సినిమాటోగ్రాఫ్ యాక్ట్: కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును సినీ ప్రముఖులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘సినిమా, మీడియా, సాహిత్యం.. ఈ మూడూ చెడు వినను, చెడు చూడను, చెడు మాట్లాడను అంటూ చెప్పే మూడు కోతుల ముచ్చటగా మిగిలి పోకూడదు. ప్రజాస్వామ్యంలో జరిగే చెడు పరిణామాలను అడ్డుకోవాలంటే మనం దాని గురించి వినాలి. చూడాలి. మాట్లాడుకోవాలి’’ఇవి సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు.
‘‘స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం మాతో మీ గొంతు కలపండి’’అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఆయన రెండు హ్యాష్ ట్యాగ్‌లు (#cinematographact2021 #raiseyourvoice) పెట్టారు.
ఈ హ్యాష్ ట్యాగ్‌లను గమనిస్తే, ఆయన సినిమాటోగ్రాఫ్ ముసాయిదా బిల్లు గురించి మాట్లాడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
సినిమాటోగ్రాఫ్ చట్టం-1952కు సవరణగా తీసుకొచ్చిన ఈ బిల్లుపై జులై 2లోగా మీ సలహాలు, సూచనలు అందించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గత నెలలో కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
వెల్లువెత్తిన విమర్శలు
అయితే, ఈ బిల్లుపై సలహాలు, సూచనల కంటే విమర్శలే ఎక్కువ వెల్లువెత్తాయి. దీనిలోని నిబంధనలపై ఆందోళన వ్యక్తంచేస్తూ వెయ్యిమందికిపైగా ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి సంయుక్తంగా ఓ లేఖ రాశారు.
ఈ లేఖ రాసిన వారిలో అనురాగ్ కశ్యప్, వెట్రి మారన్, ఫరాన్ అక్తర్, షబానా ఆజ్మి, నందితా దాస్ తదితర సినీ ప్రముఖులు ఉన్నారు.
ఈ ముసాయిదా బిల్లుకు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
కమల్ హాసన్‌తోపాటు తమిళ కథానాయకులు సూర్య శివకుమార్, కార్తి శివకుమార్, విశాల్, డైరెక్టర్లు కార్తిక్ సుబ్బరాజ్, పా రంజిత్ తదితరులు కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.
తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాశ్ రాజ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కథానాయిక ప్రణీత కూడా దీని గురించి స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ బిల్లులో ఏముంది?
భారత్‌లో విడుదలయ్యే సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సర్టిఫికేట్లు జారీ చేస్తుంటుంది. ఇక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిల్మ్ సర్టిఫికేట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎఫ్‌సీఏటీ)ను ఆశ్రయించాల్సి ఉంటుంది.
అయితే, గత ఏప్రిల్‌లో ఎఫ్‌సీఏటీని రద్దు చేశారు. అనంతరం కొద్ది రోజులకే ఈ కొత్త ముసాయిదాను తెరపైకి తీసుకొచ్చారు.
సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం.. సినిమా సర్టిఫికేషన్ మళ్లీ జరిపించాలని ఆదేశించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అయితే, ఒకసారి సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ పూర్తయిన తర్వాత, దాన్ని మళ్లీ సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సూచించకూడదని కె.ఎం.శంకరప్ప వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కర్నాటక హైకోర్టు తీర్పు నిచ్చింది.
ఈ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీం కోర్టు కూడా కర్నాటక హైకోర్టు తీర్పుకే మద్దతు పలికింది.
ప్రస్తుత ముసాయిదాలో ఈ నిబంధనల్లో మార్పులు చేశారు. సెక్షన్ 5బీ(1) పేరుతో కేంద్రం తాజాగా కొత్త నిబంధన తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అవసరమైతే, సదరు సినిమాకు మళ్లీ సర్టిఫికేషన్ చేయాలని కోరే అధికారాన్ని కేంద్రానికి ఈ నిబంధన కల్పిస్తోంది. అంటే ఆ సినిమాను మళ్లీ చూసి సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీ చైర్మన్‌కు కేంద్రం ఆదేశాలు జారీచేయొచ్చు.
ప్రస్తుతం ఈ నిబంధన చుట్టూనే వివాదం మొత్తం తిరుగుతోంది. ‘‘ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణ సినీ పరిశ్రమకు గొడ్డలి పెట్టులాంటిది. భావ ప్రకటన స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కులను ఇది హరిస్తోంది’’అని లేఖలో బాలీవుడ్ ప్రముఖులు వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దుచేసే అధికారాలను ఈ ముసాయిదా కేంద్రానికి కల్పిస్తోంది. దీంతో చిత్ర పరిశ్రమలో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఫలితంగా వాణిజ్యపరమైన అవకాశాలు దెబ్బతింటాయి. ఇలాంటి నిబంధనలను అడ్డుకోవాలి’’అని సినీనటుడు కార్తి వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు ఎక్కడుంది? ఇక సెన్సార్ బోర్డు ఉండీ ఎందుకు? ఇలాంటి క్లిష్టమైన విధానాలను అనుసరించడం ఎందుకు? ఎప్పుడూ సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుంటారు ఎందుకు? మొదట్లో జీఎస్టీ అన్నారు.. తర్వాత పైరసీపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.. ఇప్పుడేమో ఇలాంటి చట్టాలను తీసుకొస్తున్నారు’’అని విశాల్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
వయసు ఆధారంగా సర్టిఫికేట్..
ప్రస్తుతం సినిమాలకు మూడు కేటగిరీల్లో సర్టిఫికేట్లు జారీచేస్తున్నారు. ఎలాంటి అభ్యంతరాలూలేని సినిమాలకు యూ, 12ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి చూడగలిగే సినిమాలకు యూ/ఏ, పెద్దవారు మాత్రమే చూడగలిగే సినిమాలకు ఏ సర్టిఫికేట్లు ఇస్తున్నారు.
ప్రస్తుతం ఈ నిబంధనలో కూడా మార్పులు ప్రతిపాదించారు. పిల్లల వయసు ఆధారంగా యూ/ఏ కేటగిరీలో మూడు క్లాసులను తీసుకొచ్చారు.
ఏడేళ్లపై వయసున్న పిల్లలు తల్లిదండ్రులతో చూడగలిగేవి, 13 ఏళ్లపై వయసున్న పిల్లలు తల్లిదండ్రులతో చూడగలిగేవి, 16ఏళ్లపై వయసున్న పిల్లలు తల్లిదండ్రులతో చూడగలిగేవి అని వర్గీకరించారు.
దీంతో ఇప్పుడు యూ, యూ/ఏ 7+, యూ/ఏ 13+, యూ/ఏ 16+, ఏ.. ఇలా ఐదు కేటగిరీల్లో సర్టిఫికేట్లు జారీచేస్తారు. అయితే, ఇలా ఇన్ని సర్టిఫికేట్లను జారీ చేస్తే పరిస్థితి మరింత గందరగోళం అవుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టూడియా సెక్టార్ వైస్ ఛైర్మన్, నిర్మాత కె. సురేశ్ బాబు వ్యాఖ్యానించారు.
‘‘ఇప్పుడు అంతా ఓటీటీ హవా నడుస్తోంది. ఇక్కడ సర్టిఫికేట్‌తో సంబంధం లేకుండా అందరూ కలిసి కూర్చొని ఓటీటీ వేదికలపై సినిమా చూస్తున్నారు. ఇన్ని రకాల సర్టిఫికెట్లతో గందరగోళం పెరుగుతుంది అంతే. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే, అందరూ కుటుంబ సమేతంగా చూడటానికి వస్తారు. అయినా వచ్చేవారు... ఈ సర్టిఫికేట్ చూసి ఆగిపోరు’’అని సురేశ్ బాబు అన్నారు.
అయితే, అమెరికాతోపాటు కొన్ని యూరప్ దేశాల్లో పిల్లల వయసు ఆధారంగానే సినిమా సర్టిషికేషన్ జరుగుతోందని, ఈ తాజా విధానాన్ని అభివృద్ధి బాటలో పడిన అడుగుగానే చూడాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పైరసీని అడ్డుకునేందుకు..
సినిమాల్లో పైరసీని అడ్డుకునేందుకు సినిమాటోగ్రాఫ్ చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవు.
అయితే, తాజా ముసాయిదాలో సెక్షన్ 6ఏఏ పేరుతో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఎవరైనా అనుమతి లేకుండా థియేటర్లలో రికార్డింగ్ చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించేలా కొత్త నిబంధనను సిద్ధం చేశారు.
ఈ నిబంధనను సురేశ్ బాబు స్వాగతించారు. పైరసీని కట్టడి చేసేందుకు మరిన్ని కఠినమైన నిబంధనలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సీబీఎఫ్ జారీచేస్తున్న సినిమా సర్టిఫికేట్ 10ఏళ్ల వరకే ఉంటుంది. అయితే, శాశ్వత సర్టిఫికేట్లు జారీచేసేలా కొత్తగా మార్పులు ప్రతిపాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
సినిమాలను ప్రభుత్వం అడ్డుకోవచ్చా?
సినిమాటోగ్రాఫ్ యాక్ట్‌లో సెక్షన్ 5(1) కింద దీని కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించినా, లేదా మిత్ర దేశాలతో సంబంధాలు దెబ్బ తీయాలని ప్రయత్నించినా, శాంతి భద్రతలకు భంగం కలిగించినా సినిమాలను అడ్డుకునేందుకు కేంద్రానికి అధికారముంది.
మరోవైపు నైతికత, గౌరవ మర్యాదలను దెబ్బతీయడం, కోర్టు ధిక్కరణ, నేరాలను ప్రోత్సహించే సినిమాలను కూడా ఈ నిబంధన కింద అడ్డుకోవచ్చు. ఈ అధికారాలన్నీ సీబీఎఫ్‌సీ వద్దే ఉంటాయి.
అయితే, ఇప్పుడు సీబీఎఫ్‌సీ జారీచేసే సర్టిఫికేట్లను మళ్లీ సమీక్షించాలని కేంద్రం ఆదేశించడంలో అర్థంలేదని సురేశ్ బాబు అన్నారు.
‘‘చట్టం అనేది భావ ప్రకటన స్వేచ్ఛను పరిక్షించేందుకు తీసుకురావాలి. అంతేకానీ, అసమ్మతిని అణచివేయడానికి కాదు’’అని కథానాయకుడు సూర్య వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- మోషన్ సిక్నెస్: వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








