నాలుగు కాళ్ల తిమింగలం కొత్త జాతి శిలాజాన్ని ఈజిఫ్టులో గుర్తించిన శాస్త్రవేత్తలు

నాలుగు కాళ్ల తిమింగలం

ఫొటో సోర్స్, DR ROBERT W. BOESSENECKER

ఫొటో క్యాప్షన్, పాక్షికంగా ఉన్న నాలుగు కాళ్ల తిమింగలం అస్థిపంజరాన్ని ఈజిఫ్టులో కనుగొన్నారు.

4 కోట్ల 30 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన నాలుగు కాళ్ల తిమింగలం కొత్త జాతిని ఈజిఫ్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఉభయచరం అయిన 'ఫియామిసీటస్ అనుబిస్‌' శిలాజాన్ని శాస్త్రవేత్తలు ఈజిఫ్టు పశ్చిమ ఎడారిలో గుర్తించారు.

ఈ తిమింగలం పుర్రె, నక్క తలతో ఉండే ప్రాచీన ఈజిఫ్టియన్ మృత్యు దేవత అనుబిస్‌ను పోలి ఉంది. అందుకే దీనికి ఆ దేవత పేరు పెట్టారు.

ప్రస్తుత తిమింగలాల పూర్వీకులు పది మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన జింక లాంటి క్షీరదాల నుంచి అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాయల్ సొసైటీ బి బుధవారం ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 600 కేజీల బరువు, మూడు మీటర్ల పొడవున్న ఈ ఫియామిసీటస్ అనుబిస్‌కు వేటాడే జంతువులను పట్టుకోగలిగేలా బలమైన దవడ కూడా ఉంది.

ఈ తిమింగలం ఉభయచరం. భూమిపై నడవడంతోపాటూ సముద్రంలో ఈదేది.

ఈజిఫ్టులోని ఫాయుమ్ ఒయాసిస్ దగ్గర పాక్షికంగా ఉన్న ఈ తిమింగలం అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దీనిపై మాన్సోరా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

ఈ ప్రాంతం ఇప్పుడు ఎడారిగా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇది సముద్రం. ఇక్కడ చాలా శిలాజాలు లభిస్తున్నాయి.

పెరూలో శాస్త్రవేత్తలు కనుగొన్న నాలుగు కాళ్ల తమింగలం శిలాజం ఊహా చిత్రం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పెరూలో శాస్త్రవేత్తలు కనుగొన్న నాలుగు కాళ్ల తిమింగలం శిలాజం ఊహా చిత్రం

"ఫియామిసీటస్ అనుబిస్ అనేది కొత్త తిమింగలం జాతి. ఈజిఫ్టియన్, ఆఫ్రికన్ పాలయాంటాలజీకి ఇది ఒక కీలక ఆవిష్కరణ" అని ఈ అధ్యయన ప్రధాన రచయత అబ్దుల్లా గోహర్ రాయిటర్స్‌కు చెప్పారు.

అయితే కాళ్లున్న తిమింగలం శిలాజాలు దొరకడం ఇదే మొదటిసారి కాదు. తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఫియామిసీటస్ అనుబిస్‌ను ఆఫ్రికాలో కనుగొన్న మొట్టమొదటి ఉభయచర తిమింగలం శిలాజంగా భావిస్తున్నారు.

మొట్టమొదటి తిమింగలాలు 5 కోట్ల సంవత్సరాల క్రితం మొదట దక్షిణాసియాలో పరిణామం చెందాయని భావిస్తున్నారు.

2011లో ఒక పాలయాంటాలజిస్టుల బృందం పెరూలో 4 కోట్ల 30 లక్షల ఏళ్ల నాటి నాలుగు కాళ్ల పురాతన తిమింగలం శిలాజాన్ని కనుగొంది. దానికి కాలి వేళ్ల మధ్య బాతు కాళ్లకు ఉండేలా చర్మం ఉన్నట్టు ఆ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)