మోదీని భారత మిలీనియల్స్ తరం ఎందుకు ఇష్టపడుతోంది? - అభిప్రాయం

ఫ్రాన్స్‌లో 2015లో యువతీ యువకులతో సెల్ఫీ తీసుకుంటున్న మోదీ

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో 2015లో యువతీ యువకులతో సెల్ఫీ తీసుకుంటున్న మోదీ
    • రచయిత, వివన్ మర్వాహా
    • హోదా, రచయత , బీబీసీ కోసం

1981-1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. ప్రపంచదేశాలతో పోలిస్తే ఆ జనాభా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది. మొత్తం దేశ జనాభాలో వీరి సంఖ్య 400 మిలియన్లు (40 కోట్లు) ఉంటుంది.

భారతీయ యువత రాజకీయ నాయకుల నుంచి ఏమి కోరుకుంటున్నారనే అంశాన్ని వివన్ మర్వాహా పరిశీలించారు.

ఏప్రిల్, మే 2019లో నేను రాసే పుస్తకం కోసం భారతీయ మిలీనియల్స్‌కున్న ఆర్ధిక ఆశలు, సాంఘిక అభిప్రాయాలు, రాజకీయ వైఖరి గురించి పరిశోధన చేశాను.

ఇందుకోసం నేను ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల్లో చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో బస చేసి, దేశంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల గురించి యువతతో మాట్లాడాను.

ప్రతీ ఊరులోనూ యువతీ యువకులతో మాట్లాడాను. వారంతా నిరుద్యోగులుగా ఉంటూ దేశ ఆర్ధిక వ్యవస్థతో సంబంధం లేకుండా ఉన్నారు.

సంప్రదాయ పద్దతిలో ఆలోచిస్తే, ప్రధాని మోదీ ఇబ్బందుల్లో ఉన్నట్లుగా కనిపించింది. దేశం గత 45 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య యువత పై ప్రభావం చూపిస్తోంది. వీరు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న ఏకైక కార్మిక శక్తి.

ఆర్ధిక వ్యవస్థ నత్త నడక నడుస్తోంది. నేను వెళ్లిన ప్రతీ చోటా అశాంతికర వాతావరణం నెలకొంది. నేను మాట్లాడిన చాలా మంది మిలీనియల్స్ మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు వచ్చిన వారు కూడా తల్లితండ్రులతో కలిసే నివసిస్తున్నారు.

వారి కనీస ఖర్చుల కోసం తల్లి తండ్రుల మీదే ఆధారపడుతున్నారు.

వీరిలో చాలామంది 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన విస్తృత అభివృద్ధి, యువతకు లక్షలాది ఉద్యోగావకాశాల హామీలను నమ్మి మోదీకే ఓటు వేశారు.

స్వాభిమాన్, స్వచ్చంద సంస్థ నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఉద్యోగాలను పొందిన వారి సంఖ్యను చూపిస్తున్న బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వాభిమాన్, స్వచ్చంద సంస్థ నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఉద్యోగాలను పొందిన వారి సంఖ్యను చూపిస్తున్న బోర్డు

కానీ, 2019 ఎన్నికల్లో కూడా కొన్ని దశాబ్దాల పాటు అనువంశికంగా పాలించిన రాజకీయ వారసులను ఓడించి మోదీకే విజయాన్ని కట్టబెట్టడం సంప్రదాయ తరహాలో ఆలోచన చేసిన వారిని విస్మయానికి గురి చేసింది.

ఈ తీర్పు స్పష్టంగా ఒక విషయాన్ని తేల్చి చెప్పింది. భారతీయ యువత మోదీని బలంగా సమర్ధిస్తోంది. 18 - 35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారిలో 40 శాతం మంది బీజేపీకే ఓటు వేశారని ఎన్నికల అనంతరం వెలువడిన డేటా ధృవీకరించింది.

ఈ నిర్ణయం ఇతర దేశాల్లో వారికి అర్థరహితంగా కనిపించవచ్చు. అయిదేళ్ల పాలనలో తాము పెట్టుకున్న నమ్మకానికి భంగం కలిగించి, వారిని ప్రగతిపథం వైపు తీసుకుని వెళ్లలేని ప్రభుత్వానికి తిరిగి అధికారం ఎందుకు అప్పచెప్పారు?

దేశ చరిత్రలో పదవిలో ఉన్న వారికే తిరిగి అధికారం అప్పచెప్పడం అతి తక్కువ సార్లు జరిగిందని చెప్పే సంప్రదాయ పరిజ్ఞానాన్ని కూడా ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానం తోసి పుచ్చింది.

కానీ, మిలీనియల్స్ మార్పుకు నేతృత్వం వహించడంతో, భారతీయ రాజకీయాలలో ప్రాధమిక మార్పులు చోటు చేసుకున్నాయి. యువ ఓటర్లు బాగా మాట్లాడగలిగే, ప్రార్ధన చేయగలిగే, వారిని ప్రతింబింబించేలా నాయకులు ఉండాలని భావిస్తున్నారు.

కొన్ని దశాబ్దాల పాటూ భారతదేశాన్ని పాశ్చాత్య విద్యను అభ్యసించి, ఆంగ్లంలో మాట్లాడే విద్యాధికులు పాలించారు. దేశంలో ఉన్న వ్యవసాయ, స్థానిక భాషలు మాట్లాడే జనాభాతో వారు సామాన్యంగా పంచుకునే అంశాలు పెద్దగా లేవు.

పార్లమెంటులో చాలా మంది సభ్యులు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికయిన సభ్యులు క్షేత్ర స్థాయి నుంచే వచ్చినప్పటికీ, దిల్లీలో రాజకీయ ,సాంస్కృతిక అధికారం చేతిలో ఉన్న వారు మాత్రం క్షేత్ర స్థాయికి చెందిన వారు కారు.

నరేంద్ర మోదీ సమావేశంలో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 18 - 35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారిలో 40 శాతం మంది బీజేపీకే ఓటు వేశారు.

ఆశావహ దృక్పథంతో ఉన్న భారతీయ యువత తమను రక్షించగలిగే రోల్ మోడల్స్ కోసం చూస్తున్నారు.

వారి కథలను, అనుభవాలను పంచుకోగలిగే రాజకీయ నాయకుల వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా భాష భావోద్వేగాలకు సంబంధించిన అంశం. కొన్నేళ్లుగా, ఇంగ్లీష్ భారతీయ ఉన్నత వర్గాల వారి సొత్తుగా ఉండిపోయింది. మధ్యతరగతి భారతీయులు సామాజిక పురోగతి ఆశిస్తున్నారు.

కానీ, 2019 ఎన్నికల్లో ఓటర్లు ఈ ఉన్నత వర్గాల ఆనవాళ్లను కూల్చివేస్తూ హిందీ మాట్లాడే రాజకీయ నాయకులకు పట్టం కట్టారు.

నెహ్రు గాంధీ కుటుంబం నాయకత్వం వహిస్తూ, ఇంగ్లీష్ భాషలో మాట్లాడే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ను హిందీ భాషా రాష్ట్రాల నుంచి దాదాపు తుడిచి పెట్టేసారు.

మోదీ న్యూయార్క్, లండన్, సిడ్నీలో ప్రేక్షకులతో మాట్లాడుతున్నప్పుడు హిందీలో చేసిన ప్రసంగాలను మిలీనియల్స్ గుర్తు చేశారు. ఇది వారికి గర్వాన్ని కలుగచేసిందని చెప్పారు.

"ఆ దేశాల్లో ఆయన దీనిని సాధ్యం చేసారంటే, మనం కూడా ఇక్కడ చేయగలం" అనే భావన వారిలో కలిగింది.

ఒక అస్థిరమైన, ఊగిసలాడుతున్న ఆర్ధిక వ్యవస్థలో స్థిరత్వం, భద్రతను ఇవ్వగలిగే నాయకులను మిలీనియల్స్ కోరుకున్నారు.

మోదీ, ఆయన పార్టీ ఇచ్చిన సందేశాలు ఈ సెంటిమెంట్‌ను బలంగా పట్టుకోవడంతో, వారికి ఆశించిన ఫలితాలు దక్కాయి.

2019లో కశ్మీర్ లో జరిగిన పుల్వామా కాల్పులు, పాకిస్తాన్‌లో జరిగిన వైమానిక దాడి తర్వాత బీజేపీ నాయకులందరూ తమ ట్విటర్ హ్యాండిల్‌కు "చౌకీదార్" (కాపలాదారులు) అనే పదవిని జత చేసుకుని, భారతీయులను దేశ, విదేశీ శత్రువుల నుంచి రక్షిస్తామనే హామీకి కట్టుబడి ఉంటామనే సంకేతాన్నిచ్చారు.

హిందువులు అత్యధికంగా ఉన్న దేశంలో, బీజేపీ వారిని రక్షిస్తుందని, హామీలను నెరవేరుస్తుందని, ప్రజాసేవలను కల్పిస్తుందని, సంక్షేమ పథకాలను కల్పిస్తుందనే భరోసాను కల్పించింది.

ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందు, సాధారణ కులాల్లో ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ యూనివర్సిటీలలో, ఉద్యోగాలలో అదనంగా 10 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో, దేశంలో రిజర్వేషన్లను 60 శాతానికి పెంచింది.

మార్చ్ 2019లో మోదీ తన పేరు పక్కన చౌకీదార్ అని చేర్చుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్చ్ 2019లో మోదీ తన పేరు పక్కన చౌకీదార్ అని చేర్చుకున్నారు.

ఇది దేశంలో అగ్ర కులాలకు చెందిన హిందువులను ఆకర్షించేందుకు ఎత్తుగడగా ప్రయోగించింది. దేశంలో యువతకు తగినన్ని ఉద్యోగావకాశాల కల్పన జరగకపోవడంతో ఈ ఓటర్లకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పించడం తప్పనిసరి అయింది.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే, శాశ్వత ఉద్యోగం దొరికి, కొన్నేళ్లుగా ఉద్యోగం లేక ఎదుగుదల లేని వారి జీవితానికి భద్రత చేకూరుతుంది.

దేశంలో 1991 ఆర్ధిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత కొన్ని లక్షల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడటంతో, మిలీనియల్ జనాభా కేవలం మనుగడ సాగించడానికి మించి జీవితంలో అభివృద్ధి సాధించాలని అనుకుంటున్నారు.

స్మార్ట్ ఫోన్లు, చిటికెలో సమాచారం లభించే ప్రపంచంలో వారుంటున్న పరిసరాలకు ఆవల మెరిసే నగరాలుంటాయని తెలియచేసింది.

మోదీ ప్రభుత్వం ఉద్యోగ అభివృద్ధి చూపించలేకపోయినప్పటికీ, ఆర్ధిక హామీలను నెరవేర్చలేనప్పటికీ, బులెట్ రైళ్లు, అంతర్జాతీయ స్థాయి నగరాలు, ప్రపంచ వేదిక పై మెరిసే మన దేశం గురించి మాట్లాడుతూ, మిలీనియల్స్ మాట్లాడే ఆశావాద దృక్పథంతో కూడిన భాషనే వినిపిస్తారు.

మోదీ వస్త్రధారణ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆయన సంప్రదాయ తెలుపు రంగు కుర్తా, పైజామా ధరిస్తారు. అదే చాలా మంది ఇతర పురుష రాజకీయ నాయకులకు యూనిఫామ్ గా మారిపోయింది. మోదీ వార్డు రోబ్ లో ఉండే ఖరీదైన, బాగా తయారు చేసిన, రంగు రంగుల వస్త్రాలు మోదీ పురోగతిని మాత్రమే కాకుండా దేశ పురోగతిని కూడా ప్రముఖంగా చూపిస్తాయి. (ఆయన దృష్టిని నమ్మితే)

మోదీ దేశ సాంస్కృతిక , రాజకీయ చిత్రానికి ఆధిపత్యం వహిస్తుండగా, భారతీయ యువత మాత్రం ఆయన వెనుకే నిలుస్తున్నారని తెలుస్తోంది.

మోదీకి ఉన్న ప్రాముఖ్యతకు ధీటుగా ప్రజల భాష మాట్లాడుతూ, హామీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జాతీయ స్థాయి నాయకులు క్షేత్ర స్థాయి నుంచే పుడతారు.

వివన్ మర్వాహ "వాట్ మిలీనియల్స్ వాంట్" పుస్తక రచయత. (పెంగ్విన్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)