షారుక్ ఖాన్‌ను మహిళలు ఎందుకు ఇష్టపడతారు?

షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

షారుక్ ఖాన్ అంటే మీకు ఎందుకంత ఇష్టం?

బాలీవుడ్ సూపర్ స్టార్ గురించి నా స్నేహితులు కొందరిని ఈ ప్రశ్న అడిగాను. 'డెస్పరేట్‌లీ సీకింగ్ షారుక్' అనే పుస్తకం చూశాక ఈ ప్రశ్న అడగాలనిపించింది.

షారుక్ 'చార్మింగ్' హీరో అని.. ఇంటర్వ్యూలలో ఆయన ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడుతారని, సరదాగా ఉంటారని వారు నాకు సమాధానం చెప్పారు.

కీర్తి, డబ్బు వెంట పరుగులు తీయడం గురించి ఆయనేమీ పశ్చాత్తాపపడకపోవడం కూడా నచ్చిందని చెప్పారు.

నేను మరింతగా వివరాలు అడిగేసరికి.. ఆయన పోషించిన పాత్రల గురించి వారు మరింత లోతుగా ఆలోచించారు. ఆయనెప్పుడూ పురుషాహంకార హీరోగా కనిపించలేదని.. సినిమాల్లో ఆయన ప్రేమించే మహిళల విషయంలో సున్నితంగా వ్యవహరించడమే కాకుండా వారికి తలొగ్గినట్లుగా ఉంటారని చెప్పారు.

'మహిళలపై ఆయన చూపించే ప్రేమకు గాను మేం ఆయన్ను ప్రేమిస్తున్నాం' అని నా స్నేహితురాళ్లలో ఒకరు చెప్పారు.

షారుక్‌ను అభిమానించే కొందరు మహిళలను రచయిత్రి శ్రయనా భట్టాచార్య ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆమెకు కూడా ఈ సమాధానమే లభించింది.

''వాళ్లంతా ఎప్పుడు, ఎలా, ఎందుకు షారుక్‌కు అభిమానులయ్యారో చెబుతూ.. ఈ ప్రపంచం వారి హృదయాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా ముక్కలు చేస్తుందో చెప్పారు'' అని భట్టాచార్య రాశారు.

''ఎప్పుడూ మహిళలను ఒక రకమైన అననుకూల పరిస్థితుల్లోనే ఉంచేసే ప్రపంచంలో వారి రొమాంటిక్ చాయిస్‌లతో విడదీయరాని సంబంధం ఉన్న కలలు, ఆరాటాలు, తిరుగుబాట్లను పంచుకున్నారు.

కానీ, ఆశ్చర్యకరమైన రీతిలో ఈ మహిళా అభిమానుల కథలపై ఆర్థిక అసమానతల ప్రభావం ఉంది.

ఇదంతా హడావుడిగా చేసిన సర్వే ఏమీ కాదు.. ఉత్తర భారతంలో సుమారు రెండు దశాబ్దాల పాటు యువతులు, ఒంటరి మహిళలు, వివాహితలతో అనేక సార్లు మాట్లాడి తెలుసుకున్న అభిమాన అంతరంగమిది.

షారుక్ విషయంలో ఇలా తమ అంతరంగాన్ని పంచుకున్న మహిళల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు.. సంతోషంగా జీవితంగా గడుపుతున్నవారు, ఆటుపోట్లను ఎదుర్కొంటున్న గృహిణులు, ఉద్యోగినులు, రిటైరైనవారు ఉన్నారు.

వీరి నేపథ్యాలు, పరిస్థితులు భిన్నమైనా షారుక్ అభిమానులుగా వీరంతా ఒక్కటే.

1990లలో సరళీకరణగా చెప్పుకొనే ఆర్థిక సంస్కరణల అనంతరం కోకాకోలా, కేబుల్ టీవీతో పాటు షారుక్ కూడా మన జీవితాల్లో ప్రవేశించారు.

''సరళీకరణల అనంతర కాలపు మహిళల కథలు చెప్పాలనుకున్నాను, షారుక్‌లో ఒక అసాధారణ మిత్రుడిని గుర్తించాను'' అని భట్టాచార్య చెప్పారు.

షారుక్ ఖాన్ అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

2006లో భట్టాచార్య పశ్చిమ భారతదేశంలోని ఒక మురికివాడలో అగరబత్తులు తయారీ కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు.. వారి వేతనాల గురించి ఎదురయ్యే ప్రశ్నలతో వారు విసిగిపోతున్నట్లు గుర్తించారు. దాంతో ఆమె వారి అభిమాన బాలీవుడ్ హీరో గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

''వారు తమను సంతోషపెట్టే విషయాల గురించి మాట్లాడడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. వారిని సంతోషపెట్టే అంశం షారుక్ ఖాన్''

తెరపై కనిపించే షారుక్‌లా ఎక్కువ మంది అబ్బాయిలు, పురుషులు ఎందుకు ఉండలేరన్నది చాలామంది నుంచి ఎదురయ్యే కామన్ ప్రశ్న.

''వారంతా తమ వాస్తవ పరిస్థితులు, తమ ఆకాంక్షలకు అనుగుణంగా షారుక్‌ను తయారుచేసుకుంటున్నారు'' అని భట్టాచార్య చెప్పారు.

మహిళలను పట్టించుకోవడం, వారి పట్ల శ్రద్ధ చూపడం, వారు చెప్పేది వినడం వంటివి షారుక్ సినిమాలలో తన హీరోయిన్లపై చూపించే ఆరాధనలో కనిపిస్తాయి. తన అదృష్టం గురించి ఆత్రుత చెందడమనేది ఆయన పోషించిన అనేక పాత్రలలో కనిపిస్తుంది. ఇలాంటివన్నీ మహిళలు తమకు షారుక్‌లాంటి భాగస్వామి ఉంటే బాగుణ్ననుకునేలా చేశాయి.

అంతేకాదు, షారుక్‌లోని దుర్భలత్వం, మిగతా హీరోలకు భిన్నంగా తన భావాలను చూపించుకోవడానికి వెనుకాడని తత్వం కూడా ఆయన్ను మహిళలకు దగ్గర చేసింది.

''కభీ ఖుషీ కభీ ఘమ్‌లో కాజోల్‌తో షారుక్ మాట్లాడినట్లుగా, స్పృశించినట్లుగా నాతోనూ ఎవరైనా మాట్లాడాలని, తాకాలని కోరుకుంటాను. కానీ, అది ఎన్నటికీ జరగదు. నా భార్త మనోవైఖరి, చేతులు అన్నీ కఠినమే'' అని వస్త్ర పరిశ్రమలో పనిచేసే ఒక ముస్లిం యువతి చెప్పారు.

తన కొడుకులను 'ఉత్తమ పురుషులు'గా పెంచాలని కోరుకుంటున్నట్లు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ రాజకుటుంబ మహిళ చెప్పారు.

షారుక్ సినిమాల్లో తన కథనాయికలను భద్రంగా, ప్రేమగా చూసుకున్నట్లుగా తన కొడుకులు కూడా వారి భార్యలను చక్కగా చూసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారామె.

షారుక్ సినిమాలలో 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' గొప్ప హిట్. ఈ సినిమా గురించి ఓ అభిమాని తల్లి ఒక మాట చెప్పారు. నేను కూడా ఆమె చెప్పేవరకు ఆ విషయం గమనించలేదు.

''బాలీవుడ్ హీరో సినిమాలో క్యారట్ తరగడాన్ని నేను చూడడం అదే తొలిసారి. అంతేకాదు, ఆ సినిమాలో షారుక్ ఎక్కువ సమయం ఇంటిపనుల్లో మహిళలకు సాయపడుతూ కనిపిస్తారు' అన్నారామె.

షారుక్‌ను అభిమానించే మహిళలు కామం, లైంగిక ఆకర్షణల గురించి మాట్లాడలేదని కాదు. కానీ, వారు అంతకు మించిన అనేక విషయాల గురించి మాట్లాడారు అన్నారు భట్టాచార్య.

కాజోల్, షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, YASH RAJ FILMS

ఫొటో క్యాప్షన్, కాజోల్, షారుక్ ఖాన్

రోజువారీ మూస జీవితం నుంచి కాస్త బయటపడడానికి.. అన్యాయాలు, ఆశాభంగాల నుంచి ఉపశమనం పొందడానికి షారుక్ మంచి సాధనం అని చెప్పొచ్చు.

చాలామంది మహిళలు తాము షారుక్‌ను పెళ్లి చేసుకోవాలని కోరుకోవడానికి, కలలుగనడానికి కారణం ఆయన బాలీవుడ్ స్టార్ కావడం వల్ల కాదు, చక్కగా చూసుకునే పురుషుడు కావడం వల్ల. చక్కగా చూసుకునే పురుషుడు మహిళలను వారి పని వారి చేసుకోనిస్తాడు, డబ్బు పొదుపు చేస్తాడు, కనీసం జీవితం పట్ల మీకుండే కలలనైనా అంగీకరిస్తాడు.

టీనేజ్ వయసులో షారుక్ సినిమాకు అతుక్కుపోయి తల్లితో చెంపదెబ్బలు తిన్న ఒక ఉద్యోగిని.. వస్త్ర పరిశ్రమలో కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బును అన్నదమ్ములకు లంచంగా ఇచ్చి మరీ వారి సాయంతో షారుక్ సినిమా చూసే ఒక పేద యువతి.. ఇంట్లో టీవీలో ఆదివారాలలో వచ్చే షారుక్ సినిమా చూడడానికి గాను ఫాదర్‌కి ఏవేవో అబద్ధాలు చెప్పి నాలుగు వారాల పాటు చర్చికి వెళ్లకుండా తప్పించుకున్న ఓ పనిమనిషి.. ఇలా ఎందరో మహిళా అభిమానులకు షారుక్ సినిమా చూడడమంటే తమ స్వేచ్ఛను దొంగిలించి సాధించుకోవడం.

నిజానికి షారుక్ అంటే ఎంతగానో ఇష్టపడే చాలామంది నిరుపేద అభిమానులు ఎంతో వయసు వచ్చేవరకు ఆయన సినిమాలు చూడలేకపోయారు. కానీ, ఆ సినిమాల్లో పాటలు వింటూ ఆయనపై అభిమానాన్ని పెంచుకుంటారు.

''మహిళలు తమకు నచ్చినట్లుగా సరదాగా గడపడం అంత సులభం కాదు. పాటలు వినడం, ఎవరైనా నటుడిని అలాగే చూస్తూ ఉండిపోవడం వంటివి చేయలేర''ని భట్టాచార్య అంటారు.

''ఎవరైనా హీరోను ఇష్టపడుతున్న ఏ మహిళయినా చెబితే దానర్థం.. ఆ హీరో రూపాన్ని ఇష్టపడుతుందని.. అలాంటి తీరును ఇష్టపడుతుందని చెప్పొచ్చు'

ఈ మహిళలంతా రాడికల్స్ ఏమీ కాదు.. కానీ, చిన్నపాటి ఆనందాలు, విలాసాల కోసం వారంతా తిరగబడ్డారు. షారుక్ పోస్టర్లను మంచం కింద దాచుకోవడం, అతని పాటలు వినడం, ఆ పాటలకు డ్యాన్స్ చేయడం, ఆయన సినిమాలు చూడడం ద్వారా తమ పరిస్థితులపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాట్ల కారణంగా వారు తమ జీవితంలో ఏం కోరుకుంటున్నారో కూడా గ్రహించగలిగారు.

షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

షారుక్ ఖాన్ సినిమా చూసేందుకు రహస్యంగా వెళ్లిన ఓ అమ్మాయి ఆ తరువాత ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆమె రహస్యంగా సినిమా చూసొచ్చిన తరువాత ఇంట్లోవారు ఆమెకు అప్పటికప్పుడు ఓ సంబంధం తెచ్చి పెళ్లి చేసేయాలని చూశారు. కానీ, పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయి షారుక్ అభిమాని కాదు, దాంతో ఆమె ఏకంగా ఇంటి నుంచి పారిపోయింది. ఆ తరువాత ఆమె ఫ్లయిట్ అటెండెంట్ కాగలిగి షారుక్ ఖాన్ తరహా భావాలనే తనలో రగిలించిన వ్యక్తిని పెళ్లాడింది.

అలాగే చిన్నప్పుడు షారుక్ సినిమా చూస్తూ తల్లి చేతి దెబ్బలు తిన్న అధికారిణికి మళ్లీ ఆ తరువాత ఎన్నడూ షారుక్ సినిమా చూడడానికి ఎవరి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే, నా స్నేహితులకు షారుక్ గురించి కలలు కనడంపై ఎలాంటి నిషేధాజ్ఞలూ లేవు. ఎందుకంటే వారిది స్వేచ్ఛాయుత ప్రపంచమే.

మా అమ్మ, అత్త ప్రతి శుక్రవారం సెకండ్ షో సినిమాకు వెళ్లడంలో అనుభవిస్తున్న తిరుగుబాటును నేనెప్పుడూ పూర్తిగా అభినందించలేదు. కానీ, ఈ పుస్తకం చదివిన తరువాత నా ఆలోచన మారింది. అదృష్టవశాత్తు వారు నన్ను కూడా తీసుకెళ్లేవారు.

భిన్న నేపథ్యాలున్న మన బాల్యాలను కలిపే ఒక ఉమ్మడి విషయం షారుక్ ఖాన్. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూలను చూసి ఇంగ్లిష్ నేర్చుకున్నానని ఓ మహిళ చెప్పారు. నిజమే, నేను షారుక్ ఇంటర్వ్యూల నుంచి హిందీ నేర్చుకున్నాను.

షారుక్ ఒక ఐకాన్ అని, ఆయన బాలీవుడ్‌లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారారని భట్టాచార్య అన్నారు.

''ఇప్పటి యువతులు షారుక్‌ను పెళ్లి చేసుకోవాలనుకోరు. ఆయనలా ఉండాలనుకుంటారు. ఆయనలాంటి స్వతంత్ర భావజాలం, విజయం కోరుకుంటారు''

(శ్రయనా భట్టాచార్య రాసిన 'డెస్పరేట్లీ సీకింగ్ షారుక్: ఇండియాస్ లోన్లీ యంగ్ ఉమెన్ అండ్ ద సెర్చ్ ఫర్ ఇంటిమసీ అండ్ ఇండిపెండెన్స్'ను హార్పర్ కొలిన్స్ ఇండియా ప్రచురించింది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)