పుల్వామా దాడి: రెఫరెండాన్ని భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విక్టోరియా స్కోఫీల్డ్
- హోదా, బీబీసీ కోసం
1947లో అప్పటి జమ్మూకశ్మీర్ మహారాజు తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేయడానికి అంగీకరించినప్పుడు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఓ సలహా ఇచ్చారు... "కశ్మీర్ కోసం పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఏకాభిప్రాయం లేదు కాబట్టి, అది ఎవరికి చెందాలనేదానిపై ప్రజాభిప్రాయ సేకరణ, ఎన్నికలు నిర్వహించాలి" అని.
కానీ, ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే ప్రజాభిప్రాయ సేకరణ అనేది రానురాను చాలా క్లిష్టమైన అంశంగా మారింది.
1949లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో కశ్మీర్లోని మూడొంతుల్లో లద్ధాక్, జమ్ము, కశ్మీర్ లోయలతో కూడిన రెండొంతుల భూభాగం భారత్ నియంత్రణలోకి రాగా, ఒక వంతు అంటే ప్రస్తుతం ఆజాద్ కశ్మీర్ అని పాకిస్తాన్ పిలుచుకునే భాగంతో పాటు, ఉత్తర ప్రాంతం అంతా పాకిస్తాన్ అధీనంలోకి వెళ్లింది.
రాష్ట్రమంతా ఎవరి అధీనంలో ఉండాలో నిర్ణయించడానికి భారత్, పాకిస్థాన్ నాయకులు గతంలో అంగీకరించినట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి, యూఎన్ కమిషన్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్‌లు మూడు తీర్మానాల్లో పేర్కొన్నాయి.
కానీ దీనికి ముందుగా కశ్మీర్ కోసం పోరాడుతున్న పాకిస్తాన్ జాతీయులు, గిరిజనులు ఆ ప్రాంతం నుంచి వైదొలగాలనే షరతు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్లెబిసైట్ ఎందుకు జరగలేదు?
1950ల నుంచి, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలనే తన హామీకి భారత ప్రభుత్వం దూరం జరుగుతూ వచ్చింది.
దీనికి ప్రధాన కారణాల్లో మొదటిది... ఆ ప్రాంతం నుంచి పాకిస్తాన్ తమ బలగాలను ఉపసంహరించకపోవడం కాగా, రెండోది... కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అని చెబుతూ ఎన్నికలు జరగడం.
1980వ దశకం చివర్లో కశ్మీర్ లోయలో చొరబాట్లు పెరిగాయి. మిలిటెంట్లు, రాజకీయ నాయకులు తమ అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే హక్కును తామెప్పుడూ వినియోగించుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. దీంతో ప్లెబిసైట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అయితే, కశ్మీర్ భారత్‌కు చెందాలా, పాకిస్తాన్‌కు చెందాలో నిర్ణయించేందుకు ప్లెబిసైట్ నిర్వహించాలని కోరుకునే వారిలోనే విభేదాలు తలెత్తాయి. వీరిలోనే మరికొందరు మూడో ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు... అదే స్వతంత్ర కశ్మీర్.
ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని పాకిస్థాన్ ఎప్పటినుంచో కోరుకుంటోంది. ఈ విషయంలో భారత్ తన మాటకు కట్టుబడి లేదంటూ ఆరోపిస్తోంది.
కశ్మీరీల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తున్నామని చెబుతూనే ఉన్నా, పాకిస్తాన్ ఎప్పుడూ మూడో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించలేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కశ్మీర్‌ను ఐక్యంగా ఉంచాలంటూ ప్లెబిసైట్‌ను నిర్వహించినా అక్కడి సంస్కృతి, జాతులు, భాషాపరమైన వైవిధ్యాల కారణంగా దాని ఫలితాలు న్యాయబద్ధంగా ఉండవనేది సుస్పష్టం.

ఫొటో సోర్స్, Reuters
విభిన్న అభిప్రాయాలు
జమ్ము, కశ్మీర్ లోయలో నివసించే మెజారిటీ ముస్లిం వర్గ ప్రజల ఆకాంక్షలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో నివసించే మైనారిటీల వరకూ చేరలేదు.
లద్ధాక్‌లోని బౌద్ధులు కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వడాన్ని అంగీకరించరు, అలాగని దానికి స్వతంత్రతను ఇవ్వడానికీ ఒప్పుకోరు. మరోవైపు జమ్మూ ప్రాంతంలోని మెజారిటీ హిందూ ప్రజలు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటారు.
ఉత్తరాది ప్రాంతంలో నివసించేవారు అంటే "అజాద్ కశ్మీర్" ప్రజలు మాత్రం పాకిస్తాన్‌లో విలీనానికి మద్దతు పలికే అవకాశం ఉంది.
స్వాతంత్య్రాన్ని కోరుకునేవారు, పాకిస్తాన్‌వైపు మొగ్గు చూపేవారు, భారత్‌లోనే ఉండాలని కోరుకునేవారు... ఇలా విభిన్న వర్గాల కారణంగా కశ్మీర్ అంశం పరిష్కారం దొరకని సమస్యగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
స్థానికంగా నివసించేవారిలోనే ఏకాభిప్రాయం లేదు కాబట్టి, ఒకవేళ ప్రజాభిప్రాయం ద్వారానే ఈ అంశాన్ని పరిష్కరించాలని భావిస్తే, ప్రాంతాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం మేలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
కానీ, రాష్ట్రం మొత్తాన్నీ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరుకునేవారు దీన్ని అంగీకరించడం లేదు. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడం ఖాయమని వారి భావన. కానీ వారు, కశ్మీర్ ఐక్యంగా ఉంటూనే, మొత్తానికి స్వతంత్రత కావాలని కోరుకుంటున్నారు.
జమ్మూ, కశ్మీర్‌లో ప్లెబిసైట్ నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే ఆలోచనను సైతం భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ తిరస్కరిస్తూ వస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా కశ్మీర్‌లోని ఏ ప్రాంతం వారు ఏ నిర్ణయానికి మద్దతిస్తారనేది కచ్చితంగా చెప్పడం అసాధ్యం.
విక్టోరియా స్కోఫీల్డ్ - ‘కశ్మీర్ ఇన్ కాన్ల్ఫిక్ట్’ రచయిత.
ఇవి కూడా చదవండి.
- ‘పాకిస్తాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డాన్స్’ : తెలంగాణలో ముగ్గురి అరెస్ట్
- పుల్వామా అటాక్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఫొటోలు, వీడియోలు
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- పుల్వామా దాడి: ‘అదే జరిగితే యుద్ధం రావొచ్చు’ - అభిప్రాయం
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- మీ ఇంట్లో అత్యంత మురికైనది ఏమిటో మీకు తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








