వజ్రాలు ముఖ్యమా? అడవులా? దట్టమైన అడవిలో రూ .55,000 కోట్ల విలువైన వజ్రాల గనుల వేట

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాకులు దూరని కారడవి. ఓ మధ్యాహ్నం, దట్టమైన టేకు చెట్ల ఆకుల సందుల్లోంచి సూర్య కిరణాలు చొచ్చుకొని నేలను తాకుతున్నాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చిరిగిన బట్టలు ధరించి, ఆకులు, కొమ్మలు ఏరుతున్నారాయన.
ఆయన పేరు భగవాన్ దాస్. గిరిజనులు, చుట్టు పక్కల గ్రామాల వాళ్లు ఆయన దగ్గరకు వైద్యం కోసం వస్తారు. అనారోగ్యంతో ఉన్నవారికి భగవాన్ దాస్ మూలికా వైద్యం చేస్తారు.
ఇంత దట్టమైన అడవిని గనుల కోసం తవ్వితే ఏమవుతుందని ఆయన్ను అడిగాను.
కొద్ది క్షణాల మౌనం తరువాత.. "ప్రజలు చనిపోతారు. ఇదే జరుగుతుంది. ఎందుకంటే, ఔషధ గుణాలున్న చెట్లు, ఆకులు ఈ అడవిలోనే కనిపిస్తాయి. ప్రాణాలను కాపాడే మూలికలు ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడేం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలంతా పోరాడితేనే పోరాటం అవుతుంది. కేవలం మా ఒక్కరి వల్లా ఏమవుతుంది?" అని జవాబిచ్చారు.

అడవిలో మైనింగ్?
ఈ కథ 2002లో ప్రారంభమైంది.
మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్ జిల్లా మధ్యలో ఉన్న అడవి పేరు బక్స్‌వాహా.
ఆస్ట్రేలియాలో పెద్ద పేరున్న సంస్థ రియో-టింటోకు బక్స్‌వాహా అటవీప్రాంతంలో వజ్రాలను కనుగొనే ప్రాజెక్ట్ దొరికింది.
ఇందులో భాగంగా ఈ కంపెనీ ఇక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసింది.
ఏళ్ల తరబడి పరిశోధించి, ఈ అడవి కింద భూమిలో రూ. 55,000 కోట్ల విలువైన వజ్రాలు లభించే అవకాశం ఉందని కనిపెట్టింది.
అయితే, స్థానికంగా నిరసనలు వెల్లువెత్తడం, పర్యావరణ సమస్యల కారణంగా 20016లో రియో-టింటో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
కోట్ల పెట్టుబడి పెట్టిన తరువాత రియో-టింటో ఈ ప్రాజెక్టును అకస్మాత్తుగా ఎందుకు వదులుకుందంటూ అప్పట్లో సందేహాలు తలెత్తాయి.
స్థానికంగా సమస్యలు పెరగడంతో ఒక విదేశీ కంపెనీకి ఇక్కడ ప్రాజెక్ట్ కొనసాగించడం క్లిష్టమై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కాగా, 2019లో కొత్త వేలం పాటలో ఆదిత్య బిర్లా గ్రుప్‌కు చెందిన ఎస్సెల్ మైనింగ్ కంపెనీకి ఇక్కడ వజ్రాలు తవ్వేందుకు లైన్సెన్స్ లభించింది. ఈసారి 382 కోట్ల హెక్టార్ల భూభాగంలో మైనింగ్ జరగాల్సి ఉంది.
అటవీవాసులు ఏమంటున్నారు?
రియో-టింటో ప్రాజెక్టులో భాగంగా కొంతమంది స్థానికులకు ఉపాధి లభించింది. వీరంతా ఇప్పటికీ అడవి మధ్యలో గ్రామాల్లో నివసిస్తున్నవారే.
అలాంటి వారిలో గణేష్ యాదవ్ ఒకరు. రియో-టింటో సంస్థలో గణేష్ చాలా ఏళ్లు పనిచేశారు. కానీ, గణేష్‌కు మనసులో ఒక విచారం మిగిలిపోయింది.
"2004, 2005లోనే ప్రభుత్వంగానీ, ఆ సంస్థగానీ మా పిల్లలకు ప్రేరణ ఇచ్చి ఉంటే బాగుండేది. పెద్దయ్యాక మీరు ఈ పనిలో చేరవచ్చు, అందుకు కావలసిన చదువు చదవండి అని వారిని ఆ దిశగా ప్రోత్సహించి ఉంటే బావుండేది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. అలా చేసి ఉంటే ఈపాటికి వారు డిగ్రీ పూర్తి చేసి లేదా ఏదైనా సాంకేతిక విద్య నేర్చుకుని ఈ రంగంలో పని చేసేందుకు సిద్ధంగా ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ కొత్త ప్లాంటు వచ్చినా, మా పిల్లలకు ఇందులో పనిచేసే సామర్థ్యం లేదు" అని గణేష్ అన్నారు.

ఆదాయనికి ముప్పు
అడవిలో దొరికే బీడీ ఆకులు, ఇప్ప, ఉసిరి కాయలు మొదలైనవాటిని అమ్మడం ద్వారా సుమారు పది వేల మంది తమ కడుపు నింపుకుంటున్నారు.
ఇప్ప, ఉసిరి అమ్మి ఒక సాధారణ కుటుంబం సంవత్సరానికి రూ. 60,000 నుంచి రూ. 70,000 వరకు సంపాదించగలదని అక్కడి గ్రామస్థులు చెప్పారు.
అడవి అంచున ఉన్న షహపురా గ్రామంలో అందమైన మట్టి ఇళ్లు కనిపిస్తాయి. కానీ, ఆ గ్రామ ప్రజలు ముఖాలు వాడిపోయి ఉన్నాయి. మైనింగ్ ప్రారంభమైతే తమ ఆదాయం పోతుందనే చింత వారిలో కనిపిస్తోంది.

"మేమంతా అడవిలో ఏరుకొచ్చిన వాటిని అమ్మి జీవనం సాగిస్తాం. అడవి నరికేస్తే మా గతేంటి? మాకు పొలాలు లేవు. వ్యవసాయం చేయలేం. అడవిపై ఆధారపడి పిల్లలను పొషించుకుంటున్నాం" అని ఆ గ్రావ నివాసి పార్వతి విచారం వ్యక్తం చేశారు.
వజ్రాలపై ఏ మాత్రం ఆసక్తి లేని ప్రజలు బక్స్‌వాహాలో కనిపించారు.
"అడవిని తవ్వితే ధూళి రేగుతుంది. అదే మాకు మిగిలేది. మాకేమైనా వజ్రాలు దొరుకుతాయా? పోనీ ఇక్కడున్న వాళ్లందరికీ ఉపాధి లభిస్తుందా? దుమ్ము, ధూళి తప్ప ఇంకేం ఉండదు మాకు" అని బక్స్‌వాహా నివాసి కీర్తి ఠాకూర్ అన్నారు.

ఒక్కరు కూడా మైనింగ్‌ను వ్యతిరేకించలేదంటున్న ప్రభుత్వం
గ్రామస్థులు ఇలా చెబుతున్నారుగానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరోలా చెబుతోంది.
"గ్రామస్థులందరితో మేం మాట్లాడాం. ఒక్కరు కూడా మైనింగ్‌ను వ్యతిరేకించలేదు. దీనివల్ల ఉపాధి లభిస్తుందని వాళ్లందరికీ తెలుసు" అని రాష్ర ఖనిజ వనరుల శాఖ మంత్రి బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ బీబీసీతో అన్నారు.
అడవిని కొట్టేస్తారని చాలామంది బహిరంగంగా భయం వ్యక్తం చేశారని, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటని బీబీసీ అడిగింది.
"అలాంటిదేమీ మా వరకూ రాలేదు. మీ ముందు అన్నారేమో మరి, నాకు తెలీదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కూడా ఒక బృందాన్ని అక్కడకు పంపారు. మేమూ వెళ్లాం. వ్యక్తిగతంగా, బహిరంగంగా వాళ్లతో మాట్లాడాం. బయటినుంచి వచ్చినవాళ్లు చెబుతున్నారుగానీ స్థానికులు ఎలాంటి నిరసనా వ్యక్తం చేయలేదు" అని మంత్రి జవాబిచ్చారు.

వజ్రాలు తవ్వాలంటే రెండు లక్షల చెట్లను నరకవలసి ఉంటుంది.
"మీరు అక్కడకు వెళ్లారు కదా, చూసే ఉంటారు. అక్కడి భూమి అడవికి చెందినదే కానీ అడవి అంత దట్టమైనదేమీ కాదు. పైగా మేం కొత్తగా పది లక్షల చెట్లను నాటుతున్నాం" అని బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు.
అయితే, వాస్తవాలు వేరుగా ఉన్నాయి.
కొన్ని గంటలు ట్రెక్కింగ్ చేసి బీబీసీ బృందం, అడవి మధ్యలో వజ్రాల మైనింగ్ ప్రారంభమయ్యే చోటుకు చేరుకుంది.
దట్టంగా లేదని ప్రభుత్వం చెబుతోందిగానీ నిజానికి అది కారడవి. చాలా దట్టంగా ఉంది. అడవి లోపల ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడవడానికి కూడా కొన్ని గంటలు పడుతుంది. అది కూడా అడవి జంతువుల మధ్య.
ఎలుగుబంట్లు తవ్విన గోతులు, నీల్‌గాయ్, అడవి దున్నలు, అనేక రకాల పక్షులు మాకు దారిలో కనిపించాయి.

బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్య
వజ్రాల మైనింగ్‌లో రోజుకు లక్షల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది.
ప్రస్తుతం ప్రతిపాదించిన డైమండ్ మైనింగ్‌లో రోజుకు 16,050 క్యూబిక్ మీటర్ల నీరు అవసరం అవుతుందని అంచనా వేశారు. ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రాజెక్ట్ 14 ఏళ్ల పాటు కొనసాగుతుందన్నది గమనార్హం.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చెట్లను నాటడం గురించి మాట్లాడుతోంది. కానీ, వాటికి కూడా నీరు కావాలి కదా.
అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే బుందేల్‌ఖండ్ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత ఉంది. భుగర్భజలాలను మైనింగ్ కోసం వాడేస్తే సమస్య మరింత జటిలం అవుతుందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు.
"నీరు లభ్యత కోణం నుంచి ఈ ప్రాంతాన్ని సెమి-క్రిటికల్ ఏరియాగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు 60 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. దాని కోసం గేల్ నదికి ఆనకట్ట వేసి నీటిని తరలిస్తున్నారు. దాంతో గేల్ నది ఎండిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2,15,875 చెట్లను నరికేయాల్సి వస్తుంది. దాంతో ఇక్కడి నీటి మడుగులు ఎండిపోతాయి. తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది" అని పర్యావరణ కార్యకర్త అమిత్ భట్నాగర్ వివరించారు. అమిత్ చాలా ఏళ్లుగా బక్స్‌వాహాలో పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు.
వేలాది జంతువులతో పాటు అనేక గిరిజన తెగలు వందల ఏళ్లుగా ఈ అడవిలో జీవిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వలన తమ నివాసం కోల్పోతామని వారంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
చెట్లను నరకడం, నీటి సమస్య, ఆదివాసులు, జంతువుల పరిరక్షణ మొదలైన అంశాలపై చర్చించేందుకు మేం ఎస్సెల్ మైనింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను సంప్రదించాం.
కానీ, వీటిపై మాట్లేందుకు ఆ సంస్థ నిరాకరించింది.
ఎస్సెల్ మైనింగ్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడంపై కోర్టుల్లో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో అనేక కేసులు విచారణలో ఉన్నాయి. మైనింగ్ జరుగుతుందా లేదా అనేది వీరి నిర్ణయంపై ఆధారపడి ఉంది.
బక్స్‌వాహా మైనింగ్‌కు వ్యతిరేకంగా ఎన్‌జీటీలో కేసు దాఖలు చేసినవారిలో దిల్లీకి చెందిన నేహా సింగ్ కూడా ఉన్నారు. ఆమె కోవిడ్ నుంచి కొద్ది నెలల ముందే కోలుకున్నారు.
"కోవిడ్ తరువాత స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ విలువ నాకు బాగా అర్థమైంది. మనుషుల సమాధులపై పారిశ్రామికాభివృద్ధి జరగకూడదని ఎన్‌జీటీ ఇంతకుముందే చెప్పింది" అని ఆమె అన్నారు.

వారసత్వ సంపద
బక్స్‌వాహా అడవుల సమీపంలో ఉన్న గుహలపై కనిపించే చిత్రాలు 25,000 సంవత్సరాల పురాతనమైనవని భారత పురావస్తు శాఖ అంచనా వేసింది.
వేల సంవత్సరాల నాటి మానవ చరిత్రకు ఆ బొమ్మలు సాక్ష్యాలుగా నిలిచాయి.
అప్పుడూ ఇక్కడ మనుషులు జీవించారు. ఇప్పుడూ ఉన్నారు.
కానీ, ఇంకెంత కాలమో తెలీదు.
ఇవి కూడా చదవండి:
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- కరోనావైరస్ ఆ తెగలో ఆఖరి పురుషుడిని కూడా బలి తీసుకుంది...
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- క్లౌడ్ సీడింగ్: కృత్రిమ వాతావరణ మార్పులకు పూనుకుంటున్న చైనా.. ఆందోళన వ్యక్తం చేస్తున్న పొరుగు దేశాలు
- 'డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం పాముల వృద్ధికి కారణమైంది'
- విశాఖ, కాకినాడ, అంతర్వేది మునిగిపోతాయా, సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా?
- అమెజాన్ 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా ఫొటోలు
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- నాలుగు కాళ్ల తిమింగలం: ఇది నేలపై నడవగలదు.. నీటిలో ఈదగలదు
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








