తెలుగు మన్యంలో సంక్రాంతి... పప్పుల పండుగ

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
తెలుగువారికి సంక్రాంతి అంటే పెద్ద పండుగ. బంధుమిత్రులతో కలిసి ఆడంబరంగా జరుపుకునే పండుగ. కానీ, మన్యం వాసులకు మాత్రం సంక్రాంతి సందడి 'కొత్తల పండుగ'లో కనిపిస్తుంది. 'పప్పుల పండుగ' అని పిలుచుకునే సంప్రదాయ వేడుకతో గిరిజన గ్రామాలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి.
తూర్పు కనుమల మధ్య కొలువైన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల్లో పలు వింత ఆచారాలు కనిపిస్తుంటాయి. అందులో భాగంగానే సంక్రాంతిని కూడా వారు భిన్నంగా జరుపుకుంటారు. వ్యవసాయదారులు తమ చేతికి పంటలు వచ్చిన సమయంలో జరుపుకునే మకర సంక్రాంతి మాదిరిగానే మన్యం వాసులు తమ పంట చేతికందే సమయంలో 'పప్పుల పండుగ' జరుపుకుంటారు. 'పప్పుల పండుగ' సందర్భంగా ఏజన్సీ వాసుల ఇళ్లన్నీ సందడిగా మారతాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పోడు వ్యవసాయం జీవనాధారం. అలా పండించిన పంటల సాయంతోనే పొట్ట పోసుకుంటారు. ఈ వ్యవసాయం సక్రమంగా సాగేందుకు వనదేవతలను ఆరాధించడం వారి సంప్రదాయం. అందుకు తగ్గట్టుగా 'పప్పుల పండుగ'ను ఘనంగా నిర్వహిస్తుంటారు. సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. సంప్రదాయ నృత్యాలు, డోలు దరువులు, విందు వినోదాలతో కోలాహలం కనిపిస్తుంది.

ఈ సమయంలో కొత్త పప్పులు తినడానికి ససేమీరా అంటారు. తాము పండించిన కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు సహా అన్ని పంటలు తాము తినడానికి ముందుగా పితృదేవతలు, వనదేవతలకు నైవేధ్యంగా ఇస్తారు. దీనికి సంక్రాంతికి నెల రోజుల తర్వాత ముహూర్తం నిర్ణయించుకుంటారు. ఆ రోజు గిరిజన గ్రామాల్లో ఆనందం తాండవిస్తుంది. అన్ని అంశాలను పక్కన పెట్టి పూర్తిగా సంతోషభరితంగా సాగేందుకు ప్రయత్నిస్తుంటారు.

తాతముత్తాతల నుంచి వచ్చిన పప్పుల పండుగ జరుపుకోవడం తమకు ప్రత్యేకమైనదని రంపచోడవరం ఏజెన్సీలో దారగూడెం వాసి కెచ్చెల ధర్మారెడ్డి బీబీసీకి తెలిపారు. తమకు పప్పుల పండుగ అంటే మిగిలిన ప్రజల సంక్రాంతితో సమానం అన్నారు. బంధుమిత్రులతో కలసి రెండు రోజుల పాటు సరదాగా గడుపుతామన్నారు. కల్లుతాగుతూ, సంప్రదాయ డోలా దరువులకు తగ్గట్టుగా రేలా పాటలతో సాగడం తమకు సంతోషాన్నిస్తుందన్నారు.
ఏటా రెండు రోజుల పాటు తమ సంప్రదాయ పండుగల్లో డోలాలను వినియోగిస్తామని పల్లాల కృష్ణమ్మ తెలిపారు. దూర ప్రాంతాలలో ఉన్న బంధువులు సైతం ఈ పండుగకు ఇక్కడకు రావడంతో అందరిళ్లలో సంతోషం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు.

వనదేవతల అనుగ్రహం కోసం పూజలు చేసిన తర్వాత అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డితో అల్లిన కొరడాతో దెబ్బలు తినడం వీరి ఆనవాయితీ. పిల్లలు, పెద్దవాళ్లు అందరూ ఈ దెబ్బలు తినడం కోసం ఎగబడడం విశేషం.
వస్త్రధారణలో కొంత ఆధునికత కనిపిస్తున్నప్పటికీ సంప్రదాయాలను మాత్రం వీరు పక్కనపెట్టలేదు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









