కేసీఆర్: ఫేస్‌బుక్ పోస్టు చూసి రైతుకు ఫోన్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Telangana cmo/facebook
ఆ రైతు పేరు కొండపల్లి శరత్. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామస్థుడు. అతనికి బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ఫోన్ వచ్చిందని.. ఆయస సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఆ కథనం ప్రకారం..
తనకు వారసత్వ ఆస్తిగా సంక్రమించిన భూమిని ఇతరులు పట్టా చేయించుకున్నారంటూ శరత్.. ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయడం, అది తన వరకూ చేరడంతో సీఎం స్పందించి నేరుగా ఫోన్ చేశారు.
శరత్‌తో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి.. జూన్‌లో ఆ శాఖ విషయంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో ఉద్యోగులంతా ఆందోళన, సమ్మెకు దిగే అవకాశం ఉంటుందని, అప్పుడు ప్రజలంతా ప్రభుత్వం వైపు ఉండాలని పిలుపునిచ్చారు.
శరత్ పోస్ట్ చేసిన వీడియోను చూసి కొంతమంది తనను తిట్టారని సీఎం అన్నారు. అయినా వాటిని పట్టించుకోబోమని చెప్పారు.
శరత్ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సమస్య పరిష్కారమయ్యాక కూడా మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాలని సూచించారు. వెంటనే.. సీఎం ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆగమేఘాలపై శరత్ ఇంటికి వెళ్లారు. వివాదానికి కారణమైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను, వీఆర్‌వోను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అతని సమ్య పరిష్కారానికి కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. శరత్ భూమిని అతని పేరిటే పట్టా అయ్యేట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సంభాషణను ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చు.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
ఏపీ నిఘావిభాగాధిపతి బదిలీ రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఆంధ్ర్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని ఈనాడు తెలిపింది.
ఈ కథనం ప్రకారం.. పోలీసుశాఖపరంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారిక హోదాలేవో వివరిస్తూ ఓ ఉత్తర్వును జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ జాబితాలో నిఘా విభాగాధిపతి పోస్టు ప్రస్తావన లేనందున ఆయన బదిలీని రద్దు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, అడ్డాల వెంకటరత్నంలను బదిలీ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఎలాంటి ఎన్నికల విధులు బాధ్యతలు అప్పగించరాదని సూచించారు.
అయితే ఎన్నికల విధులతో ఏయే హోదాలు కలిగిన పోలీసు అధికారులకు సంబంధం ఉందో వివరిస్తూ అనిల్ చంద్ర పునేఠ బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో నిఘా విభాగాధిపతి పోస్టు ప్రస్తావన లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28-ఏ ప్రకారం డీజీపీ, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ, అన్ని రీజియన్ల ఐజీలు, రేంజి డీఐజీలు, నగర పోలీసు కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, ఎన్నికల నిర్వహణ విధులతో సంబంధం ఉన్న డీసీపీలు, సబ్‌డివిజినల్ పోలీసు అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐ.లు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ మీద తెలుగు ఎన్‌ఆర్‌ఐల నామినేషన్ల అస్త్రం
నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో రైతుల తరహాలోనే.. నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లోరోసిస్ బాధిత ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నామినేషన్లు వేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలు సన్నద్ధమవుతున్నారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కోదాడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్, ప్రకాశం జిల్లాకు చెందిన వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ వడ్డె శ్రీనివాస్ మరో ఇద్దరు ఫ్లోరోసిస్ బాధితులతో కలసి ఏప్రిల్ 22న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేయబోతున్నారు.
వారణాసి స్థానానికి (ఉత్తరప్రదేశ్ లోని ఈ లోక్‌సభ స్థానానికి ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు) ఏప్రిల్ 22 నుంచి 28 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా, మే 19న ఎన్నికలు జరగనున్నాయి.
నల్లగొండ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉండగా, ప్రకాశం జిల్లాలో వేలాది మంది ఉన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధి గుర్తింపు, చికిత్స విధానం పై పరిశోధనల కోసం 2007-08లో నాటి యూపీఏ ప్రభుత్వం దేశంలో రెండు రీజినల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దక్షిణాది రాష్ట్రాల కోసం నల్లగొండ జిల్లాకు, ఉత్తరాది రాష్ట్రాల కోసం గుజరాత్‌కు ఈ కేంద్రాలను మంజూరు చేసింది. 2007లో ఈ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాకు మంజూరు కాగా, ఇప్పటి వరకు కాగితాలపైనే ఉండిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మంత్రిగా రాజన్?
‘‘దేశానికి నా సేవలు అవసరమైతే తప్పక తిరిగి వస్తా’’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి విజయం సాధిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి అవుతారన్న ఊహాగానాల మధ్య రాజన్ పైవిధంగా స్పందించారు.
మంగళవారం తన కొత్త పుస్తకం ‘ది థర్డ్ పిల్లర్’ ఆవిష్కరణ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో క్రీయాశీలక పాత్ర పోషించాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం నేనున్న చోట సంతోషంగా ఉన్నాను. అయినప్పటికీ నా సేవలు వినియోగించుకోవాలనుకున్నవారికి నేనెప్పుడూ అందుబాటులోనే ఉంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు.
2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు మూడేండ్లపాటు ఆర్బీఐ 23వ గవర్నర్‌గా పనిచేసిన రాజన్.. ఆ పదవిలో మరో మూడేండ్లు కొనసాగేందుకు నిరాకరించారు. తిరిగి తనకు ఇష్టమైన అధ్యాపక వృత్తిలోకే వెళ్లిపోయారు.
గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రిసెర్చ్ డైరెక్టర్, ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్.. ప్రస్తుతం అమెరికాలోని చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
టీఎంసీ, ఎస్‌పీ, బీఎస్‌పీ, టీడీపీ తదితర ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా కూర్చోబెట్టవచ్చన్న ఊహాగానాలపై అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. దేశానికి తన సేవలు అవసరమైతే తిరిగి వస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- పుల్వామా దాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు భారత ప్రజల అశ్రు నివాళి
- 2014 తర్వాత భారత్‌లో భారీ తీవ్రవాద దాడులు జరగలేదా
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- పుల్వామా దాడి: కశ్మీర్ ఎలా విడిపోయింది? వారికి ఏం కావాలి?
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








