Cyber attack: మైక్రోసాఫ్ట్ సర్వర్లపై చైనా భారీ సైబర్ దాడికి పాల్పడిందని బ్రిటన్, ఈయూ ఆరోపణలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గోర్డాన్ కొరెరా
- హోదా, సెక్యూరిటీ కరెస్పాండెంట్
ఈ ఏడాది ప్రారంభంలో చైనా భారీ సైబర్ దాడికి పాల్పడిందని బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ఆరోపించాయి.
ఈ దాడి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్లే లక్ష్యంగా జరిగింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా సర్వర్లు ప్రభావితం అయ్యాయి.
ఈ దాడిని ఎదుర్కోవడానికి 70కి పైగా బాధిత సంస్థలకు బ్రిటన్‌లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) సలహాలు, సూచనలు అందించింది.
‘చైనా భూభాగం’ నుంచే ఈ దాడి జరిగిందని మొదట ఈయూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ‘ చైనా ప్రభుత్వ మద్దతుగల వారే ఈ దాడికి బాధ్యులని’ బ్రిటన్ కూడా పేర్కొంది. ఈ ఆరోపణలు చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా కూడా చేరే అవకాశముంది.
అయితే, ఈ ఆరోపణలు అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని చైనా అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
గూఢచర్య, నిఘా కార్యకలాపాలకు చైనా ప్రభుత్వమే కారణమని బ్రిటన్, ఈయూ పేర్కొన్నాయి.
అమెరికా, బ్రిటన్ తరచుగా సైబర్ భద్రతపై ప్రచారాలు నిర్వహించాలని ఇతర దేశాలకు పిలుపునిస్తుంటాయి. ఈయూ ప్రోత్సాహంతో ఈ క్యాంపెయిన్‌లో చేరిన చైనా నేడు సైబర్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది.
చైనా ధోరణి నానాటికీ ప్రమాదకరంగా మారుతోందని పాశ్చాత్య ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కంప్యూటర్లలో వెబ్ షెల్స్ చేర్చే విధంగా హ్యాకర్లు ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ వెబ్ షెల్స్ సైబర్ నేరాలకు అనువుగా ఉండి భవిష్యత్‌లో మరిన్ని సైబర్ దోపిడీలకు వీలు కల్పిస్తాయి.
రాన్సమ్ వేర్ దాడులు, గూఢచర్య కార్యకలపాలు సులువుగా చేసేందుకు ఈ వ్యవస్థ తోడ్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈమెయిల్ సైబర్ దాడి కూడా..
‘మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్లపై చైనా ప్రభుత్వ ప్రోద్బలం ఉన్న గ్రూపులు చేసిన సైబర్ దాడి... నిర్లక్ష్య పూరితమైనది, ఇది వారి వైఖరిని ప్రతిబింబిస్తోంది’అని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ అన్నారు.
‘ఈ సైబర్ విధ్వంసానికి చైనా ప్రభుత్వం ముగింపు పలికి తీరాలి. అలా చేయని పక్షంలో ఈ దాడులకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ దాడి వ్యక్తిగత సమాచారాన్ని, మేధో సంపత్తిని స్వాధీనం చేసుకోవడంతో పాటు గూఢచర్య కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తుందని యూకే విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
‘సైబర్ దాడులకు ముగింపు పలకాలని పదే పదే ఇచ్చిన పిలుపులను చైనా ప్రభుత్వం విస్మరించింది. అంతేకాకుండా తమ ప్రోద్బలం ఉన్న గ్రూపులు పెద్ద మొత్తంలో దాడులు చేసేందుకు అనుమతించింది. పోలీసులకు పట్టుబడిన సందర్భాల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించేలా హ్యాకర్లను ప్రోత్సహిస్తోంది‘ అని యూకే విదేశాంగ కార్యాలయం వెల్లడించింది.
ఈ హ్యాకర్ల వివరాలను మైక్రోసాఫ్ట్ మార్చిలో ప్రకటించింది. చైనాతో సంబంధాలున్న హాఫ్నియం అనే గ్రూప్ ఈ దాడికి కారణమని తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ ఆరోపణలను చైనా కొట్టివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈయూ తరఫున విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాలకు చెందిన అత్యున్నత ప్రతినిధి ఈ దాడిపై ఓ ప్రకటనను విడుదల చేశారు.
‘మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్లపై జరిగిన దాడితో వేల సంఖ్యలో కంప్యూటర్లు ప్రభావితయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈయూ సభ్య దేశాల, ఈయూ సంస్థల నెట్‌వర్క్‌లు ప్రమాదంలో పడ్డాయి.’
‘ఈ నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర ధోరణి.. మా ప్రభుత్వ సంస్థల, ప్రైవేట్ కంపెనీల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. ఆర్థిక నష్టాలనూ తెచ్చిపెట్టింది. భద్రత, ఆర్థిక వ్యవస్థలపై పెద్ద ప్రభావాన్ని చూపించింది’.
ఈ ఆందోళనకర పరిస్థితులకు కారణమైన చైనా ధోరణులను ఈయూ గుర్తుంచుకుంటుందని ఈయూ ప్రకటనలో వెల్లడించింది.
‘ఈయూతో పాటు సభ్యదేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, రాజకీయ సంస్థలు, పారిశ్రామిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న మాల్‌వేర్‌ను గుర్తించాం’అని వెల్లడించింది.
ఈ సైబర్ దాడులన్నీ చైనాలోని రెండు గ్రూపుల(ఏపీటీ 40, ఏపీటీ 3) పనే అని ఈయూ పేర్కొంది. ఈ రెండు గ్రూపులపై... నిఘా పెట్టడం, గూఢ చర్యం, మేధోసంపత్తి సమాచార చౌర్యం తదితర ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








