న్యూజీలాండ్ కాల్పులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లో చర్చిని తగులబెట్టారనే ప్రచారం నిజమేనా? - BBC Fact Check

ఈజిప్ట్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీం
    • హోదా, బీబీసీ న్యూస్

వాదన: న్యూజీలాండ్ కాల్పులకు ప్రతీకారంగా, ముస్లింలు పాకిస్తాన్‌లో ఓ చర్చికి నిప్పు పెట్టారని ఓ వీడియో వైరల్ అయింది. కానీ, ఆ వీడియో అబద్ధం అని మా అధ్యయనంలో తేలింది.

చర్చిని ధ్వంసం చేశారంటూ ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన శ్వేతజాతీయుడు న్యూజీలాండ్‌లోని రెండు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నవారిపై కాల్పులు జరిపాడు. ఈ దాడుల్లో 50మంది మరణించారు. ఈ దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేశాడు.

న్యూజీలాండ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లో చర్చిని తగలబెట్టారన్న వీడియోలో, కొందరు వ్యక్తులు.. బిల్డింగ్ ప్రధాన ద్వారాన్ని ఎక్కుతూ కనిపిస్తారు. వీడియో చివర్లో శిలువను విరగ్గొట్టిన దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఈజిప్ట్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

వీడియోలో ప్రజలు అరుస్తుండటం, చర్చి చుట్టుపక్కల పొగ కమ్ముకోవడాన్ని కూడా గమనించవచ్చు.

ఈ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్‌లో షేర్ చేశారు. బీబీసీ వాట్సప్ పాఠకులు దీన్ని నిర్ధరించుకోవడం కోసం ఈ వీడియోను మాకు పంపారు.

"@TheaDickinson'' అనే ట్విటర్ వినియోగదారు.. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఈ విషయంలో బీబీసీ ఎందుకు స్పందించడంలేదు అని ప్రశ్నించారు.

ఈజిప్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఇది పాకిస్తాన్ వీడియో కాదు!

న్యూజీలాండ్‌లోని అల్ నూర్, లిన్ఉడ్ మసీదుల్లో జరిగిన కాల్పుల్లో దాదాపు 50మంది మరణించగా, మరో 50మందికి పైగా గాయపడ్డారు.

ఈ దాడిని 'టెర్రరిస్ట్ దాడి'గా న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ పేర్కొన్నారు. దేశానికి 'ఇది ఓ చీకటి రోజు' అన్నారు.

న్యూజీలాండ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సాక్ష్యంగా కొందరు.. ఈ 30సెకెన్ల ఈ వీడియోను షేర్ చేశారు.

కానీ, 'రివర్స్ ఇమేజ్ సెర్చ్' ద్వారా.. ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినది కాదని, ఐదేళ్ల కిందట 2013లో ఈజిప్ట్‌కు చెందిన వీడియో అని తేలింది.

7 నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ వీడియో నుంచి 30సెకెన్ల వీడియోను కట్ చేసి, షేర్ చేశారు.

ఈజిప్ట్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

ఇది కాప్టిక్ చర్చిపై దాడి

2013లో ఈజిప్ట్‌లో చెలరేగిన క్రిస్టియన్ వ్యతిరేక అల్లర్లలో భాగంగా, దేశవ్యాప్తంగా కనీసం 25 చర్చిలపై దాడులు జరిగాయి.

అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు క్రీ.శ.50 సంవత్సరానికి చెందిన పురాతన 'కాప్టిక్ ఆర్థొడాక్స్ చర్చి'ని లక్ష్యంగా చేసుకున్నారు.

2013లో అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ, అతని వర్గానికి చెందిన మరికొందరు ముస్లింలను ఈజిప్ట్ ఆర్మీ.. అధికారం నుంచి తొలగించింది.

ఈ రాజకీయ పరిణామాలకు దేశంలోని క్రిస్టియన్ మైనారిటీలు బాధ్యులు అని భావించి, ఇస్లాం మతానికి చెందిన కొందరు అతివాదులు క్రిస్టియన్లపై దాడులు చేశారు.

ఈజిప్ట్

ఫొటో సోర్స్, Getty Images

‘జనరల్ సిసీ’ ప్రణాళికలు బాగున్నాయని కోప్టిక్ పోప్ వ్యాఖ్యానించారు. ఇందుకుగాను, ఆయన కొన్ని బెదిరింపులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు కొందరు క్రిస్టియన్లు కూడా మరణించారు.

ఈజిప్ట్‌లోని క్రిస్టియన్లలో అధికభాగం కోప్టిక్ వర్గానికి చెందినవారే. వీరు ప్రాచీన ఈజిప్షియన్ల సంతతి. ఈజిప్టు జనాభాలో 10% క్రిస్టియన్లే. కొన్ని శతాబ్దాలుగా, సున్నీ ముస్లిముల ఆధిపత్యంలో వీరంతా ప్రశాంతంగా జీవించారు.

ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)