'మిలిటెంట్ల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కాంగ్రెస్' అనే ప్రచారంలో నిజమెంత? : Fact Check

కశ్మీర్‌లో హింస

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

తీవ్రవాదుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కోటి రూపాయల పరిహారం ఇస్తోందంటూ ఓ వార్తాపత్రికలో కథనం వచ్చిందంటూ మితవాద సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇది నిజమేనా?

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మిలిటెంట్ల దాడి తర్వాత ఈ వార్త మరింత వైరల్ అయ్యింది.

పత్రికా కథనం: తీవ్రవాదుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, పత్రికా కథనం: తీవ్రవాదుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కాంగ్రెస్

జైషే మొహమ్మద్ సంస్థ జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 46 మంది జవాన్లు మరణించారు. మరెంతోమంది గాయపడ్డారు.

ఈ దాడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పరిహారం ఇస్తోందని ఉన్న వార్త క్లిప్పింగ్ మరింత వైరల్ అయ్యింది. వేలాదిమంది దాన్ని చూశారు.

'Namo Fan', 'BJP Mission 2019' వంటి ఫేస్‌బుక్ గ్రూపుల్లో గత 48 గంటల్లో ఈ ఫొటో విపరీతంగా షేర్ అయ్యింది.

అయితే ఈ దాడికి, ఆ వార్తా కథనానికీ ఎలాంటి సంబంధం లేదని మా పరిశీలనలో తేలింది.

కాంగ్రెస్

తమ పార్టీ అధికారంలోకి వస్తే మిలిటెంట్ల కుటుంబాలకు నగదు పరిహారాన్ని ఇస్తామని 2018 డిసెంబరులో కాంగ్రెస్ నాయకుడు హాజీ సఘీర్ సయీద్ ఖాన్ ప్రకటించారు.

"తీవ్రవాదం ముసుగులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందిస్తాం. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. టెర్రరిస్టులుగా ముద్రపడి జైళ్లలో మగ్గుతున్న అమాయకులను విడుదల చేసి, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పుతాం" అని ఖాన్ తెలిపారు.

అయితే, ఇలాంటి ప్రకటన చేసినందుకు ఆయన పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.

ఈ ప్రకటనను కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఖండించిందని, దేశ సమగ్రతకు భంగం కలిగించే ఏ చర్యనూ మేం సమర్థించం అని కశ్మీర్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ బీబీసీకి తెలిపారు.

భారత్ చేస్తున్న తీవ్రవాదానికి వ్యతిరేక పోరాటానికి మేమెప్పుడూ బాసటగానే నిలుస్తాం అని ఆయనన్నారు.

వివాదాస్పద ప్రకటన చేసినందుకు ఖాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జమ్మూకశ్మీర్ ప్రదేశ్ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి విక్రమ్ మల్హోత్రా ధ్రువీకరించారు.

పార్టీ విధానాలపై బహిరంగంగా మాట్లాడేందుకు ఖాన్‌కు అధికారం లేదని, అలాంటి తెలివితక్కువ ప్రకటన చేసినందుకు ఆయనను పార్టీ సస్పెండ్ చేసిందని విక్రమ్ బీబీసీతో చెప్పారు.

తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కాంగ్రెస్ దాన్ని సహించదు అని ఆయనన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)