'ఓ హత్య జరగబోతోంది... అది నాదే' - ప్రమాదంలో ఫుడ్ డెలివరీ డ్రైవర్ల జీవితాలు

సోనియా కింగ్

ఫొటో సోర్స్, Matt Johnson, WSB-TV

ఫొటో క్యాప్షన్, ‘కచ్చితంగా ఓ హత్య జరిగేది.. ఆ హత్యకు గురవుతోంది నేనే’ అని తనకు అనిపించిందని సోనియా కింగ్ చెప్పారు
    • రచయిత, సైబన్ ట్యులెట్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఫుడ్ పార్సిళ్లు తెచ్చుకోవటం ఇప్పుడున్నంత ఈజీగా మునుపెన్నడూ లేదు. డజన్ల కొద్దీ యాప్‌లు వచ్చేశాయి. వేడి వేడి ఆహారం నిమిషాల్లోనే మన గుమ్మం ముందుకు వచ్చేస్తోంది. అయితే.. అదే యాప్‌ల వల్ల మన రోడ్లు వందలాది మంది డెలివరీ డ్రైవర్లతో నిండిపోతున్నాయి. వారు మనకు ఆహారం తీసుకురావటం కోసం బెదిరింపులు ఎదుర్కోవటానికి, తీవ్రంగా గాయపడటానికి.. చివరికి చావుకు సైతం సిద్ధపడుతున్నారు.

సోనియా కింగ్ జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరంలో నివసిస్తుంది. ఆమె గత ఏడాది మే నెలలో 'డోర్ డాష్' డ్రైవర్ అకౌంట్‌లోకి లాగిన్ అయింది. ఆ రోజు అద్భుతమైన జీతం వస్తుందని ఆశించింది. ఎందుకంటే.. అది పండుగ రోజు. సెలవు రోజు. అటువంటి రోజు ఆమెకు తీరిక లేనంత పని ఉంటుంది.

కానీ.. ఆ రోజు కేవలం ఒకే ఒక్క ఆర్డర్ మాత్రమే ఇవ్వగలిగింది. అది డెలివరీ చేయటం ఆమె ప్రాణం మీదకు వచ్చింది.

సోనియా ఒక ముస్లిం మహిళ. నలుగురు పిల్లల తల్లి. ఆ రోజు మొదటి డెలివరీ ఇచ్చి వెనుదిరిగింది. ఆమె కస్టమర్ రిక్ పెయింటర్ వెనుక నుంచి ఆమె మీద దాడి చేశాడు. ఆమె జుట్టు పట్టుకుని నికాబ్‌తో ఆమె గొంతు నులమటానికి ప్రయత్నించాడు.

అతడి దాడి నుంచి తప్పించుకోవటానికి సోనియా పెనుగులాడింది. తన కారు తాళాలు చేతికి దొరకటంతో వాటితో అతడి ముఖం మీద, తల మీద పలుమార్లు పొడిచింది.

అట్లాంటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అట్లాంటాలో సెలవు రోజుల్లో ఆహారం డెలివరీ ఆర్డర్లు చాలా అధికంగా ఉంటాయి

''నేను పెనుగులాడుతూ అటూ ఇటూ దొర్లటానికి ప్రయత్నించాను.. వేళ్లతో రక్కాను. అతడు నా జుట్టు వదలిపెట్టలేదు. అతడి కంట్లో నా వేలితో గుచ్చాను. అయినా నా జుట్టు వదిలిపెట్టలేదు. అక్కడ ఓ హత్య జరగోబోతోంది.. నన్నే చంపేయబోతున్నాడు'' అనిపించిందని ఆమె వివరించింది.

''నేను ఎవరినీ పొడవాలని అనుకోలేదు. కానీ ఆ పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు నా పిల్లలు నా కళ్ల ముందు కనిపిస్తున్నారు. నా భర్త కళ్ల ముందు కనిపిస్తున్నాడు. అప్పుడు నేననుకున్నాను.. ఈ ఇంటి నుంచి, ఈ దాడి నుంచి ఎలాగైనా బయటపడాలి. నా ఇంటికి.. నా భర్త, పిల్లల దగ్గరకు వెళ్లాలి'' అని తెలిపింది సోనియా.

ఆమెను నిర్బంధించినందుకు, ఆమెపై దాడి చేసినందుకు గాను 54 ఏళ్ల రిక్ పెయింటర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

సోనియా కింగ్

ఫొటో సోర్స్, Matt Johnson, WSB-TV

ఫొటో క్యాప్షన్, తనపై జరిగిన దాడి ఫలితంగా తాను జనాన్ని నమ్మటం లేదని.. ఎప్పుడైనా ఏదైనా ఘోరం జరుగుతుందేమోననే భయంతో బతకుతున్నానని సోనియా కింగ్ పేర్కొన్నారు

ఒంటి మీద కోతలు, గాయాలతో సోనియా ప్రాణాలతో బయటపడింది. కానీ.. ఆ దాడి తాలూకూ భావోద్వేగాల ప్రభావం ఇంకా తన మీద కొనసాగుతూనే ఉందని చెప్పారు.

''నేను ప్రేమించే చాలా మందికి ఇప్పుడు నేను దూరం జరిగిపోయాను. జనాన్ని నమ్మటం లేదు. ఏదో ఘోరం జరుగుతుందని నిరంతరం అనిపిస్తూ ఉంటుంది'' అని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆహారం డెలివరీ చేసే వారిలో.. విధుల్లో ఉండగా దాడికి గురై గాయపడిన అనేక మందిలో ఆమె ఒకరు.

ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది అంచనా వేయటం కష్టం. ఎందుకంటే దీనికి సంబంధించిన గణాంకాలను పోలీసు బలగాలు ఇంకా సమీకరించలేదు. కంపెనీలు కూడా ఏ వివరాలూ ప్రచురించవు.

కానీ.. ఆహారం డెలివరీ చేసే డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా - సిడ్నీ నుంచి న్యూయార్క్ వరకూ - కనిపిస్తూనే ఉంటాయి.

లండన్‌లో అయితే.. ఈ డ్రైవర్లు భయపడేది తమ కస్టమర్లను చూసి కాదు.. క్రిమినల్ గ్యాంగ్‌లను చూసి. వీరి రవాణా వాహనాలు - ప్రత్యేకించి మోటార్‌బైక్‌లు, మోపెడ్ల కోసం నేరస్తుల ముఠాలు వీరి మీద దాడులు చేస్తున్నాయి.

దాడులను.. లేదంటే దాడి చేస్తామన్న బెదిరింపులను తాము దాదాపు ప్రతి రోజూ ఎదుర్కొంటూనే ఉంటామని కొందరు డ్రైవర్లు చెప్తున్నారు.

షాజిదుర్ రెహ్మాన్
ఫొటో క్యాప్షన్, చీకట్లో ఓ దోపిడీ దొంగల ముఠా తనపై దాడి చేసిందని షాజిదుర్ రెహ్మాన్ తెలిపారు

''రోడ్డు మీద అత్యధికంగా దాడికి గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తి డెలివరీ డ్రైవర్'' అంటారు ఊబర్ఈట్స్ డ్రైవర్ షాజీదుర్ రెహ్మాన్. తూర్పు లండన్‌లో నివసించే ఈయన వయసు 31 సంవత్సరాలు.

ఆయన గత ఆగస్టు నెలలో ఓ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆయన మీద దాడి జరిగింది.

''ఓ దోపిడీ ముఠా - ఎనిమిది, పది మంది వరకూ ఉంటారు - చీకట్లో నుంచి వచ్చింది. ఒకడు నన్ను ఎగిరి తన్నాడు. నేను బైక్ మీద నుంచి పడిపోయాను. అప్పుడు అందరూ కలిసి నా మీద పడి కొట్టారు'' అని వివరించారు రెహ్మాన్.

ఆయన మోపెడ్‌ను, మొబైల్ ఫోన్‌ను ఆ గ్యాంగ్ దోచుకెళ్లింది. ఆయన భుజం, పాదం విరిగాయి.

లండన్‌లో మోపెడ్‌లు, మోటార్‌బైక్‌లకు సంబంధించిన నేరాలు ఎంత పెద్ద సమస్యగా మారాయంటే.. దీని కోసం మెట్రోపాలిటన్ పోలీసులు 'ఆపరేషన్ వెనిస్' పేరుతో ఒక ప్రత్యేక దళాన్ని నెలకొల్పారు.

ఈ నేరాల బాధితుల్లో డెలివరీ డ్రైవర్లు ఎంత మంది ఉన్నారన్న లెక్కలు తమ దగ్గర లేవని మెట్రో పోలీస్ విభాగం చెప్పింది.

అయితే.. రెహ్మాన్, ఆయన సహ డ్రైవర్లు ఈ దాడుల పట్ల ఎంతగా విసిగిపోయారంటే.. వీరు వాట్సాప్ ద్వారా పరస్పరం అప్రమత్తం చేసుకుంటూ ఒక బృందంగా ఏర్పడి.. తమపై దాడికి దిగుతున్న ముఠాలతో తలపడుతున్నారు.

ఈ విషయం మీద స్పందించాలన్న బీబీసీ విజ్ఞప్తికి మెట్రో పోలీసు విభాగం స్పందించలేదు. అయితే.. గత ఏడాదిలో ఇటువంటి దోపిడీలు, స్కూటర్ లేదా మోటార్‌బైక్ నేరాలు సగానికి పడిపోయాయని.. 9,000 కన్నా తక్కువ నమోదయ్యాయని చెప్పారు. అంటే.. గత ఏడాది ఇటువంటి నేరాలు సగటున గంటకు ఒకటి చొప్పున జరిగాయన్న మాట.

తమకు రక్షణ కల్పించటానికి, సాయం చేయటానికి తాము పనిచేస్తున్న కంపెనీలు మరింత కృషి చేయవచ్చునని డ్రైవర్లు అంటారు.

అయితే రహ్మాన్.. స్వయం ఉపాధి కాంట్రాక్టరు తరగతిలోకి వస్తారు కానీ ఆ సంస్థ ఉద్యోగిగా కాదు. కాబట్టి.. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగికి లభించే బీమా ప్రయోజనాలు ఆయనకు వర్తించవు. ఊబర్‌ఈట్స్ బీమాదారులు ఆయనకు ఒక నెల ఆదాయ భద్రత చెల్లిస్తారని ఆయనకు చెప్పారు. అంతే.

An Uber Eats food courier

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఊబర్ఈట్స్ తన కొరియర్ల భద్రతను పెంపొందించటానికి మరింత కృషి చేస్తున్నామని చెప్తోంది

''నా కుటుంబం పూర్తిగా నా మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను వారి మీద ఆధారపడ్డాను. దీనినంతటినీ ఎలా భర్తీ చేయాలో నాకు తెలియటం లేదు'' అని ఆయన చెప్పారు.

ఊబర్ఈట్స్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆయన తప్పుపడుతున్నారు. ఎందుకంటే.. ఒక ఆర్డర్‌ను డెలివరీ చేయటానికి అంగీకరిస్తే తప్ప.. అది ఏ ప్రాంతంలో డెలివరీ చేయాలో ఆ సాఫ్ట్‌వేర్ ఈ డ్రైవర్లకు చూపించదు. దీనివల్ల.. ముఠాలు సంచరించే ప్రాంతాలుగా పేరుపడ్డ ప్రదేశాలకు వెళ్లకుండా తప్పుకునే అవకాశం లేకుండా పోతోంది.

''డెలివరీ చేస్తామని అంగీకరించి.. అడ్రస్ చూసిన తర్వాత అక్కడికి వెళ్లవద్దని అనుకున్నా ఆ ఆర్డర్‌ను రద్దు చేయలేం. అలా చేస్తే కంపెనీ మా ఖాతాలను సస్పెండ్ చేస్తుంది'' అని రహ్మాన్ తెలిపారు.

ఈ నిర్దిష్ట ఆందోళనల గురించి ఊబర్‌ఈట్స్ స్పందించలేదు. అయితే.. తమ యాప్ ఉపయోగించే కొరియర్ల భద్రతను మెరుగుపరచటానికి తాము కష్టపడి పనిచేస్తున్నామని చెప్పింది.

కొరియర్లు తమ యాప్ ద్వారా ఐదు వరకూ విశ్వసనీయ కాంటాక్టులను కుటుంబ సభ్యులు, స్నేహితులుగా ఎంపిక చేసుకోవచ్చునని.. తాము డెలివరీ చేసేటపుడు తమ లొకేషన్‌ను వారితో షేర్ చేసుకోవచ్చునని ఊబర్‌ఈట్స్ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో యాప్‌లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ ద్వారా.. సాయం కోసం పిలువవచ్చునని.. ఆ పరిస్థితుల్లో వారి రియల్ టైమ్ లొకేషన్‌ని కనుగొనవచ్చునని వివరించింది.

ఇటువంటి దాడులు వార్తల్లోకి ఎక్కవచ్చు. కానీ రోడ్డు ప్రమాదాలు వీరికి అన్నిటికన్నా ఎక్కువ ముప్పుగా పరిణమించాయి. ఈ డ్రైవర్లు కొంత ఆదాయం పెంచుకోవటం కోసం.. తమకు ఉన్న అతి తక్కువ సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువ డెలివరీలు చేయాలని ప్రయత్నిస్తారు.

ప్రమాదానికి గురైన గోల్వో డెలివరీ డ్రైవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యూనస్ ఎయిర్స్‌లో గోల్వో డెలివరీ డ్రైవర్ ప్రమాదానికి గురికావటంతో ఒక జడ్జి నగరంలో డెలివరీ యాప్‌లను నిషేధించారు.

ఈ ఏడాది ఆరంభంలో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఆహారం డెలివరీ చేసే యాప్‌లను జడ్జి రాబర్టో గలార్డో నిషేధించారు. కొన్ని సంస్థలు కార్మిక, రవాణా చట్టాలకు అనుగుణంగా నడచుకోవటం లేదన్న ఆందోళనలు వ్యక్తం కావటం దీనికి కారణం. ఈ ఆరోపణలను సదరు కంపెనీలు తిరస్కరించాయి. ఆ తీర్పును సవాల్ చేస్తూ అప్పీలుకు వెళ్లాయి.

గ్లోవో అనే ఫుడ్ డెలివరీ వేదిక ద్వారా ఆర్డర్ చేసిన పిజ్జాను డెలివరీ చేస్తున్న ఎర్నెస్టో ఫ్లోరిడియా అనే 63 ఏళ్ల వ్యక్తి.. ఒక కారు ఢీ కొనటంతో గాయపడ్డారు. దీంతో ఆ జడ్జి ఈ యాప్‌లను నిషేధించారు.

రోడ్డు ప్రమాదంలో తాను గాయపడ్డానని, కదల లేకపోతున్నానని ఎర్నెస్టో సదరు కంపెనీకి మెసేజ్ చేశారు. దీనికి గ్లోవో సిబ్బంది స్పందిస్తూ.. ఎర్నెస్టో డెలివరీ చేయాల్సిన పిజ్జా ఫొటోను తమకు పంపించాలని సూచించారు. అలా చేయటం వల్ల తాము ఆ ఆర్డర్‌ను రద్దు చేయటానికి వీలుంటుందని చెప్పారు.

ఈ ఉదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అందుకు క్షమాపణ చెప్పామని గ్లోవో స్పందించింది. ''అలా చేయటం తప్పేనని ఆ సమయంలోనే మేం అంగీకరించాం. అది ఎర్నెస్టోకు చాలా విచారం కలిగించి ఉంటుంది'' అని వ్యాఖ్యానించింది.

ఆ ఉదంతానికి సంబంధించిన కస్టమర్ సర్వీస్ బృందం సభ్యుడిని తొలగించామని.. ఎర్నెస్టో పూర్తిగా కోలుకుని మళ్లీ గ్లోవో కోసం పనిచేస్తున్నారని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

జార్జియాకు తిరిగివస్తే.. డోర్‌డాష్ తన డెలివరీల కసం పనిచేసే దాదాపు 4,00,000 మంది కొరియర్లకు భద్రత కల్పించటానికి మరింత కృషి చేయాలని సోనియా కింగ్ అంటున్నారు. కస్టమర్ల నేర రికార్డులను తనిఖీ చేయటం ఆ చర్యల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఎందుకంటే.. తన మీద దాడి చేసిన రిక్ పెయింటర్ అప్పటికే తరచుగా జైలుకు వెళ్లివస్తుంటాడని.. హింసాత్మక నేరాల చరిత్ర ఉందని వెల్లడైందని ఆమె అన్నారు.

సోనియా కింగ్

ఫొటో సోర్స్, Sonya King

ఫొటో క్యాప్షన్, డోర్‌డాష్ తన వద్ద పనిచేసే నాలుగు లక్షల మంది కొరియర్ల భద్రత కోసం మరింత కృషి చేయాలని సోనియా కింగ్ అంటారు

అదీగాక.. తన మీద దాడి జరిగిన తర్వాత.. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన డోర్‌డాష్ కంపెనీకి సంబంధించిన ఏ ఒక్కరితోనూ తాను మాట్లాడలేకపోయానని.. వారికి కేవలం ఈమెయిల్ మాత్రమే చేయగలిగానని సోనియా తెలిపారు. తన మీద దాడి జరిగిన మూడు రోజుల తర్వాత కానీ.. కంపెనీ నుంచి ఒకరు తనకు ఫోన్ చేయలేదని చెప్పారు.

''నేను దాదాపు చచ్చిపోయాను.. కంపెనీ స్పందన చాలా జుగుప్సాకరంగా ఉంది'' అని ఆమె విమర్శించారు.

సోనియా ఉదంతంలో వ్యవహరించిన తీరు మీద తాము తీవ్రంగా విచారిస్తున్నామని డోర్‌డ్యాష్ అంటోంది. ''మా సంస్థ కోసం పనిచేసే మా వాళ్ల భద్రత విషయాన్ని మేం చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఎటువంటి వేధింపులనూ, అనుచిత ప్రవర్తననూ సహించం'' అని పేర్కొంది.

అమెరికాలో తమ కోసం పనిచేసే డెలివరీ డ్రైవర్లందరి కోసం ఇప్పుడు ఒక ఉచిత వృత్తి ప్రమాద బీమాను ప్రవేశపెట్టామని ఆ సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)