ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ

ద్యుతి చంద్
    • రచయిత, రాఖీ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

స్ప్రింటర్ అనగానే బాగా ఎత్తుగా, కండలు తిరిగిన దేహంతో ఉన్న వ్యక్తి ట్రాక్‌పై పరిగెడుతున్న దృశ్యమే ఎవరి మనసులోనైనా కదలాడుతుంది. కానీ, ద్యుతి చంద్ ఆకారం మాత్రం ఈ ఊహకు కాస్త భిన్నంగా ఉంటుంది.

ఆమె ఎత్తు నాలుగు అడుగుల 11 అంగుళాలే. ఆసియాలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ ఆమేనని ఆకారం చూసి నమ్మడం కాస్త కష్టమే. ఆమె పరుగు చూస్తే గానీ తెలియదు అసలు విషయం.

Presentational grey line
News image
Presentational grey line

తనను సహచర అథ్లెట్లు ప్రేమగా 'స్ప్రింట్ క్వీన్' అని పిలుస్తుంటారని చెబుతున్నారు ద్యుతి.

"2012లో నేను ఓ చిన్న కారు గెలిచా. అప్పటి నుంచి నా మిత్రులు నన్ను 'నానో' అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పడు వయసులో పెద్దదాన్నయ్యా. అందరూ దీదీ (అక్క) అని పిలుస్తున్నారు" అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, ద్యుతీ చంద్: ఎప్పుడూ గెలుస్తునే ఉండాలి... లేకపోతే జనం మర్చిపోతారు

అథ్లెట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు..

ద్యుతిది ఒడిశాలోని జాజ్‌పుర్ జిల్లా. ఆమెకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి నేత పనిచేసేవారు.

అథ్లెట్ అవ్వడానికి ఆమె చాలా కష్టాలను భరించాల్సి వచ్చింది.

ఆమె పెద్దక్క సరస్వతి చంద్ ఒకప్పుడు జాతీయ స్థాయి స్ప్రింటర్. ఆమెను చూస్తూ ద్యుతి కూడా అథ్లెట్ కావాలని నిర్ణయించుకున్నారు.

"నాకు స్ఫూర్తినిచ్చింది మా అక్కే. మాకు చదువుకునేందుకు డబ్బు ఉండేది కాదు. క్రీడల్లో రాణించి, స్కూల్ ఛాంపియన్ అయితే, స్కూలే ఖర్చులు భరిస్తుందని అక్క చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కూడా వస్తుందని చెప్పింది. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుని పరుగు మొదలుపెట్టా" అని ద్యుతి వివరించారు.

ద్యుతి చంద్

ఫొటో సోర్స్, Getty Images

కొండంత సవాళ్లు

అప్పటి నుంచి ద్యుతి జీవితంలో సవాళ్లు మొదలయ్యాయి. ఆమెకు బూట్లు కూడా ఉండేవి కావు. పరిగెత్తడానికి సరైన రన్నింగ్ ట్రాక్ లేదు. నేర్పించే కోచ్ లేరు.

ప్రతి వారం తమ ఊరి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లి రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చేది. సదుపాయాలేవీ ఉండేవి కావు. కొన్ని సార్లు ఆమె రాత్రుళ్లు రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై గడపాల్సి వచ్చేది.

"మొదట్లో ఒంటరిగా పరిగెత్తేదాన్ని. వట్టి కాళ్లతోనే రోడ్లపై, ఊరిలో నది ఒడ్డున పరిగెత్తుతుండేదాన్ని. 2005లో గవర్న్‌మెంట్ సెక్టార్ నుంచి స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికయ్యా. అక్కడ చిత్తరంజన్ మహాపాత్ర కోచ్‌గా ఉన్నారు. తొలి దశలో ఆయనే నన్ను సిద్ధం చేశారు" అని ద్యుతి అన్నారు.

ద్యుతి చంద్

ఫొటో సోర్స్, Getty Images

మొదటి పతకం..

ద్యుతికి త్వరగానే విజయాలు రావడం మొదలైంది. 2007లో జాతీయ స్థాయిలో తన తొలి పతకం గెలిచారు. అయితే, అంతర్జాతీయ పతకం కోసం మాత్రం ఇంకో ఆరేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.

2013లో భారత్‌లో జరిగిన ఏసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె జూనియర్ అథ్లెట్ అయినప్పటికీ సీనియర్ స్థాయిలో పోటీపడ్డారు. 200 మీ. పరుగు పోటీలో కాంస్యం గెలిచారు.

టర్కీలో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ద్యుతి పాల్గొన్నారు. విదేశాలకు వెళ్లడం ఆమెకదే తొలిసారి.

"అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అంతకుముందు మా ఊర్లో ఒక కారు కూడా నేనెప్పుడూ చూడలేదు. కానీ, క్రీడల వల్ల ఓ అంతర్జాతీయ విమానంలో కూర్చునే అవకాశం నాకు వచ్చింది. కల నిజమైనట్లు అనిపించింది నాకు" అని ద్యుతి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

ద్యుతి పతకాలు సాధించడం మొదలుపెట్టాక, ఆమె పట్ల జనాల దృక్పథం మారుతూ వచ్చింది. విమర్శించిన నోళ్లే, ప్రశంసించడం మొదలుపెట్టాయి.

ద్యుతి చంద్

ఫొటో సోర్స్, Getty Images

హార్మోన్లపై వివాదం

ద్యుతి జీవితంలో కఠిన పరీక్ష ఎదుర్కొంది 2014లోనే. ఆ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత బృందం నుంచి హఠాత్తుగా ద్యుతి పేరును తప్పించారు.

ద్యుతి శరీరంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ భారతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆమె మహిళా అథ్లెట్‌గా పోటీపడటంపై నిషేధం విధించింది.

"అప్పుడు మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యా. నా గురించి మీడియాలో చెడ్డగా వచ్చింది. ట్రైనింగ్ ‌తీసుకోవడం కూడా కుదరలేదు" అని అన్నారు ద్యుతి.

2015లో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో ఆమె ఈ నిర్ణయంపై అప్పీలు చేశారు.

తీర్పు ద్యుతికి అనుకూలంగా వచ్చింది. అయితే, 2016-రియో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వడంపై ఈ పరిణామాల ప్రభావం తీవ్రంగా పడింది.

"రియో ఒలింపిక్స్ కోసం నా దగ్గర అప్పుడు ఒక ఏడాది మాత్రమే ఉంది. చాలా కష్టపడి ఆ పోటీలకు అర్హత సాధించా" అని ఆమె చెప్పారు.

"భువనేశ్వర్ క్యాంపస్ నుంచి 2016లో నన్ను పంపించేశారు. అందుకే హైదరాబాద్‌కు నేను మారాల్సి వచ్చింది. తమ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోమని పుల్లెల గోపీచంద్ సర్ చెప్పారు" అని ద్యుతి వివరించారు.

రియో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల ఈవెంట్‌లో ద్యుతి పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న మూడో భారతీయ మహిళా అథ్లెట్‌గా ఘనత సాధించారు.

అయితే, ఆమె ప్రయాణం హీట్స్‌తోనే ఆగిపోయింది. 11.69 సెకన్ల టైమింగ్ ఆమె నమోదు చేశారు.

అప్పటి నుంచి ద్యుతి ప్రదర్శన మెరుగవుతూ వస్తోంది. 2017లో ఏసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 100 మీటర్లు, 4X100 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు గెలిచారు.

2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతి పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగులో 11.32 సెకన్ల టైమింగ్‌తో రజతం గెలిచారు. 200 మీటర్ల పరుగులోనూ రజతం సాధించారు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళగా నిలిచారు. ఇదివరకు పీటీ ఉష ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు.

వ్యక్తిగత జీవితంలోనూ ద్యుతి కొన్ని కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు.

తాను స్వలింగ సంపర్కురాలినని 2019లో ఆమె బయటపెట్టారు. సొంత కుటుంబం, ఊరు నుంచి ఆమె దీనిపై వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ, ద్యుతి వెనుకడగు వేయలేదు.

ఇప్పుడు ఆమె మరో మహిళతోనే కలిసి ఉంటున్నారు. అయితే, ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

ద్యుతి చంద్

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఒలింపిక్స్‌పైనే దృష్టి

ద్యుతి ప్రస్తుతం కోచ్ నాగపురి రమేశ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు.

2012లో ఆమెకు నాగపురి రమేశ్ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు 100 మీటర్ల ఈవెంట్‌లో ద్యుతి టైమింగ్ 12.5 సెకన్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆమె 11.22 సెకన్లలోనే ఆ పరుగును పూర్తి చేస్తున్నారు.

ద్యుతి పదిసార్లు తన పేరిట ఉన్న జాతీయ రికార్డును తానే బద్దలుకొట్టారు. మహిళల 100 మీటర్ల పరుగులో ప్రస్తుతం ఆమె ఆసియాలోనే అత్యుత్తమ అథ్లెట్.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్నారు.

"టోక్యోలో ప్రధానంగా జమైకా, అమెరికా, బ్రెజిల్ అథ్లెట్స్ నుంచి పోటీ ఎదురవుతుంది. సామర్థ్యంలో వాళ్లు మన కన్నా చాలా ముందున్నారు. అయినా, నేను శాయశక్తులా ప్రయత్నిస్తా. ఆసియా క్రీడల్లో పతకం సాధించా. ఇక నా లక్ష్యం కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పతకం తేవడమే" అని ద్యుతి అన్నారు.

ద్యుతి చంద్

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయాలవైపు చూపు

క్రీడల నుంచి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వచ్చే యోచనలోనూ ద్యుతి ఉన్నారు.

"రోజూ పొద్దున, సాయంత్రం ట్రాక్‌పై పరిగెడతా. కెరీర్ పూర్తయ్యాక, ఓ ఆఫీస్‌లో కూర్చొని పనిచేయడం కష్టం. చిన్నారుల కోసం అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. రాజకీయాల్లో చేరి, దేశానికి సేవ చేయాలనుంది" అని ద్యుతి అన్నారు.

గత ఏడాది టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన '100 నెక్స్ట్' జాబితాలో ద్యుతికి స్థానం దక్కింది. వివిధ రంగాల్లో భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తులతో ఈ జాబితాను టైమ్ ప్రకటించింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)