పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?

పెగాసస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ)పై పార్లమెంటరీ స్థాయీ సంఘం రెండో రోజు సమావేశం జూలై 28, బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే, హోం, ఐటీ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నట్లు, గంట ముందు సమాచారం వచ్చిందని కమిటీ సభ్యుడు పీఆర్ నటరాజన్ వెల్లడించారు.

ఇలా ఏ కారణం చెప్పకుండా మంత్రిత్వ శాఖల అధికారులు సమావేశాలకు హాజరు కాకపోవడం ఇంతకు మునుపు జరగలేదని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని నటరాజన్ తెలిపారు.

ఈ సమావేశానికి బీజేపీ సభ్యులు వచ్చారుగానీ, మీటింగ్ రిజిస్టర్‌లో సంతకం పెట్టడానికి నిరాకరించారని, కోరం లేకపోడంతో సమావేశం జరగలేదని కమిటీకి చెందిన ఒక సభ్యుడు మరో కథనాన్ని వినిపించారు.

కొన్ని అత్యవసర లేదా ఇతర కారణాల వల్ల మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాలేకపోవచ్చు. కానీ, అందుకు ఏ కారణాలూ చెప్పకపోవడం లేదా తమకు బదులు వేరే అధికారులను పంపించకపోవడం ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు.

మంత్రిత్వ శాఖ అధికారులు స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాకపోవడంతో చైర్మన్ శశి థరూర్‌ ఆశ్చర్యపోయారని చెప్పారు.

పెగాసస్

ఫొటో సోర్స్, Getty Images

మొదటగా బహిష్కరించిన బీజేపీ నేతలు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శశి థరూర్ ఈ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించడంలో "వ్యక్తిగత ఎజెండాను" అనుసరిస్తున్నారని చెబుతూ బీజేపీ ఎంపీలు 27వ తేదీ, మంగళవారం జరిగిన మొదటి రోజు సమావేశాన్ని బహిష్కరించారు.

"పార్లెమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్‌సభ, రాజ్యసభలను నడపడం మా పని. మధ్యలో ఇలాంటి సమావేశాలు పెట్టడం అనుచితం కాదు" అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం పట్ల బీజేపీ నేతలకు ఎందుకంత విముఖత? కారణాలేంటి?

అంతర్గత గోప్యత కారణంగా, ఈ స్టాండింగ్ కమిటీ సభ్యుడు శక్తి సింగ్ గోహిల్ ఈ సమావేశంలో చర్చిస్తున్న విషయాలను బహిరంగపరచలేదు.

కానీ, మీడియా రిపోర్టుల ప్రకారం, సినిమాటోగ్రాఫ్ ముసాయిదా బిల్లు - 2021ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పనితీరును సమీక్షించడమే ఈ కమిటీ సమావేశాల అజెండా అని తెలుస్తోంది. ఇందులో 31 మంది సభ్యులు పాలుపంచుకుంటున్నారు.

కాగా, ప్రజల డేటాను, ప్రైవసీని రక్షించడం, సైబర్ సెక్యూరిటీ ఈ కమిటీ సమావేశాల అజెండాలో భాగమని పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శశి థరూర్ చెప్పారు.

మరోవైపు, శశి థరూర్‌ను ఈ కమిటీ నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు.

"ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కమిటీలో చర్చించిన విషయాలు ముందుగా మీడియాకు లీకు అవుతున్నాయి. ఆయనను కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. అంతవరకూ ఈ కమిటీ సమావేశం జరగకూడదు" అంటూ దూబే ట్వీట్ చేశారు.

పెగాసస్

ఫొటో సోర్స్, Getty Images

పెగాసస్‌పై చర్చలు ఎందుకు జరగట్లేదు?

ఎంతోమంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి.

దీనిపై చర్చ చేపట్టాలని, దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందో, లేదో స్పష్టం చేయాలని కోరాయి.

అయితే, ఈ ఆరోపణలన్నిటినీ 'ఫేక్ న్యూస్ ' అంటూ కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది.

పెగాసస్ విషయం తేల్చాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూనే ఉన్నాయి.

"ఏ విషయంపైనైనా మీడియాతో చర్చించడానికి అభ్యంతరం లేదని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారుగానీ, పెగాసస్ విషయంలో మాత్రం పెదవి విప్పడం లేదు" అని సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి అన్నారు.

"ఐటీ స్టాండింగ్ కమిటీలో చర్చలు శాంతియుతంగానే జరుగుతాయి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కృతమవుతాయనే, అనేక అంశాలు కమిటీ వరకూ వస్తాయి. అలాంటి కమిటీ నుంచే బీజేపీ వాకవుట్ చేసిందంటే పెగాసస్‌పై చర్చలకు వారు ఎంతమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. పార్లమెంటులో పలు అంశాలపై చర్చలు జరగకపోవడం, ఇలా కమిటీల నుంచి వాకవుట్ చేయడం ఆందోళన కలిగించే విషయాలు. ఇలా జరుగుతూ ఉంటే, పార్లమెంటు ఔచిత్యం దెబ్బ తింటుంది.’’

‘‘ఇంత గొడవ చేసే బదులు పార్లమెంటులో వారి వారి వాదనలను గట్టిగా వినిపించడం, బలమైన ఆధారాలు చూపించడం చేయొచ్చు. కానీ, ఈసారి ప్రభుత్వం ఎంత మొండిగా ఉందంటే, గొడవ చేయడం తప్ప ప్రతిపక్షాల వద్ద మరో మార్గం లేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై నిషికాంత్ దూబే, రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్‌‌‌లను సంప్రదించడానికి ప్రయత్నించాం. కానీ ఎలాంటి స్పందనా రాలేదు.

పెగాసస్

ఫొటో సోర్స్, Getty Images

పెగాసస్‌పై ప్రభుత్వం ఏమంటోంది?

పెగాసస్‌పై ప్రభుత్వం చర్చించకపోవడానికి పలు కారణాలు వినబడుతున్నాయి.

మొదటగా, ఈ కేసు.. ద్రవ్యోల్బణం, ఆహార కొరత లేదా కోవిడ్‌లా సామాన్య ప్రజలను ప్రభావితం చేసే సమస్య కాదని, ఇది త్వరగానే మీడియా నుంచి కనుమరుగైపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రెండవది, ప్రతిపక్షంలో ఐక్యత లేకపోవడం, పెగాసస్‌లాంటి వాటి వలన పొంచి ఉన్న ముప్పును సామాన్య ప్రజలకు సులువైన మాటల్లో చెప్పగల సత్తా ఉన్న నాయకులు లేకపోవడం. అయితే, పి. చిదంబరం లాంటి వాళ్లు ప్రభుత్వానికి అడ్డుపుల్ల వేయగలరు.

పార్లమెంటు

ఫొటో సోర్స్, ANI

కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి

బీజేపీ నేతలు కమిటీ సమావేశాలను బహిష్కరించడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.

వాస్తవానికి, మంగళవారం స్టాండింగ్ కమిటీ మొదటి రోజు సమావేశం ప్రారంభం కావడానికి మూడు గంటల ముందు, మధ్యహ్నం ఒంటిగంటకు కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ కార్యాలయం నుంచి తనకు కాల్ వచ్చిందని, రెండు గంటలకు భూపేంద్ర యాదవ్‌తో సమావేశం కావాలని చెప్పినట్లు కమిటీ సభ్యుడు, సీపీఎం పీఆర్ నటరాజన్ బీబీసీకి చెప్పారు.

అయితే, నిర్ణీత సమయానికి అక్కడకు చేరిన తరువాత, ఆ సమావేశం బీజేపీ సభ్యుల కోసం మాత్రమేనని తెలిసిందని, అనంతరం బీజేపీ సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించారని ఆయన అన్నారు.

మరో కమిటీ సభ్యుడు కూడా ఇదే మాట చెప్పారు. ఆయనకు కూడా కార్మిక మంత్రి ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. కానీ, మరో 15 నిమిషాల తరువాత ఇంకో కాల్ చేసి భూపేంద్ర యాదవ్‌తో సమావేశం కానక్కర్లేదని చెప్పారు.

"బీజేపీ మంత్రుల నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. బీజేపీ హైకమాండ్ నుంచి వారికి ఆదేశాలు వచ్చాయి" అని నటరాజన్ అన్నారు.

స్టాండింగ్ కమిటీ తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై చైర్మన్ శశి థరూర్ నిర్ణయం తీసుకుంటారని ఒక సభ్యుడు, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మరొక సభ్యుడు తెలిపారు.

పెగాసస్‌పై చర్చించడానికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తే మేలని ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన గడ్డం రంజిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)