రష్మీ రాకెట్: క్రీడల్లో జెండర్, హార్మోన్ల పరీక్షలు మహిళలకు మాత్రమే ఎందుకు?

ఫొటో సోర్స్, Facebook/Tapsee
- రచయిత, జాహ్నవీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆమె ఒక అమ్మాయిగానే పెరిగింది. కానీ, ఒక రోజు అకస్మాత్తుగా ఎవరైనా వచ్చి ఆమె అమ్మాయి కాదని, అబ్బాయి అని చెబితే ఆమెకెలా ఉంటుంది?
ఇదే ప్రశ్న రష్మీ రాకెట్ సినిమాలో హీరోయిన్ రష్మీ వీరకు కూడా ఎదురవుతుంది. ఒక క్రీడాకారిణిగా, రన్నర్‌గా ఆమె ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోతుంది. కానీ, పరిస్థితులకు తలవంచకుండా ఆమె ఉనికిని ప్రశ్నించే విధానాలను సవాలు చేస్తుంది.
తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా అక్టోబరు 15న విడుదలయింది. ఈ సినిమా అంతా బాలీవుడ్ మసాలాతో నిండిపోయింది. ఒక్కొక్కసారి ఇది మెలోడ్రామాలా అనిపించి స్పృశించాల్సిన సున్నితమైన విషయం నుంచి పక్కకు జరిగినట్లుగా అనిపిస్తుంది.
కానీ, మహిళల క్రీడల్లో కొన్ని సార్లు నిర్లక్ష్యం చేసే, కొన్నిసార్లు అంతగా పట్టించుకోని అంశాన్ని ఈ సినిమా ముఖ్యాంశంగా తీసుకుంది. క్రీడల్లో పాల్గొనే సమయంలో మహిళలు ఎదుర్కొనే వివక్షను చూపించింది.
ఒక మహిళ మహిళో కాదో నిర్ధారించే ‘‘జెండర్ పరీక్షల"తో సినిమాలో చర్చ మొదలవుతుంది. ఈ పరీక్షలను 'లింగ నిర్ధారణ పరీక్షలు', లేదా 'జెండర్ పరీక్షలు' అని పిలవడం ద్వారా కలిగే హానిని ఈ చర్చ ద్వారా చూపించారు.

ఫొటో సోర్స్, AFP
అమ్మాయిలు-అబ్బాయిల మధ్య నెలకొన్న వివక్ష
ఆధునిక కాలంలో అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నారు. కానీ, క్రీడల్లో మాత్రం క్రీడాకారుల జెండర్ ఆధారంగా వారిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. దీనికి ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనేందుకు కావల్సిన శారీరక శక్తి కారణమని చెప్పవచ్చు.
మహిళలు, పురుషుల శరీర నిర్మాణాలు భిన్నంగా ఉంటాయి. దీనర్ధం మహిళలు బలహీనులని కాదు. కానీ, పొడవు, బరువు, శక్తి లాంటి శారీరక విషయాల్లో మహిళలు పురుషుల కంటే భిన్నంగా ఉంటారు.
అందుకే మహిళలతో పోటీకి పురుషులను బరిలో దించడం అన్ని సార్లూ సరికాదు. ఆలా చేయడం వల్ల పోటీ సమాన స్థాయిలో ఉండదు. ఏవో కొన్ని ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో మినహాయించి, సాధారణంగా మహిళలకు పురుషులకు పోటీలను వేర్వేరు విభాగాల్లోనే నిర్వహిస్తారు.
కానీ, మహిళలు క్రీడల్లో పాల్గొనేందుకు విధించిన నిబంధనలు మాత్రం మహిళల పట్ల అన్యాయంగానే ఉన్నాయి. మహిళా క్రీడాకారులు ఆ నిబంధనల పరిధిలోకి రాకపోతే, ఆమె మహిళల విభాగంలో ఆడేందుకు అర్హురాలు కాదు. అయితే, ఇలాంటి నిబంధనలు పురుషులకు లేవు.
అందుకే ఈ నిబంధనలు చాలా సార్లు వివాదాలకు కారణమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్రీడల్లో జెండర్ పరీక్షల చరిత్ర ఏంటి?
20వ శతాబ్దంలో మొదట్లో మహిళా క్రీడాకారిణులకు 'లింగ నిర్ధారణ పరీక్షలు' తప్పనిసరిగా నిర్వహించేవారు. దీంతో, చాలా సార్లు క్రీడాకారిణులు అవమానకరమైన శారీరక పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చేది. 1968 ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన క్రోమోజోమ్స్ పరీక్ష వీటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కానీ, 1990లలో, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (ఐఏఏ), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ పరీక్షలను కచ్చితంగా నిర్వహించే పద్ధతిని తొలగించాయి. అప్పటి నుంచీ ఎవరిపైనైనా అనుమానం కలిగినా, లేదా ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు అందిన పక్షంలోనే ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఆ తర్వాత క్రీడాకారులు మహిళగా ఆడవచ్చా లేదా అని నిర్ణయించేందుకు హార్మోన్ల పరీక్ష చేసేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఒక పురుషుడు మహిళగా ఆడటానికి ముందుకు రావడం క్రీడల్లో చాలా అరుదు. ఇంటర్ సెక్స్, ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు.
ఒక క్రీడాకారిణి మహిళో కాదో తేల్చేందుకు ఒక ప్రమాణాన్ని నిర్ణయించడం సరైన పద్ధతేనా? ప్రకృతిలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ఉండరు. అలాగే, ఏ ఇద్దరు మహిళలూ ఒకేలా ఉండరు. మరి ఈ ప్రమాణాలకు మహిళలే ఎందుకు తలవంచాలి?
ఇదే ప్రశ్నను ద్యుతీ చంద్ అడిగారు. ఆమె పోరాటం మహిళల హక్కులు, ముఖ్యంగా మానవ హక్కుల కోసం పోరాటంగా మారింది.

ఫొటో సోర్స్, AFP
శాంతి సౌందర్‌రాజన్ నుంచి కాస్టర్ సెమెన్య వరకూ....
రష్మీ రాకెట్ సినిమా ఏ ఒక్కరినీ ఉద్దేశించి తీసింది కాదని ఆ సినిమా నిర్మాతలు మొదట్లోనే చెప్పినప్పటికీ, ఈ కథ మాత్రం కొంత మంది క్రీడాకారిణులను గుర్తు చేస్తుంది. చాలా మంది ఈ సినిమాను ద్యుతీ చంద్ ప్రయాణంతో పోల్చారు. ఆమె చాలా నిబంధనలను సవాలు చేశారు.
ద్యుతీ కంటే ముందు, భారతీయ క్రీడాకారిణులు కొంత మంది ఇలాంటి వేదననే ఎదుర్కోవాల్సి వచ్చింది.
2001లో గోవాకు చెందిన స్విమ్మర్ ప్రతిమా గావర్కర్ జెండర్ పరీక్షలో ఓడిపోయారన్న విషయాన్ని విన్న వెంటనే ఆమె జీవితాన్నే ముగించాలని అనుకున్నారు.
ఐదేళ్ల తర్వాత , శాంతి సౌందర్‌రాజన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఆమె 2006 ఆసియా క్రీడల్లో జరిగిన 800 మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. కానీ, ఆమె జెండర్ పరీక్షలో ఓడిన తర్వాత ఆమె పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.
శాంతికి ఇది పెద్ద షాక్. ఆమె వైద్య నివేదికలను జాతీయ టీవీ ఛానెల్‌లో బహిరంగంగా చర్చించారు. ఆమె మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు.
కానీ, ఆమె జీవితాన్ని పునర్నిర్మించుకుని అథ్లెటిక్స్ కోచ్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. అయితే, ఆమె పతకాలు ఆమెకు వెనక్కి తిరిగి రాలేదు. శాంతికి లభించని పతకాలు కాస్టర్ సెమెన్యకు లభించాయి. ఆమెకు దొరికిన మద్దతు సమాజపు దృక్కోణాన్ని మార్చింది.

ఫొటో సోర్స్, AFP
సెమెన్య 2009 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 18ఏళ్ల వయసులోనే స్వర్ణం సాధించారు. కానీ, దానికి ముందు ఆమె జెండర్ పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వార్త మీడియాలో ప్రచురితమయింది. దాంతో, అనేక అనుమానాలు వెల్లువెత్తాయి.
కానీ, దక్షిణాఫ్రికాలో ఫెడరేషన్లు సెమెన్యకు మద్దతు పలికాయి. ఆమె ఒక సంవత్సరం తర్వాత పరుగు పెట్టేందుకు అనుమతి లభించడంతో పాటు ఆమె సాధించిన పతకాలు కూడా ఆమెకు దక్కాయి. అన్నిటి కంటే ముఖ్యంగా, ఆమె వైద్య ఫలితాలను బహిర్గతం చేయలేదు.
హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఏంటి?
సెమెన్య వివాదం తర్వాత మహిళల్లో ఉండే హైపర్ ఆండ్రోజెనిజంపై అధ్యయనం చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఐఏఏఎఫ్ నియమించింది.
మహిళల శరీరంలో అత్యధిక శాతంలో ఆండ్రోజెన్‌లు ఉంటే ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపర్ ఆండ్రోజెనిజం అని అంటారని నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంటోంది.
ఆండ్రోజెన్‌లు.. టెస్టోస్టీరాన్ లాంటి గ్రూపుకు చెందిన హార్మోన్లు. ఇవి సాధారణంగా పురుషుల శరీరంలో కనిపిస్తాయి. మహిళల శరీరంలో కూడా ఈ హార్మోన్లు సహజంగా పుడతాయి. కానీ, వాటి ప్రభావం పురుషులతో పోలిస్తే మహిళల్లో తక్కువగా ఉంటుంది.
అయితే, మహిళల్లో ఉండే టెస్టోస్టీరాన్ స్థాయిల పట్ల నిపుణుల మధ్య బేధాభిప్రాయాలున్నాయి. కానీ, కొంత మంది మహిళల్లో సహజంగానే ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం అందరికీ ఉండదు.
కొందరికి ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ కూడా ఉంటుంది. అంటే, వారి శరీరంలో పురుషుల్లో ఉండే ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయి. కానీ, వారి శరీరం టెస్టోస్టీరాన్‌ను వినియోగించలేదు. దాంతో, వారి శారీరక ఆకృతి మహిళల్లా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అలాంటి క్రీడాకారులను ఎలా వర్గీకరిస్తారు?
ఐఏఏఎఫ్ నిపుణుల కమిటీ, ఐఓసీ మెడికల్ కమీషన్ నివేదికలను సమర్పించిన తర్వాత క్రీడాకారిణుల్లో ఉండాల్సిన టెస్టోస్టీరాన్ స్థాయిలను నిర్ణయించారు.
క్రీడాకారుల ప్రతీ లీటరు రక్తంలో 10 కంటే తక్కువ నానోమోల్స్ ఆండ్రోజెన్ ఉంటే వారు మహిళల విభాగంలో పాల్గొనవచ్చు.
అలాగే, ఇతర క్రీడాకారుల నుంచి ఫిర్యాదు వచ్చినా లేదా డోప్ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే, ఈ పరీక్ష నిర్వహించాలని ఐఏఏఎఫ్ పేర్కొంది. ఈ పరీక్ష వివరాలను బయటపెట్టడం లాంటివి చేయకూడదు.
హైపర్ ఆండ్రోజెనిజం లక్షణాలతో ఉండే మహిళలు వైద్య చికిత్స ద్వారా దీనిని తగ్గించుకునే అవకాశం ఉంది. ద్యుతీ చంద్‌కు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు. కానీ, ఆమె చికిత్స తీసుకునేందుకు నిరాకరించారు. ఆమె ఈ విధానాలకు వ్యతిరేకంగా సవాలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ద్యుతీ చంద్ పోరాటం
ద్యుతీ చంద్ ఒడిశాలోని ఒక చిన్న గ్రామంలో పెరిగారు. ఆమె 18ఏళ్లకే క్రీడల్లోకి వచ్చి, 2013లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు.
కానీ, 2014 కామన్‌వెల్త్ క్రీడలకు ముందు, ద్యుతీని భారతీయ జట్టు నుంచి తొలగించారు. ఆమె హైపర్ఆండ్రో జెనిజమ్ స్థాయి నిబంధనల పరిమితిలో లేకపోవడంతో ఆమెను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఆమెకు చికిత్స తీసుకోమని సూచించారు.
ఆ సమయంలో మానసికంగా వేదనకు గురయినట్లు ద్యుతీ చంద్ 2019లో బీబీసీకి చెప్పారు.
"నన్ను బాధపెట్టే విషయాలు చాలా మాట్లాడారు. నేను శిక్షణ తీసుకోవడానికి కూడా వెళ్లలేకపోయేదానిని. దీని గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో ఊర్లో వాళ్లంతా నన్నొక అబ్బాయిలా చూడటం మొదలుపెట్టారు" అని చెప్పారు.
కానీ, ద్యుతీ చంద్ పోరాడాలని అనుకున్నారు. ఆమెకు జెండర్ అంశాలపై పరిశోధన చేసిన డాక్టర్ పయోషిని మిత్ర సహాయం చేశారు.
ఆమె కేసును అంతర్జాతీయ క్రీడలకు అత్యున్నత న్యాయస్థానమైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పోర్ట్స్‌కు (సీఏఎస్) తీసుకుని వెళ్లారు.
2015లో ఆమెకు న్యాయం లభించింది. హైపర్ ఆండ్రోజెనిజం గురించి ఐఏఏఎఫ్ విధించిన నియమాలను వెనక్కి తీసుకోమని న్యాయస్థానం సూచించింది.
అధిక స్థాయిల్లో టెస్టోస్టీరోన్ స్థాయిలు ఉన్న మహిళలకు క్రీడల్లో గెలిచేందుకు లాభం ఎంత వరకూ ఉంటుందో చెప్పేందుకు ఆధారాలు లేవని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలేంటి?
సెక్స్ డెవలప్మెంట్‌లో జన్యువులు, హార్మోన్లు, పునరుత్పత్తి అవయవాల మధ్యలో ఉండే తేడాల (డిఎస్‌డి) గురించి లోతైన అధ్యయనం నిర్వహించమని ఐఏఏఎఫ్‌ను సీఏఎస్ కోరింది.
2018లో మహిళల్లో, ఇంటర్ సెక్స్ క్రీడాకారుల్లో ఉండే డీఎస్‌డీ లక్షణాల గురించి ఐఏఏఎఫ్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
హైపర్ ఆండ్రోజెనిజం లేదా ఎక్స్ వై క్రోమోజోములు, లేదా ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ ఉన్న మహిళా క్రీడాకారులు 400 మీటర్లు నుంచి ఒక మైలు పోటీల్లో పాల్గొనకూడదనే నియమాన్ని విధించింది. ఈ నియమం ఇతర పోటీలకు వర్తించదు.
అలాంటి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకుంటే, వారి రక్తంలో ఉండే టెస్టోస్టీరోన్ స్థాయిలను లీటరు రక్తానికి 5 నానోమోల్స్‌కు తెచ్చుకోవాలని సూచించారు.
ఈ నిబంధనలే సెమెన్యను అనుమతించలేదు. ఆమె కూడా సీఏఎస్‌లో అప్పీలు చేసుకున్నప్పటికీ కేసు ఓడిపోయారు. ఆమె ఈ విషయంపై యూరోపియన్ హ్యూమన్ రైట్స్ కోర్టుకు కూడా వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- ఎంఎస్ ధోనీ సీఎస్కేను వదిలేస్తున్నారా? హర్షాభోగ్లేకు ధోనీ ఇచ్చిన సమాధానం ఏంటి?
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- మొదటి ప్రపంచ యుద్ధం: భారత సైన్యం అక్కడికి చేరుకోకపోతే.. చరిత్ర మరోలా ఉండేది
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










