పెగాసస్: సైబర్ దాడితో భారత ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మీ వ్యక్తిగత గోప్యతా హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని అనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది క్షమించరాని నేరం. ఎవరి వ్యక్తిగత గోప్యతకూ భంగం కలగకూడదు'' అని ది వైర్ సహవ్యవస్థాపకుడు సిద్ధార్ధ్ వరదరాజన్ అన్నారు.
మీడియా రిపోర్టుల ప్రకారం.. ఇజ్రాయెల్ సంస్థ ప్రభుత్వాలకు అమ్మిన ఫోన్ సాఫ్ట్‌వేర్‌తో టార్గెట్ చేసిన కార్యకర్తలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, లాయర్లలో సిద్ధార్ధ్ వరదరాజన్ కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్ సంస్థ క్లయింట్స్ ఆసక్తి కనబరిచిన 50 వేల మొబైల్ నంబర్లలో 300లకు పైచిలుకు నంబర్లు భారతీయులకు చెందినవని ది వైర్ పేర్కొంది.
పెగాసస్ స్పై వేర్‌పై పరిశోధన జరిపిన 16 అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ది వైర్ కూడా ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
2019లోనూ
వినియోగదారులకు తెలియకుండా స్మార్ట్ ఫోన్లలో చొరబడి, వారి డేటా అంతటినీ గుప్పిట్లోకి తెచ్చుకోగల పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు రూపొందించింది.
జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పెగాసస్‌ను ప్రయోగించడం ఇదేమీ తొలిసారి కాదు.
2019లో కొందరు యూజర్లను పెగాసస్‌తో టార్గెట్ చేశారని వాట్సాప్ ప్రకటించడంతో భారత్, ఇతర దేశాల్లో పెద్దయెత్తున నిరసనలు పెల్లుబిక్కాయి.
అప్పట్లో భారత్‌కు చెందిన 121 మంది ఈ సాఫ్ట్‌వేర్ బారిన పడ్డారు. వీరిలో కార్యకర్తలు, స్కాలర్లు, జర్నలిస్టులు ఉన్నారు. అయితే, దీని వెనుక భారత ప్రభుత్వానికి చెందిన నిఘా వర్గాల ప్రమేయం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
దాదాపు 1400 మొబైల్ ఫోన్లపై సైబర్ దాడులకు పాల్పడినందుకు ఎన్ఎస్ఓ గ్రూపుపై వాట్సాప్ దావా కూడా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు చేయించారు?
తాజాగా జరిగిన సైబర్ దాడిని ఎవరు చేయించారు? లీకైన ఫోన్ నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని ఫోన్లు హ్యాక్ అయ్యాయి? అనే చిక్కుముళ్లకు ఇంకా సమాధానం దొరకలేదు.
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఎన్ఎస్ఓ గ్రూపు తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇవి సత్యదూరమని తెలిపింది.
‘సాఫ్ట్‌వేర్‌ను తప్పుడు మార్గాల్లో వాడారనే విశ్వసనీయ సమాచారంపై మేం దర్యాప్తు చేస్తాం. వచ్చే ఫలితాల ఆధారంగా చర్యలు కూడా తీసుకుంటాం’ అని ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా నిఘా ఆరోపణలను తోసి పుచ్చింది.
‘దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు’ భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చు. హోం మంత్రిత్వ శాఖలోని బాగా సీనియర్ ఆఫీసర్ మాత్రమే ఈ ఆదేశాలు ఇవ్వగలరు. అయితే, ఈ ఆదేశాలు ఎలా ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు’ అని దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఫెలోగా ఉన్న మనోజ్ జోషీ చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఫోన్లలో నిఘాపై 2019లో పార్లమెంటులో జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ ఎంపీ కేకే రాగేశ్ ప్రభుత్వంపై చాలా ప్రశ్నలు సంధించారు.
పెగాసస్ స్పై వేర్ భారత్‌లోకి ఎలా వచ్చింది? ప్రభుత్వంపై పోరాడుతున్న వ్యక్తులనే ఎందుకు టార్గెట్ చేశారు? దేశ రాజకీయ నాయకులపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను ప్రభుత్వం తీసుకురాలేదంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? లాంటి ప్రశ్నలను ఆయన సంధించారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, క్రిమినల్స్, తీవ్రవాదుల చర్యలను ముందుగానే గుర్తించి, నిలువరించేందుకే ఈ టెక్నాలజీలను ప్రభుత్వ భద్రతా, నిఘా సంస్థలకు అమ్ముతామని ఎన్ఎస్ఓ చెబుతోంది.
భారత్‌లో పది సంస్థలకు చట్టబద్ధంగా ట్యాపింగ్ చేసే అధికారం ఉంది. వీటిలో అత్యంత శక్తిమంతమైనది, అతి పెద్ద నెట్వర్క్ ఉన్నది 134 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో.
తీవ్రవాదంపై నిఘా ఉంచడమే కాకుండా జడ్జిల వంటి ఉన్నత పదవులకు దరఖాస్తు చేసుకునే వారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ కూడా ఈ సంస్థ చేస్తుంది. రాజకీయ నాయకులు, ఎన్నికలపై కూడా ఇది నిఘా పెడుతుందని ఒక నిపుణుడు వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను తెలుసుకునేందుకు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను వాడుకుంటున్నట్లు గత అనుభవాలను పరిశీలిస్తే మనకు అర్థం అవుతోంది.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
అప్పట్లో ఆరోపణలు..
1988లో 50 మంది సహోద్యోగులతో పాటు ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్‌కి ఆదేశాలు జారీ చేశారన్న ఆరోపణల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేశారు.
1990లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తనతో పాటు 27 మంది రాజకీయ నాయకుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తోందని మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
2010లో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాతో సంభాషించిన ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులకు చెందిన 100 టేపులను ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారులు మీడియాకు లీక్ చేశారు.
ఈ రికార్డింగులు తనకు వాటర్‌గేట్ కుంభకోణాన్ని గుర్తు చేస్తున్నాయని నాటి ప్రతిపక్ష నాయకుడు ఎల్కే అద్వానీ అన్నారు.
‘‘నాటికి, నేటికి మధ్య తేడా ఏమిటంటే.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారిపై నిరంతరం ఎలాంటి అనుమానం రాకుండా నిఘా ఉంచడమే’’ అని టెక్నాలజిస్టు, పబ్లిక్ పాలసీ రిసెర్చర్ రోహిణీ లక్షణే తెలిపారు.

ఫొటో సోర్స్, NurPhoto/Getty Images
నిఘా ఆదేశాలివ్వడానికి భారత్‌లో అమెరికా మాదిరి ప్రత్యేక కోర్టులేవీ లేవు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మనీశ్ తివారీ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఉన్న ప్రత్యేక అధికారంపై నియంత్రణ తెచ్చేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు వీగిపోయింది.
‘ప్రజల వ్యక్తిగత విషయాలపై నిఘా పెడుతున్న సంస్థలను చూసీచూడనట్లుగా వదిలేయకూడదు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రైవేటు బిల్లును తిరిగి ప్రవేశపెడతాను’ అని ఆయన చెప్పారు.
‘పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎలక్ట్రానిక్ నిఘా పెడుతోంది. భారత్‌లో దీనికి ఎలాంటి సంరక్షణలు లేవు’ అని భారత్‌లో నిఘా సంస్కరణల ఆవశ్యకతను రోహిణీ లక్షణే నొక్కి చెప్పారు.
ఈ వారం పార్లమెంటులో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. సేకరించిన డేటా పరిశీలించిన తర్వాత ఏమవుతుంది? డేటాను ఎక్కడ భద్రపరుస్తున్నారు? ప్రభుత్వంలో ఎవరికి దాన్ని తీసుకునే అధికారం ఉంది? ప్రభుత్వ సంస్థలు కాకుండా ఇతర సంస్థలకు డేటాను ఇస్తున్నారా? ఎలాంటి సాంకేతిక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అనే కఠిన ప్రశ్నలు వేయడానికి ఇదే సరైన సమయమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- Cyber attack: మైక్రోసాఫ్ట్ సర్వర్లపై చైనా భారీ సైబర్ దాడికి పాల్పడిందని బ్రిటన్, ఈయూ ఆరోపణలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








