సైక్లోన్ ఇదాయ్: ఆఫ్రికాలో పెను విపత్తు... వరద కోరల్లో వేలాది మంది విలవిల

సైక్లోన్ ఇదాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొజాంబిక్‌లో సహాయం కోసం నిరీక్షిస్తున్న తుపాను బాధితులు

ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో సైక్లోన్ ఇదాయ్ 'భారీ విపత్తు'ను సృష్టించిందని.. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేసిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

భారీస్థాయి వరదలు, విధ్వంసంతో మొజాంబిక్, జింబాబ్వే, మలావి దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పింది.

ఇది ''మహా మానవ విపత్తు'' అని మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ పేర్కొన్నారు. గత వారం తుపాను తాకిన తర్వాత దేశంలో 1,000 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

మొజాంబిక్‌లోని బేరియా రేవు నగరం వద్ద గత గురువారం సైక్లోన్ ఇదాయ్ తీరాన్ని తాకింది. గంటకు 177 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

సైక్లోన్ ఇదాయ్ ప్రభావిత ప్రాంతాలు
ఫొటో క్యాప్షన్, సైక్లోన్ ఇదాయ్ ప్రభావిత ప్రాంతాలు

''దక్షిణార్థ గోళాన్ని తాకిన అతి భీకర వాతావరణ సంబంధిత విపత్తుల్లో ఇది ఒకటిగా మారుతోంది'' అని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ప్రతినిధి క్లారీ నలిస్ బీబీసీతో పేర్కొన్నారు.

''సాధ్యమైనంత సాయం మొత్తం అవసరం'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీయర్ చెప్పారు.

దేశంలో 84 మంది చనిపోయారని, బేరియా నుంచి లక్ష మందిని తక్షణం రక్షించాల్సిన అవసరముందని మొజాంబిక్‌ ప్రభుత్వం వెల్లడించింది.

మొజాంబిక్‌లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మొజాంబిక్‌లో ఇదాయ్ తుపాను, వరదల వల్ల చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి

తుపాను తాకిన సఫోలా ప్రావిన్స్‌లో బూజీ నది వరదలతో పొంగిపోవటంతో 50 కిలోమీటర్ల ప్రాంతం నీట మునిగినట్లు ఏరియల్ సర్వేలో గుర్తించినట్లు 'సేవ్ ద చిల్డ్రన్' స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

చిక్కుకుపోయిన ప్రజలను తక్షణం కాపాడాల్సిన అవసరం ఉందని పొరుగున ఉన్న మానీసియా ప్రావిన్స్ గవర్నర్ మాన్యుయెల్ రోడిరిగెస్ తెలిపారు.

''ఇది చాలా విచారకరం. చాలా క్లిష్టమైన పరిస్థితి. గగనతలం నుంచి మేం వీక్షించినపుడు వేలాది మంది వరదలో చిక్కుబడిపోయి సహాయం కోసం అర్థిస్తుండటం కనిపించింది. వాళ్లు జింక్ షీట్లతో సిన తమ ఇళ్ల పైకప్పుల మీద, వరద నీటిలో చిక్కుబడి ఉన్నారు. వాళ్లు రెండు, మూడు రోజుల పైగా ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు లేకుండా అలమటిస్తున్నారు'' అని ఆయన విలేకరులకు చెప్పారు.

line
సైక్లోన్ ఇదాయ్

ఫొటో సోర్స్, Reuters

'అది యుద్ధం లాగా ఉంది'

బేరియా నగర నివాసి నెల్సన్ మోడా తన అనుభవాన్ని బీబీసీ ఓఎస్ రేడియోకు ఇలా వివరించారు:

''నా కొడుకు పుట్టినరోజు మార్చి 14వ తేదీన మేం అందరం ఇంట్లోనే ఉన్నాం. ఉదయాన్ని బలమైన తుపాను మొదలైంది. నగరం మొత్తం వణికిపోయింది. చెట్లు, ఇళ్లు ఊగిపోయాయి.

అది ఒక యుద్ధంలా ఉంది. చాలా భయానకంగా ఉంది. పిల్లలు ఏడుస్తున్నారు. మేం బాత్‌రూంలో దాక్కున్నాం. కొంత మంది జనం నా కళ్లముందే చనిపోయారు. మా ఇల్లు కళ్ల ముందే ధ్వంసమైపోయింది.

ఇప్పుడు చాలా మంది పిల్లలకు తల్లీ, తండ్రీ లేకుండా పోయారు. వారికి ఇల్లు కూడా లేదు. నేను పుట్టిపెరిగిన నగరం నేను చూస్తండగానే ధ్వంసమైపోయింది.

బేరియాలో కనీస సేవలు లేవు. జనానికి తినటానికి ఏమీ లేదు. నిద్రపోవటానికి చోటు లేదు.

ఆ రాత్రి నుంచీ నాకు నిద్ర రావటం లేదు.

line
జింబాబ్వోలో చిక్కుకుపోయిన టింబర్ కార్మికులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జింబాబ్వేలో ఒక రోడ్డు కొట్టకుపోవటంతో వందలాది మంది టింబర్ కార్మికులు చిక్కుకుపోయారు

జింబాబ్వేలో 90 మంది చనిపోయారని, మరో 200 మందికి పైగా గల్లంతయ్యారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆహారం సరఫరా చేస్తోందని దేశాధ్యక్షుడు ఎమర్సన్ నాన్‌గాగ్వా చెప్పారు.

తుపాను తాకినపుడు తమ బంధువులు ఎలా చనిపోయారనే భయానక అనుభవాల గురించి చిమానిమని పట్టణ ప్రజలు చెప్తున్నారు.

కొందరి ఇళ్లు, కొందరి మృతదేహాలు కూడా నదుల్లో పొరుగు దేశం మొజాంబిక్‌కు కొట్టుకుపోయాయని.. సహాయ చర్యల్లో పాల్గొంటున్న వారు కొందరు తెలిపారు.

మొజాంబిక్‌లో తుపాను దారిలో కనీసం 17 లక్షల మంది ఉన్నారని.. మలావిలో 9,20,000 మంది ప్రభావితులయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

జింబాబ్వేలో కనీసం 20,000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 600 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని తెలిపింది.

నిరాశ్రయులకు బియ్యం, జొన్నలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

తుపాను వల్ల దెబ్బతిన్న రోడ్లు

ఫొటో సోర్స్, ADRIEN BARBIER

ఫొటో క్యాప్షన్, బేరియా, చిమోయియో మధ్య రోడ్డు దెబ్బతినటంతో సహాయం అందటానికి దారి లేకుండా పోయింది

సహాయ బృందాలకు అవరోధాలు

మొజాంబిక్‌లో ప్రభుత్వ గాలింపు, సహాయ చర్యలతో పాటు.. ఆహార సరఫరా కోసం పలు స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయని లీఫ్ వెబ్ పేర్కొంది.

సహాయ చర్యలకు తీవ్ర అవరోధంగా ఉన్న సమాచార వ్యవస్థను నెలకొల్పటానికి టెలికామ్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఒక బృందాన్ని బేరియాకు పంపించింది.

సహాయం కోసం బయలుదేరిన చాలా ట్రక్కులు.. రోడ్లు దెబ్బతినటంతో చిక్కుపడిపోయాయి. తమ గమ్యాలకు చేరలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైమానిక సహాయ చర్యలూ పరిమితంగానే సాగుతున్నాయి.

నీటి సరఫరా లేకపోవటం, నీటి శుద్ధి స్తంభించటం వల్ల.. నీటి కాలుష్యం కారణంగా కలరా వంటి నీటి వల్ల వ్యాపించే రోగాలు విజృంభించే ప్రమాదం ఉందని రెడ్ క్రాస్ సంస్థ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)