ట్విటర్‌, భారత ప్రభుత్వం మధ్య వివాదం ఏమిటి... కొత్త ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రశాంతో కె రాయ్
    • హోదా, టెక్నాలజీ రైటర్

గతవారం విచారణకు హాజరు కావాలని ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌కు ఘాజియాబాద్ పోలీసులు సమన్లు పంపారు.

ఈ నోటీసుల అనంతరం తనను అరెస్టు చేయకుండా కోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిలు తీసుకున్నారు. ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

ట్విటర్ వేదికగా షేర్ అయిన ఓ వీడియోతో ఈ వివాదం మొదలైంది. ఈ వీడియోలో 72ఏళ్ల ముస్లిం వృద్ధుణ్ని కొందరు చితకబాదుతూ కనిపిస్తున్నారు. కొట్టిన అనంతరం ఆయన గడ్డాన్ని కూడా కోసేశారు. ఈ వీడియోను జర్నలిస్టులు సహా చాలా మంది షేర్ చేశారు.

ఆ వృద్ధుణ్ని కొట్టడానికి మతం కారణం కాదని పోలీసులు చెబుతున్నారు. ఆయన అమ్మిన ఓ ఆభరణమే వివాదానికి మూలకారణమని వివరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అదే సమయంలో ట్విటర్ ఇండియా, న్యూస్ వెబ్‌సైట్ ద వైర్, ముగ్గురు జర్నలిస్టులు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా తీవ్రమైన నేరారోపణలతో కేసులు నమోదుచేశారు.

నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురూ ముస్లింలే. అయితే, ముస్లిమేతరులు కూడా ఈ వీడియోను షేర్ చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ‘‘ఇంటర్మీడియరీ’’ సంస్థల కిందకు వస్తాయి.

వీరి సైట్లు, ప్లాట్‌ఫామ్‌లపై నెటిజన్లు పెట్టే పోస్టులకు వీరిని బాధ్యులుగా చేయకూడదని భారత చట్టాలు చెబుతున్నాయి. అయితే, వీరు చట్టాలను అనుసరిస్తూ ఆ కంటెంట్‌ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది.

అయితే, ఫిబ్రవరిలో విడుదల చేసిన కొత్త ఐటీ నిబంధనల అనంతరం, ఇంటర్మీడియరీ హోదా ట్విటర్‌కు వర్తించదని భారత ప్రభుత్వం చెబుతోంది.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) పేరుతో ఈ నిబంధనలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి ప్రకారం సోషల్ మీడియా దిగ్గజాలు ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ప్రత్యేకంగా నియమించుకోవాల్సి ఉంటుంది.

వీరిలో ఒకరు నిబంధనల అమలుకు, మరొకరు ప్రజల సాధకబాధకాల పరిష్కారానికి, మరొకరు ప్రభుత్వ సంస్థలతో సమన్వయానికి పని చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారతీయులై ఉండాలి. అవి పూర్తికాల ఉద్యోగాలై ఉండాలి.

అయితే, ట్విటర్ నియమించుకున్న వారిలో ఇద్దరు పూర్తికాల ఉద్యోగులు కారని భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. వీరి ఇద్దరి ఆఫీస్ చిరునామా పరిశీలిస్తే, ఏదో న్యాయ సేవల సంస్థ చిరునామా ఉందని, మూడో ఉద్యోగి వివరాలు కూడా సమర్పించలేదని వివరిస్తోంది.

ముఖ్యంగా నిబంధనలను అమలుచేసే చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రభుత్వం సూచించిన సమాచారాన్ని 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు.

అశ్లీల దృశ్యాలు సహా అభ్యంతరకర సమాచారాన్ని తొలగించేందుకు ఆటోమేటెడ్ విధానాలను అనుసరించాలని సూచించారు.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధుణ్ని కొట్టిన దృశ్యాలకు సంబంధించి దాదాపు 50 ట్వీట్లను ట్విటర్ తొలగించింది.

వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణకు హాజరు అవుతామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పోలీసులకు చెప్పారు. అయితే, నేరుగా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు.

‘‘భారత ప్రభుత్వం ఈ కేసు ద్వారా మిగతా సోషల్ మీడియా దిగ్గజాలకు, విదేశీ కంపెనీలకు గట్టి సందేశం ఇవ్వాలని చూస్తోంది. ఇక్కడి ప్రభుత్వం కూడా చైనా ప్రభుత్వంలా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న విదేశీ కంపెనీలపై పట్టు సాధించాలని చూస్తోంది’’అని జర్నలిస్టు, డిజిటల్ రైట్స్ యాక్టివిస్టు నిఖిల్ ఫావా వ్యాఖ్యానించారు.

ఇంటర్మీడియరీ హోదాను వెనక్కి తీసుకుంటే భారత్‌లో సోషల్ మీడియా దిగ్గజాలు మనుగడ సాగించడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మతపరమైన మనోభావాలు చాలా తేలిగ్గా దెబ్బతింటాయి. ఉదాహరణకు హిందువులు పవిత్రంగా భావించే ఆవుపై వేసే కార్టూన్లతో వేలకొద్దీ కేసులు వచ్చిపడతాయి. దీనికి కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు బాధ్యులు అవుతారు. ట్విటర్‌పై ఇప్పుడు నమోదైన కేసు దీనికి ఉదాహరణ. ఇలాంటి కేసులు చాలా వచ్చిపడే అవకాశముంది.

ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు ట్విటర్‌ నేరుగా స్పందించలేదు. అయితే, తాము చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను తాత్కాలికంగా నియమించుకున్నామని తెలిపింది. కొత్త నిబంధనలను అనుసరించేందుకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొంది.

భారత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్

మరికొన్ని కంపెనీలు ఇలానే...

భారత ప్రభుత్వంతో వివాదాల్లో చిక్కున్న సంస్థ కేవలం ట్విటర్ ఒక్కటే కాదు. గత నెలలో వాట్సాప్‌ కూడా కొత్త నిబంధనల విషయంలో వివాదాల్లో చిక్కుకుంది.

భారత్‌లో 40 కోట్ల మందికిపైగా వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇది భారత్‌లో అతిపెద్ద మెసెంజెర్ ప్లాట్‌ఫామ్.

ఏదైనా మెసేజ్‌ను ఎవరు పంపారో అడిగితే తమకు చెప్పాల్సి ఉంటుందని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.

అయితే, ఇలా చెప్పాలంటే మొదట ఎన్‌క్రిప్షన్‌ను తొలగించాల్సి ఉంటుందని, అన్ని మెసేజ్‌లను చదివి, స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ అంటోంది.

అయితే, ఎన్‌క్రిప్షన్‌ను తొలగించకుండా, మెసేజ్‌ను పంపేవారి వివరాలు వెల్లడించేలా చూడాలని భారత అధికారులు సూచిస్తున్నారు. అలా చేస్తే, వ్యక్తుల గోప్యతా హక్కుకు భంగం కలిగించినట్లు అవుతుందని వాట్సాప్ చెబుతోంది.

మెసేజ్ పంపిన వ్యక్తిని ట్రేస్‌చేసే ఈ నిబంధన మిగతా ఎన్‌క్రిప్టెడ్ సంస్థలైన సిగ్నల్, యాపిల్ ఐమెసేజ్‌లకూ కూడా వర్తిస్తుంది. అయితే, ప్రస్తుతం దృష్టి మొత్తం వాట్సాప్‌పైనే ఉంది.

పిల్లల అపహరణ, గోవధలు, మూకదాడులపై వాట్పాప్‌లో వదంతుల వ్యాప్తి నడుమ ఈ నిబంధనల ముసాయిదాను 2019లో తీసుకొచ్చారు.

ఉగ్రవాదంతోపాటు ఫేక్‌న్యూస్‌పై దర్యాప్తుల్లో వాట్సాప్ సహకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఎన్‌క్రిప్షన్‌ను తీసేస్తే చాలా సమస్యలు వచ్చి పడతాయని హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ఐరాస ఆందోళన

భారత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఐటీ నిబంధనలతో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగే అవకాశముందని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఐరాస ప్రత్యేక రాయబారులు ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘సమాచారాన్ని తొలగించాలని ఇంటర్మీడియరీలకు కుప్పలుతెప్పలుగా అభ్యర్థనలు వచ్చి పడుతుంటాయి. వారిని బాధ్యుల్ని చేసే కేసులూ పెరుగుతాయి’’అని వారు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.

జర్నలిస్టుల స్వేచ్ఛను కూడా కొత్త నిబంధనలు హరిస్తాయని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ నిబంధనలకు ముందు కూడా పలువురు జర్నలిస్టులపై తీవ్రమైన నేరారోపణలు మోపారు.

న్యూస్ పబ్లిషర్లకు ఈ నిబంధనల్లో ప్రత్యేక సెక్షన్ ఉంది. దీన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. దీనిలో కూడా వార్తలను తొలగించడం, ప్రజల సాధకబాధకాల పరిష్కారాలు తదితర అన్ని నిబంధనలూ ఉన్నాయి.

ప్రధాన వార్తా సంస్థల జాబితా నుంచి డిజిటల్ న్యూస్ సంస్థలను తొలగించాలని నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్.. భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టంచేసింది.

ఈ ఇంటర్మీడియరీ నిబంధనలతో మరికొన్ని కేసులు కూడా వచ్చి పడ్డాయి. వీటిని సవాల్ చేస్తూ 13 మీడియా సంస్థలు కోర్టుల్ని ఆశ్రయించాయి. తాము ప్రభుత్వ నిఘా నీడలో, భయంతో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని వారు పిటిషన్లలో వ్యాఖ్యానించారు.

ట్విటర్ కార్యాలయంలో దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ట్విటర్ కార్యాలయంలో దిల్లీ పోలీసులు

మరోవైపు ట్విటర్ నిబంధనలను పాటించడంలేదని దిల్లీకి చెందిన ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఇంకొకవైపు ఈ నిబంధనలతో ఒక కళాకారుడిగా తన హక్కులకు భంగం కలుగుతోందని ప్రముఖ గాయకుడు టీఎం కృష్ణ కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా భావ ప్రకటన, వ్యక్తిగత గోప్యతా హక్కులకు భంగం కలుగుతోందని ఆయన చెప్పారు.

ఈ నిబంధనలకు వ్యతిరేకంగా మొదట్లో పిటిషన్లు దాఖలుచేసిన వారిలో న్యాయవాది సంజయ్ కే సింగ్ ఒకరు. ‘‘రాజ్యాంగం మనకు ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఈ నిబంధనలు ఉన్నాయి’’అని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో విద్వేషకర వ్యాఖ్యలు చేయడం నేరమని చెప్పే ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.

‘‘ఈ కొత్త నిబంధనలు కోర్టు తీర్పుతో విభేదిస్తున్నాయి. ముఖ్యంగా తమను విమర్శించే వార్తలు, సమాచారాన్ని వారు తొలగించాలని భావిస్తున్నారు’’అని సింగ్ వ్యాఖ్యానించారు.

సింగ్ వాదనతో న్యాయ విద్యార్థిని శ్రేయా సింఘాల్‌ కూడా ఏకీభవిస్తున్నారు. 66ఏ సెక్షన్‌కు వ్యతిరేకంగా ఈమె అప్పట్లో పిటిషన్ వేశారు.

‘‘అయితే, ట్విటర్ ముందు ఈ నిబంధనలను అనుసరించాలి. అనంతరం చట్టపరంగా వీటిని సవాల్ చేయాలి. అప్పుడే వారి కేసు నిలబడుతుంది’’అని శ్రేయ అన్నారు.

‘‘అన్నింటిపైనా పర్యవేక్షణ ఉంచే దేశంగా మన దేశం మారిపోతోంది. ప్రస్తుతం ఎప్పుడూ లేనంతగా సమాచారంపై నిఘా, పర్యవేక్షణ ఉంటున్నాయి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)