పుల్వామా దాడి: ‘పాకిస్తాన్‌పై చర్యలకు భారత్ ఎంతవరకూ వెళ్లొచ్చు’ - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అజయ్ శుక్లా
- హోదా, బీబీసీ కోసం
భారత పాలిత కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ దళంపై జరిగిన దాడి తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎదురుదాడి చేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు.
ఇది గత మూడు దశాబ్దాలలో భారత్‌పై జరిగిన అత్యంత దారుణమైన మిలిటెంట్ దాడి.
మిలిటెంట్ గ్రూపులు, దాని మద్దతుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ దాడి తర్వాత ప్రధాని మోదీ హెచ్చరించారు.
ఇటు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడికి పాకిస్తాన్ కారణమని దానికి గట్టి జవాబు ఇస్తామని హెచ్చరించారు. మీడియాలో కూడా అదే దూకుడు కనిపించింది. కొన్ని టీవీ ఛానళ్లయితే ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అన్నాయి.
ఆత్మాహుతి వాహనంతో జరిగిన దాడికి మేమే బాధ్యులమని పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సహా ఎన్నో దేశాలు ఈ సంస్థను టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించాయి.
దీని వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్‌ను భారత భద్రతా దళాలు 1990వ దశకంలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాయి. 1999లో దిల్లీ వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారు. ప్రయాణికుల బదులు భారత్ విడుదల చేసిన మిలిటెంట్లలో అజర్ కూడా ఉన్నారు.
భారత ప్రభుత్వం ఆ విమానం హైజాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఎప్పుడూ చెబుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
జైష్ కారణంగా ఒత్తిడి
చాలా ఏళ్ల నుంచి అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిపై భారత్ ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్ మిత్ర దేశంగా చైనా దీన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వస్తోంది.
అయితే పుల్వామా దాడిలో జైషే మహమ్మద్ ఉండడంతో ఈ దాడిలో నేరుగా పాకిస్తాన్ సంబంధం కూడా ఉందనవచ్చు. 2001లో భారత పార్లమెంటుపై దాడికి జైషే మహమ్మద్ కారణమని గుర్తించారు. ఈ దాడిలో 9 మంది సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందారు.
ఆ తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారాయంటే చాలా నెలలపాటు భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
2016లో పఠాన్‌కోట్, ఉరీలో భారతీయ సైనిక స్థావరాలపై దాడి జరిగింది. ఆ తర్వాత భారత సైన్యం వాస్తవాధీన రేఖ దగ్గర ఉన్న మిలెంట్ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
ఐఎస్ఐకి జేఈఎం తలనొప్పులు
ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంపై ఏదో ఒకటి చేయాలనే ఒత్తిడి ఉంది.
2016లో సర్జికల్ స్ట్రైక్స్ చాలా లిమిటెడ్‌గా జరిగింది. అది జరిగిన సమయం, టార్గెట్‌ను బట్టి, ఇవి జరిగాయని పాకిస్తాన్ కూడా అంగీకరించలేకపోయింది.
అయితే, భారీ ప్రాణనష్టానికి కారణమైన మిలిటెంట్ సంస్థపై, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తక్షణం ఎదురుదాడికి దిగడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని భారత సైన్యం చెబుతోంది.
కానీ అలా ఏ మాత్రం అడుగు వేసినా దానివల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. పరిస్థితి రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే వరకూ వెళ్తుంది.
రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు ఆ భయం మరింత పెరుగుతుంది. పాకిస్తాన్ వాటిని ఉపయోగిస్తామని చాలా సార్లు సంకేతాలు ఇచ్చింది.
నిజానికి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పుల్వామా దాడి తర్వాత విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. భారత్ ఆరోపణలను కొట్టిపారేసింది. ఎలాంటి విచారణ చేయకుండానే భారత ప్రభుత్వం, భారత మీడియా ఈ దాడికి పాకిస్తాన్‌కు సంబంధం ఉందని చెప్పడాన్ని తప్పుబట్టింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఇటీవల ఆత్మాహుతి దాడి చేసిన జైషే మహమ్మద్ దానికి తామే బాధ్యులమని ప్రకటించినా, దాని చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ఇది చూస్తున్న భారత ప్రజలకు వేరే ఎలాంటి సాక్ష్యాలూ అవసరం లేదు.
అయినా, పాకిస్తాన్ సైన్యం నియంత్రణలో ఉన్న నిఘా ఏజెన్సీ 'ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్'(ఐఎస్ఐ)కి కూడా జైషే మహమ్మద్ నుంచి సమస్య ఎదురవుతోంది.
నిజానికి, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి మిలిటెంట్ గ్రూపు కాదు. అది పాకిస్తాన్ సైన్యం సూచనలను పాటించడం లేదు.
జైష్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేయడానికి కూడా వెనకాడడం లేదు.
2003లో పాకిస్తాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌పై ఈ మిలిటెంట్ గ్రూప్ రెండు సార్లు చాలా ప్రమాదకరమైన దాడులు చేసింది.

ఫొటో సోర్స్, ForeignOfficePk @Twitter
అయినప్పటికీ, జైష్‌ను పట్టించుకోకుండా పాకిస్తాన్ సైన్యం తన కళ్లు మూసుకుని ఉంది. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాలంటే అలా ఉండడమే మంచిదని భావిస్తోంది.
అయితే ఇప్పుడు జైషే మహమ్మద్‌పై పాక్‌లో ఎలాంటి విచారణ జరుగుతుందో చూడాలి. దానికి భారత్ వైపు నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. చైనా నుంచి కూడా అది రావచ్చు. ఎందుకంటే చైనా ఇప్పుడు మసూద్ అజర్ కోసం మధ్యవర్తిత్వం చేసే స్థితి నుంచి చాలా ముందుకు వెళ్లిపోయింది.
అలాంటప్పుడు జైషే మహమ్మద్ మిలిటెంట్ గ్రూపును పాకిస్తాన్‌లో నిషేదించడం జరగవచ్చు.
భౌగోళిక రాజకీయాల నుంచి కాకుండా, ఈ ఆత్మాహుతి దాడిని స్థానికత కోణం నుంచి కూడా చూడాల్సుంటుంది. గత ఏడాది సమయంలో భారత భద్రతా దళాలు సుమారు 300 మంది కశ్మీర్ మిలిటెంట్లను కాల్చి చంపాయి. ఇందులో ఎక్కువ మంది ఇప్పుడు ఆత్మాహుతి దాడి జరిగిన దక్షిణ కశ్మీర్ వారే.

ఫొటో సోర్స్, Reuters
అందుకే, మిలిటెంట్ గ్రూపులకు తమ ఉనికిని చాటుకోడానికి చాలా పెద్ద దాడి చేయాల్సిన అవసరం కూడా వచ్చింది.
ఈ ప్రాంతంలో పట్టు ఉన్న మిలిటెంట్ గ్రూపుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఆత్మాహతి దాడులను ఇస్లాం వ్యతిరేకంగా భావిస్తుంది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలే ఆత్మాహుతి దాడులు చేస్తుంటాయి.
భారత సురక్షా వ్యూహం విషయానికి వస్తే, ఇది తీవ్రమైన నిఘా వైఫల్యం. జైషే మహమ్మద్ భారత సైన్యంపై ఇంత పెద్ద స్థాయిలో ఎలా దాడి చేయగలిగింది అనే ప్రశ్నను రాష్ట్ర పోలీసులు, నిఘా ఏజెన్సీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనం ఏర్పాటు చేసుకోవడం నుంచి, జవాన్ల రాకపై నిఘా పెట్టడం, దాడికి ముందు ప్రాక్టీస్ చేయడం, అంత భద్రత ఉన్నప్పుడు వాహనంతో ఢీకొట్టడం లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. ఆర్థిక చర్యల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. అలా చేయడం వల్ల పాకిస్తాన్‌కు వ్యాపార ప్రయోజనాలు లభించవు.
అంతేకాకుండా, పాకిస్తాన్‌ను రాజకీయంగా కూడా ఏకాకిని చేస్తామనే మాట చెప్పింది. కానీ అప్పటిలోగా జైషే మహమ్మద్‌పై పాకిస్తాన్ ఎలాంటి దర్యాప్తూ ప్రారంభించకపోతే, ఆలోపు ఇలాంటి మరో దాడి జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల వేళ జోరుగా ‘జంపింగ్స్’
- ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మిసైళ్ళే...
- జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి
- సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








