అనితా దేవి: క్రిమినల్స్‌ను పట్టుకోవడం నుంచి.. షూటింగ్‌లో స్వర్ణం వరకు... - BBC ISWOTY

అనితా దేవి
ఫొటో క్యాప్షన్, అనితా దేవి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఒక్కోసారి చిన్న చిన్న లక్ష్యాలే మనలో అసాధారణ ప్రతిభను వెలికి తీస్తుంటాయి. హరియాణాలోని మహిళా కానిస్టేబుల్ అనితా దేవి కథ దీనికి చక్కటి ఉదాహరణ. పిస్టల్ షూటింగ్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె కథ ఎంతో స్పూర్తిదాయకమైనది.

2008లో కానిస్టేబుల్‌గా హరియాణా పోలీసు విభాగంలో దేవి చేరారు. పదోన్నతి అవకాశాలను మెరుగు పరచుకోవడమే లక్ష్యంగా ఆమె షూటింగ్‌పై దృష్టిసారించారు.

భర్త ధర్మబీర్ గులియా కూడా ఆమెకు అండగా నిలిచారు. అయితే, ఒకరోజు ఈ షూటింగే తనను జాతీయ ఛాంపియన్‌గా నిలబెడుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు.

జాతీయ స్థాయిలో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచారు. దీంతో 2011 నుంచి 2019 వరకు ప్రతి ఏటా ఆమె పథకాలను కైవసం చేసుకుంటూనే వచ్చారు.

అయితే, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం దక్కలేదని ఆమె అప్పుడప్పుడు బాధపడుతుంటారు. భారత్‌లో మూడో ర్యాంకుతో కెరియర్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా.. అవగాహన లేకపోవడం, ముందుండి నడిపించేవారు ఎవరూ లేకపోవడంతో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్)కు చేరువ కాలేకపోయానని ఆమె చెబుతుంటారు.

అంతర్జాతీయ క్రీడల్లో భారత్ తరఫున ఆడేందుకు ఐఎస్ఎస్ఎఫ్ గుర్తింపు తప్పనిసరి. ఈ కార్డు ఉండేటనే తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు భారత్ అనుమతిస్తుంది.

అయితే, 2016లో హనోవర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ కాంపిటీషన్‌లో ఆమె ప్రైవేటుగా పాల్గొన్నారు. ఇలా పాల్గొంటే ఐఎస్ఎస్ఎఫ్ గుర్తింపు అవసరం లేదు. ఈ పోటీల్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగంలో రజత పతకాలను ఆమె దక్కించుకున్నారు.

36ఏళ్ల దేవి ఇప్పటికీ షూటింగ్‌లో తనను తాను మెరుగు పరచుకుంటున్నారు. అదే సమయంలో తన 14ఏళ్ల కొడుకును తిరుగులేని షూటర్‌గా మార్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు.

అనితా దేవి

మొదట్నుంచీ ముందంజలోనే..

హరియాణాలోని పల్వాల్ జిల్లా పరిధిలోని లాల్‌ప్రా గ్రామంలో దేవి జన్మించారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఆమెను స్పోర్ట్స్‌లో రాణించేలా ప్రోత్సహించారు. ఆమె తండ్రి ఒక రెజ్లర్. దేవిని కూడా రెజ్లర్‌ను చేయాలని ఆయన భావించారు. అయితే, రెజ్లింగ్‌తో చెవులు దెబ్బతింటాయని, ఆ దిశగా దేవి అడుగులు వేయలేదు.

షూటింగ్ గురించి దేవికి మొదట్లో పెద్దగా తెలియదు. హరియాణా పోలీసు విభాగంలో చేరిన తర్వాత.. పోలీసు విభాగం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని, ఆమె కురుక్షేత్రలోని గురుకుల్ రేంజ్‌లో శిక్షణ పొందారు. దీని కోసం ఆమె ఉంటున్న సోనేపట్ నుంచి రెండు గంటలపాటు ప్రయాణించి అక్కడికి వెళ్లేవారు. నెల రోజుల్లోనే హరియాణా స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం పతకం సంపాదించారు.

తన భర్త ప్రతి దశలోనూ ఆమెను ముందుండి నడిపించారు. ట్రైనింగ్‌కు అవసరమైన నిధులను ఆయన ఎప్పటికప్పుడు సమకూర్చేవారు.

కానిస్టేబుల్‌గా ఆమె నెల జీతం రూ.7,200 మాత్రమే. అయితే, షూటింగ్ కోసం ఆమెకు తన భర్త రూ. 90,000 పెట్టి పిస్టల్ కొనుగోలు చేశారు.

మరోవైపు తనకు అవసరమైనప్పుడల్లా సమయం కేటాయిస్తూ పోలీసు విభాగం కూడా తనకు ఎంతో సహకరించింది.

తనలో క్రీడాస్పూర్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే, ఉద్యోగం కంటే షూటింగ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నావని కొందరు తోటి ఉద్యోగులు చెప్పేటప్పుడు తనకు ఒక పెద్ద పరీక్షలా అనిపించేది.

ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఉన్నతాధికారులు చెప్పినప్పుడు.. షూటింగ్ వైపే దేవి మొగ్గుచూపారు. అయితే ఆమె రాజీనామాను పోలీసు విభాగం ఆమోదించలేదు. ఇప్పటికీ ఆమె హెడ్ కానిస్టేబుల్‌గానే పనిచేస్తున్నారు. త్వరలో ఆమెకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పదోన్నతి లభించే అవకాశముంది.

శ్రమతోనే విజయం

2013లో దేవికి చాలా గుర్తింపు వచ్చింది. ఆ ఏడాదే తను నేషనల్ ఛాంపియన్‌గా మారారు. మరోవైపు ఆల్ ఇండియా పోలీస్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు కూడా కైవసం చేసుకున్నారు. బెస్ట్ షూటర్ అవార్డు కూడా ఆమెకే దక్కింది.

2015 నేషనల్ గేమ్స్‌లోనూ దేవికి రజత పతకం వచ్చింది.

తన కొడుకుతోపాటు తను కూడా జాతీయ స్థాయి టోర్నమెంట్‌లలో పాల్గొనడమే లక్ష్యంగా ఇప్పుడు ఆమె కృషి చేస్తున్నారు. ఏదో ఒకరోజు తన కొడుకు దేశానికి బంగారు పతకాన్ని తీసుకొస్తాడని ఆమె ఆశిస్తున్నారు.

కష్టకాలంలో తన కుటుంబం తనకు అండగా ఉందని ఆమె చెబుతుంటారు. ఎన్నో త్యాగాల ఫలితమే ఈ విజయం అని అంటారు. 2013లో టోర్నమెంట్ వల్ల తన తండ్రి అంత్యక్రియలకు సైతం ఆమె హాజరుకాలేకపోయారు.

తన తండ్రి, భర్త, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోయుంటే తను ఒక మంచి షూటర్‌ను కాలేకపోయుండేదాన్నని ఆమె అంటారు. ఇప్పుడు తన కొడుకుకు కూడా ఇలాంటి వాతావరణమే అందించాలని ఆమె భావిస్తున్నారు.

(బీబీసీ ఈమెయిల్ ప్రశ్నావళికి అనితా దేవి సమాధానాల ఆధారంగా ఈ కథనం రాశాం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)