టీ20 వరల్డ్ కప్: విరాట్ కోహ్లీ భారత్ కోసం పాకిస్తాన్‌తో మ్యాచ్ గెలవగలడా

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత టీ20 ప్రపంచకప్ తరువాత విరాట్ కోహ్లీ భారత టీ20 జట్టు కెప్టెన్ పదవి నుంచి వైదొలగనున్నాడు.

విరాట్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను భారత్‌కు క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో ఆడనున్నాడు.

ఈ సందర్భంగా స్పోర్ట్స్ రైటర్ శారదా ఉగ్ర అందిస్తున్న కథనం..

ఒమన్, యూఏఈలలో ఈ టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీని క్రాకర్‌ అనుకుంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను మాత్రం ఏకంగా ఒక పెద్ద బాణసంచా పెట్టె అనుకోవాలి.

ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకుల్లో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం ఇంగ్లండ్‌ది. పాకిస్తాన్ మూడో ర్యాంకులో ఉంది.

అయితే, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి ఈ ర్యాంకులు పెద్దగా పరిగణనలోకి రావు.

గత రెండేళ్లలో ప్రధాన జట్లలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మాత్రమే భారత్ కంటే తక్కువ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాయి.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయి టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడినప్పటికీ వారికి దక్కిన విజయాలు కంటే ఓటములే ఎక్కువ. అయితే, ఇదంతా లెక్కలోకి రాదు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ విజయమే అందరికీ ప్రధానం.

భారత్ విషయానికొస్తే.. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌ 'విరాట్ కోసం విజయం' సాధించడమనే బృహత్ లక్ష్యం. ఈ ప్రపంచ కప్‌లో విరాట్ జట్టు విజయం సాధిస్తే అది ఆయనకు తొలి టీ20 వరల్డ్ కప్ విజయం అవుతుంది. అంతేకాదు.. విరాట్ ముందున్న చివరి అవకాశమూ ఇదే.

అందుకే విరాట్ సేనకు ఇది మరింత కీలకంగా మారింది.

వీడియో క్యాప్షన్, కోహ్లీ మరో రికార్డు

ప్రస్తుత ప్రపంచ కప్ తరువాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి.. అలాగే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు సారథ్యం నుంచి కూడా తప్పుకుంటానని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు.

ఆయన ప్రకటన తరువాత మొత్తం భారత్ క్రికెట్ దృష్టి అంతా కోహ్లీపైనే కేంద్రీకృతమైంది.

ప్రస్తుత ప్రపంచకప్ కంటే ముందు 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. అప్పుడు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు.

అప్పటి జట్టులో ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, ఆర్.అశ్విన్, మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలు ఇప్పుడు కూడా ఆడుతున్నారు.

అప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ ఇప్పుడు ఈ జట్టుకు మెంటార్‌గా డ్రెసింగ్ రూంను పంచుకుంటున్నాడు. తాను పట్టిందల్లా బంగారం చేయగలిగే ధోనీ భారత్ జట్టుకు మెంటార్‌గా కప్ సాధిస్తాడని ఆశిస్తున్నారు.

ప్రపంచ కప్‌ల విషయానికొస్తే ధోనీ పట్టిందల్లా బంగారమనే చెప్పుకోవాలి. అన్నిఫార్మాట్ల క్రికెట్‌ ప్రపంచ కప్‌లను సాధించిన కెప్టెన్ ధోనీ.

కోహ్లీకి డ్రెసింగ్ రూమ్‌లో ధోనీ ఒక్కడే కాదు మరికొందరు టీ20 కెప్టెన్ల అండ కూడా ఉంది.

అయిదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న రోహిత్ శర్మ, ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్న కేఎల్ రాహుల్, ఆర్.అశ్విన్, రిషబ్ పంత్ ఇప్పుడు కోహ్లీ జట్టులోనే ఉన్న కెప్టెన్లు. సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో అందుబాటులో లేనప్పుడు ఆ జట్టును నడిపించిన భువనేశ్వర్ కుమార్‌ను కూడా లెక్కేస్తే కోహ్లీ జట్టులో మొత్తం అయిదుగురు కెప్టెన్లు ఉన్నట్లు.

బంతి బంతికీ కెప్టెన్ వ్యూహ దక్షతపై ప్రతి ఒక్కరూ కన్నేసే ఫార్మాట్ టీ20. భారత క్రికెట్‌లో మిగతా ఉత్తమ ఆటగాళ్లకు అందనంత ఎత్తున సర్వోత్తముడిగా గుర్తింపు పొందడానికి ఈ వ్యూహాలు, ఈ ఫార్మాటే ప్రామాణికం.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్‌ను ధోనీ సారథ్యంలోని టీమిండియా గెలుచుకుంది

ధోనీ(సీఎస్‌కే కెప్టెన్‌గా 203 మ్యాచ్‌లు) తరువాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించింది కోహ్లీనే. ఆర్‌సీబీకి 140 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు కోహ్లీ.

అయితే ధోనీ విజయాల రికార్డుకు భిన్నంగా కోహ్లీకి ఓటములు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఆర్‌సీబీని 64 మ్యాచ్‌లలో మాత్రమే గెలిపించాడు.

కోహ్లీ తన చుట్టూ కెప్టెన్లు ఉండడానికి సమ్మతించడు కానీ ధోనీ ఇప్పుడు తన వైపు ఉండడం వల్ల కలిగే లాభాలేమిటో ఆయనకు బాగా తెలుసు.

కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ 75 వైట్ బాల్ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ నేతృత్వంలో గెలిచిన వైట్ బాల్ సిరీస్‌లలో సగం ధోనీ భాగస్వామ్యం ఉంది.

ధోనీ ఇప్పుడు మైదానంలో కోహ్లీకి సలహాలు ఇవ్వలేడు.. కానీ, కానీ జట్టును ఎంపిక చేసుకోవడంలో, వికెట్లను అర్థం చేసుకోవడంలో కోహ్లీకి సాయపడి విజయాలకు సహకరిస్తాడు.

ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సిన టోర్నీలో కోహ్లీ ఎవరి మాట విన్నా వినకపోయినా ధోనీ మాటను మాత్రం పెడచెవిన పెట్టడానికి వీల్లేదు.

ఐపీఎల్‌లో భాగంగా విస్తారంగా టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ టీమిండియా ఈ ఫార్మట్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం ఆశ్చర్యకరమే. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఇంతవరకు టీమిండియా మళ్లీ గెలవలేదు.

ఐసీసీ ఈవెంట్లలో టీ20 ప్రపంచ కప్ మిగతావాటికంటే భిన్నమైనది. ఇక్కడ ఎవరి రికార్డులు, ఘనతలు లెక్కలోకి రావు. టీ20లో విజయాలు అప్పటికి ఎవరు ఎలా ఆడారన్నదాని ప్రకారమే దక్కుతాయి.

కోహ్లీ, ధోనీ

ఫొటో సోర్స్, AFP

ఇక ప్రస్తుత టోర్నీకి వస్తే.. యూఏఈలో స్లో వికెట్‌పై ఆడేందుకు కండబలాన్ని మాత్రమే నమ్ముకుంటే కష్టం. బ్యాటింగ్ నైపుణ్యాలూ ఉండాలి.

పేస్ బౌలర్లు ఇక్కడ పరుగులు ఇచ్చుకుంటారు. అనుకున్న చోట బంతిని వేయగల స్లో బౌలర్లు.. బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతిని టర్న్ చేయగల సమర్థులు రాణిస్తారు.

ఎడమచేతి వాటం బౌలర్లు ఇప్పుడు అవసరం. కానీ, భారత జట్టులో యార్కర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్ లేడు. అలాగే ఖలీల్ అహ్మద్ కూడా గాయపడ్డాడు.

సెప్టెంబర్ 28న ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేశారు. టీ20లలో విజయవంతంగా రాణించిన స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ లేకపోవడం లోటే.

స్లో బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ రావడంతో బౌలింగ్ బలం పెరిగింది.

టీ20

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఆడబోయే 5 మ్యాచ్‌లలో 4 దుబయిలో జరుగుతాయి. ఐపీఎల్‌లో చేజింగ్‌లో విజయాలు అందించిన వేదికగా దుబయికి పేరుంది.

భారత్‌కు కూడా ఛేదనలో మంచి పేరుంది. అయితే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారనేది చూడాలి. బహుశా ధోనీ అందరికీ మొన్నటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుర్తు చేస్తాడేమో.

(బెంగళూరుకు చెందిన శారద ఉగ్ర ఇండిపెండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)