పుల్వామా దాడికి అయిదేళ్లు : కశ్మీర్ ఎలా విడిపోయింది, వారికి ఏం కావాలి?

ఫొటో సోర్స్, Getty Images
అణ్వాయుధ దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య నిత్యం మండుతున్న అగ్నిగోళం కశ్మీర్. ప్రపంచంలోనే... నిత్యం సైనిక పహారా మధ్య, అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో కశ్మీర్ ఒకటి.
భారత్, పాక్ మధ్య వైరం ఈనాటిది కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది.
కానీ, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా భారత సైనికులపై జరిగిన దాడి అనంతరం కశ్మీర్‌లో భారత సైన్యం, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పులు.. తదితర పరిణామాలన్నీ భారత్-పాకిస్తాన్ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చూపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెండూ ‘అణ్వస్త్ర’ దేశాలే!
పుల్వామా దాడి పాకిస్తాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ పనేనని భారత్ ఆరోపించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ అన్నది.
భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధ దేశాలే కావడంతో, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రమాదకర పరిస్థితులకు దారి తీయగలదు.
ఇంతవరకూ రెండు దేశాల మధ్య 1947, 1965లలో రెండు సార్లు యుద్ధం జరిగింది. ఎన్నో సాయుధ దాడులు జరిగాయి. స్థానిక ప్రజలు లెక్కలేనన్ని దాడులను భరించారు. ఫలితంగా కశ్మీర్‌లో నిరుద్యోగం పెరిగి, రాజకీయ అస్థిరత నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ మహారాజు నిర్ణయం
భారత ఉపఖండం, హిందు, ముస్లిం మతాల ప్రాతిపదికగా ఇండియా, పాకిస్తాన్ దేశాలుగా విడిపోవడానికి ముందే కశ్మీర్ గురించి వేడివేడిగా చర్చలు జరిగాయి.
అప్పటి కశ్మీర్ మహారాజు.. కశ్మీర్‌ను భారత్ లేదా పాకిస్తాన్‌లో విలీనం చేసే విషయంలో తర్జనభర్జన పడ్డాడు. చివరికి భారత్ వైపే మొగ్గు చూపాడు.
మహారాజు నిర్ణయంతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కశ్మీర్ కోసం రెండేళ్లపాటు యుద్ధం జరిగింది.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత, కశ్మీర్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి పాకిస్తాన్ అంగీకరించలేదు. దీంతో కశ్మీర్ రెండుగా విడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్‌లు విభేదించుకుంటున్న సమయంలో 1950లో చైనా మెల్లమెల్లగా తూర్పు కశ్మీర్‌ను ఆక్రమిస్తూ వచ్చింది. ఆ ప్రాంతమే అక్సాయ్ చిన్.
1965లో ఇరు దేశాల మధ్య రెండోసారి యుద్ధం జరిగింది. 1980-90ల మధ్య భారత్‌లో ప్రభుత్వంపై అసంతృప్తి, సామూహిక నిరసనలు, తిరుగుబాట్లు జరిగాయి. ఫలితంగా భారత్‌లో పాకిస్తాన్ మద్దతుతో కొన్ని మిలిటెంట్ సంస్థలు పుట్టుకొచ్చాయి.
1999లో పాకిస్తాన్ సైన్యంతో భారత్ తీవ్రంగా తలపడింది. అప్పటికే రెండు దేశాలు.. తాము అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరినట్లు ప్రకటించుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, అక్కడి ఓటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని 1950లోనే ఐక్యరాజ్య సమితి చెప్పింది.
మొదట్లో ఐక్యరాజ్య సమితి సూచనకు మద్దతు తెలిపిన భారత్, తర్వాత... ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని, జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో... ప్రజలు భారత్ వైపే ఉన్నట్లు తెలిపింది.
కానీ, ఇందుకు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. కశ్మీర్‌లో చాలామంది ప్రజలు భారత్‌ను వ్యతిరేకిస్తున్నారని పాక్ చెబుతోంది. తమ భూభాగానికి స్వతంత్రం ప్రకటించాలని, లేని పక్షంలో తమను పాకిస్తాన్‌లో కలపాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని పాకిస్తాన్ చెబుతోంది.
జమ్మూ-కశ్మీర్ జనాభాలో 60%కుపైగా ముస్లింలు ఉన్నారు. భారతదేశంలో ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









