పుల్వామా అటాక్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఫొటోలు, వీడియోలు - FactCheck

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
పుల్వామా దాడి అనంతరం గాయపడిన భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సిబ్బంది అంటూ చాలా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలు, వీడియోల్లో తీవ్రంగా గాయపడిన సైనికులు కనిపిస్తున్నారు.
పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ ప్రజల్ని ప్రోత్సహించేలా ఈ ఫొటోలతో పాటు మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ ఫొటోలకు సోషల్ మీడియాలో వేలాది కామెంట్లు వస్తున్నాయి. ‘పాకిస్తాన్‌పై ప్రభుత్వం దాడి చేయాలి’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
గురువారం పుల్వామా వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 46 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతికి తామే కారణమని పాకిస్తాన్‌కి చెందిన మిలిటెంట్ సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ప్రకటించుకుంది.
అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేస్తామని భారతదేశం ప్రకటించింది. అలాగే, అవసరమైన చర్యలు తీసుకోవాలని భద్రతా దళాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అయితే సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు మాత్రం పాకిస్తాన్‌పై భారతదేశం పూర్తిస్థాయి యుద్ధానికి దిగాలని కోరుతున్నాయి.
కానీ, పుల్వామా దాడికి సంబంధించినవి అంటూ షేర్ అవుతున్న ఈ ఫొటోలు, వీడియోలు పుల్వామా దాడివి కాదని మా పరిశీలనలో తేలింది. సిరియా, మావోయిస్టు దాడులకు చెందిన ఫొటోలు, వీడియోలను.. ఆఖరికి రష్యాకు చెందిన ఫొటోలను కూడా పుల్వామా దాడి చిత్రాలు అంటూ షేర్ చేస్తున్నారు.
పుల్వామాలో జరిగిన దాడి దశాబ్దాల కాలంలో కశ్మీర్‌లో సైనికులపై జరిగిన అత్యంత పాశవిక దాడి. భీకరమైన ఈ దాడి తీవ్రతకు ఒక బస్సు ఇనుప ముద్దలాగా మారిపోయింది. చాలామంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఫొటోలను ప్రచారం చేయొద్దని ప్రజలకు, మీడియాకు కొందరు అధికారులు సైతం విజ్ఞప్తి చేశారు.
అయితే, కొన్ని సోషల్ మీడియా గ్రూపులు మాత్రం ఈ దాడికి సంబంధం లేని ఫొటోలను షేర్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
రష్యా సైనికుడి ఫొటో...
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల్లో ఒకటి... శరీరం మొత్తం బ్యాండేజీలతో, చేతిలో రైఫిల్‌తో ఉన్న ఒక సైనికుడి ఫొటో ఒకటి. అతను ముందుకు వెళుతుంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఆ సైనికుడిని ఆసక్తిగా చూస్తుంటారు.
‘‘సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించిన వెంటనే, గాయపడిన ఈ సైనికుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవటం ఆపేసి, ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరాడు. ఇదీ సైన్యం సాహసం. జై హింద్. వందే మాతరం’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.
అయితే, ఈ ఫొటో రష్యాలోనిది. 2004లో ఒక పాఠశాలపై మిలిటెంట్లు దాడి చేసినప్పుడు వందలాది మంది మృతి చెందారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇదని యాండెక్స్ సెర్చ్ ఇంజిన్ చెబుతోంది.
సిరియా వీడియో...
చెక్ పాయింట్ వద్దకు వస్తున్న ఒక వాహనం పేలి, మంటల్లో కాలిపోతున్న ఒక వీడియో కూడా పుల్వామా దాడికి సంబంధించిన వీడియోగా ప్రచారంలో ఉంది.
ఈ వీడియోను ప్రచారం చేస్తున్న వారంతా.. ఇది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సేకరించిన పుల్వామా దాడి వీడియో అని చెబుతున్నారు.
అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం, మౌలిక సదుపాయాలను బట్టి చూస్తే ఇది కశ్మీర్ అనిపించటం లేదు. ఈ వీడియోను రివర్స్ సెర్చ్ ద్వారా పరిశీలిస్తే.. సిరియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన కారు బాంబు దాడికి సంబంధించిన వీడియో ఇదని తెలిసింది.
ఫిబ్రవరి 12వ తేదీన ఇజ్రాయెల్ న్యూస్ పేపర్ హారెట్జ్ ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది.

ఫొటో సోర్స్, UGC
2017 మావోయిస్టు దాడి
జాతీయ జెండా కప్పిన శవపేటికలు ఉన్న ఒక ఫొటో కూడా పుల్వామా దాడికి సంబంధించిన ఫొటోగా ప్రచారంలో ఉంది. శవపేటికల వద్ద పోలీసులు నివాళులర్పిస్తూ కనిపిస్తున్నారు.
చత్తీశ్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 2017లో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేసిన తర్వాత తీసిన ఫొటో ఇది.
ఇలా చాలా ఫొటోలను పుల్వామా దాడికి సంబంధించిన ఫొటోలు అంటూ ప్రచారం చేస్తున్నారు.
‘అవి నకిలీ ఫొటోలు.. నమ్మొద్దు’
పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికుల శరీర భాగాలుగా చెబుతూ కొన్ని నకిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయనీ, వాటిని ఎవరూ నమ్మవద్దని సీఆర్‌పీఎఫ్ ప్రజలకు సూచించింది. దేశంలో ద్వేషం పెంచేందుకు కొందరు దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనీ, ఆ ఫొటోలను ఎవరూ ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. 'దయచేసి అలాంటి పోస్ట్‌లు, ఫొటోలను షేర్, లైక్ చేయకండి. ఇతరులకు పంపకండి' అని సీఆర్‌పీఎఫ్ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా అలాంటి ఫొటోలు, పోస్ట్‌లు వస్తే [email protected] కి తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని కోరింది.
ఇవి కూడా చదవండి:
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- పుల్వామా దాడి: ‘అదే జరిగితే యుద్ధం రావొచ్చు’ - అభిప్రాయం
- మీ ఇంట్లో అత్యంత మురికైనది ఏమిటో మీకు తెలుసా...
- పెయిన్ కిల్లర్స్: తేడా వస్తే నొప్పినే కాదు మనిషినే చంపేయొచ్చు
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








