కేసీఆర్: ‘రైతులు తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో ఐదెకరాలు కొంటున్నారు’

వీడియో క్యాప్షన్, కేసీఆర్: ‘తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో ఐదెకరాలు కొంటున్నారు’

మంత్రివర్గ సమావేశం తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఏడేళ్ల కిందట తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఏడేళ్ల కిందట తెలంగాణ పల్లెల్లో ఎంత డబ్బు ఉంది? ఇప్పుడు ఎంత డబ్బు ఉంది? తెలంగాణ భూముల ధరలు ఎక్కడికి పోయినై? చాలామంది తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి అన్నారు. పడిపోయినయా పెరిగినయా? రూ. 20 లక్షల లోపల (ఎకరం) భూమి దొరుకుతుందా ఇయ్యాల తెలంగాణలో ఎక్కైడనా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ వాల్యూ.. తెలంగాణ రైతు వాల్యూ? ఐదెకరాలు ఉన్న తెలంగాణ రైతు ఇయ్యాల కోటీశ్వరుడు. అదే ఏడేండ్ల కిందట.. బిచ్చగాడు. వలస బోయిండు. పోలే.. మనం జూళ్లే.

ఐదేళ్ల కిందట ఐదెకరాలున్న రైతు హైదరాబాద్ కూలి పనికి వచ్చిండు. ఇయ్యాల ఐదెకరాలున్న రైతు తెలంగాణలో ఏ మారుమూలకు బోయినా.. నువ్వు కాగజ్ నగర్ పోయినా, మక్తల్ పోయినా, గద్వాల బోయినా, భద్రాచలం బోయినా, జుక్కల్ బోయినా ఇరవై లక్షల్లోపు ఎకరం జాగా లేదు. రోడ్డు సైడ్ ఉంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. రాజీవ్ రహదారి వంటి నేషనల్ హైవే పక్కన ఉంటే మూడు కోట్లు, నాలుగు కోట్లు ధర. తెలంగాణ రైతుల వాల్యూ పెరగలే ఇయ్యాల.

ఆనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ మూడెకరాలు కొన్నారు. ఇయ్యాల మా నల్గొండ రైతులు.. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో ఐదెకరాలు, నాలుగెకరాలు కొంటున్నారు. తెలంగాణ రైతులు ఇయ్యాల కాలర్ ఎగరేసి ప్రకాశం జిల్లాలో కొంటున్నరు. కర్ణాటకలో కొంటున్నరు భూములు.. ఒక ఎకరం అమ్మి రెండెకరాలు, మూడెకరాలు కొంటున్నరు. ఇది నిజం కాదా? తెలంగాణలో భూముల ధరలు పెరిగినయ్.. రైతులు కోటీశ్వరులు అయినరు. ఒక పల్లెలో కోటాను కోట్లు ఉంటున్నయ్ ఇయ్యాల. ఒక మేనేజర్ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు.. సర్ ఇయ్యాల మా ఊరి బ్యాంకులో ఆరు కోట్ల రూపాయలు ఉన్నయ్ అని. ఏడేళ్ల కిందట ఏముండె? లక్షలకు కూడా దిక్కు లేకుండె. దీనికంత ఎవలు.. ఎవలు కారణం?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)