ఆర్యన్ ఖాన్: రేవ్ పార్టీ అంటే ఏంటి? లోపల ఏం జరుగుతుంది?

రేవ్ పార్టీ: ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేవ్ పార్టీ: ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మయాంక్ భగవత్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఓ క్రూయిజ్‌‌ షిప్‌లో రేవ్ పార్టీలో పాల్గొంటున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. డ్రగ్స్ తీసుకోవడం, వాటిని సరఫరా చేసే వారితో ఉన్న సంబంధాలు ఆయనపై ఉన్న ఆరోపణలు

కార్డిలియా క్రూయిజ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్ సహా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అయితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? పార్టీలో ఏం జరుగుతుంది? దీని గురించి తెలుసుకునేందుకు మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకునే అధికారులు, ఇన్ఫార్మర్లతో బీబీసీ మాట్లాడింది.

రేవ్ పార్టీ అంటే ఏమిటి?

రేవ్ పార్టీలు చాలా రహస్యంగా జరుగుతాయి. వీటిలో పెద్ద మొత్తంలో డ్రగ్స్, ఆల్కహాల్, మ్యూజిక్, డ్యాన్స్, కొన్నిసార్లు సెక్స్ కాక్టెయిల్స్ ఉంటాయి.

''రేవ్ పార్టీలు కొందరు వ్యక్తులు, వారి సర్కిల్స్‌లలో మాత్రమే జరుగుతాయి. వీరిలో అంతా తెలిసినవారే ఉంటారు. కొత్తవారిని అనుమతించరు. తద్వారా సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడతారు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి ఒకరు వెల్లడించారు.

ఇక్కడ పార్టీల్లో పాల్గొనేవారిలో డ్రగ్స్ తీసుకునే వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సరఫరా చేసేవారు కూడా అంత త్వరగా బయటపడరు.

ఆదిల్ షేక్ ( నిజమైన పేరు కాదు) రెండుసార్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి రేవ్ పార్టీలపై దాడులలో పాల్గొన్నారు.

''రేవ్ పార్టీల్లో డ్రగ్స్‌ను పెద్ద మొత్తంలో తీసుకుంటారు. ఈ డ్రగ్స్ తీసుకున్నవారు తాము ఏ స్థితిలో ఉన్నామో తెలియనంత మత్తులో మునిగి పోతారు'' అన్నారు ఆదిల్ షేక్.

డ్రగ్స్ వాడుతున్నట్లు ఆర్యన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి.

ఫొటో సోర్స్, INSTAGRAM

ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ వాడుతున్నట్లు ఆర్యన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి.

కార్డిలియా క్రూయిజ్‌పై జరిగిన దాడిలో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల మెథడోన్, 22 టాబ్లెట్ల ఎక్స్‌టాసీని పట్టుకున్నారు.

''రేవ్ పార్టీల్లో ఎక్స్‌టాసీ, కెటామైన్, ఎండీఎంఏ, ఎండీ, చరస్‌‌లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు'' అని ఆదిల్ వెల్లడించారు.

పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ట్రాన్స్ మ్యూజిక్, లైటింగ్‌లో ఈ పార్టీలు జరుగుతుంటాయని, ఈ మత్తు పదార్ధాలు తీసుకున్న వ్యక్తులు ఎక్కువసేపు ట్రాన్స్‌లో ఉండిపోతారని ఆయన వెల్లడించారు.

డ్రగ్స్ తీసుకున్న తర్వాత అబ్బాయిలు, అమ్మాయిలు సంగీతపు హోరులో మునిగిపోతారు. కొన్ని రేవ్‌పార్టీలు 24 గంటల నుండి మూడు రోజుల వరకు కొనసాగుతుంటాయి.

"ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మ్యూజిక్‌‌ను ప్లే చేయడానికి ప్రత్యేక సిస్టమ్ ఉంటుంది. అది ధ్వనిని ఎక్కువగా చేస్తుంది" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు.

పార్టీలో లేజర్ షోలు, ప్రొజెక్టెడ్ కలర్ ఇమేజ్‌లు, విజువల్ ఎఫెక్ట్‌లు, ఫాగ్ మెషీన్‌లను కూడా ఉపయోగిస్తారు.

"రేవ్ పార్టీలో ప్లే చేసే పాటల్లో లిరిక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ట్రాన్స్ మ్యూజిక్ భ్రాంతిలో ముంచెత్తుతుంది" అని రెవ్ పార్టీపై దాడుల్లో పాల్గొన్న ఇన్ఫార్మర్ ఒకరు చెప్పారు.

ఈ పార్టీ ఏర్పాటు చేసుకోవడంలో ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. పార్టీ ప్లాన్ నుంచి ముగింపు వరకు ఈ కోడ్ లాంగ్వేజ్‌ను వాడతారు.

ముంబైకి చెందిన రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్ సమాధాన్ ధనేధర్ గతంలో యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. ఆయన రేవ్ పార్టీ జరిగే తీరును వివరించారు. "ఈ పార్టీలు ఏకాంత ప్రదేశంలో జరుగుతాయి. ఇక్కడ పార్టీ జరుగుతోందని అనుమానం కూడా రాదు" అని వెల్లడించారు.

ముంబై సమీపంలోని ఖండాలా, లోనావాలా, కర్జత్, ఖలాపూర్, పుణెలలో ఈ రేవ్ పార్టీలు ఎక్కువగా జరుగుతుంటాయి.

భారీ మ్యూజిక్, లైటింగ్ మధ్య రేవ్ పార్టీలు జరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ మ్యూజిక్, లైటింగ్ మధ్య రేవ్ పార్టీలు జరుగుతుంటాయి.

రేవ్ పార్టీకి ఎవరిని పిలుస్తారు?

ఇది అత్యంత రహస్యంగా జరిగే వ్యవహారం కాబట్టి పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. ఇందులో పాల్గొనే వారిని వివిధ మార్గాల్లో ఆహ్వానిస్తారు. ఇన్విటేషన్‌ కోసం సోషల్ మీడియాలో కోడ్ లాంగ్వేజ్ వాడతారు.

"గత కొన్ని సంవత్సరాలుగా, రేవ్ పార్టీలకు ఆహ్వానాల కోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. డ్రగ్ కల్చర్‌లో పాల్గొనే వ్యక్తులు లేదా పిల్లలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడతారు. వారి ద్వారా ఆహ్వానాలు వెళతాయి" అని ధనేధర్ వెల్లడించారు.

''సీక్రెట్ కోడ్ వారికి మాత్రమే తెలుసు కాబట్టి, బయటివాళ్లు దాన్ని అర్ధం చేసుకోలేరు. భద్రత కోసం నోటి మాటల ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి పాస్ చేస్తుంటారు'' అని ఆయన తెలిపారు.

ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ సహా 8మంది అరెస్టయ్యారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ సహా 8మంది అరెస్టయ్యారు.

ఎంత ఖర్చవుతుంది?

ఈ పార్టీలో పాల్గొనడానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి సామాన్యులు ఈ పార్టీకి వెళ్లలేరు. ఎక్కువగా ధనవంతుల పిల్లలు వీటిని నిర్వహిస్తుంటారు.

1980ల నుంచి ఈ రేవ్ పార్టీలు యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. గత కొన్నేళ్లుగా ధనవంతుల పిల్లలు నిర్వహిస్తున్న రేవ్ పార్టీలు అనేకం పట్టుబడ్డాయి.

పార్టీలపై దాడులు

2009లో ముంబైలోని జుహు ప్రాంతంలోని బాంబే 72 క్లబ్‌పై ముంబై పోలీసులు దాడి చేశారు. 246 మంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పిల్లల రక్త నమూనాల పరీక్షల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

2011లో ఖలాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీపై రాయగడ పోలీసులు దాడి చేశారు. ముంబైలోని యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసు అధికారి అనిల్ జాదవ్ కూడా ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ పార్టీలో పాల్గొన్న 275 మంది రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు తేలింది.

2019లో జుహులోని ఓక్‌వుడ్ హోటల్‌పై జరిగిన దాడిలో 96 మందిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)