ఆంధ్రప్రదేశ్: ఎన్నికల వేళ జోరుగా ‘జంపింగ్స్’

జగన్ మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, jaganmohanreddy/fb

    • రచయిత, శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారు.

కొన్ని రోజుల కిందట చీరాల‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

టీడీపీ నేత, లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఆలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్‌ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన కూడా వైసీపీలో చేరారు.

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాటం రెడ్డి విష్ణువర్డన్ రెడ్డి, వంటేరు వేణు గోపాల్ రెడ్డిలు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

విజయవాడ వైసీపీ నేత వంగవీటీ రాధాకృష్ణ ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతున్నది ఇంకా ఆయన ప్రకటించలేదు.

కడప జిల్లా నుంచి టీడీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఈ సారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇటీవల పార్టీ వీడారు. సతీమణితో కలిసి ఆయన జనసేనలో చేరారు.

నిర్మాత‌, హీరో కృష్ణ సోద‌రుడు జి. ఆదిశేష‌గిరిరావు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఇటీవల ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబును కలిసిన ఆయన త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

వైసీపీలో చేరిన ప్రముఖులు

మాజీ మంత్రి సి.రామ‌చంద్రయ్య కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల వైసీపీలో చేరారు.

ఆయన తొలుత టీడీపీ, త‌ర్వాత పీఆర్పీ, చివరగా కాంగ్రెస్‌లో ప‌నిచేశారు. ఇటీవల టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపొట్టుకోడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు.

మ‌రో మాజీ మంత్రి ఎం. మ‌హిధ‌ర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీ గూటికి చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కందుకూరు నుంచి పోటీ చేయ‌బోతున్నారు.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. త‌ర్వాత బీజేపీలో చేరారు. ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ వైసీపీ గూటికి వచ్చారు.

ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీశ్, విజ‌య‌వాడ‌మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కాంగ్రెస్ వీడి వైసీపీలో చేరారు.

తన కుమారుడు హితేశ్‌తో కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ఎన్టీయార్ పెద్దల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వరరావు ప్రకటించారు. ప‌ర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా హితేశ్ పోటీ చేస్తారని చెప్పారు. ఆయ‌న భార్య‌, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు.

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు నుంచి పోటీ చేసుందుకు కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు.

నాదెండ్ల మనోహనర్

ఫొటో సోర్స్, Manohar/fb

జ‌న‌సేన‌లోకి వస్తున్న ప్రముఖులు

కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ జనసేనలో చేరి పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో తెనాలి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించారు.

టీడీపీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రావెల కిశోర్ బాబుకూడా ఇటీవల పార్టీని వీడి జనసేనలో చేరారు. ఈ మాజీ ఐఆర్ఎస్ అధికారి తొలిసారి బ‌రిలో దిగి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల పాటు మంత్రిగా చేశారు. కేబినెట్ విస్తరణలో పదవి కోల్పోయిన అనంతరం జనసేన గూటికి చేరారు.

మాజీ మంత్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ ప‌సుపులేటి బాల‌రాజు, తుని మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత రాజా అశోక్ బాబు కూడా ఇటీవల జ‌న‌సేన‌లో చేరారు

ఎన్టీఆర్ హ‌యంలో మంత్రిగా చేసిన ముత్తా గోపాల‌కృష్ణ‌ వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరారు. కాగా, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే రెడ్డి ఇటీవల అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు.

సినీ నటులు దివ్య‌వాణి, వాణీ విశ్వ‌నాథ్ ఇటీవల టీడీపీలో చేరి రాజకీయ రంగప్రవేశం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

‘అధికారం కోసం ఏమి చేసినా చెల్లుబాటయ్యే పరిస్థితి రాకూడదు’

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు పార్టీలు మారుతుండటంపై సీనియర్ జర్నలిస్టు పాశం జగన్నాథం నాయుడు స్పందిస్తూ..

‘‘రాజకీయాలు పూర్తిగా వ్యాపారం అయిపోయాయి. విలువలకు చోటు లేదు. ఎవరు ఎప్పుడు ఏపార్టీలో ఉంటారో తెలియడం లేదు. అవకాశవాదం హద్దులు దాటుతోంది. నేతలు పార్టీలు మారుతున్నారు. అందుకే అవకాశం ఇచ్చి, గెలిపించిన పార్టీ నుంచి గడువు ముగియకముందే మారిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ఇలాంటి తీరుని ప్రజలు హర్షిస్తారని భావించడం లేదు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా లో కూడా ఈ ధోరణి పెరుగుతున్న తీరుని అందరూ తప్పుబట్టాలి. అధికారం కోసం ఏమి చేసినా చెల్లుబాటయ్యే పరిస్థితి రాకూడదు’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)