ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 ప్రశ్నలు

ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, నామ్‌దేవ్ కాట్కర్, మయంక్ భాగవత్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో నడుస్తున్న విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ఈ కేసులో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఆర్యన్ ఖాన్ తరఫున తన వాదనలు వినిపించారు. మరోవైపు వకీల్ సతీష్ మాన్షిందే, అమిత్ దేశాయ్ ఇంతకు ముందు నుంచే ఆర్యన్ ఖాన్ కేసును వాదిస్తున్నారు.

ఒక క్రూయిజ్‌లో జరుగుతున్నట్లు చెబుతున్న రేవ్ పార్టీ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది.

రెండు సార్లు ప్రయత్నించినా ఆర్యన్ ఖాన్, మరో ఇద్దరు నిందితులకు బెయిల్ రాలేదు.

బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరక్కపోయినా, తన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ దగ్గర నిషేధిత డ్రగ్స్ ఉన్నాయనే విషయం అతడికి తెలుసని, ఇద్దరూ కలిసే ఉన్నారని కోర్టు చెప్పింది. అందుకే దీనిని కాన్షియస్ పజెషన్(తెలిసీ డ్రగ్స్ ఉంచుకోవడం)గా భావిస్తున్నట్లు తెలిపింది.

అర్బాజ్ మర్చంట్ దగ్గర ఆరు గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు.

ముకుల్ రోహత్గీ గతంలో ఆర్యన్ ఖాన్‌ను సమర్థించారు. ఆర్యన్ ఖాన్‌ను జైల్లో ఉంచడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. సెలబ్రిటీ కావడం వల్ల ఆర్యన్ ఖాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వాదించారు.

ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్యన్ ఖాన్

సమాధానాలు లేని ప్రశ్నలు

ముంబయిలోని ఒక క్రూయిజ్ నౌకలో జరిగినట్లు చెబుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2న దాడులు చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని అరెస్ట్ చేసింది.

ఈ ఎనిమిది మందిలో నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌తోపాటూ అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమిచా గురించే ఎక్కువ చర్చ జరిగింది.

ఎన్సీబీ ముంబయి డివిజన్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ దాడులకు నేతృత్వం వహించారు.

దాదాపు ఒక నెల నుంచీ ఈ కేసులో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రూయిజ్‌లో జరిగిన దాడులకు ప్రభాకర్ సాయిల్‌ను సాక్షి అని ఎన్సీబీ చెప్పింది. కానీ, సమీర్ వాంఖడే తనను డబ్బులు డిమాండ్ చేశారని ఆయన ఇప్పుడు ఆరోపిస్తున్నారు.

ఎన్సీపీ ప్రతినిధి, మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మలిక్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.

ఇది నకిలీ కేసుగా చెప్పిన వారు, బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్నారని, బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే సమీర్ వాంఖడే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

దీంతో ఈ మొత్తం కేసులో ఆర్యన్ ఖాన్, కొందరు తెలియని వ్యక్తులు, సమీర్ వాంఖడే గురించి కొన్ని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పటికీ దొరకడం లేదు. బీబీసీ సమాధానాలు లేని ఈ ప్రశ్నలకు కారణాలు వేతికే ప్రయత్నం చేసింది.

సమీర్ వాంఖడే

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, సమీర్ వాంఖడే

1. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడా, లేదా?

ఆర్యన్ ఖాన్‌ను ఏడీపీసీ చట్టం సెక్షన్ 8సి, 20బి కింద అరెస్ట్ చేశారు. అతడిని వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. కానీ అతడి రక్తం, మూత్రం, జుట్టు కుదుళ్ల శాంపిళ్లు మాత్రం తీసుకోలేదు.

డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో నిందితుల రక్తం, మూత్రం శాంపిళ్లతోపాటూ జుట్టు కుదుళ్ల శాంపిళ్లు కూడా తీసుకుంటారు. వెంట్రుకలను టెస్ట్ చేయడం వల్ల వారు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు.

"ఎన్సీబీ నమోదు చేసిన ఈ మొత్తం కేసు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉందనే దానిపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ ఆరోపణల వల్ల అతడు బెయిలు మీద విడుదలవడం అంత సులభం కాదు" అని నిపుణులు చెబుతున్నారు.

ప్రాసిక్యూషన్ వైపు కేసులో చాలా లోపాలు ఉన్నట్టు తనకు అనిపిస్తోందని వకీల్ ఆషిమా మండలా చెబుతున్నారు.

"నిందితులపై నమోదు చేసిన సెక్షన్లు డ్రగ్స్ స్వాధీనం, వినియోగానికి సంబంధించినవి. కానీ ప్రాసిక్యూషన్ తరఫు నుంచి ఆ ఆరోపణలను నిరూపించడానికి బలమైన ఆధారాలేవీ ప్రవేశపెట్టలేకపోయారు" అని ఆమె చెప్పారు.

ఎన్సీబీ అధికారులు మొదట ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరికాయని చెప్పారు. ఆ తర్వాత ఆర్యన్ డ్రగ్స్ ఉపయోగించినట్లు చెప్పారు. కానీ దానిని నిరూపించడానికి వారి దగ్గర వైద్యపరంగా ఎలాంటి ఆధారాలూ లేవు.

కానీ, ఇప్పుడు ప్రశ్న మళ్లీ మొదటికే వస్తుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధరించడానికి అతడికి వైద్య పరీక్షలు ఎందుకు చేయించలేదు?

ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, SHAHID SHAIKH / BBC

ఫొటో క్యాప్షన్, ఆర్యన్ ఖాన్

ఆర్యన్ ఖాన్ బెయిల్ అంశం

అక్టోబర్ 20న ఆర్యన్ ఖాన్, మరో ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్‌ను ముంబయి ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.

ఆర్యన్ ఖాన్ బెయిల్ తోసిపుచ్చడానికి అతడి వాట్సాప్ చాట్ కారణం అని చెప్పారు. ఆ చాట్స్ ద్వారా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

అంటే కేవలం వాట్సాప్ చాట్ ఆధారంగానే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారా?

జులై 15న ద టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అధ్యక్షతన ఏర్పాటైన ఒక ధర్మాసనం ఒక కేసు విచారణ సందర్భంగా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సందేశాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని చెప్పింది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైనా పోస్ట్ చేయచ్చు, డెలిట్ చేయచ్చు. వాట్సాప్ సందేశాలకు కోర్టులు ప్రాధాన్యం ఇవ్వవు అని సుప్రీంకోర్టు చెప్పినట్లు ఈ రిపోర్టులో రాశారు.

నిందితుడికి వ్యతిరేకంగా ఎన్సీబీ దగ్గర వాట్సాప్ చాట్‌ ఆధారాలు ఉంటే, వారు గుర్తింపును దాచిపెట్టి కోర్టులో దానిని ప్రవేశపెట్టాలని, అభియోగాలపై స్పష్టత ఇవ్వాలని వకీల్ ఆషిమా మండల్ అన్నారు.

కిరణ్ గోస్వామి, ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, Social media

ఫొటో క్యాప్షన్, కిరణ్ గోస్వామి, ఆర్యన్ ఖాన్

సెల్ఫీలో ఉన్న కిరణ్ గోస్వామి ఎవరు?

ఎన్సీబీ దాడుల తర్వాత ఒక వ్యక్తి ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటి నుంచి ఈ సెల్ఫీలో ఉన్న వ్యక్తి ఎవరనే ప్రశ్న కూడా మొదలైంది. దాంతో ఆ సమయంలో ఎన్సీబీతో 9 మంది మధ్యవర్తులు ఉన్నారని వారిలో కిరణ్ గోస్వామి ఒకరని ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు.

తర్వాత కిరణ్ గోస్వామి గురించి మరింత సమాచారం బయటికి రావడంతో ఇది మరింత వివాదాస్పదం అయ్యింది. కిరణ్ గోస్వామిపై 2018 మే 29న ఒక ఫ్రాడ్ కేసు నమోదైంది. ఈ కేసులో పుణె పోలీసులు ఆ కిరణ్ గోస్వామిపై చార్జిషీటు కూడా ఫైల్ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి కిరణ్ గోస్వామి పరారీలో ఉన్నాడు.

పోలీసులు ఆయనపై ఒక లుక్ అవుట్ నోటీస్ కూడా జారీ చేశారని పుణె జోన్-1 డీసీపీ ప్రియాంకా నర్వాణే బీబీసీ మరాఠీకి చెప్పారు. బీబీసీ అక్టోబర్ 25న ప్రియాంకా నర్వాణేను సంప్రదించింది.

"కిరణ్ గోస్వామి ఇప్పటికీ లొంగిపోలేదు. మేం అలర్ట్ అయ్యాం, పోలీస్ స్టేషన్, కోర్టులు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. అతడు కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. మేం కిరణ్ గోస్వామి కోసం గాలిస్తున్నాం" అని చెప్పారు.

ప్రభాకర్ సాయిల్ ఒక వీడియో జారీ చేశారు. సమీర్ వాంఖడే తనను డబ్బు డిమాండ్ చేశారని అందులో ఆరోపణలు చేశారు. ఆయనను కిరణ్ గోస్వామి బాడీగార్డ్ అని ఆ వీడియోలో చెప్పారు. కిరణ్ గోస్వామిపై కూడా ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక్కడ కూడా ఒక ప్రశ్న వస్తుంది. అసలు కిరణ్ గోస్వామి ఎక్కడున్నాడు. మొదట ఈ కేసులో అతడి పేరు బయటికి రాగానే, గోస్వామి కొన్ని మీడియా సంస్థలకు తన స్పందన ఇచ్చాడు. అయితే ఆయన ఎక్కడా కనిపించడం లేదు.

బీబీసీ మరాఠీకి చెందిన మయంక్ భాగవత్, నీలేష్ ధోత్రేతో సోమవారం కిరణ్ గోస్వామితో మాట్లాడారు. ఆయన ప్రభాకర్ సాయిల్ ఆరోపణలను ఖండించారు.

వీడియో క్యాప్షన్, డ్రగ్స్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఎందుకు రావట్లేదు?

శామ్ డిసౌజా ఎవరు. ఈ కేసులో ఆయన పాత్ర ఏంటి?

ఆర్యన్ ఖాన్ కేసులో పదే పదే శామ్ డిసౌజా అనే పేరు వినిపిస్తోంది. ప్రభాకర్ సాయిల్ తన వీడియోలో కూడా శామ్ డిసౌజా పేరు ప్రస్తావించారు.

షారూఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ కిరణ్ గోస్వామిని కలవడానికి వచ్చినపుడు శామ్ డిసౌజా, పూజా ఒకే కార్లో కూర్చుని ఉన్నట్లు చెబుతున్నారు.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సోమవారం తన ప్రకటనలో శామ్ డిసౌజా గురించి ప్రస్తావించారు.

"శామ్ డిసౌజా ముంబయిలో, దేశంలో మనీ లాండరింగ్ చేసే ఒక పెద్ద వ్యక్తి. ఇప్పుడే మొదలైన అది చాలా పెద్ద ఆట. బయటపడిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. దేశభక్తి ముసుగులో కొంతమంది డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. నకిలీ కేసులు నమోదు చేస్తున్నారు" అని సంజయ్ రౌత్ అన్నారు.

అయితే, ఇప్పుడు అసలు శామ్ డిసౌజా ఎవరు, ఈ కేసులో అతడి పాత్ర ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది?

ముంద్రా పోర్ట్

ఫొటో సోర్స్, Reuters

ముంద్రా రేవు కేసులో ఏం చర్యలు తీసుకున్నారు

గత నెలలో గుజరాత్ కచ్ జిల్లాలోని అదానీ గ్రూప్‌కు చెందిన ముంద్రా రేవులో మూడు వేల కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

2021 సెప్టెంబర్ 16న ఈ చర్యలు చేపట్టారు. ముంద్రా రేవులో దొరికిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.21 వేల కోట్లు.

ముంద్రా రేవు కేసు నుంచి దృష్టి మళ్లించడానికే ఎన్సీబీ క్రూయిజ్ మీద చేసిన దాడులు చేసిందని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి.

మరోవైపు, 2021 అక్టోబర్ 6న కేంద్ర హోంమంత్రి అనుమతితో ముంద్రా రేవు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసులో తర్వాత ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)