...

తనకు హత్యా రాజకీయాలు తెలియవని, వివేకా హత్య ఇంటి దొంగల పనేనని, రాజకీయ ప్రయోజనం కోసమే జగన్ తనపై బురదజల్లుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. హత్య చేయించి, సాక్ష్యాలను తుడిచిపెట్టారని ఆరోపిస్తున్నారు.

సీబీఐతో విచారణ చేయిస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో కేసును తప్పుదోవ పట్టించి, తాను బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నాడన్నది చంద్రబాబు వాదన.

వైఎస్ వివేకానందరెడ్డి రాశాడంటున్న వివాదాస్పద లేఖ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వైఎస్ వివేకానందరెడ్డి రాశాడంటున్న వివాదాస్పద లేఖ

పోలీసుల అదుపులో వివేకానందరెడ్డి సన్నిహితులు

ఇదిలా ఉండగా.. సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వివేకా సన్నిహితులు గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డి, పీఏ క్రిష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరోవైపు కుటుంబ సభ్యులే సాక్ష్యాలను చెరిపివేశారన్న ఆరోపణల మేరకు, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు.. వివేకా కుమార్తె సునీత, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు వివేకా సోదరులు వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి ఇతర సమీప బంధువులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డిలని ప్రశ్నించారు.

''స్థిరాస్థి, ఆర్థిక వివాదాల కోణంలో విచారిస్తున్న ఓ బృందం గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డిపై ప్రత్యేక ద్రృష్టి సారించింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా సింహాద్రిపురం మండలంలోని దుద్దేకుంటకు చెందిన శేఖర్ రెడ్డితో పాటు అతని అనుచరులు నలుగురిని మేం అదుపులోకి తీసుకున్నాం. వీరికి, టీడీపీ నేతలకు ఉన్న సంబంధాలపై కూడా ఆరాతీస్తున్నాం. అన్ని కోణాల్లో లోతైన విచారణ జరుగుతుంది. త్వరలోనే వాస్తవాలు వెలుగు చూస్తాయి'' అని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బీబీసీతో అన్నారు.

ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

ఫొటో సోర్స్, D.L.Narasimha

'అందర్నీ అనుమానించాల్సిందే' - సునీత

ఈ నేపథ్యంలో తండ్రి మరణం తరువాత మెుదటిసారి మీడియా ముందుకు వచ్చిన సునీత, తన తండ్రి చావును రాజకీయాలకోసం వాడుకోవడం దుర్మార్గమని అన్నారు.

సిట్‌ దర్యాప్తుపై ప్రభావం పడేలా మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తోందని, దీన్ని ఆపాలని ఆమె కోరారు. సిట్‌ నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని అభ్యర్థించారు.

మీరు రాకముందు మీ కుటుంబ సభ్యులే సాక్ష్యాధారాలను తుడిచేశారన్న ఆరోపణలు వస్తున్నాయికదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..

"ఈ సంఘటన జరిగినప్పుడు దురదృష్టవశాత్తు మేము ఇక్కడలేము. ఆరోజు ఉదయం ఘటనాస్థలంలో మా బంధువులు, అత్మీయులు, పోలీసులు ఉన్నారు. కానీ అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ షాక్‌లో హత్య ఎలాజరిగిందన్న కచ్చితమైన నిర్ణయానికి ఎవరూ రాలేరు. వారు చేసింది తప్పా, ఒప్పా లేక పథకం ప్రకారం చేశారా అన్నది విచారణలో బయటపడుతుంది. ఈ సంఘటనలో ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్కరిని అనుమానించే దర్యాప్తు చేయాల్సిన అవసరముంది" అని సునీత అన్నారు.

సీబీఐతో విచారణ జరిపించాలని జగన్‌ అంటున్నారు కదా మీరు కూడా సీబీఐ విచారణను కోరుకుంటున్నారా? అన్న మరో ప్రశ్నకు సమాధానమిస్తూ..

''ఈ ఘటనపై విచారణ పారదర్శకంగా జరగడం ముఖ్యం. అది ఏ విచారణ సంస్థయినా, దానిపేరు ఏదైనా సరే.. ఎవరి ఒత్తిడి లేని పారదర్శక, నిష్పక్షపాత విచారణ మాకు కావాలి" అని అన్నారు సునీత.

సతీష్ రెడ్డి

ఫొటో సోర్స్, D.L.Narasimha

నా ప్రమేయం ఉంటే, పులివెందులలో ఉరి తీయండి

సునీత పరిస్థితిని తాము ఆర్థం చేసుకోగలమని, చనిపోయిన వారి గురించి తప్పుగా ప్రచారం చేయటం తగదని పులివెందుల టీడీపీ అభ్యర్ధి సతీష్ రెడ్డి అన్నారు.

''వివేకానందరెడ్డి చనిపోయిన రోజు నుండి తామెవరమూ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది.. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు'' అని సతీష్ అన్నారు.

వివేకా హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 11 గంటలకే.. వివేకా హత్యకు తాను, ఆదినారాయణరెడ్డి, చంద్రబాబునాయుడు, లోకేష్ కారణమని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం రాజకీయం చేయడంకాదా అని సతీష్ మండిపడ్డారు. వివేకా హత్యలో తన ప్రమేయముందని తేలితే పులివెందుల పట్టణంలోనే తనను ఉరితీయాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)