పుల్వామా దాడి: ‘పాకిస్తాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డాన్స్’ : తెలంగాణలో ముగ్గురి అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
పుల్వామా మిలిటెంట్ దాడి తర్వాత సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా వీడియోలు, సందేశాలు పోస్ట్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో భారత దేశానికి వ్యతిరేకంగా ఒక వీడియో పోస్ట్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నిజామాబాద్ జిల్లాలో సోమవారం ముగ్గురిని అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఈ ముగ్గురిలో ఇద్దరు ఉత్తర ప్రదేశ్ వారు కాగా, ఒకరు తెలంగాణ వాసి.
వీడియోలో ఈ ముగ్గురూ భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ డాన్స్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన ఒక వ్యక్తి దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 153 ఎ(శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505(2)( బహిరంగ అల్లర్లు) కింద కేసులు నమోదు చేశారు.
దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేసినందుకు అరెస్టులు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పారామెడికల్ కోర్స్ చేస్తున్న కశ్మీరీ విద్యార్థినులు నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు పుల్వామా దాడికి సంబరాలు చేసుకుంటూ, ఆ ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేశారు.
దీంతో విద్యా సంస్థ వెంటనే వారిని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించింది. నలుగురు అమ్మాయిలపై పోలీసులు దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేశారు.
ఇటు కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జిలేఖా బీ కూడా ఫేస్‌బుక్‌లో 'పాకిస్తాన్ కీ జై' అని పోస్ట్ చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఆమెను కోర్టులో హాజరు పరచగా కోర్టు కస్టడీ విధించింది. కర్ణాటకలో ఇలాంటి ఘటనలో శనివారం పోలీసులు మరో యువకుణ్ని కూడా అరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్న కశ్మీరీ తహ్సీన్ గుల్ ఇన్‌స్టాగ్రాంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లో కూడా కైఫ్(18) అనే యువకుడు ఒక వాట్సాప్ గ్రూప్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' అని పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు.
మరోవైపు బయటి పరిస్థితులు సరిగా లేకపోవడంతో కశ్మీరీ విద్యార్థులు క్యాంపస్ దాటి బయటకు రాకూడదని యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం సూచించింది.
ఇవి కూడా చదవండి:
- పుల్వామాలో ఎన్కౌంటర్: ఇద్దరు మిలిటెంట్లు హతం.. నలుగురు సైనికులు మృతి
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








