లోక్‌పాల్: భారత తొలి లోక్‌పాల్‌‌గా జస్టిస్ పి.సి.ఘోష్ నియామకం

జస్టిస్ పి.సి.ఘోష్

ఫొటో సోర్స్, DDNEWS

ఫొటో క్యాప్షన్, జస్టిస్ పి.సి.ఘోష్ తొలి లోక్‌పాల్‌గా నియమితులయ్యారు

భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ (పి.సి.ఘోష్) నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి కార్యాలయం మార్చి 19న జారీ చేసింది.

లోక్‌పాల్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఘోష్‌తో పాటు... మరో ఎనిమిది మంది సభ్యులనూ నియమించారు.

అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగీలతో కూడిన లోక్‌పాల్ ఎంపిక కమిటీ.. జస్టిస్ ఘోష్ పేరును సిఫారసు చేసింది.

ఈ కమిటీ సమావేశాలకు తనను 'ప్రత్యేక ఆహ్వానితుడు' హోదాలో ఆహ్వానించటానికి నిరసనగా తాను హాజరుకాలేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

లోక్‌పాల్ మొత్తం సభ్యులు వీరే...

చైర్‌పర్సన్:

  • జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్

న్యాయ రంగ సభ్యులు:

  • జస్టిస్ దిలీప్ బి.భోసలే
  • జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి
  • జస్టిస్ అభిలాష కుమారి
  • జస్టిస్ అజయ్‌కుమార్ త్రిపాఠి

ఇతర రంగాల సభ్యులు

  • దినేశ్ కుమార్ జైన్
  • అర్చనా రామసుందరం
  • మహేందర్‌సింగ్
  • ఇందర్‌జిత్ ప్రసాద్ గౌతమ్
అన్నా హజారే

ఫొటో సోర్స్, PTI

చట్టం ఆమోదించిన ఆరేళ్ల తర్వాత...

నిజానికి దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉధృతమవటంతో 2013లోనే లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించింది.

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా లోక్‌పాల్ చట్టం కోసం నిరాహార దీక్షతో ఉద్యమించారు. నిర్దిష్ట స్థాయి ప్రజా సేవకులపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల నియామకానికి సంబంధించిన లోక్‌పాల్ బిల్లు 2013లో పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందింది.

2014 జనవరి 16న లోక్‌పాల్ చట్టం నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ, అప్పటి నుంచీ లోక్‌పాల్ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు.

లోక్‌పాల్‌ను నియమించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత కూడా లోక్‌పాల్ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉండాలని.. కానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరూ లేనందున ఈ కమిటీ లోక్‌పాల్‌ను ఎంపిక చేయటం సాధ్యం కాదని ప్రభుత్వం వాదించింది.

ప్రభుత్వం తరఫున అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహతగీ ఈ వాదనలు వినిపించారు. కానీ, ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత లేకపోవటం వల్ల లోక్‌పాల్ నియామకం చట్టబద్ధం కాకుండా పోదని సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించింది.

అనంతరం లోక్‌పాల్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది.

ఫిబ్రవరి చివరికల్లా లోక్‌పాల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోక్‌పాల్ ఎంపిక కమిటీ సమావేశమై ఈ నియామకం చేపట్టింది.

మోదీ, ఖర్గే

ఫొటో సోర్స్, AFP

లోక్‌పాల్ ఎంపిక కమిటీ సభ్యులు...

లోక్‌పాల్ ఎంపిక కమిటీకి ప్రధానమంత్రి సారథ్యం వహిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఈ నలుగురూ కలిసి ఒక న్యాయకోవిదుడిని అయిదో సభ్యుడిగా నియమించాలి.

అయితే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరూ లేరన్న కారణం చెబుతూ... ప్రధాని, సీజేఐ, స్పీకర్‌లు ముగ్గురు.. అయిదో సభ్యుడిగా మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగిని నియమించారు.

లోక్‌సభలోని విపక్షాల్లో పెద్ద పార్టీ కాంగ్రెస్‌ సభా పక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేను 'ప్రత్యేక ఆహ్వానితుడి'గా ఎంపిక కమిటీ సమావేశానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. కానీ, అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో కాకుండా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవటాన్ని తిరస్కరిస్తూ ఖర్గే ఈ సమావేశాలకు హాజరుకాలేదు.

చివరికి ప్రధానమంత్రి మోదీ, సీజేఐ రంజన్ గొగోయ్, స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగీలతో కూడిన కమిటీ.. జస్టిస్ పి.సి.ఘోష్‌ను లోక్‌పాల్‌గా నియమించాలని సిఫారసు చేసింది.

జస్టిస్ పి.సి.ఘోష్

ఫొటో సోర్స్, Supreme Court of India

లోక్‌పాల్ జస్టిస్ పి.సి.ఘోష్ ఎవరు?

జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ 1952లో జన్మించారు. ఆయన జస్టిస్ శంభు చంద్ర ఘోష్ కుమారుడు. కలకత్తాలో న్యాయవిద్య అభ్యసించారు. 1976లో కలకత్తాలోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1997లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు.

జస్టిస్ పి.సి.ఘోష్ 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 మే 27వ తేదీన ఆ పదవీ విరమణ చేశారు.

ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా ఉన్నారు.

జస్టిస్ ఘోష్ ముఖ్యమైన తీర్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగానూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానూ జస్టిస్ ఘోష్ ఎన్నో ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, నాటి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళల మీద ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తుది తీర్పు ఇచ్చిన ధర్మాసనానికి జస్టిస్ పి.సి.ఘోష్ నేతృత్వం వహించారు. ఆ కేసులో విచారణ కోర్టు తీర్పును పునరుద్ధరిస్తూ శశికళకు జైలుశిక్ష విధించారు. జయలలిత మరణించినందున ఆమెపై ఇక కేసు లేనట్లుగా పరిగణించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్‌సింగ్ తదితరుల మీద కుట్ర అభియోగాలను నమోదు చేయాలని విచారణ కోర్టును ఆదేశించిన ధర్మాసనానికి జస్టిస్ ఘోష్ సారథిగా ఉన్నారు. మరో జస్టిస్ ఆర్.ఎఫ్ నారీమణ్‌ ఆ ధర్మాసనంలో భాగస్వామి.

జంతువుల పట్ల క్రూరత్వ నిరోధ చట్టానికి జల్లికట్టు, ఎడ్ల పందేలు వ్యతిరేకమంటూ వాటిపై నిషేధం విధించిన ధర్మాసనంలో జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్‌తో పాటు జస్టిస్ ఘోష్ కూడా ఉన్నారు.

అలాగే, రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషుల శిక్షలను తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. అటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కొట్టివేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో కూడా జస్టిస్ ఘోష్ భాగస్వామిగా ఉన్నారు. నాటి సీజేఐ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో పాటు జస్టిస్ ఘోష్ ఇచ్చిన 3:2 మెజారిటీ తీర్పులో.. సీబీఐ దర్యాప్తు తర్వాత దోషులుగా తేలిన వారికి విధించిన శిక్షను తగ్గించే సుమోటో అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)