ఆర్యన్ ఖాన్: షారుఖ్ ఖాన్ కుమారుడికి బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు?

ఫొటో సోర్స్, Deepak Salvi/ANI
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్టోబరు 3న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది.
మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటివరకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోవడమే.
అక్టోబరు 20న ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులకు బెయిల్ జారీ చేసేందుకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది.
‘‘ఆర్యన్ దగ్గర నుంచి ఎలాంటి డ్రగ్స్‌నూ స్వాధీనం చేసుకోలేదు. అయితే, అతడి మిత్రుడు అర్బాజ్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఆయనకు తెలుసు. వారిద్దరూ కలిసే ఉన్నారు. దీన్ని కూడా నేరంగానే (కాన్షియస్ పొసెషన్) పరిగణించాలి’’అని బెయిల్ తిరస్కరించే సమయంలో కోర్టు వ్యాఖ్యానించింది.
అర్బాజ్ మర్చెంట్ నుంచి ఆరు గ్రాముల ‘‘చరస్’’ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Aryan Khan/Instagram
వాట్సాప్ చాట్...
ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణ సమయంలో, ఎన్‌సీబీ సేకరించిన వాట్సాప్ చాట్‌లను కూడా కోర్టు ప్రస్తావించింది.
‘‘ఈ వాట్సాప్ చాట్‌లను పరిశీలిస్తుంటే, డ్రగ్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో ఆర్యన్ చాట్ చేస్తున్నారని స్పష్టం అవుతోంది. పెద్దమొత్తంలో డ్రగ్స్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది’’అని కోర్టు వివరించింది.
‘‘ఈ వివరాలను పరిశీలించిన తర్వాత, నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న వారితో ఆర్యన్‌కు సంబంధాలున్నట్లు అనిపిస్తోంది. తరచూ ఆయన అక్రమ డ్రగ్స్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది.
బెయిల్ జారీచేస్తే, మళ్లీ ఇవే నేరాలను ఆయన చేసే అవకాశం లేకపోలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
‘‘ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తుంటే, ఈ కేసు వెనుక నేరం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరముంది’’అని కోర్టు వివరించింది.

ఫొటో సోర్స్, ANI
ఆర్యన్ న్యాయవాదులు ఏం అంటున్నారు?
ఈ కేసులో ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూలేవని ఆర్యన్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే, ‘‘నిందితులందరూ ఒక నెట్‌వర్క్‌లో భాగంగా కనిపిస్తున్నారు. ఇది పెద్ద నెట్‌వర్క్‌లో భాగమయ్యే అవకాశముంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది.
క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీలో పాల్గొంటుండగా అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.
ముంబయి తీరంలో క్రూయిజ్ నౌకలో జరిగిన ఈ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్యన్‌తోపాటు ఇతర నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని సెక్షన్ 20బీ (డ్రగ్స్ సేకరించడం), 27 (డ్రగ్స్ సేవించడం), 28 (డ్రగ్స్ తీసుకునేందుకు ప్రయత్నించడం), 29 (డ్రగ్స్ తీసుకునేలా ప్రోత్సహించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.

ఫొటో సోర్స్, ANI
ఎన్నో ప్రశ్నలు
ఆర్యన్ ఖాన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకనప్పుడు లేదా ఆయన డ్రగ్స్ ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారాలూ లేనప్పుడు.. ఆయనకు బెయిల్ ఎందుకు దొరకడం లేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీనిపై సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ వికాస్ సింగ్ బీబీసీతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో మీడియా హైప్, ఎన్‌సీబీ అధికారుల తీరు వల్లే ఆర్యన్‌కు బెయిల్ రావడం లేదని ఆయన అన్నారు.
‘‘నిందితుల దగ్గర లభ్యమైన డ్రగ్స్ ఆధారంగా ఈ చట్టం కింద కేసులు నమోదుచేస్తారు. శిక్షలు కూడా వారి దగ్గర దొరికిన డ్రగ్స్ ఆధారంగానే విధిస్తారు.’’
‘‘ఒకవేళ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుని ఉండుంటే, అది బెయిల్ జారీ అయ్యేందుకు వీలైన నేరమే. అయితే, ఈ కేసులో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు పెద్దగా ఆధారాలు కనిపించడం లేదు.’’
అయితే, ఆర్యన్ ఖాన్‌ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పటికీ, అతడి రక్తం, మూత్రం, వెంట్రుకల నమూనాలను పరీక్షల కోసం సేకరించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.
సాధారణంగా డ్రగ్స్ కేసుల్లో నిందితుల రక్తం, మూత్రం, వెంట్రుకల నమూనాలను అధికారులు సేకరిస్తుంటారు.

ఫొటో సోర్స్, Aryan Khan/Instagram
స్మగ్లింగ్‌పై ప్రధానంగా దృష్టి
తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే, ఆర్యన్ ఖాన్ మీద డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ రవాణా తదితర ఆరోపణలపై ఎన్‌సీబీ అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరోపణల వల్లే ఆయనకు బెయిల్ రావడం కష్టం అవుతోందని వివరిస్తున్నారు.
ఈ కేసులో చాలా లోపాలు కనిపిస్తున్నట్లు అడ్వకేట్ ఆశిమా మండ్లా అన్నారు.
‘‘డ్రగ్స్ కలిగి ఉండటం, డ్రగ్స్ వినియోగం తదితర సెక్షన్ల కింద నిందితులపై కేసు మోపారు. అయితే, దీనికి అనుగుణంగా ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోతోంది’’అని ఆమె వివరించారు.
‘‘మొదట ఆర్యన్ దగ్గర డ్రగ్స్ లభించాయని ఎన్‌సీబీ అధికారులు చెప్పారు. అయితే, తర్వాత డ్రగ్స్ దొరకలేదని అన్నారు’’అని ఆశిమా అన్నారు.
‘‘వారు డ్రగ్స్ ఉపయోగించారని అంటున్నారు. కానీ ఆ విషయాన్ని నిరూపించే వైద్య పరమైన ఆధారాలు లేవు.’’
‘‘ఒకవేళ ఆర్యన్ డ్రగ్స్ సరఫరాదారని ఎన్‌సీబీ చెప్పాలని అనుకుంటుందా? ఒకవేళ అదే వారి ఉద్దేశం అయితే, ఇంత తక్కువ మొత్తంలో నౌకలో దొరికిన డ్రగ్స్‌తో ఆ విషయాన్ని నిరూపించడం కష్టం.’’
‘‘కాన్షియస్ పొసెషన్ కింద ఆర్యన్‌పై అభియోగాలు నమోదుచేశారు. అలాంటప్పుడు నౌకలోని అందరిపైనా ఇవే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి కదా? ఎందుకు 20 మందికే పరిమితం అయ్యారు?’’అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ANI
వాట్సాప్ చాట్ ఆధారంగా
ఇప్పటివరకు కేసులో బయటపడిన అంశాలను చూస్తుంటే, వాట్సాప్ చాట్ ఆధారంగా ఎన్‌సీబీ అధికారులు కేసులు నమోదుచేసినట్లు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాది నటి రియా చక్రవర్తి అరెస్టు సమయంలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. డ్రగ్స్ కేసులో రోజులపాటు విచారించిన తర్వాత, గత సెప్టెంబరులో రియాను అరెస్టు చేస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు ప్రకటించారు.
28 రోజలపాటు కస్టడీలో గడిపిన అనంతరం, రియాకు బాంబే హైకోర్టు బెయిలు మంజూరుచేసింది.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు కూడా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 26న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఫొటో సోర్స్, ANI
వాట్సాప్ చాట్ సరిపోతుందా?
డ్రగ్స్ కోసం గుర్తుతెలియని వ్యక్తులతో వాట్సాప్‌లో ఆర్యన్ చాట్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు సమర్పించిన ఆధారాలను బెయిల్ నిరాకరణ సమయంలో కోర్టు ప్రస్తావించింది.
కేవలం వాట్సాప్ చాట్‌ల ఆధారంగానే బెయిల్‌ను నిరాకరించారా? ఇంగ్లిష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా జులై 15న ప్రచురించిన కథనం ప్రకారం.. ఓ కేసును విచారించే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికలపై సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోలేమని వ్యాఖ్యానించారు.
‘‘సోషల్ మీడియాలో నేడు ఎలాంటి వార్తనైనా సృష్టించగలం, తొలగించగలం. మార్పులు చేయగలం. అందుకే వాట్సాప్ సందేశాలకు కోర్టు ప్రాధాన్యం ఇవ్వదు’’అని ఆనాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు.
‘‘ఒకవేళ వాట్సాప్ చాట్‌ల ఆధారంగానే ఎన్‌సీబీ ఆరోపణలు నమోదుచేస్తే, ముందుగా ఆ చాట్‌లను బహిరంగంగా కోర్టు ముందుంచాలి. ఆరోపణల్లో ఎలాంటి అస్పష్టతా ఉండకూడదు’’అని ఆశిమా అన్నారు.
‘‘ఇంటర్నేషన్ డ్రగ్స్ స్మగ్లింగ్ గ్యాంగ్‌లో ఆర్యన్ కూడా భాగమని ఎన్‌సీబీ ఆరోపణలు చేస్తోంది. అందుకే బెయిల్ తిరస్కరణకు గురవుతోంది’’అని న్యాయవాది విరాజ్ గుప్తా అన్నారు.‘‘ఒకవేళ ఆర్యన్ ఖాన్ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్‌లో భాగమైతే, అతడి ఇళ్లలో సోదాలు చేపట్టాలి. బ్యాంకు ఖాతాలపైనా విచారణలు జరగాలి. అయితే, అరెస్టై ఇన్ని రోజులు గడుస్తున్నా అలాంటి వార్తలేమీ బయటకు రాలేదు.’’
ఆర్యన్ బయటకు వస్తే, ఆయనతోపాటు ఆయన కుటుంబం తమ పలుకుబడిని ఉపయోగించి ఆధారాలను తారుమారు చేసే అవకాశముందని ఎన్‌సీబీ చెబుతోంది.

ఫొటో సోర్స్, ANI
హైప్రొఫెల్ అరెస్టులతో..
‘‘ఒకవేళ ఆధారాలను తారుమారు చేస్తారనే బెయిల్‌కు ఎన్‌సీబీ అడ్డుచెబుతుంటే.. వాట్సాప్ చాట్‌లు కాకుండా ఇతర ఆధారాలను సేకరించే దిశగా ఎన్‌సీబీ చర్యలుఎందుకు తీసుకోవడం లేదు?’’అని విరాజ్ ప్రశ్నించారు.
‘‘ఆర్యన్ బ్యాంక్ ఖాతాలను ఎందుకు స్తంభింపచేయలేదు? ఇంకా, ఆ నెట్‌వర్క్‌తో సంబంధమున్న ఇతర సభ్యుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?’’అని ఆయన అన్నారు.
మీడియా దృష్టిని ఆర్షించేందుకే ఎన్‌సీబీ హైప్రొఫైల్ అరెస్టులు చేస్తోందని వికాస్ అన్నారు. ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటివి చేస్తుంటారని వివరించారు.
‘‘గత ఏడాది కూడా చాలామంది సినీ తారల్ని ఎన్‌సీబీ రోజులపాటు విచారించింది.’’
తమ అధికారాలను ప్రజలను వేధించేందుకు ఎన్‌సీబీ ఉపయోగించుకుంటోందని ఆయన అన్నారు. ‘‘ఈ నేరాలకు బాధితులుగా మారిన వ్యక్తులపైనే ఎన్‌సీబీ ప్రధానంగా దృష్టిసారిస్తోంది. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న పెద్దపెద్ద ముఠాల్లోని సభ్యుల్ని పట్టించుకోవడంలేదు’’అని విరాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాపర్ తమ వాడేనంటూ శ్రీచైతన్య, నారాయణ సంస్థల ప్రకటనలు, అసలు మృదుల్ అగర్వాల్ ఎక్కడ చదువుకున్నారు?
- ఆపరేషన్ తర్వాత గాలిని ఇంజెక్ట్ చేసి నలుగురిని చంపేశాడు
- పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తి పెరగడంపై ఆందోళన ఎందుకు?
- India vs Pakistan: ‘అభిమానుల్లో ఇదివరకటిలా ఆవేశం లేదు.. కానీ థ్రిల్ మాత్రం కొనసాగుతోంది’
- దట్టమైన అడవిలో రూ .55,000 కోట్ల విలువైన వజ్రాల గనుల వేట
- సమంత కేసు: యూట్యూబ్ చానళ్లలో ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి
- తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో చెప్పిన జో బైడెన్
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘బూతు’ సంస్కృతి
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








