పుల్వామా దాడి: ఈ స్థాయిలో పేలుడు పదార్థాలను పాక్ నుంచి భారత్‌లోకి తేవడం సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Reuters
ఫిబ్రవరి 14న జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై దాడి జరిగింది. అందులో 40 మందికి పైగా జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ప్రకటించింది.
ఈ దాడి తర్వాత భారత్ వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండాలి, ఈ దాడి వెనక ఉన్న మిగతా కారణాలు ఏంటి అనే చర్చ మొదలైంది.
ఇలా రకరకాల ప్రశ్నల మధ్య రక్షణ నిపుణులు, కశ్మీర్‌లో పనిచేసిన సైనికాధికారులు కూడా దీనిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దానితోపాటు భారత్ ఈ అంశంలో ఎలా వ్యవహరించాలో కూడా చెప్పారు.
ఎ.ఎస్.దులత్: 1965 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎ.ఎస్.దులత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్(రా) చీఫ్‌గా ఉన్నారు. ఆదివారం పుల్వామా దాడి గురించి మాట్లాడిన ఆయన భారత్ ఈ దాడికి ప్రతి దాడులు చేయడానికి బదులు దౌత్యాన్ని చూపించాలన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన దులత్ "దౌత్య మార్గాన్ని అనుసరించడం చాలా అవసరం. అమెరికా మనకు ముందే మద్దతు ఇచ్చింది. దౌత్య దిశలో సమాధానం ఇవ్వడం ఒక మెరుగైన ఉపాయం. 1999లో కార్గిల్ యుద్ధం, 2001లో జరిగిన పార్లమెంటు దాడి తర్వాత కూడా మేం అలాగే చేశాం. దౌత్యంలో దూకుడు చూపించి పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇవ్వాల్సి ఉంటుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దులత్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్నారు. దేశంలో కశ్మీర్ గురించి తెలిసిన నిపుణుల్లో ఆయన ఒకరు. ఆయన ఇటీవల కశ్మీర్‌పై 'ద స్పై క్రానికల్: రా, ఐఎస్ఐ అండ్ ద ఇల్యూజన్ ఆఫ్ పీస్' అనే పుస్తకం రాశారు. ఇందులో వాజ్‌పేయి పదవీకాలంలో కశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చెప్పారు.
ఈ దాడిపై దులత్ "నేను ఎప్పుడూ రెండు దేశాల మధ్య చర్చలకు అనుకూలమే. కానీ పుల్వామా దాడి తర్వాత నేను చర్చల గురించి మాట్లాడితే నన్ను 'దేశద్రోహి' అంటారు" అన్నారు.
చర్యల కోసం భారత ప్రభుత్వం సైన్యానికి స్వేచ్ఛను ఇవ్వడం గురించి ఆయన "ఏది సరైనదని అనిపిస్తే అలా చేయడానికి ఆర్మీకి స్వేచ్ఛ ఉంది. కానీ అంత మాత్రాన ఎవరి ఇంట్లోనో చొరబడి హత్యలు చేయమని కాదు. మీపై దాడి చేస్తే, బదులుగా మీరు చర్యలకు దిగవచ్చు" అని మాత్రమే దానికి అర్థం.
వేర్పాటువాద నేతలకు కల్పించిన రక్షణ వెనక్కు తీసుకోవాలనే నిర్ణయంపై "ఇక్కడ నిజం ఏంటంటే కొంతమంది వేర్పాటు వాద నేతల ప్రాణాలకు ప్రమాదం ఉంది. కొందరు నేతలను హత్యకూడా చేశారు. అందుకే వారికి రక్షణ కల్పించారు. వారికి రక్షణ తొలగిస్తే వారిపై మళ్లీ దాడులు జరగచ్చు" అన్నారు
"జైష్ గత కొన్నేళ్లుగా శాంతంగానే ఉంది. కానీ గత రెండేళ్లుగా ఈ సంస్థ తిరిగి యాక్టివ్ అయ్యింది" అన్నారు దులత్.

ఫొటో సోర్స్, Getty Images
పుల్వామా దాడి గురించి న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడిన లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్.హుడా "ఇంత భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను సరిహద్దులు దాటించడం సాధ్యం కాదు" అన్నారు.
ఈశాన్య కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా 2016లో పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు వాటికి నేతృత్వం వహించారు.
"దాడికి ఉపయోగించిన ఈ పేలుడు పదార్థాలను దొంగచాటుగా తీసుకొచ్చుంటే, పొరుగు దేశంలో మన సంబంధాల గురించి మనం మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది" అన్నారు
పుల్వామా దాడి వెనక ఉన్న కారణాల గురించి మాట్లాడిన మాజీ రా చీఫ్ విక్రమ్ సూద్ "భద్రత విషయంలో చాలా పెద్ద పొరపాటు వల్ల ఈ దాడి జరిగింది" అన్నారు.
వార్తా సంస్థ ఎఎన్ఐతో మాట్లాడిన ఆయన "భద్రతలో పొరపాటు లేకుండా ఇలాంటి దాడి జరగదు. ఆ పొరపాటు ఎలా జరిగిందో నాకు తెలీదు. కానీ భద్రతలో గందరగోళం లేకుండా ఇలాంటి దాడులు జరగవు" అన్నారు.

ఫొటో సోర్స్, AFP
హైదరాబాద్‌లో ఒక సెమినార్ సందర్భంగా మాట్లాడిన సూద్ "ఈ దాడిలో ఒకరు కంటే ఎక్కువ మంది ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక వాహనం ఏర్పాటు చేసుకున్నారు. వారికి సీఆర్పీఎఫ్ వాహనాలు రావడం గురించి పూర్తి వివరాలు కూడా తెలుసు. మొత్తం ఒక గ్రూప్ ఈ దాడికి ప్లాన్ చేసింది" అన్నారు.
ఈ దాడికి భారత్ ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే ప్రశ్నకు ఆయన "దెబ్బకు దెబ్బ కొట్టడానికి ఇదేదో బాక్సింగ్ మ్యాచ్ కాదు. ఈ పరిస్థితుల్లో అది పని చేయదు" అన్నారు.
"చైనా పాకిస్తాన్‌కు రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఐక్యరాజ్యసమితిలో మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించకుండా అడ్డుకుంటోంది" అన్నారు..
పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ వెనక్కు తీసుకుంది. దానితోపాటు పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకులపై విధించే కస్టమ్స్ డ్యూటీని 200 శాతం వరకూ పెంచింది.
ఇవి కూడా చదవండి:
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- ఆ ప్రశ్నలు అమ్మాయిలకే ఎందుకు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- సెక్స్‌కు గుండెపోటుకు సంబంధముందా?
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








