కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?

వర్షాలు

ఫొటో సోర్స్, Bharti Joshi/BBC

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడం, కొండ చరియలు విరిగిపడటం వల్ల కేరళలో 26 మందికిపైగా మరణించారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ మృతుల సంఖ్య 50 దాటింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో అక్టోబర్ 18వ తేదీన ఎల్లో అలర్ట్ కూడా జారీచేశారు.

1960 తర్వాత దేశ రాజధాని దిల్లీలో అక్టోబరులో అత్యధిక వర్షపాతం నమోదైన సంవత్సరం ఇదేనని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 1960లో అక్టోబరులో మొత్తంగా 93.4 మి.మీ.ల వర్షపాతం నమోదు అవ్వగా, ప్రస్తుతం 20వ తేదీ నాటికి 94.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

సాధారణంగా రుతపవనాల ప్రభావం అక్టోబరులో కాస్త తక్కువే ఉంటుంది. అయితే, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి కారణం ఏమిటి?

ఉత్తరాఖండ్ వరదలు

ఫొటో సోర్స్, EPA

రుతుపవనాల తిరోగమనం..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వీటిలో మొదటిది అల్ప పీడనం, రెండోది రుతుపవనాల తిరోగమనం (మాన్‌సూన్ విత్‌డ్రాల్) ఆలస్యం కావడం, మూడోది వాయువ్య ప్రాంతం నుంచి వీచే బలమైన గాలులు (వెస్టర్న్ డిస్టర్బెన్స్). ఈ మూడు పరిణామాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రభావం చూపిస్తున్నాయి.

జూన్ మొదటివారంలో కేరళలో రుతుపవనాలు మొదలవుతాయి. మూడు రోజులు వరసగా 5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురవడంతోపాటు 60 శాతం ప్రాంతాల్లో వర్షం పడితే.. రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ ప్రకటిస్తుంది. ఇవి కేరళ, దక్షిణ కర్నాటకల మీదుగా వెళ్తూ.. జులై రెండో వారం నాటికి రాజస్తాన్‌లోని బికనేర్ వరకు చేరుకుంటాయి. దీంతో భారత దేశం మొత్తానికి రుతుపవనాలు వ్యాపించినట్లు ఐఎండీ ప్రకటిస్తుంది.

రుతు పవనాల నిష్రమణ సెప్టెంబరు మొదటి వారం నుంచి మొదలవుతుంది. వరుసగా ఐదు రోజులు వర్షం లేకుండా ఉండటంతోపాటు గాలుల దిశ మారితే రుతుపవనాల తిరోగమనం మొదలవుతుందని ఐఎండీ ప్రకటిస్తుంది. ఇది బికనేర్ నుంచి మొదలవుతూ కేరళ వరకు వస్తుంది.

అయిత ప్రస్తుతం ఈ తిరోగమనం ఆలస్యం కావడంతో తెలంగాణతోపాటు ఉత్తర భారత దేశంలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ విభాగ కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నాగరత్న చెప్పారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ట్రాన్సిషన్ పిరియడ్‌ అక్టోబర్...

‘‘తెలంగాణలో రుతు పవనాల తిరోగమనం సాధారణంగా అక్టోబరు 15తో మొదలవుతుంది. అయితే, ఈ సారి ఇది అక్టోబరు 23 వరకు ఆలస్యమైంది’’అని నాగరత్న చెప్పారు.

‘‘అక్టోబరును ట్రాన్సిషన్ పిరియడ్‌గా చెబుతుంటారు. అంటే నైరుతి రుతు పవనాలు నిష్ర్కమించడం నుంచి ఈశాన్య రుతుపవనాల ఆగమనం మధ్య కాలం ఇదీ. అయితే, ఇప్పుడు నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యం కావడంతో ఇంకా మనకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో వర్షాలకు ఇవే కారణం. దక్షిణ తెలంగాణలో అక్టోబరు 23 వరకు ఈ ప్రభావం ఉంటుంది.’’

‘‘రుతు పవనాలు నిష్క్రమించిన తర్వాత కూడా, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల తేలికపాటి వర్షాలు పడుతుంటాయి. అయితే, ఇవి అంత ప్రభావాన్ని చూపవు’’అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం ఉత్తర తెలంగాణతో మొదలుపెట్టి హైదరాబాద్, నల్గొండ వరకు రుతు పవనాల నిష్క్రమణ పూర్తైందని నాగరత్న చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ రెండు, మూడు రోజుల్లో రుతు పవనాలు నిష్క్రమిస్తాయని ఆమె వివరించారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో వరదలకు కారణం...

కేరళలో కుండపోత వర్షాలకు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రధాన కారణమని ఐఎండీ వెల్లడించింది. బంగాళా ఖాతంలో ఒకటి, అరేబియా సముద్రంలో మరొకటి అల్ప పీడనాలు ఏర్పడినట్లు పేర్కొంది.

ఈ అల్ప పీడనం వల్ల అక్టోబరు 1 నుంచి 19 మధ్య సగటు కంటే 135 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

‘‘అక్టోబరులో సాధారణంగా కేరళలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంటాయి. అయితే, రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యం కావడంతోపాటు ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీగా వర్షాలు పడుతున్నాయి’’అని వాతావరణ శాస్త్రవేత్త డా. ఏ శ్రావణి చెప్పారు.

కేరళ వరదలు

‘‘ప్రస్తుతం ఈ అల్ప పీడనం బలహీనపడింది. దీంతో అతిభారీ వర్షాలు తగ్గాయి. కేరళతోపాటు దక్షిణ కర్నాటకలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది’’అని ఆమె చెప్పారు.

అయితే, అల్ప పీడన ప్రభావం తగ్గినప్పటికీ, రుతుపవనాల నిష్క్రమణ ప్రభావంతో కేరళలో వర్షాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు.

మరోవైపు రానున్న ఐదు రోజుల్లో కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది.

ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ప్రమాద స్థాయిలో పొంగి పొర్లుతున్న నదులు తాజా కుంభవృష్టితో మరిన్ని ప్రాంతాలను ముంచెత్తే ముప్పుంది.

ఉత్తరాఖండ్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తరాఖండ్‌లో వరదలకు కారణం..

మరోవైపు ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే రుతు పవనాలు నిష్క్రమించాయి. అయినప్పటికీ, ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

‘‘జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌ల నుంచి నైరుతి రుతు పవనాలు నిష్క్రమించిన మాట వాస్తవమే. అయితే, నైరుతి రుతు పవనాల నిష్క్రమణ అనంతరం ఇక్కడ వాయువ్య ప్రాంతం నుంచి వీచే బలమైన గాలులు (వెస్టెర్న్ డిస్టర్బెన్స్) మొదలవుతాయి. వీటి వల్ల జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ లాంటి ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో వాతావరణం ప్రభావితం అవుతోంది. దీంతో అక్కడ వర్షాలు, హిమపాతం కురుస్తుంటుంది.’’

వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో అక్టోబరు 18, 19న ఉత్తరాఖండ్‌లో భారీగా వర్షపాతం నమోదైంది. నైనీతాల్, చంపావత్, పంచేశ్వర్ లాంటి ప్రాంతాల్లో అయితే, 500 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి.

అయితే, ఈ వర్షపాతం తూర్పువైపుగా కదిలి ఉత్తర్ ప్రదేశ్, బిహార్, సిక్కిం, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లవైపు మళ్లుతుందని ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో దిల్లీతోపాటు ఉత్తర, మధ్య భారత దేశంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తరాఖండ్ వరదలు

ఫొటో సోర్స్, EPA

కోస్తా ఆంధ్రా, తమిళనాడుల్లో..

సాధారణంగా అక్టోబరు మధ్యనాటికి నైరుతి రుతుపవనాలు తమ దిశను మార్చుకుని ఈశాన్య రుతు పవనాలుగా మారుతాయి. ఫలితంగా కోస్తా ఆంధ్రాతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తర కర్నాటకలతోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.

అయితే, నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యం కావడంతో, ఈశాన్య రుతుపవనాల ఆగమనం కూడా ఆలస్యం అవుతుందని విశాఖపట్నంలోని సైక్లోన్ సెంటర్‌ హెడ్ సునంద చెప్పారు.

‘‘పశ్చిమ పవనాల ప్రాంతాన్ని తూర్పు పవనాలు భర్తీ చేస్తున్నాయి. అయితే, ఇంకా బలపడాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా బలపడిన తర్వాతే, ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. దీంతో దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ, తమిళనాడు, దక్షిణ కర్నాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి’’అని ఆమె వివరించారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, ANI

అక్టోబరు 25 తర్వాతే, ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యే అవకాశముందని ఐఎండీ కూడా అంచనా వేసింది. అంటే ఉత్తరాఖండ్‌తోపాటు తెలంగాణలో వర్షాలు ముగిసినప్పటికీ.. కేరళ, తమిళనాడుతోపాటు కోస్తా ఆంధ్రాలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి.

''సాధారణంగా అక్టోబరును తుపానుల కాలంగా చెబుతారు. ఎందుకంటే నైరుతి, ఈశాన్య రుతుపవనాల మధ్య ట్రాన్సిషన్ పిరియడ్‌లో ఎక్కువగా తుపానులు ఏర్పడుతుంటాయి''అని సునంద అన్నారు. అయితే, నేడు తుపానులతోపాటు భారీ వర్షాలు కూడా ఈ నెలలో విపరీతంగా కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)